అవినీతిలో అందెవేసిన చేయి | MRO Caught By ACB Rides For Taken Bribe In Vizianagaram | Sakshi
Sakshi News home page

అవినీతిలో అందెవేసిన చేయి

Published Wed, Jul 31 2019 8:43 AM | Last Updated on Wed, Jul 31 2019 8:43 AM

MRO Caught By ACB Rides For Taken Bribe In Vizianagaram - Sakshi

దాడులలో పట్టుబడిన నగదు,ఇన్‌సెట్లో ఏసీబీ డీఎస్పీ నాగేశ్వరరావు

చేయి తడపందే ఆయన దగ్గరనుంచి ఏ ఫైల్‌ కదలదంట... పనిచేసిన ప్రతిచోటా కలెక్షన్‌ చేయడంలో సిద్ధహస్తుడంట... ఈయన దాహానికి అంతులేకపోవడంతో ఇటీవలే ఓ అధికారి సైతం జాగ్రత్తగా ఉండాలంటూ 
హెచ్చరించారంట... అయినా ఆయన తన సహజ ధోరణితో వ్యవహరించడంతో మళ్లీ ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టారన్న ఆరోపణలపైనా ఓసారి కేసు నమోదై... ఇంకా విచారణ కొనసాగుతోంది. రాష్ట్ర ముఖ్యమంత్రి ఓ వైపు అవినీతిపై ఉక్కుపాదం మోపాలని హెచ్చరిస్తుంటే... ఇంకా ఇలాంటి తిమింగలాలు తమ వైఖరి మార్చుకోకపోవడం రెవెన్యూ శాఖకే మాయని మచ్చగా మారుతోంది. 

సాక్షి, విజయనగరం : రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి రెవెన్యూశాఖలో అవినీతి పై రెండు నెలలుగా ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూనే ఉన్నారు. అయినా రెవెన్యూశాఖ అధికారుల 
తీరు మారడంలేదు. ఎన్నోఏళ్లుగా లంచాలకు అలవాటు పడ్డ కొందరు వాటిని మానుకోలేకపోతున్నారు. గంట్యాడ మండల తహసీల్దార్‌ డి.శేఖర్‌ అవినీతి నిరోధక శాఖ అధికా>రులకు మంగళవారం చిక్కడం ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. 

అవినీతి శేఖరం
ఏసీబీ అధికారులకు చిక్కిన గంట్యాడ తహసీల్దార్‌ డి.శేఖర్‌కు అవినీతి చరిత్ర పెద్దదే ఉంది. కాసులివ్వనదే పని చేయడన్న ఆరోపణలు బలంగా ఉన్నాయి. ఈయన విశాఖపట్నంలో రెవెన్యూశాఖలో ఉద్యోగ ప్రస్థానం ప్రారంభించారు. డిప్యూటీ తహసీల్దారు కేడరు వరకు అక్కడే పని చేశారు. ఏడాది క్రితం తహసీల్దారుగా పదోన్నతి ఇచ్చిన రాష్ట్ర భూపరిపాలన ముఖ్య కార్యదర్శి విజయనగరం జిల్లా కేటాయించారు. జిల్లా కలెక్టర్‌ ఈయన్ను మొదట బొండపల్లి తహసీల్దారుగా నియమించారు. ఎన్నికల సమయంలో బదిలీల్లో అక్కడి నుంచి సీతానగరం బదిలీ చేశారు. తాజాగా 20రోజుల క్రితం సీతానగరం నుంచి గంట్యాడకు బదిలీపై వచ్చారు. ఈ నెల 10వ తేదీనే అక్కడ విధుల్లో చేరారు. సుదీర్ఘకాలం రెవెన్యూశాఖలో సేవలందించిన శేఖర్‌పై జిల్లాలో అనేక ఆరోపణలున్నాయి. జిల్లాకు వచ్చిన ఏడాది కాలంలో అనేక అవినీతి అక్రమాలకు పాల్పడ్డారన్న పేరు కూడా ఉంది. ఎక్కడ పని చేసినా డబ్బులు ఇవ్వనిదే పనులు చేయరన్నది ప్రతీతి. పట్టాదారు పాసుపుస్తకాలు, పలు ధ్రువీకరణపత్రాల జారీకి పెద్ద ఎత్తున లంచాలు డిమాండ్‌ చేశారని బొండపల్లి, సీతానగరం, గంట్యాడ వాసులు చెబుతున్న మాట.

బొండపల్లిలో ఉండగా లంచా ల విషయంలో సిబ్బందికి, ఆయనకు మధ్య పెద్ద ఎత్తున వివాదాలు చోటు చేసుకున్నాయి. గంట్యా డ వెళ్లిన 20రోజుల్లోనే అనేక పనులకు డబ్బులు డిమాండ్‌ చేయడం, ఇచ్చిన వారికి సంతకాలు చేయడం, ఇవ్వనివారిని తిప్పించడం చేస్తున్నారని ప్రచారం సాగింది. కొందరు అధికారులు ఏమీ ఆశించకుండా ఇచ్చే ఎఫ్‌సీవో కాపీ కోసం రూ.2వేలు డిమాండ్‌ చేస్తున్నారని ఆ శాఖ అధికారుల్లోనే చర్చ జరుగుతోంది. ఈ విషయం జిల్లా అధికా రుల వరకూ చేరడంతో జాగ్రత్తగా ఉండాలని మూడు రోజుల క్రితమే ఓ జిల్లా అధికారి హెచ్చరించినట్టు కూడా తెలిసింది. అయినా ఎక్కడా వెనక్కి తగ్గలేదు. విశాఖపట్నంలో పని చేసినపుడు కూడా ఆయనపై అనేక అవినీతి అభియోగాలు న్నాయి. విశాఖపట్నంలో పని చేస్తుండగా ఆరేళ్ల క్రి తం ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీబీ అధికారులు దాడులు చేసి కేసులు నమోదు చేయగా ఇంకా కేసు నడుస్తోంది.

ఎన్‌ఓసీకోసం రూ. 50వేలు లంచం...
విజయనగరానికి చెందిన రొంగలి శ్రీనివాసరావు రామవరం పంచాయతీ కరకవలస సమీపంలో సర్వేనంబర్‌ 32/6లో 20 సెంట్ల స్థలాన్ని ల్యాండ్‌ కన్వర్షన్, పెట్రోల్‌బంకు ఏర్పాటుకు ఎన్‌ఓసీ ఇవ్వాలని రెవెన్యూ శాఖతో పాటు 4 శాఖలకు దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పటికే పోలీస్, ఫైర్‌ తదితర శాఖలు ఎన్‌ఓసీ ఇవ్వగా రెవెన్యూమాత్రం ఇవ్వలేదు. దీనిపై తహసీల్దార్‌ బి.శేఖర్‌ను సంప్రదించగా రూ 50వేలు లంచం డిమాండ్‌ చేశారు. చేసేది లేక ఆయన ఏసీబీ అధికారులకు ఫిర్యాదుచేయగా ఏసీబీ డీఎస్పీ డి.వి.ఎస్‌.నాగేశ్వరరావు ఆధ్వర్యంలో మాటువేసి తహసీల్దార్‌ కార్యాలయంలోనే లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. వెంటనే ఆయనపై కేసు నమోదుచేసి, విశాఖపట్నం ఏసీబీ కోర్టులో హాజరుపర్చనున్నట్టు డీఎస్పీ తెలిపారు. గంట్యాడలో గతంలో విద్యుత్‌ శాఖ జేఈ జ్యోతీశ్వరరావు, సర్వేయర్‌ శ్రీనివాసరావు, ఆర్‌డబ్ల్యూఎస్‌ జేఈ గోవిందరావు ఏసీబీ వలలో చిక్కుకున్నారు.

ముఖ్యమంత్రి ఎంతగా హెచ్చరిస్తున్నా...
రెవెన్యూశాఖపై ఇప్పటికే జనంలో చెడ్డ పేరుంది. ఇక్కడ ఏ పనీ లంచం ఇవ్వనిదే జరగదన్న ఓ అపవాదు కూడా ఉంది. ఈ విషయం ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి దృష్టిలో ఉండటంతో అవినీతి తగ్గాలని కలెక్టర్ల సమావేశం, వీడియో కాన్ఫరెన్సులో చెబుతూనే ఉన్నారు. రెండు రోజుల క్రితం జరిగిన వీడియోకాన్ఫరెన్సులోనూ ఈ విషయం కలెక్టర్‌ ప్రస్తావించారు. అయినా తహసీల్దారు శేఖర్‌ తీరు మారకపోవడం విశేషం. ఇలాంటి పనుల వల్ల డిపార్టుమెంటు పరువు పోతోందని ఆ శాఖలోని అధికారులే వ్యాఖ్యానించడం గమనార్హం.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement