![ED Special Focus on HMDA Former Director Shiva Balakrishna - Sakshi](/styles/webp/s3/article_images/2024/02/9/SIVA%20BALAKRISHA%2014.jpg.webp?itok=k18lEFG3)
సాక్షి, హైదరాబాద్: హెచ్‌ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ అవినీతి భాగోతంపై త్వరలోనే ఇన్ కమ్‌ట్యాక్స్ (ఐటీ), ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)అధికారులు రంగంలోకి దిగనున్నట్టు తెలిసింది. అధికార దుర్వినియోగం, అడ్డగోలు అనుమతుల జారీతో దాదాపు రూ.250 కోట్ల మేర ఆస్తులను శివబాలకృష్ణ కూడబెట్టినట్టు ఏసీబీ అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ మొత్తం వ్యవహారంలో మనీలాండరింగ్ కోణంలో దర్యాప్తు చేసేందుకు ఈడీ అధికారులు సిద్ధమవుతున్నట్టు తెలిసింది.
అదేవిధంగా ఐటీ అధికారులు సైతం ఏసీబీ నుంచి ఈ కేసు వివరాలు తీసుకోనున్నట్టు సమాచారం. అతనిపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్ కాపీ, కేసు దర్యాప్తులో గుర్తించిన అక్రమాస్తుల వివరాలను ఈ రెండు దర్యాప్తు సంస్థలు ఏసీబీ నుంచి తీసుకోనున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఏసీబీ దర్యాప్తులో కీలక అంశాలు వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు ఈడీ, ఐటీ రంగంలోకి దిగితే మరిన్ని కొత్త విషయాలు తెలిసే అవకాశం ఉన్నట్టు చర్చ జరుగుతోంది.
మరో ఇద్దరు బినామీల అరెస్టుకు రెడీ!
శివబాలకృష్ణ తన అక్రమార్జనలో ఎక్కువ భాగం తన కుటుంబ సభ్యులు, ఇతర బినామీల పేరిట ఉంచినట్టు ఏసీబీ అధికారులు ఇప్పటికే కీలక ఆధారాలు సేకరించారు. శివబాలకృష్ణకు ప్రధాన బినామీగా ఉన్న ఆయన సోదరుడు శివనవీన్ కుమార్‌ను ఏసీబీ మంగళవారం రాత్రి అరెస్టు చేసిన విషయం తెలిసిందే. శివబాలకృష్ణ బినామీలుగా ఉన్న మరో ఇద్దరిని అరెస్టుకు రంగం సిద్ధం చేశారు. మరోవైపు శివ నవీన్‌కుమార్ కస్టడీ కోసం ఏసీబీ అధికారులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
హెచ్‌ఎండీఏలో ముగిసిన ఏసీబీ సోదాలు
హెచ్‌ఎండీఏలో ఏసీబీ సోదాలు ముగిశాయి. మూడు రోజుల పాటు వివిధ జోన్‌లకు చెందిన ఫైళ్లను క్షుణ్ణ్గంగా తనిఖీ చేసిన ఏసీబీ అధికారులు 4వ రోజు గురువారం పంచనామా నిర్వహించారు. ఈ నాలుగు రోజుల్లో శంకర్‌పల్లి, శంషాబాద్, ఘట్కేసర్ జోన్‌ల పరిధిలోని సుమారు 120 ఫైళ్లను పరిశీలించారు. వాటిలో కీలకమైన వాటిని తమ వెంట తీసుకెళ్లినట్లు తెలిసింది. ముఖ్యంగా శివబాలకృష్ణ హెచ్‌ఎండీఏ నుంచి రెరాకు బదిలీ అయిన తరువాత కూడా పాత తేదీలతో పెద్ద ఎత్తున భూమార్పిడి అనుమతులను ఇవ్వడాన్ని ఏసీబీ సీరియస్‌గా పరిగణిస్తోంది.
జోవో 111 పరిధిలో కన్జర్వేషన్ జోన్‌లో ఉన్న భూములను రెసిడెన్షియల్, కమర్షియల్ జోన్‌లకు మారుస్తూ అనుమతులను ఇచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. పుప్పాలగూడ నుంచి వట్టినాగులపల్లి వరకు వివిధ ప్రాంతాల్లో వందల ఎకరాలను ఇలా అడ్డగోలుగా మార్చేసినట్లు తెలిసింది. అలాగే ఘట్‌కేసర్, శంషాబాద్ జోన్‌లలో ఇచ్చిన మరి కొన్ని అనుమతులపైన కూడా ఏసీబీ అధికారులు దృష్టి సారించారు.
అలా ఎలా అనుమతులిచ్చారని నిలదీసిన ఏసీబీ
నీటివనరులు ఉన్న ప్రాంతాల్లో భవన నిర్మాణాలకు, లే అవుట్‌లకు అనుమతులను ఇచ్చేందుకు కొందరు ప్లానింగ్ అధికారులు మొదట నిరాకరించినా ఆ తరువాత ఆ అధికారులే తిరిగి అనుమతులను ఎందుకిచ్చారని ఏసీబీ వర్గాలు ప్రశ్నించినట్లు తెలిసింది. ‘వాళ్లకు అనుమానం వచ్చిన ప్రతి ఫైల్‌ను పోస్టుమార్టం చేశారు. అనేక రకాల సందేహాలను వ్యక్తం చేశారు. అన్నింటికీ మా వైపు నుంచి సమాధానాలు చెప్పాం.’అని ఒక ప్లానింగ్ అధికారి తెలిపారు.‘ప్రతి ఫైల్ పరిష్కారంలో పై అధికారుల సూచనలు, సలహాలు, దిశా నిర్ధేశం మేరకే పని చేశాం.’అని మరో ప్లానింగ్ అధికారి వివరించారు. డైరెక్టర్ స్థాయిలో ఉన్న బాలకృష్ణ ఆదేశాలను తప్పకుండా పాటించవలసి వచ్చిందని చెప్పుకొచ్చారు.
ఆ ఏపీఓలపై ఏసీబీ కన్ను
ఏసీబీ అధికారులు తమ వెంట తీసుకెళ్లిన ఫైళ్ల కారణంగా ఎలాంటి ఉపద్రవం ముంచుకొస్తుందోనని కొందరు ప్లానింగ్ అధికారులు, ఏపీఓలు భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే ఒకరిద్దరు ఏపీఓలు బాలకృష్ణకు అన్నివిధాలుగా సహకరించి అక్రమార్జనలో శివబాలకృష్ణకు పోటీపడినట్లు ఏసీబీ అధికారులు గుర్తించినట్లు తెలిసింది.
తెర వెనుక సూత్రధారులెవరు?
అసలు శివ బాలకృష్ణ తెరవెనుక ఉండి.. ఆయనను నడిపించిందెవరు అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఒక డైరెక్టర్ స్థాయిలో ఇష్టారాజ్యంగా అనుమతులనివ్వడం అసాధ్యం. భూమి జోన్ మార్పునకు సంబంధించిన అనుమతులకు కమిటీ ఆమోదం తప్పనిసరి. ఈ కమిటీలో ఐఏఎస్ అధికారులతో పాటు మున్సిపల్‌శాఖ మంత్రి కూడా ఉంటారు. రూ.వందల కోట్ల విలువైన భూములను కన్జర్వేషన్ జోన్ నుంచి రెసిడెన్షియల్ జోన్‌లోకి మార్చేందుకు సదరు కమిటీ సమావేశంలోనే నిర్ణయం తీసుకుంటారు.
కానీ ఇలాంటి ఫైళ్లు పదుల కొద్దీ ఎలాంటి సమావేశాలు లేకుండానే ఎడాపెడా ఇచ్చేశారు. ఈ క్రమంలో కింది నుంచి పై వరకు భారీ మొత్తంలో చేతులు మారాయి. కానీ చివరకు బాలకృష్ణ మాత్రం మూల్యం చెల్లించుకోవలసి వచ్చిందని హెచ్‌ఎండీఏ అధికారి ఒకరు అభిప్రాయపడ్డారు. ఈ అక్రమ అనుమతులను మరింత లోతుగా, సమగ్రంగా అధ్యయనం చేస్తే తెరవెనుక ఉన్న కీలకమైన వ్యక్తులు కూడా బయటకు వచ్చే అవకాశం ఉంటుందన్నారు. ‘ప్రతి చేంజ్ ఆఫ్ లాండ్ యూజ్ వెనుక వాళ్లు ఉన్నారు. వారిచ్చే ఆదేశాల మేరకే బాలకృష్ణ పని చేసి తన వాటా తాను పొందాడు. ’అని హెచ్‌ఎండీఏ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఈ క్రమంలో ’వాళ్లు’ఎవరనేది ఇప్పుడు చర్చనీయాంశమైంది.
Comments
Please login to add a commentAdd a comment