రైతుల పడరాని పాట్లు.. | To Get New Passbooks Revenue Officers Asking Bribe In Siddipet | Sakshi
Sakshi News home page

రైతుల పడరాని పాట్లు..

Published Wed, Jul 24 2019 9:48 AM | Last Updated on Wed, Jul 24 2019 9:48 AM

To Get New Passbooks Revenue Officers Asking Bribe In Siddipet - Sakshi

సాక్షి, సిద్దిపేట: నిజాం కాలం నాటి భూముల రికార్డులను సరిచేసి భూ సమస్యను తీర్చాలనే ఉద్దేశంతో  ప్రభుత్వం రికార్డుల ప్రక్షాళనకు పూనుకుంది. ఆలోచనకు అనుగుణంగా అధికారులు పనిచేయకపోడంతో కొత్తపాస్‌ పుస్తకాలు రావడమేమో కాని ఉన్న భూమి వేరేవారి పేరున మారిపోయింది. చిన్న చిన్న తగాదాలను అడ్డం పెట్టుకొని పలువురు రెవెన్యూ అధికారులు డబ్బులు దండుకుంటున్నారు. అన్నీ సక్రమంగా ఉన్నా.. పాస్‌ పుస్తకం ఇవ్వాలంటే ముడుపులు చెల్లించాల్సిన పరిస్థితి నెలకొంటోంది.

 ఎందుకు డబ్బులు ఇవ్వాలని గట్టిగా అడిగితే వారి భూమికి మరిన్ని కొర్రీలు అంటగట్టడం, కంప్యూటర్‌లో తప్పుగా నమోదు చేయడం, ఫైల్‌ మాయం చేయడం పరిపాటిగా మారింది. ఇలాంటి చర్యలతో అనేక మంది రైతులు తమ సమస్యల పరిష్కారానికి చెప్పులరిగేలా ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. అయినా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది. దీంతో వారంతా రైతుబంధు, రైతుబీమాకు దూరమవుతున్నారు.  

చిన్న చిన్న సమస్యలను కూడా సవరించకుండా.. అమ్మిన వారి, కొన్నవారి కాగితాలు, రిజిస్ట్రేషన్‌ పత్రాలు ఉన్నా.. ఎవరో ఫిర్యాదులు చేశారని పలువురు రైతులకు పాస్‌ పుస్తకాలు ఇవ్వకుండా అధికారులు జాప్యం చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 3,33,432 ఖాతాలు ఉన్నాయి. ఇందులో 2,64,062 ఖాతాలు సక్రమంగా ఉన్నాయని అధికారులు డిజిటల్‌ సంతకం చేశారు. ఇందులో ఇప్పటి వరకు 2,63,018 మంది రైతులకు పాస్‌పుస్తకాలు అందజేశారు. మరో 1,044 మంది పాస్‌పుస్తకాలు ప్రింటింగ్‌ కాకుండా నిలిచిపోయాయి.

అదేవిధంగా 19,591 ఖాతాలు ఆధార్‌ కార్డు నంబర్లలో తప్పులు, సర్వే నంబర్‌లో తేడాలు, డబుల్‌ నంబర్‌  ఇలా అనేక కారణాలతో ప్రాససింగ్‌ నిలిచిపోయాయి. మిగిలిన 15,441 ఖాతాలు పట్టణాల సమీపంలో ఉండటంతో వ్యవసాయేతర భూమిగా మార్చడంతో వాటికి పాస్‌ పుస్తకాలు ఇవ్వడం లేదు. అదేవిధంగా 32,438 ఖాతాలు ప్రభుత్వ భూముల్లో ఉన్నాయి. ఇవిపోగా 1,900 ఖాతాలు ఫార్ట్‌–బీలో  పెట్టారు. దీంతో  పాస్‌పుస్తకాలు రాలేదు. అదేవిధంగా ప్రభుత్వం అందచేసే రైతు బంధు, రైతు బీమా సౌకర్యంతోపాటు బ్యాంకు రుణాలు కూడా ఇవ్వడం లేదు. 

అధికారులకు వరంగా..
ప్రభుత్వం శ్రీకారం చుట్టిన భూ రికార్డుల ప్రక్షాళన పలువురు రెవెన్యూ అధికారులు, ఉద్యోగులకు వరంగా మారింది. తల్లిదండ్రుల నుంచి సంక్రమించే ఆస్తులు, ఒకరి దగ్గరి నుంచి మరొకరు కొనుగోలు చేసి, రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నా రెవెన్యూ పహానీలో నమోదు చేసేందుకు అంగీకరించడం లేదు. అదేవిధంగా అన్నదమ్ముల పంపకాలు, ఇతర విషయాల్లో పైసలు ఇవ్వనిదే దస్త్రం కదలని దుస్థితి. ప్రధానంగా 1900 ఖాతాలు పార్ట్‌–బిలో ఉన్నాయి. వీటిని సరిచేస్తున్నామనే నెపంతో అధికారులు చేతివాటం ప్రదర్శిస్తున్నారు.  డబ్బులు ఇచ్చిన వారికి ఏ అడ్డంకులు లేకుండా పాస్‌పుస్తకాలు అందజేశారని, ఇవ్వని వారిని ఇప్పటి వరకు సతాయిస్తున్నారని రైతులు ఆదేవన వ్యక్తం చేస్తున్నారు.

పాస్‌పుస్తకాలు  ఎందుకు రాలేదు అంటే సర్వే నంబర్లు తప్పులు పడ్డాయని, మీ సర్వేనంబర్‌లో భూమిలేదని ఇలా సాకులు చెబుతూ డబ్బులు వసూళ్లు చేస్తున్నారని రైతులు చెబుతున్నారు.  రెవెన్యూ కార్యాలయానికి సాధారణంగా రైతులు  తమ భూములకు సంబంధించిన పట్టాదారు పాస్‌ పుస్తకాల కోసం, వారసత్వంగా తాతలు, తండ్రుల నుంచి వచ్చిన భూమిని తమ పేరు మీదకు మార్చుకోవడానికి, మ్యూటేషన్‌ కోసం, భూమిని కొలిపించుకోవడానికి దరఖాస్తు చేయడం కోసం వస్తుంటారు. వీటిలో ఏ పని చేయాలన్నా అధికారులకు డబ్బులు ఇవ్వాల్సిందేనని పలువురు రైతులు వాపోతున్నారు.

పట్టాదారు పాసు పుస్తకాల కోసం ఎకరానికి రూ. 5 వేల నుంచి రూ. 10 వేల వరకు, మ్యూటేషన్‌ కోసం ఎకరానికి రూ. 10 వేల వరకు, వారసత్వ భూమిని తమ పేరు మీద మార్చుకోవడానికి రూ. 20 వేలు, ఇతరుల నుంచి కొనుగోలు చేసిన భూమిని తమ రికార్డుల్లో ఎక్కించుకోవడానికి, కొత్త పాసు పుస్తకం కోసం రూ. 20 వేల నుంచి రూ. లక్ష వరకు అధికారులకు ముట్ట జెప్పాల్సి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామాల్లోని వ్యవసాయ భూములకు తక్కువగా, రియల్‌ ఎస్టేట్‌కు అనుకూలంగా ఉండి డిమాండ్‌ ఉన్న భూములకు లక్షల్లో వసూలు చేస్తున్నట్టు రైతులు ఆరోపిస్తున్నారు. ఇవే కాకుండా పట్టణ ప్రాంతాలకు, రాష్ట్ర, జాతీయ రహదారులకు దగ్గర ఉన్న భూములకు రూ. అక్ష నుంచి ఆపైన వసూలు చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. 

కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినా అంతే సంగతులు
నంగునూరు మండలం పాలమాకుల గ్రామానికి చెందిన వర్దోలు శ్రీనివాస్‌కు  2008లో 112 సర్వే నంబర్‌లోని రెండు బిట్లు, 2010లో ఇదే సర్వే నంబర్‌లో భూమి కొనుగోలు చేశాడు. అప్పుడు అధికారులు పాస్‌పుస్తకం అందజేశారు. నాటి నుంచి 2017 వరకు పహానీలు అందజేసి బ్యాంక్‌లో రుణాలు పొందాడు. ప్రభుత్వం రైతులకు కొత్త పాసు పుస్తకాలు ఇవ్వగా తన పేరిట ఉన్న సర్వే నంబర్లు ఎగిరిపోవడంతో పాటు  బుక్కు రాలేదు. 2018లో వీఆర్‌ఓకు దరఖాస్తు చేసుకుంటే మూడు నెలల్లో అందజేస్తామని చెప్పినా ఇప్పటి వరకు ఇవ్వలేదు. తహసీల్దార్, ఆర్డీఓ, కలెక్టర్లకు వినతి పత్రం అందజేసినా ఫలితంలేదు.  కొత్త పుస్తకాలు రాకపోవడంతో ప్రభుత్వం అందిస్తున్న పంట పెట్టుబడి సహాయం రాకపోగా రైతుబీమా బాండ్‌ కూడా రాలేదు.   
–శ్రీనివాస్, పాలమాకుల, నంగునూరు మండలం 

పైరవీకారుల పనులు మాత్రమే చేస్తుండ్రు..
కోహెడ  మండలంలోని నారాయణపూర్‌ గ్రామానికి చెందిన రైతు మందడి బుచ్చిరెడ్డి. ఇతడు 2013లో అదే గ్రామానికి చెందిన తగ్గరి బంధువు హన్మంతరెడ్డి అనే రైతు వద్ద 106 సర్వే నెంబర్‌లోని 2 ఎకరాల భూమిని కొనుగోలు చేశాడు. రిజిస్ట్రేషన్‌ సైతం బుచ్చిరెడ్డి పేరిట చేయించుకున్నాడు. అప్పటి నుంచి కార్యాలయం చూట్టు తిరుగుతున్నాడు. ఇప్పటికే నాలుగుసార్లు మీ సేవలో దరఖాస్తు చేసుకున్నాడు. ప్రతి రోజు కారాలయం చూట్టు తిరుగుతున్నడు. రేపు రా..మాపు రా అంటూ అధికారులు మాట దాటివేస్తున్నారు. ఇప్పగికి 6 సంవత్సరాలు అయన పరిష్కరించడం లేదు. వారం రోజుల క్రితం గట్టిగ ఆడిగితే నీ ఫైలు పోయింది. మళ్లీ కొత్తగా దరఖాస్తు చేసుకొమ్మని   నీర్లక్ష్యం సమాధానం చెబుతూ బెదిరిస్తున్నారు. ప్రతి రోజు ఎలాంటి పని పేట్టుకోకుండా కేవలం తహసీల్దార్‌ కార్యలయం చుట్టూ తిరుగుతున్నాడు. పైరవీకారులకు పనులు మాత్రమే చేస్తున్నరని అధికారులపై రైతు మండిపడ్డరు.
–బుచ్చిరెడ్డి, నారాయణపూర్, కోహెడ మండలం

ముడుపులిస్తేనే పనులు

అక్కన్నపేట మండలం చౌటపల్లి గ్రామానికి చెందిన గంగధారి సుగుణ. సర్వే నంబర్‌ 155లో సదా భైనామా ద్వార 0.38 గుంటలు కొనుగోలు చేసి సాగు చేసుకుంటుంది.  ప్రభుత్వం భూ రికార్డుల ప్రక్షాళనకు అవకాశం ఇవ్వడంతో ఏడాదిన్నర కిందట  ఊరుకు వచ్చిన రెవెన్యూ అధికారులకు భూమి పట్టా చేయాలని దరఖాస్తు పెట్టింది. మోక మీద విచారణ చేసిన అధికారులు పట్టా చేస్తామని చెప్పిన అధికారులు ఇప్పటి వరకు పాస్‌ పుస్తకం అందచేయడం లేదు. ఎందుకు పాస్‌పుస్తకం ఇవ్వడంలేదు అని నిలదీస్తే  ఇదే ఖాత నంబరులో జి.మల్లయ్యకు నాలుగు గుంటల భూమి అది సర్వే చేసిన తర్వాత చేస్తామని చెబుతున్నాడు.

ఏడాది కిందనే భూ సర్వే కోసం ఫీజులు కట్టిన సర్వేయర్‌ రాని దుస్థితి. వీఆర్‌ఏ శ్రీనివాస్‌ డిప్యూటీ తహసీల్దార్‌ తిరుపతిరెడ్డికి దగ్గర ఉండి ప్రైవేట్‌ కంప్యూటర్‌ ఆపరేటర్లకు చెప్పి అమ్మిన పట్టేదారు పేరును పట్టా కాలం నుంచి తొలగించారు.  భూ రికార్డుల ప్రక్షాళన మొదలు పెట్టిన అధికారులు తిరిగి భూమి అమ్మిన వ్యక్తి పేరున వస్తుంది.  అమ్మిన సదరు వ్యక్తిని తీసుకవచ్చి అధికారులకు చెప్పించినా వారు పని చేయడం లేదు. శీఆర్‌ఏ శ్రీనివాస్‌ అధికారులకు తప్పుడు సమాచారం అందించి భూ సమస్య తీరకుండా చేస్తున్నాడని బాదితురాలు ఆరోపిస్తోంది. ఆయకు ముడుపులు అప్పగిస్తేనే పనులు చేస్తున్నారు. 
- గంగాధరి సుగుణ, చౌటపల్లి, అక్కన్నపేట మండలం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement