Anti Corruption Department
-
17ఏ.. నిందితులకు కాదేమో!
అవినీతి నిరోధక చట్టానికి చేసిన 17ఏ సవరణను ఏ ఉద్దేశంతో తీసుకొచ్చారో చూడాలి. దీని ప్రకారం పబ్లిక్ సర్వెంట్లు అక్రమాలకు పాల్పడకూడదు. చట్టంలోని ప్రధాన ఉద్దేశాన్ని పక్కనపెట్టి ఓ వ్యక్తికి మేలు జరిగేలా ఈ చట్టాన్ని అన్వయించుకోకూడదు. అది చట్టం లక్ష్యాన్నే దెబ్బతీస్తుంది – సుప్రీంకోర్టు సాక్షి, న్యూఢిల్లీ: ‘అవినీతి నిరోధక చట్టం (పీసీ యాక్ట్)లోని సెక్షన్ 17ఏ అనేది నేరం జరిగిన తేదీకి వర్తిస్తుంది కానీ నిందితులకు కాదేమో’ అని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. చట్టం చేసిన ఉద్దేశాన్ని అర్థం చేసుకోవాలే తప్ప, దానిని తప్పుగా అన్వయించుకోవడానికి వీల్లేదని వ్యాఖ్యానించింది. సవరణలు వచ్చినప్పుడల్లా కొత్తగా మార్పులు వస్తున్నాయని, సెక్షన్ 17ఏ చంద్రబాబు కేసుకు వర్తిస్తుందా అని న్యాయమూర్తులు జస్టిస్ అనిరుద్ద బోస్, జస్టిస్ బేలా ఎం.త్రివేదిలతోకూడిన ధర్మాసనం సందేహం వ్యక్తం చేసింది. స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో తనపై సీఐడీ నమోదు చేసిన కేసును కొట్టేయాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్ తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. సోమవారం చంద్రబాబు తరఫున సీనియర్ న్యాయవాది హరీశ్ సాల్వే వాదనలు వినిపించారు. హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో 2021లో ఎఫ్ఐఆర్ నమోదైందని సీఐడీ పేర్కొందని, అందువల్ల ఈ కేసుకు సెక్షన్ 17ఏ వర్తిస్తుందని ఆయన తెలిపారు. 2018కి ముందే విచారణ ప్రారంభమైందన్న రాష్ట్ర ప్రభుత్వ వాదన సరికాదన్నారు. గతంలో కొంత విచారణ జరిగినట్లు కనిపిస్తున్నా, ఈ ఎఫ్ఐఆర్కు, దానికి సంబంధం లేదన్నారు. ప్రభుత్వాలు మారిన తర్వాత వ్యక్తుల్ని లక్ష్యంగా చేసుకొని పెట్టే కేసులను నిరోధించడానికి సెక్షన్ 17ఏను తీసుకొచ్చారన్నారు. 2018 కన్నా ముందే దర్యాప్తు జరిగిందని రుజువు చేసే డాక్యుమెంట్లను ప్రభుత్వం సమర్పించలేదని, ఏసీబీ కోర్టు ముందు కూడా ఉంచలేదని తెలిపారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ.. మీరు రిమాండ్ రిపోర్టును సవాలు చేస్తున్నారా అని ప్రశ్నించగా.. అవునని సాల్వే బదులిచ్చారు. సీఐడీ సమర్పించిన డాక్యుమెంట్ ద్వారానే దర్యాప్తు మొదలైందని లేదా ఎఫ్ఐఆర్ నమోదైందని భావిస్తే ఆ డాక్యుమెంటును కోర్టు పరిగణనలోకి తీసుకోవాలన్నారు. పీసీ చట్టంలోని 17ఏ పై కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ (ఎస్ఓపీ) ప్రకారం ప్రతి దశలోనూ గవర్నర్ అనుమతి తప్పనిసరి అని అన్నారు. ఈ ఎస్వోపీ కోర్టు సమీక్షకు లోబడి ఉండదని, సెక్షన్ 17ఏ ను అర్థం చేసుకోవడానికి సహకరిస్తుందన్నారు. ఈ దశలో జస్టిస్ బేలా ఎం త్రివేది జోక్యం చేసుకొని.. చట్టం లక్ష్యాన్ని భంగపరిచే వివరణలు కోర్టు స్వీకరించదని స్పష్టం చేశారు. ఎస్‌వోపీని మూడేళ్ల కిందట ప్రకటించారని, అంతకు ముందు సంగతేమిటని, ప్రభుత్వం మారిన తర్వాత రాజకీయ కక్ష అని ఎవరన్నారని జస్టిస్ త్రివేది ప్రశ్నించారు. కేసును పరిశీలిస్తే ఫిర్యాదులో అంశాలు చంద్రబాబుకు వర్తించవన్నారు. ఈ కేసు మొత్తం సీమెన్స్, డిజైన్‌టెక్‌లకు సంబంధించిందన్నారు. డిజైన్‌టెక్ కంపెనీ స్కిల్ టెక్ కంపెనీ నుంచి జీఎస్టీ క్రెడిట్లు పొందిందని, దానికి సంబంధించిందే 2021 సెప్టెంబరులోని ఫిర్యాదు అని సాల్వే తెలిపారు. ఈ సమయంలో ధర్మాసనం స్పందిస్తూ, డిజైన్‌టెక్ ఒప్పందం ఎవరితో చేసుకుందని ప్రశ్నించగా... అప్పటి రాష్ట్ర ప్రభుత్వంతో అని సాల్వే తెలిపారు. దర్యాప్తు ఎప్పుడు ప్రారంభమైందని ధర్మాసనం ప్రశ్నించగా.. 2021 సెప్టెంబరు 7న అని అన్నారు. ఏ ఆధారంతో చెబుతున్నారని ధర్మాసనం తిరిగి ప్రశ్నించింది. అవినీతిని నిరోధించడమే ఈ చట్టం ప్రధాన లక్ష్యమని, చట్టం లక్ష్యాన్ని భంగపరిచే వివరణ స్వీకరించలేమని జస్టిస్ బేలాఎం త్రివేది వ్యాఖ్యానించారు. వాదనలు అయ్యాక దీనికి సంబంధించి ఏవైనా డాక్యుమెంట్లు సమర్పిస్తే వాటిని కౌంటర్ చేసే అవకాశం ఉండదని, అప్పుడు మెరిట్స్ జోలికి వెళ్లకుండా తిప్పి పంపుతామని సాల్వేనుద్దేశించి జస్టిస్ త్రివేది అన్నారు. సెక్షన్ 17ఏ నేరం జరిగిన తేదీతో సంబంధమని హైకోర్టు న్యాయమూర్తి చెప్పినందున తిప్పి పంపటం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదని సాల్వే తెలిపారు. హైకోర్టులో వాదనల తర్వాత ప్రభుత్వం డాక్యుమెంట్లు సమర్పించిందన్నదే పిటిషనర్ వాదన అని, అసలు ఏమీ వినకుండానే కేసు కొట్టేస్తారా అని జస్టిస్ త్రివేది ప్రశ్నించారు. హైకోర్టులో వాదనలు పూర్తయిన తర్వాత డాక్యుమెంటు సమర్పించామన్న సాల్వే వాదనలను రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది నిరంజన్‌రెడ్డి తప్పుపట్టారు. కేసు రిమాండ్‌లోనే మొత్తం విషయం ఉందని తెలిపారు. ఈ కేసులో రెండు అంశాలు పరిశీలిస్తున్నామని.. ఒకటి హైకోర్టు ముందు సీఐడీ దాఖలు చేసిన డాక్యుమెంట్.. 2018 జులై 5న దర్యాప్తు ప్రారంభమైందని చెప్పే డాక్యుమెంట్ అని జస్టిస్ బోస్ పేర్కొన్నారు. ఇక రెండోది.. హైకోర్టు ముందు వాదన వినిపించడానికి పిటిషనర్ అవకాశం కోల్పోయారా అనే అంశమని జస్టిస్ బోస్ వ్యాఖ్యానించారు. దర్యాప్తు పేరుతో ఒక వ్యక్తిని ఇబ్బంది పెట్టడం చట్టం ఉద్దేశం కాదని సాల్వే అన్నారు. సెక్షన్ 17ఏ సవరణను అవినీతి నిరోధక చట్టం ఉద్దేశంతో చూడాలని, దాని ప్రకారం పబ్లిక్ సర్వెంట్లు అక్రమాలకు పాల్పడకూడదని జస్టిస్ త్రివేది చెప్పారు. చట్టం ప్రధాన ఉద్దేశాన్ని పక్కనపెట్టి ఓ వ్యక్తికి మేలు జరిగేలా చట్టాన్ని విశ్లేషించుకోవడం ద్వారా చట్టం లక్ష్యాన్నే దెబ్బతీస్తుందని జస్టిస్ త్రివేది వ్యాఖ్యానించారు. ఈ కేసులో చంద్రబాబు పేరు సెప్టెంబరు 2023న చేర్చారని, 37వ నిందితుడిగా ఉన్న చంద్రబాబును ఏ1 అంటున్నారని సాల్వే ఆరోపించారు. దర్యాప్తు అధికారి ప్రకారం ఏ 37 (చంద్రబాబు) సూచనల మేరకు ఏ 36 నేరానికి పాలడ్డారని, ఇది అవినీతి నిరోధక చట్టానికి వర్తిస్తుందని చెప్పారని, అదే సమయంలో గవర్నర్ అనుమతి తీసుకొని ఉండాల్సిందని సాల్వే తెలిపారు. సెక్షన్ 17 ఏ సవరణను ఎలాగైనా చూడొచ్చని, అంతకు ముందు జరిగిన నేరాల సంగతేమిటని జస్టిస్ త్రివేది ప్రశ్నించారు. 17ఏ అనేది నేరం జరిగిన తేదీకే కానీ నిందితులకు కాదు కదా అని జస్టిస్ బోస్ ప్రశ్నించారు. సెక్షన్ 6ఏ ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్టుపై ఐదుగురు న్యాయమూర్తుల సుప్రీంకోర్టు ధర్మాసనం చెప్పిన అంశాలు చూడాలని, ఇది కూడా 17ఏ సవరణ తరహాలో ఉందని జస్టిస్ త్రివేది వ్యాఖ్యానించారు. ఒక ప్రజాప్రతినిధి సైకిలు దొంగతనం చేస్తే దాంట్లో జరిగిన అక్రమం తనకు కేటాయించిన విధులకు సంబంధించినదై ఉండాలని, అవినీతి నిరోధక చట్టం వర్తించరాదని సాల్వే పేర్కొన్నారు. అంటే సెక్షన్ పూర్తిగా కాకుండా పైపైన వర్తిస్తుందా అని జస్టిస్ బోస్ ప్రశ్నించారు. ఈ కేసులో పరిపాలన పరమైన అంశాలు ఉన్నాయని, అభియోగాలు చూస్తే పది శాతం అడ్వాన్స్ నిధులు ముందే విడుదల చేశారని ఉందని జస్టిస్ బోస్ పేర్కొన్నారు. అరెస్టు చేసిన విధానం సరికాదు కాబట్టే సెక్షన్ 17ఏ పైనే వాదన చేస్తున్నామని సాల్వే పేర్కొన్నారు. మంగళవారం సీఐడీ తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి వాదనలు వినిపించనున్నారు. -
‘స్కిల్’ స్కాంపై ఈడీ కొరడా
సాక్షి, అమరావతి: చంద్రబాబు హయాంలో యథేచ్ఛగా సాగిన అవినీతి కుంభకోణాల బండారాలు జాతీయస్థాయిలో బట్టబయలవుతున్నాయి. టీడీపీ ప్రభుత్వ పెద్దలు ‘ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఎస్ఎస్డీసీ)లో నిధులను అడ్డగోలుగా కొల్లగొట్టిన అవినీతి బాగోతంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కొరడా ఝళిపించింది. టీడీపీ హయాంలో సీమెన్స్ కంపెనీతో రూ.3,300 కోట్ల ప్రాజెక్టు పేరిట కథ నడిపించి.. ఒక్క రూపాయి కూడా పెట్టుబడి రాకుండానే.. అసలు ప్రాజెక్టు లేకుండానే రూ.241కోట్ల ప్రజాధనాన్ని కొల్లగొట్టారు. ఈ అవినీతి దందాలో సూత్రధారులు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన తనయుడు.. ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ కాగా.. చంద్రబాబు సన్నిహితులు, బినామీలు పాత్రధారులుగా వ్యవహరించారు. ఈ కుంభకోణంలో పాత్రధారులుగా వ్యవహరించిన వారికి ఆదివారం ఈడీ నోటీసులు జారీచేసింది. చంద్రబాబు స్నేహితుడు, ఏపీఎస్ఎస్డీసీ ఎండీగా చేసిన కే లక్ష్మీనారాయణ, ప్రత్యేక కార్యదర్శి గంటా సుబ్బారావు, ఓఎస్డీ నిమ్మగడ్డ వెంకట కృష్ణప్రసాద్, చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ కే ప్రతాప్కుమార్లతోపాటు ఈ కుంభకోణంలో కీలకంగా వ్యవహరించిన షెల్ కంపెనీల ప్రతినిధులతో సహా మొత్తం 26మందికి నోటీసులు జారీచేశారు. ఆ జాబితాలో డిజైన్ టెక్, స్కిల్లర్, ఇన్‌వెబ్ సర్వీసెస్, అలైడ్ కంప్యూటర్స్ ఇంటర్మేషనల్, ప్రతీక్ ఇన్ఫో సర్వీసెస్, ఐటీ స్మిత్ సొల్యూషన్స్, నాలెడ్జ్ పోడియం, ట్యాలెంట్ ఎడ్జ్ మొదలైన షెల్ కంపెనీలున్నాయి. ఈ కేసులో ఇప్పటికే ఏపీ సీఐడీ అధికారులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తూ కీలక ఆధారాలు సేకరించి ఎనిమిది మందిని అరెస్టుచేశారు. మరోవైపు.. ఈడీ కూడా నాలుగైదు నెలలుగా ఈ కుంభకోణంపై గుట్టుచప్పుడు కాకుండా దర్యాప్తు చేసి కీలక ఆధారాలను సేకరించింది. ప్రధానంగా షెల్ కంపెనీల పేరిట ప్రజాధనాన్ని కొల్లగొట్టి సింగపూర్ కంపెనీలకు తరలించి.. తిరిగి తమ ఖాతాల్లో వేసుకున్న వైనాన్ని ఈడీ పూర్తి ఆధారాలతో గుర్తించింది. తద్వారా చంద్రబాబు సన్నిహితులు మనీల్యాండరింగ్‌కు పాల్పడినట్లు నిర్ధారించింది. అనంతరమే ఈ కేసులో వారిని విచారించేందుకు నిర్ణయించి నోటీసులు జారీచేసింది. మరోవైపు.. హైదరాబాద్‌లోని ఈడీ కార్యాలయంలో విచారణకు సోమవారం హాజరుకావాలని వారిని ఆదేశించింది. కాగితాలపై ప్రాజెక్టు.. బాబు బినామీల ఖాతాల్లో రూ.241 కోట్లు ఇక టీడీపీ ప్రభుత్వ పెద్దలు జర్మనీకి చెందిన సీమెన్స్ కంపెనీతో ఓ ప్రాజెక్టు అంటూ కేవలం కాగితాలపై చూపించి ఏకంగా రూ.241 కోట్లు కొల్లగొట్టారు. రాష్ట్రంలో యువతకు నైపుణ్యాభివృద్ధిలో శిక్షణ ఇప్పిస్తామని చెప్పి పన్నాగం పన్నారు. అందుకోసం చంద్రబాబు కనుసన్నల్లోనే ఎలాంటి శాస్త్రీయ మదింపు లేకుండానే ఏకంగా రూ.3,300 కోట్లతో ప్రాజెక్టును రూపొందించారు. ఆ పన్నాగంలో భాగంగానే 2014–15లో అప్పటి సీఎం చంద్రబాబును సీమెన్స్ ఇండియా లిమిటెడ్ ఎండీ సుమన్ బోస్, డిజైన్ టెక్ కంపెనీ ఎండీ వికాస్ కన్విల్కర్ కలిశారు. ప్రభుత్వం 10శాతం నిధులు సమకూరిస్తే సీమెన్స్, డిజైన్‌టెక్ సంస్థలు 90శాతం నిధులు పెట్టుబడి పెడతాయని ఒప్పందం కుదుర్చుకున్నారు. నిజానికి.. అసలు సీమెన్స్ కంపెనీకి ఈ ఒప్పందం గురించే తెలీదు. భారత్‌లో గతంలో ఆ కంపెనీ ఎండీగా వ్యవహరించిన సుమన్ బోస్ అలియాస్ సౌమ్యాద్రి శేఖర్ బోస్‌తోపాటు టీడీపీ పెద్దలు డిజైన్ టెక్‌తో కలిసి కథ నడిపించారు. చంద్రబాబు ఆదేశాలతో అప్పటి ముఖ్య కార్యదర్శి పీవీ రమేశ్ నిధులు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీచేశారు. ఈ కుంభకోణంలో ఏపీఎస్ఎస్డీసీ’కి అప్పట్లో ఎండీగా ఉన్న రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కే లక్ష్మీనారాయణ, ప్రత్యేక కార్యదర్శిగా ఉన్న గంటా సుబ్బారావు కీలకంగా వ్యవహరించారు. ఇక ఏపీఎస్ఎస్డీసీ సీఈఓగా డిప్యూటీ ఐఏఎస్ అధికారి అపర్ణ ఉపాధ్యాయను నియమించారు. ఈమె సీమెన్స్ కంపెనీ కమిటీలో సభ్యుడైన జీవీఎస్ భాస్కర్ సతీమణి. ఈ విధంగా పరస్పర విరుద్ధ ప్రయోజనాలకు నిబంధనలను ఉల్లంఘిస్తూ మరీ ఆమెకు పోస్టింగ్ ఇవ్వడం గమనార్హం. కనీసం ఆ రెండు సంస్థల నుంచి బ్యాంకు గ్యారంటీ కూడా తీసుకోలేదు. ఇక ప్రాజెక్టు పనులు మొదలు పెట్టకుండానే ప్రభుత్వం తరపున 10 శాతం వాటాగా జీఎస్టీతో కలుపుకుని రూ.371 కోట్లను ఆ సంస్థలకు చెల్లించేశారు. ఇందులో సీమెన్స్ కంపెనీ సరఫరా చేసిన రూ.56 కోట్ల సాఫ్ట్వేర్, మరికొన్నింటికి చెల్లింపులు చేసి కథ ముగించారు. మిగిలిన రూ.241 కోట్లను నకిలీ ఇన్వాయిస్తో పలు షెల్ కంపెనీలు, బినామీ కంపెనీ డిజైన్‌టెక్ ఖాతాలోకి మళ్లించారు. ఇక ఢిల్లీలోని ఇన్‌వెబ్ సర్వీసెస్, పూణేకు చెందిన స్కిల్లర్ అనే షెల్ కంపెనీలకు నిధులు మళ్లించి ఆ నిధులను సింగపూర్‌లోని కంపెనీలకు తరలించి అక్కడి నుంచి టీడీపీ పెద్దల ఖాతాల్లోకి బదిలీ చేశారు. అందుకుగాను షెల్ కంపెనీలకు కేవలం కమీషన్లు చెల్లించి టీడీపీ పెద్దలు రూ.241కోట్లు కొల్లగొట్టారు. కీలక ఫైళ్లు గల్లంతు.. వాస్తవానికి ఏపీఎస్ఎస్డీసీ కుంభకోణాన్ని 2018లోనే కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. కేంద్ర జీఎస్టీ అధికారులు 2018లో పూణేలో కొన్ని సంస్థలపై నిర్వహించిన తనిఖీల్లో నకిలీ ఇన్వాయిస్లు వెలుగు చూశాయి. అవి ఏపీఎస్ఎస్డీసీ ప్రాజెక్టుకు సంబంధించినవిగా గుర్తించి ఆ సమాచారాన్ని ఏపీ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ)కి తెలిపాయి. దాంతో ఈ వ్యవహారంపై ఏసీబీ దర్యాప్తు చేయాల్సి ఉంది. కానీ, చంద్రబాబు ప్రభుత్వం అప్పట్లో ఇందుకు అనుమతించలేదు. ఆ విషయాన్ని కప్పిపుచ్చింది. అంతేకాదు.. వెంటనే సీమెన్స్ కంపెనీతో ఒప్పందానికి సంబంధించి ఏపీఎస్ఎస్డీసీలో కీలకమైన ఫైళ్లను మాయం చేశారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కేంద్ర జీఎస్టీ అధికారులు ఏసీబీ దృష్టికి తీసుకువచ్చిన విషయం వెలుగుచూసింది. దీంతో టీడీపీ పెద్దలు లేని ప్రాజెక్టు ముసుగులో రూ.241 కోట్లు దోచుకున్న అవినీతి బాగోతం బట్టబయలైంది. -
ఏసీబీ దాడులు: భారీగా బంగారం, నగదు గుర్తింపు
బనశంకరి: ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించిన ఆరోపణలతో పలువురు ప్రభుత్వ అధికారుల ఇళ్లు, ఆఫీసులపై ఏసీబీ దాడులు నిర్వహించింది. మంగళవారం తెల్లవారుజామున రాష్ట్రవ్యాప్తంగా 11 జిల్లాల్లో 9 మంది అధికారుల ఇళ్లలో సోదాలు ప్రారంభించారు. ఇందులో భారీఎత్తున బంగారు ఆభరణాలు, నగదుతో పాటు లెక్కలోకి రాని స్థిర చరాస్తులను కనిపెట్టారు. ఈ ఏడాదిలో జరిగిన రెండో ఏసీబీ దాడి ఇది. అధికారులు, బంధువుల ఇళ్లల్లో సోదాలు సుమారు 52 మంది ఏసీబీ అధికారులు, 174 మంది ఏసీబీ సిబ్బంది దాడుల్లో పాల్గొన్నారు. చిక్కబళ్లాపురలో కృష్ణేగౌడ, అతని సోదరుని ఇళ్లపై ఏసీబీ ఎస్పీ కళా కృష్ణమూర్తి నేతృత్వంలో దాడులు జరిగాయి. ఇద్దరి ఇళ్లలో ఫైళ్లు, ఆస్తుల డాక్యుమెంట్లు దొరికాయి. బెళగావి విద్యుత్‌శాఖ ఇన్స్పెక్టర్ హనుమంత శివప్పచిక్కణ్ణనవర్ విలాసవంతమైన ఫ్లాటులో భారీ ఎత్తున బంగారం, వెండి ఆభరణాలు, వివిధ చోట్ల ఖరీదైన ఫ్లాట్లు, వివిధ బ్యాంకుల్లో ఎఫ్డీలు, భారీఎత్తున ఆస్తిపాస్తులను స్వాధీనం చేసుకున్నారు. మైసూరులో మూడుచోట్ల ఏసీబీ దాడులతో నగరంలోని ప్రభుత్వ సిబ్బంది హడలిపోయారు. మైసూరు టౌన్‌ప్లానింగ్ అధికారి సుబ్రమణ్య వీ.వడ్కర్ ఇంటితో పాటు కారవారలో ఉన్న తల్లి నివాసంలోనూ దాడులు సాగాయి. మైసూరు ఎఫ్‌డీఏ చన్నవీరప్ప ఇంట్లో పెద్దమొత్తంలో నగదు, బంగారు ఆభరణాలతో పాటు భూములు, స్థలాల పత్రాలు దొరికాయి. ఆఫీసులో ఉండాల్సిన అనేక ఫైళ్లు, డీడీలు ఇంట్లో ఉన్నాయి. విలువైన గడియారాలు లభించాయి. యాదగిరి వలయ బెస్కాం లెక్కాధికారి రాజుపత్తార్ ఇంట్లో నగలు, బ్యాంక్ పాస్‌పుస్తకాలు, లాకర్ గుర్తించారు. బెంగళూరులో బీఎంటీఎఫ్ సీఐ విక్టర్సీమన్ కసవనహళ్లిలోని నివాసం, మైసూరులో ఉన్న మామ ఇంట్లో సోదాలు జరిగాయి. భారీఎత్తున స్థిరచరాస్తులు లభించాయి. బీబీఎంపీ యలహంక వలయ నగర ప్లానింగ్ విభాగ అసిస్టెంట్ డైరెక్టర్ కే.సుబ్రమణ్యంకి శంకరనగరలో స్టార్‌హోటల్‌ను తలదన్నేలా నివాసం ఉంది. ఇటీవలే కొన్నట్లు తెలిసింది. డిప్యూటీ డైరెక్టర్ కేఎం.ప్రథమ్‌కు బెంగళూరు నాగశెట్టిహళ్లిలో ఉన్న నివాసం, సోదరుని ఇంటిపై దాడులు జరిగాయి. ఏసీబీ దాడులు ఎదుర్కొన్న అధికారులు వీరే 1. కృష్ణేగౌడ, నిర్మితికేంద్ర పథకం డైరెక్టర్– చిక్కబళ్లాపుర 2. హనుమంత శివప్పచిక్కణ్ణనవర్, డిప్యూటీ విద్యుత్ శాఖ ఇన్స్పెక్టర్– బెళగావి వలయం 3. సుబ్రమణ్య వీ.వడ్కర్, జాయింట్‌డైరెక్టర్ టౌన్‌ప్లానింగ్, మైసూరు 4. మునిగోపాల్ రాజు–బెస్కాం ఇంజనీర్, మైసూరు 5. చిక్కవీరప్ప, ఏ గ్రేడ్ అధికారి, ఆర్టీఓ కార్యాలయం, మైసూరు 6. రాజు పత్తార్– లెక్కాధికారి, బెస్కాం యాదగిరి 7. విక్టర్ సీమన్, సీఐ, బీఎంటీఎఫ్, బెంగళూరు 8. కే.సుబ్రమణ్యం, జూనియర్ ఇంజనీర్, టౌన్‌ప్లానింగ్ కార్యాలయం, బీబీఎంపీ, యలహంక 9. కేఎం.ప్రథమ్– డిప్యూటీ డైరెక్టర్, పరిశ్రమలు, బాయిలర్స్, దావణగెరె వలయం -
గిన్నిస్ బుక్ రికార్డులోకి కీసర తహసీల్దార్
సాక్షి, హైదరాబాద్ : అవినీతి నిరోధకశాఖకు పట్టుబడ్డ కీసర తహసీల్దార్ బాలరాజు నాగరాజు పేరు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులోకి ఎక్కించాలని అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న చెందిన రెండు స్వచ్ఛంద సంస్థలు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్‌ను కోరాయి. ఒక భూపట్టా విషయంలో రూ.2 కోట్లకు డీల్ మాట్లాడుకుని రూ. 1.10 కోట్లు స్వీకరిస్తూ ఇటీవలే తహసీల్దార్ పట్టుబడిన విషయం తెలిసిందే. ఒక ప్రభుత్వ ఉద్యోగి 20 మిలియన్లను లంచం రూపంలో తీసుకుంటూ పట్టుబడటం ప్రపంచంలోనే ఇదే తొలిసారి అయి ఉండవచ్చని యూత్ ఫర్ యాంటీ కరప్షన్ (వైఏసీ) అధ్యక్షుడు పల్నాటి రాజేందర్, వరంగల్ కేంద్రంగా అవినీతి వ్యతిరేక అవగాహన కార్యకలాపాలు నిర్వహిస్తున్న జ్వాల సంస్థ అధ్యక్షుడు సుంకరి ప్రశాంత్ గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డ్ కు ఆన్ లైన్లో చేసుకున్న దరఖాస్తులో తెలిపారు. దీనికి గిన్నిస్ బుక్ సంస్థ స్పందించింది. ప్రభుత్వ అధికారుల అవినీతికి సంబంధించిన తమవద్ద ఇంతవరకు ఎలాంటి కేటగిరీ లేదని, దీనికోసం ప్రత్యేకంగా కేటగిరి ప్రారంభించే విషయాన్ని పరిశీలిస్తామని తెలిపింది. -
ఫిక్సర్లకు యూఏఈ అడ్డాలాంటిది
ముంబై: ఐపీఎల్–2020 యూఏఈలో జరిగే సమయంలో ఫిక్సింగ్, బెట్టింగ్ తదితర అంశాలపై ఒక కన్నేసి ఉంచడంలో ఎలాంటి కష్టం ఉండబోదని బీసీసీఐ అవినీతి నిరోధక విభాగం అధినేత అజిత్ సింగ్ అన్నారు. దేశంలోని ఎనిమిది వేదికలతో పోలిస్తే మూడు చోట్లనే మ్యాచ్‌లు జరగనుండటం తమ పని సులువు చేస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. లీగ్‌ను బయో సెక్యూర్ వాతావరణంలో నిర్వహిస్తారా లేదా అనే అంశంపై స్పష్టత వచ్చిన తర్వాత తమ ఏర్పాట్లు చేసుకుంటామని అజిత్ సింగ్ వెల్లడించారు. ‘క్రికెట్లో అవినీతిని అరికట్టే విషయంలో మా బృందం సమర్థంగా పని చేస్తుంది. అది మన దేశంలో అయినా మరెక్కడైనా పనితీరు ఒకే తరహాలో ఉంటుంది. బుకీల వ్యవహారంపై మాకు స్పష్టత ఉంది. నిజానికి ఫిక్సర్లకు యూఏఈ అడ్డాలాంటిది. అయితే అక్కడి మూడు వేదికల్లో ఫిక్సింగ్పై దృష్టి పెట్టేందుకు మేం తగిన ప్రణాళికలతో సిద్ధంగా ఉన్నాం. ఒక వేళ తగినంత మంది అధికారులు లేరని భావిస్తే అక్కడే ఐసీసీ ప్రధాన కార్యాలయం ఉంది కాబట్టి వారి అనుమతితో అక్కడి మనుషులనే తాత్కాలిక ప్రాతిపదికన నియమించుకుంటాం. అంతే కానీ ఉదాసీతనకు చోటివ్వం’ అని ఆయన స్పష్టం చేశారు. -
పనిష్మెంట్లో ఉన్నవారి వివరాలివ్వండి
సాక్షి, అమరావతి : రాష్ట్రంలోని అవినీతిపరులైన ఉద్యోగుల గుండెల్లో అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) గుబులు రేపుతోంది. తాజాగా రాష్ట్ర సాధారణ పరిపాలన శాఖ(జీఏడీ)కు ఏసీబీ డీజీ పీఎస్ఆర్ ఆంజనేయులు ఇటీవల రాసిన లేఖ కలకలం సృష్టిస్తోంది. ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగుల్లో పనిష్మెంట్(శాఖాపరమైన చర్యలు)లో ఉన్నవారు, పనిష్మెంట్ అమలుకాకుండా పెండింగ్‌లో ఉన్నవారి వివరాలను కోరుతూ ఆయన లేఖ రాశారు. దీంతో ఏసీబీ కోరిన వివరాలివ్వాలంటూ అన్ని ప్రభుత్వ శాఖల ముఖ్య కార్యదర్శులకు, హెచ్ఓడీలకు జీఏడీ ఉత్తర్వులు(మెమో) జారీ చేసింది. రాష్ట్రంలో అవినీతి నిర్మూలనకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా ఏసీబీ దాడులు ముమ్మరం చేయడం తెలిసిందే. అవినీతికి సంబంధించిన సమాచారం, ఫిర్యాదులకోసం ప్రభుత్వం డయల్ 14400 టోల్ ఫ్రీ నంబర్‌ను ప్రారంభించింది. టోల్ ఫ్రీ నంబర్‌కు వస్తున్న ఫిర్యాదులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్న ఏసీబీ డీజీ పీఎస్ఆర్ ఆంజనేయులు తమ టీమ్‌తో దాడులు నిర్వహిస్తున్నారు. గత కొద్దిరోజుల్లో రెవెన్యూ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్, ప్రభుత్వ హాస్టల్స్, మున్సిపల్ టౌన్ ప్లానింగ్, ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుపుదాడులు జరిపి.. సోదాలు నిర్వహించి లోపాలను గుర్తించి ప్రభుత్వానికి నివేదించారు. దీంతో అవినీతి వేళ్లూనుకున్న కొన్ని శాఖల్లోని ఉద్యోగులు తర్వాత వంతు తమదేమోననే భయంతో గడుపుతున్నారు. ఈ నేపథ్యంలో జీఏడీకి ఏసీబీ డీజీ రాసిన లేఖ ప్రభుత్వ శాఖల్లో ఒక్కసారిగా కలకలం రేపింది. అవినీతిపరుల జాబితాకోసం ఏసీబీ దృష్టి పెట్టిందనే ప్రచారం జరగడంతో పలువురు ఉద్యోగుల్లో కంగారు మొదలైంది. మేం అడిగింది పనిష్మెంట్కు గురైన వారి వివరాలు మాత్రమే ప్రభుత్వ శాఖల్లో అవినీతిపరులైన అధికారుల వివరాలు కోరినట్టు జరుగుతున్న ప్రచారంలో నిజంలేదు. అవినీతికి పాల్పడేవారిని ఏసీబీ గుర్తిస్తుంది. అంతేతప్ప ప్రభుత్వ శాఖలను ఆ వివరాలు ఎందుకు అడుగుతాం.. సస్పెండైన ఉద్యోగులు, పనిష్మెంట్ అమలు కాకుండా పెండింగ్‌లో ఉన్నవారి వివరాలు మాత్రమే మేం కోరాం. 2019 జూన్ 1 తేదీ నుంచి ఇప్పటివరకు పూర్తి స్థాయి వివరాలను ఇవ్వాలని జీఏడీని కోరడం జరిగింది. – ఏసీబీ డీజీ పీఎస్ఆర్ ఆంజనేయులు -
అవినీతి అంతమే లక్ష్యంగా..
సాక్షి, అమరావతి: అవినీతి అంతానికి రాష్ట్ర ప్రభుత్వం మరిన్ని చర్యలు చేపట్టింది. ప్రభుత్వ విభాగాల్లో ఏ స్థాయిలోనూ అవినీతిని సహించబోమని ముఖ్యమంత్రి జగన్ ఇప్పటికే హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ఇటీవల పెద్ద ఎత్తున ఆకస్మిక దాడులు నిర్వహిస్తూ అవినీతిపరుల వేటలో నిమగ్నమైంది. అవినీతిపై ప్రజలను, అధికారులను మరింత జాగృతం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలో ప్రముఖ క్రీడాకారులు, సినీ నటులతో సందేశాత్మక ఆడియోలు, వీడియో చిత్రాలను రూపొందించాలని భావిస్తోంది. అవినీతిపై సమాజాన్ని జాగృతం చేసేలా తన గళం అందించేందుకు ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణీ పీవీ సింధు ముందుకొచ్చారని ఏసీబీ వర్గాలు తెలిపాయి. అవినీతి వల్ల సమాజానికి జరిగే అనర్థాలు, ప్రజలకు కలిగే ఇబ్బందులను ప్రస్తావిస్తూ చైతన్యం కలిగించేలా సింధు సందేశాలను సిద్ధం చేస్తున్నారు. క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్‌తోపాటు ఇతర క్రీడాకారులు, ప్రముఖ సినీ నటులతో కూడా అవినీతికి వ్యతిరేకంగా సందేశాత్మక చిత్రాలను రూపొందించేందుకు ఏసీబీ అధికారులు కసరత్తు చేస్తున్నారు. టోల్ ఫ్రీ నెంబర్‌పై పోస్టర్లతో ప్రచారం అవినీతి అంతానికి ఇప్పటికే పెద్ద ఎత్తున దాడులు నిర్వహిస్తున్న ఏసీబీ ప్రజా చైతన్య కార్యక్రమాలను కూడా చేపట్టడం విశేషం. రాష్ట్ర ప్రభుత్వం 14400 టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేసి అవినీతిపై ప్రజలు నేరుగా ఫిర్యాదు చేసే వెసులుబాటు కల్పించింది. టోల్ ఫ్రీ నెంబర్లకు వచ్చే ఫోన్ కాల్స్‌ను ఎప్పటికప్పుడు సమీక్షించి ఏసీబీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. 14400 టోల్ ఫ్రీ నెంబర్‌పై బస్సులు, ఆటోలు, ఇతర వాహనాలపై పోస్టర్ల ద్వారా పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఎక్కడైనా ప్రభుత్వ ఉద్యోగులు సేవలు అందించేందుకు డబ్బులు డిమాండ్ చేస్తే సమాచారం అందించాలని వీటి ద్వారా పౌరులను అప్రమత్తం చేస్తున్నారు. ‘మౌనం వీడండి.. అవినీతిపై గొంతెత్తండి’ అంటూ ప్రముఖ ప్రదేశాలు, కూడళ్లలో బోర్డులు, హోర్డింగ్‌లు ఏర్పాటు చేస్తున్నారు. అవినీతికి వ్యతిరేకంగా ఎఫ్ఎం రేడియో ద్వారా కూడా ప్రచారం చేపట్టారు. ‘మీ చుట్టుపక్కల అవినీతి జరిగితే చూస్తూ ఊరుకోకండి. ఏసీబీకి ఫిర్యాదు చేయండి’ అంటూ మొబైల్ ఫోన్లకు సందేశాలను పంపుతున్నారు. ప్రముఖులను భాగస్వాముల్ని చేస్తున్నాం రాష్ట్రంలో అవినీతికి తావు లేకుండా చేయాలన్నదే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తపన. సీఎం ఆలోచనలకు అనుగుణంగా చర్యలు చేపట్టాం. అవినీతిపై ప్రశ్నించడం, ఫిర్యాదు చేయడం ద్వారా ప్రజల్లో చైతన్యం పెరగాలి. సీఎం ఆదేశాలతో తొలి ప్రయత్నంగా ప్రభుత్వ శాఖల్లో అవినీతి, లంచగొండితనం రూపుమాపేందుకు పెద్ద ఎత్తున దాడులు చేస్తున్నాం. ఎక్కడైనా అవినీతి జరిగితే ఏసీబీ దృష్టికి తేవాలని ప్రతి పౌరుడినీ కోరుతున్నాం. సమాచారం ఇచ్చిన వ్యక్తి వివరాలు గోప్యంగా ఉంచడంతోపాటు తగిన పారితోషికం అందచేసి ప్రోత్సహిస్తాం. ప్రముఖ క్రీడాకారులు, నటులను అవినీతి వ్యతిరేక ఉద్యమంలో భాగస్వాముల్ని చేస్తున్నాం’ – ఏసీబీ డీజీ పీఎస్ఆర్ ఆంజనేయులు -
అవినీతిలో అందెవేసిన చేయి
చేయి తడపందే ఆయన దగ్గరనుంచి ఏ ఫైల్ కదలదంట... పనిచేసిన ప్రతిచోటా కలెక్షన్ చేయడంలో సిద్ధహస్తుడంట... ఈయన దాహానికి అంతులేకపోవడంతో ఇటీవలే ఓ అధికారి సైతం జాగ్రత్తగా ఉండాలంటూ హెచ్చరించారంట... అయినా ఆయన తన సహజ ధోరణితో వ్యవహరించడంతో మళ్లీ ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టారన్న ఆరోపణలపైనా ఓసారి కేసు నమోదై... ఇంకా విచారణ కొనసాగుతోంది. రాష్ట్ర ముఖ్యమంత్రి ఓ వైపు అవినీతిపై ఉక్కుపాదం మోపాలని హెచ్చరిస్తుంటే... ఇంకా ఇలాంటి తిమింగలాలు తమ వైఖరి మార్చుకోకపోవడం రెవెన్యూ శాఖకే మాయని మచ్చగా మారుతోంది. సాక్షి, విజయనగరం : రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వై.ఎస్.జగన్మోహన్రెడ్డి రెవెన్యూశాఖలో అవినీతి పై రెండు నెలలుగా ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూనే ఉన్నారు. అయినా రెవెన్యూశాఖ అధికారుల తీరు మారడంలేదు. ఎన్నోఏళ్లుగా లంచాలకు అలవాటు పడ్డ కొందరు వాటిని మానుకోలేకపోతున్నారు. గంట్యాడ మండల తహసీల్దార్ డి.శేఖర్ అవినీతి నిరోధక శాఖ అధికా>రులకు మంగళవారం చిక్కడం ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. అవినీతి శేఖరం ఏసీబీ అధికారులకు చిక్కిన గంట్యాడ తహసీల్దార్ డి.శేఖర్‌కు అవినీతి చరిత్ర పెద్దదే ఉంది. కాసులివ్వనదే పని చేయడన్న ఆరోపణలు బలంగా ఉన్నాయి. ఈయన విశాఖపట్నంలో రెవెన్యూశాఖలో ఉద్యోగ ప్రస్థానం ప్రారంభించారు. డిప్యూటీ తహసీల్దారు కేడరు వరకు అక్కడే పని చేశారు. ఏడాది క్రితం తహసీల్దారుగా పదోన్నతి ఇచ్చిన రాష్ట్ర భూపరిపాలన ముఖ్య కార్యదర్శి విజయనగరం జిల్లా కేటాయించారు. జిల్లా కలెక్టర్ ఈయన్ను మొదట బొండపల్లి తహసీల్దారుగా నియమించారు. ఎన్నికల సమయంలో బదిలీల్లో అక్కడి నుంచి సీతానగరం బదిలీ చేశారు. తాజాగా 20రోజుల క్రితం సీతానగరం నుంచి గంట్యాడకు బదిలీపై వచ్చారు. ఈ నెల 10వ తేదీనే అక్కడ విధుల్లో చేరారు. సుదీర్ఘకాలం రెవెన్యూశాఖలో సేవలందించిన శేఖర్‌పై జిల్లాలో అనేక ఆరోపణలున్నాయి. జిల్లాకు వచ్చిన ఏడాది కాలంలో అనేక అవినీతి అక్రమాలకు పాల్పడ్డారన్న పేరు కూడా ఉంది. ఎక్కడ పని చేసినా డబ్బులు ఇవ్వనిదే పనులు చేయరన్నది ప్రతీతి. పట్టాదారు పాసుపుస్తకాలు, పలు ధ్రువీకరణపత్రాల జారీకి పెద్ద ఎత్తున లంచాలు డిమాండ్ చేశారని బొండపల్లి, సీతానగరం, గంట్యాడ వాసులు చెబుతున్న మాట. బొండపల్లిలో ఉండగా లంచా ల విషయంలో సిబ్బందికి, ఆయనకు మధ్య పెద్ద ఎత్తున వివాదాలు చోటు చేసుకున్నాయి. గంట్యా డ వెళ్లిన 20రోజుల్లోనే అనేక పనులకు డబ్బులు డిమాండ్ చేయడం, ఇచ్చిన వారికి సంతకాలు చేయడం, ఇవ్వనివారిని తిప్పించడం చేస్తున్నారని ప్రచారం సాగింది. కొందరు అధికారులు ఏమీ ఆశించకుండా ఇచ్చే ఎఫ్సీవో కాపీ కోసం రూ.2వేలు డిమాండ్ చేస్తున్నారని ఆ శాఖ అధికారుల్లోనే చర్చ జరుగుతోంది. ఈ విషయం జిల్లా అధికా రుల వరకూ చేరడంతో జాగ్రత్తగా ఉండాలని మూడు రోజుల క్రితమే ఓ జిల్లా అధికారి హెచ్చరించినట్టు కూడా తెలిసింది. అయినా ఎక్కడా వెనక్కి తగ్గలేదు. విశాఖపట్నంలో పని చేసినపుడు కూడా ఆయనపై అనేక అవినీతి అభియోగాలు న్నాయి. విశాఖపట్నంలో పని చేస్తుండగా ఆరేళ్ల క్రి తం ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీబీ అధికారులు దాడులు చేసి కేసులు నమోదు చేయగా ఇంకా కేసు నడుస్తోంది. ఎన్ఓసీకోసం రూ. 50వేలు లంచం... విజయనగరానికి చెందిన రొంగలి శ్రీనివాసరావు రామవరం పంచాయతీ కరకవలస సమీపంలో సర్వేనంబర్ 32/6లో 20 సెంట్ల స్థలాన్ని ల్యాండ్ కన్వర్షన్, పెట్రోల్‌బంకు ఏర్పాటుకు ఎన్ఓసీ ఇవ్వాలని రెవెన్యూ శాఖతో పాటు 4 శాఖలకు దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పటికే పోలీస్, ఫైర్ తదితర శాఖలు ఎన్ఓసీ ఇవ్వగా రెవెన్యూమాత్రం ఇవ్వలేదు. దీనిపై తహసీల్దార్ బి.శేఖర్‌ను సంప్రదించగా రూ 50వేలు లంచం డిమాండ్ చేశారు. చేసేది లేక ఆయన ఏసీబీ అధికారులకు ఫిర్యాదుచేయగా ఏసీబీ డీఎస్పీ డి.వి.ఎస్.నాగేశ్వరరావు ఆధ్వర్యంలో మాటువేసి తహసీల్దార్ కార్యాలయంలోనే లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. వెంటనే ఆయనపై కేసు నమోదుచేసి, విశాఖపట్నం ఏసీబీ కోర్టులో హాజరుపర్చనున్నట్టు డీఎస్పీ తెలిపారు. గంట్యాడలో గతంలో విద్యుత్ శాఖ జేఈ జ్యోతీశ్వరరావు, సర్వేయర్ శ్రీనివాసరావు, ఆర్డబ్ల్యూఎస్ జేఈ గోవిందరావు ఏసీబీ వలలో చిక్కుకున్నారు. ముఖ్యమంత్రి ఎంతగా హెచ్చరిస్తున్నా... రెవెన్యూశాఖపై ఇప్పటికే జనంలో చెడ్డ పేరుంది. ఇక్కడ ఏ పనీ లంచం ఇవ్వనిదే జరగదన్న ఓ అపవాదు కూడా ఉంది. ఈ విషయం ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి దృష్టిలో ఉండటంతో అవినీతి తగ్గాలని కలెక్టర్ల సమావేశం, వీడియో కాన్ఫరెన్సులో చెబుతూనే ఉన్నారు. రెండు రోజుల క్రితం జరిగిన వీడియోకాన్ఫరెన్సులోనూ ఈ విషయం కలెక్టర్ ప్రస్తావించారు. అయినా తహసీల్దారు శేఖర్ తీరు మారకపోవడం విశేషం. ఇలాంటి పనుల వల్ల డిపార్టుమెంటు పరువు పోతోందని ఆ శాఖలోని అధికారులే వ్యాఖ్యానించడం గమనార్హం. -
బాలకృష్ణ మాజీ పీఏకు మూడేళ్ల జైలు..!
సాక్షి, అనంతపురం : సినీనటుడు, టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ మాజీ పర్సనల్ అసిస్టెంట్ శేఖర్‌కు జైలు శిక్ష ఖరారైంది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శేఖర్‌కు మూడేళ్ల జైలు, మూడు లక్షల జరిమానా విధిస్తూ నెల్లూరు ఏసీబీ కోర్టు తీర్పు వెలువరించింది. తిరుపతి పద్మావతి యూనివర్సిటీలో అసిస్టెంట్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న శేఖర్, ఎమ్మెల్యే బాలకృష్ణ వద్ద పీఏగా పనిచేశారు. బాలకృష్ణ పేరుతో హిందూపురంలో ఆయన అక్రమ వసూళ్లకు పాల్పడ్డారనే ఆరోపణలన్నాయి. పీఏ దందాలను చాలాకాలం కిందటే బాలకృష్ణ, టీడీపీ నేతలు వ్యతిరేకించారు. ఇక పార్టీ నేతల మధ్య కూడా విభేదాలకు కారణమయ్యాడనే ఆరోపణల నేపథ్యంలో బాలకృష్ణ తన పీఏ శేఖర్‌కు ఫిబ్రవరిలోనే ఉద్వాసన పలికారు. శేఖర్‌పై 2008లో కేసు నమోదుకాగా, మూడు రోజుల కిందట నెల్లూరు ఏసీబీ కోర్టు శిక్ష ఖరారు చేసింది. -
ఏసీబీ వలలో జీహెచ్ఎంసీ ఉద్యోగి..!
సాక్షి, హైదరాబాద్ : లంచం తీసుకుంటుండగా ఓ జీహెచ్ఎంసీ ఉద్యోగిని ఏసీబీ అధికారులు శుక్రవారం రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఇల్లు కుట్టకునేందుకు బిద్లాన్ ధర్మేందర్‌సింగ్ అనే వ్యక్తి చార్మినార్ సర్కిల్-9లో దరఖాస్తు చేశాడు. అక్కడ టౌన్‌ప్లానింగ్ సెక్షన్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న సయ్యద్ అష్రఫ్ అహ్మద్ పర్మిషన్ ఇచ్చేందుకు రూ.10వేలు డిమాండ్ చేశాడు. బాధితుడు ఏసీబీ అధికారులకు విషయం చెప్పడంతో.. అష్రఫ్ లంచం తీసుకుంటుండగా జామా మజీద్ వద్ద వలపన్ని పట్టుకున్నారు. -
‘స్టే’జీవికి ఝలక్
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారని, దీనిపై ఏసీబీ విచారణకు ఆదేశించాలని కోరుతూ నందమూరి లక్ష్మీపార్వతి 2005లో దాఖలు చేసిన ప్రైవేట్ ఫిర్యాదుపై విచారణ కొనసాగించాలని హైదరాబాద్‌లోని అవినీతి నిరోధక శాఖ ప్రత్యేక న్యాయస్థానం నిర్ణయించింది. అందులో భాగంగా తదుపరి విచారణను మే 13వ తేదీకి వాయిదా వేసింది. లక్ష్మీపార్వతి ఫిర్యాదుపై ఏసీబీ కోర్టు విచారణ జరపకుండా చంద్రబాబు 2005 మార్చిలో హైకోర్టు నుంచి స్టే తెచ్చుకున్నారు. గత ఏడాది సుప్రీంకోర్టు ఒక కేసులో తీర్పునిస్తూ.. స్టే ఉత్తర్వులు మంజూరు చేసి ఆరు నెలలు దాటినప్పుడు, తిరిగి ఆ ఉత్తర్వులు పొడిగింపు పొందాల్సి ఉంటుందని, లేకపోతే స్టే లేనట్లుగా భావించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. లక్ష్మీపార్వతి దాఖలు చేసిన ఫిర్యాదు గత నెలలో ఏసీబీ కోర్టు ముందు విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా కోర్టు ఈ కేసుకు సంబంధించి ఏవైనా స్టే ఉత్తర్వులున్నాయా అంటూ సందేహం వ్యక్తం చేసింది. విచారణను వాయిదా వేసింది. శుక్రవారం ఈ కేసు మరోసారి విచారణకు రాగా, లక్ష్మీపార్వతి తరఫు న్యాయవాది సురేందర్‌రెడ్డి స్పందిస్తూ.. ఈ ఫిర్యాదుపై చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించి 2005లో స్టే పొందారని తెలిపారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఆరు నెలల గడువు ముగిసిన తరువాత స్టే పొడిగింపు పొందాలని, అయితే, ఈ కేసులో చంద్రబాబు ఇప్పటివరకు ఎలాంటి పొడిగింపు పొందలేదని ఆయన ఏసీబీ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అలా అయితే సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం స్టే లేనట్లుగానే భావించాల్సి ఉంటుందని, అందువల్ల లక్ష్మీపార్వతి ఫిర్యాదుపై విచారణను కొనసాగిస్తామని ఏసీబీ కోర్టు స్పష్టం చేసింది. తదుపరి విచారణను మే 13వ తేదీకి వాయిదా వేసింది. ఆ రోజు విచారణకు హాజరు కావాలని లక్ష్మీపార్వతిని ఆదేశించింది. లక్ష్మీపార్వతి ఫిర్యాదులోని ముఖ్యాంశాలు ‘‘చంద్రబాబు నాయుడు సాధారణ వ్యవసాయ కుటుంబంలో పుట్టారు. ఆర్థిక స్థోమత లేకపోవడంతో ఆయన విద్యాభ్యాసమంతా ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లోనే సాగింది. 1978లో చిత్తూరు జిల్లా చంద్రగిరి నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఎమ్మెల్యేగా నెలకు రూ.350 జీతం అందుకున్నారు. 1980లో మంత్రి అయ్యారు. మంత్రిగా నెలకు రూ.2,500 జీతం తీసుకున్నారు. 1978 నుంచి 1983 వరకు ఎమ్మెల్యేగా, మంత్రిగా ఆయన ఆదాయం రూ.74,050. 1983లో తెలుగుదేశం పార్టీలో చేరారు. అప్పటి నుంచి 1989 వరకు ఆయన వ్యవసాయ ఆదాయం ఏడాదికి రూ.36,000. ఈ విషయాన్ని చంద్రబాబు 1988లో ఓ కేసులో హైకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్లో పేర్కొన్నారు. 1983 నుంచి 1989 వరకు ఆయన ఆదాయం రూ.2.16 లక్షలు. 1992లో చంద్రబాబు హెరిటేజ్ ఫుడ్స్‌ను ప్రమోట్ చేశారు. ఆ కంపెనీ డైరెక్టర్‌గా ఐదు నెలలు పాటు నెలకు రూ.20,000 చొప్పున జీతం తీసుకున్నారు. 1999లో స్పీకర్‌కు ఆస్తుల వివరాలు సమర్పించినప్పుడు, అందులో హెరిటేజ్ ఫుడ్స్‌లో రూ.76.15 లక్షల పెట్టుబడులు పెట్టినట్లు చెప్పారు. అలాగే రూ.3.07 లక్షలను ఇతర ఆదాయంగా చూపారు. అన్‌లిస్టెడ్ వాటాల విలువ రూ.41.55 లక్షలు. ఇలా తన పేరు మీద మొత్తం ఆస్తుల విలువను రూ.144.50 లక్షలుగా చూపారు. బాబు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు అంతేకాకుండా నెల్లూరు జిల్లా బాలాయపల్లి మండలం నిందాలి గ్రామంలో 26.43 ఎకరాలు, హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 65లో ప్లాట్, వెంకటేశ్వర హౌసింగ్ సొసైటీలో మరో 600 చదరపు గజాల స్థలం ఉన్నట్లు చంద్రబాబు చూపారు. వీటి విలువను రూ.5.36 కోట్లుగా పేర్కొన్నారు. తన కుమారుడు నారా లోకేశ్ పేరు మీద రూ.2.45 కోట్ల ఆస్తులున్నట్లు చెప్పారు. తండ్రి, కొడుకుల ఆస్తిని రూ.7.82 కోట్లుగా చూపారు. 1999 నుంచి 2004 వరకు చంద్రబాబు ముఖ్యమంత్రిగా కొనసాగారు. కుప్పం ఎమ్మెల్యేగా ఆయన రిటర్నింగ్ అధికారికి సమర్పించిన అఫిడవిట్లో తన ఆస్తులను రూ.1.58 కోట్లుగా చూపారు. లోకేశ్ పేరిట ఉన్న ఆస్తులను చూపించలేదు. 1978 నుంచి 2003 వరకు చంద్రబాబు అధికారిక సంపాదన రూ.7.38 లక్షలు మాత్రమే. రిటర్నింగ్ అధికారికి చూపిన అఫిడవిట్‌లోని లెక్కలు నిజమనుకున్నా, ఆయనకు ఆదాయానికి మించి ఉన్న ఆస్తులు రూ.1.50,85,066. ఇవి ఆయన కుమారుడు లోకేశ్ ఆస్తులను కలపకుండా చూపిన ఆస్తులు. ఆ సమయంలో లోకేశ్ మైనర్‌గా ఉన్నాడు. మైనర్ ఆస్తులను తండ్రి ఆస్తులుగా పరిగణించాల్సి ఉంటుంది. దీని ప్రకారం చంద్రబాబు మొత్తం ఆస్తుల విలువ రూ.4.03 కోట్లు. చంద్రబాబు ఎమ్మెల్యేగా, మంత్రిగా తనకొచ్చే జీతంతో జూబ్లీహిల్స్‌లో ఇల్లు కట్టలేరు. హెరిటేజ్‌లో రూ.76.15 లక్షల పెట్టుబడి పెట్టలేరు. వివిధ కంపెనీల్లో రూ.44.55 లక్షల విలువైన షేర్లు కొనలేరు. ఎమ్మెల్యే, మంత్రిగా అధికార దుర్వినియోగానికి పాల్పడం ద్వారా సంపాదించిన డబ్బుతోనే చంద్రబాబు ఇవన్నీ చేయగలిగారు. 1995లో చంద్రబాబు రెవెన్యూ శాఖ మంత్రి అయ్యారు. అప్పటి నుంచి ఆయన భార్య భువనేశ్వరి ఆస్తులతో పాటు హెరిటేజ్ ఫుడ్స్ ఆస్తులు కూడా గణనీయంగా పెరుగుతూ వచ్చాయి. పలు కీలక ప్రాంతాల్లో ఎకరాల కొద్దీ భూములు కొనేశారు. అలాగే హైదరాబాద్ నడిబొడ్డున పంజాగుట్టలో భవనం కొనుగోలు చేశారు. చంద్రబాబు తన తల్లి అమ్మణ్ణమ్మ పేరిట హైదరాబాద్ మదీనాగూడలో భూమి కొని, దాన్ని కుమారుడు లోకేశ్ పేరిట బదలాయించారు. రూ.76 లక్షలతో రూ.17.44 కోట్ల ఆస్తులు కొనడం సాధ్యమేనా? 2004లో రిటర్నింగ్ అధికారికి సమర్పించిన అఫిడవిట్లో భువనేశ్వరి ఆస్తులను రూ.19.34 కోట్లుగా> చంద్రబాబు చూపారు. 1994–2003 మధ్య రూ.76 లక్షలుగా భువనేశ్వరి ఆదాయం ఉంది. ఈ మొత్తంతో రూ.17.44 కోట్ల ఆస్తులు కొనుగోలు చేయడం అసాధ్యం. చంద్రబాబు చర్యలు అవినీతి నిరోధక చట్టం కిందకు వస్తాయి. ఈ ఆధారాలన్నింటితో ఏసీబీ డీజీకి ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అందువల్ల ఈ ప్రైవేట్ ఫిర్యాదు దాఖలు చేస్తున్నా. దీన్ని విచారణకు స్వీకరించి, చంద్రబాబుపై విచారణ జరిపేలా ఏసీబీని ఆదేశించండి’’ అని నందమూరి లక్ష్మీపార్వతి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదు గురించి పత్రికల్లో వార్తా కథనాలు వచ్చాయి. వెంటనే చంద్రబాబు ఏసీబీ కోర్టులో ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేసి, తన వాదనలు వినాలని కోరారు. చంద్రబాబు అభ్యర్థనను న్యాయస్థానం తోసిపుచ్చింది. దీంతో చంద్రబాబు వెంటనే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. క్రిమినల్ పిటిషన్ కాకుండా అధికరణ 226 కింద రిట్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన అప్పటి న్యాయమూర్తి జస్టిస్ డీఎస్ఆర్ వర్మ ఏసీబీ కోర్టులో లక్ష్మీపార్వతి ఫిర్యాదుపై తదుపరి చర్యలన్నింటినీ నిలిపేస్తూ 2005 మార్చిలో ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వులను ఎత్తివేయాలని కోరుతూ లక్ష్మీపార్వతి పిటిషన్ దాఖలు చేశారు. అప్పటి న్యాయమూర్తి జస్టిస్ వంగా ఈశ్వరయ్య ఈ పిటిషన్‌ను కొట్టివేశారు. దీంతో అప్పటి నుంచి స్టే కొనసాగుతూ వస్తోంది. -
సమాచారం లీక్: శోభన్‌బాబుపై వేటు!
సాక్షి, విజయవాడ: కంచె చేను మేసిన తరహాలో ఓ అవినీతి నిరోధక విభాగం (ఏసీబీ) అధికారి అవినీతిపరులతో కుమ్మక్కయ్యాడు. అవినీతి అధికారులకు ముందుగానే ఏసీబీ దాడుల గురించి లీక్ చేసి.. వారు ఒడ్డున పడేలా వ్యవహరించాడు. ఈ వ్యవహారం వెలుగులోకి రావడంతో ఏసీబీ రహస్య విభాగం మేనేజర్ శోభన్‌బాబుపై సస్పెన్షన్ వేటు పడింది. అవినీతి అధికారులతో శోభన్‌బాబు కుమ్మక్కయి.. ముందుగానే ఏసీబీ దాడుల సమాచారాన్ని వారికి అందవేస్తున్నట్టు తాజాగా గుర్తించారు. 50మందికిపైగా అవినీతిపరులతో ఆయన సంప్రదింపులు జరిపినట్టు కాల్‌డేటా ఆధారంగా ఏసీబీ ఉన్నతాధికారులు గుర్తించారు. దీంతో శోభన్‌బాబుపై శాఖపరమైన విచారణకు ఏసీబీ డీజీ ఠాకూర్ ఆదేశించారు. కాల్‌డేటా ఆధారంగా ఆయనపై కేసు నమోదుచేశారు. -
ఏసీబీ డీజీగా అనురాగ్ శర్మకు అదనపు బాధ్యతలు
⇒ డైరెక్టర్‌గా ఉన్న చారుసిన్హాపై బదిలీ వేటు ⇒ ట్రైనింగ్ ఐజీగా పోస్టింగ్ ⇒ ఐజీ శ్రీనివాస్‌రెడ్డి గ్రేహౌండ్స్‌కు ట్రాన్స్ఫర్ ⇒ నల్లగొండ కేసులే చారుసిన్హా బదిలీకి కారణమన్న ఏసీబీ వర్గాలు సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర అవినీతి నిరోధక శాఖ డైరెక్టర్ జనరల్ (డీజీ)గా డీజీపీ అనురాగ్ శర్మకు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఏసీబీ డైరెక్టర్‌గా ఉన్న ఐజీ చారుసిన్హాపై ప్రభుత్వం బదిలీ వేటు వేసింది. ట్రైనింగ్ ఐజీగా ఉన్న కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డిని గ్రేహౌండ్స్ ఐజీగా నియమిం చడంతోపాటు ఆయన స్థానంలో చారుసిన్హా ను ట్రైనింగ్ ఐజీగా నియమించింది. అయితే అకస్మాత్తుగా జరిగిన ఈ బదిలీలపై అటు ఏసీబీలోనూ, ఇటు ప్రభుత్వ వర్గాల్లోనూ తీవ్ర చర్చ మొదలైంది. చారుసిన్హాపై నల్లగొండ నేతల వార్ ఏసీబీ డీజీగా పదవీ విరమణ పొందిన ఏకే ఖాన్ తర్వాత ఆ విభాగాన్ని చారుసిన్హా పర్యవేక్షిస్తున్నారు. అప్పటి నుంచి అక్రమా ర్కులుగా ముద్రపడ్డ విజిలెన్స్ అధికారులు, రెవెన్యూ, కమర్షియల్ ట్యాక్స్ అధికారులపై ఏసీబీ ప్రధానంగా దృష్టి సారించింది. అయితే ఇక్కడే చారుసిన్హాకు ఎదురుదెబ్బ తగిలినట్టు ఏసీబీ వర్గాలు పేర్కొన్నాయి. నల్లగొండ జిల్లాలో ఈ మూడు విభాగాల్లోని అధికారులపై ఏసీబీ ప్రధానంగా దృష్టి సారించడంతో అక్కడి అవి నీతి అధికారులు ప్రజా ప్రతినిధులను ఆశ్రయిం చారు. తాము తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పని చేశామని, అయినా తమను ఏసీబీ వెంటాడుతోందని, ఆ కేసులు తమపైకి రాకుండా చూడాలని కీలక నేతలపై ఒత్తిడి తెచ్చా రని తెలిసింది. ఇటీవలే విజిలెన్స్ నల్లగొండ విభాగం ఎస్పీ ఏసీబీకి చిక్కి కటకటాల పాలయ్యారు. అలాగే ఇద్దరు రెవెన్యూ అధికారులపై అక్రమాస్తుల కేసును ఏసీబీ... ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లింది. ఇక్కడి వరకు ప్రభుత్వ పెద్దల నుంచి ఎలాంటి ఒత్తిడి ఏసీబీపై పడలేదు. కానీ కమర్షియల్ ట్యాక్స్ విభాగంలో పనిచేస్తున్న కీలక అధికారులపై ఏసీబీ దృష్టి సారించి పూర్తి నివేదికను ప్రభుత్వానికి పంపింది. సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవడానికి అనుమతి కావాలని ఏసీబీ జనరల్ అడ్మినిస్ట్రేటివ్ విభాగంపై ఒత్తిడి తెచ్చింది. దీంతో సంబంధిత ఆరోపణలెదుర్కొం టున్న అధికారి కీలక నేతలకు విషయాన్ని తెలియజేశారు. వెంటనే సంబంధిత నేతలు ప్రభుత్వ పెద్దల వద్ద ఏసీబీ వ్యవహరిస్తున్న తీరుపై ఫిర్యాదు చేశారు. ఈ తరుణంలోనే ముందస్తు అనుమతులు లేకుండా ఏసీబీ ఉన్నతాధికారులు వ్యవహరిస్తున్నారంటూ పరోక్షంగా చారుసిన్హాపై నేతలు ఫిర్యాదు చేసినట్లు విశ్వసనీయంగా తెలిసింది. కావాలనే తమ మనుషులను ఏసీబీ టార్గెట్ చేస్తోందని, దీనంతటికీ చారుసిన్హాయే కారణమని తెలియడంతో అప్పటికప్పుడు ఐజీని బదిలీచేసినట్లు ఏసీబీ వర్గాలు తెలిపాయి. -
అవినీతి ఖజానా
నెల్లిమర్ల, నెల్లిమర్ల రూరల్, న్యూస్‌లైన్: అవినీతి నిరోధక శాఖ వలకు ఖజానా సిబ్బంది చిక్కారు. నెల్లిమర్ల మండల కేం ద్రంలో ఉప ఖజానాధికారిగా పనిచేస్తున్న పద్మిణీ ఆచారిణి, అదే కార్యాలయంలో సీనియర్ అకౌంటెంట్‌గా పనిచేస్తున్న శంకర పోలినాయుడులు రూ.3,500 లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఒకేసారి ఒక అధికారి మరో ఉద్యోగి ఏసీబీకి చిక్కడంతో మండలానికి చెందిన అధికారులు, ఉద్యోగులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఏసీబీ డీఎస్పీ సి.హెచ్. లక్ష్మీపతి అందించిన వివరాల ప్రకారం..నెల్లిమర్లకు చెందిన 5వ బెటాలియన్ హెడ్ కానిస్టేబుల్ దాడిశెట్టి రాంబాబు 2002లో మృతిచెందారు. ఇతని భార్య అన్నపూర్ణ కూడా అంతకు ముందు రెండేళ్ల క్రితమే మరణించడంతో వీరి కుమారులకు పింఛను మంజూరైంది. దీనికి సంబంధించిన ఎరియర్స్ సుమారు రూ.90 వేలు వచ్చాయి. ఈ మొత్తాన్ని అందజేసేందుకు ఎస్టీఓ రూ.3500 లంచం డిమాండ్ చేశారు. దీంతో డెంకాడ పోలీస్‌స్టేషన్‌లో హెచ్‌సీగా పనిచేస్తున్న రాంబాబు తమ్ముడు డి. శంకరరావు ఏసీబీని ఆశ్రయించారు. పథకం ప్రకారం ఏసీబీ అధికారులు అందజేసిన నగదును శుక్రవారం మధ్యాహ్నం ఎస్టీఓకు మూడు వేల రూపాయలు, సీనియర్ అసిస్టెంట్‌కు రూ.అయిదు వందలు శంకరరావు ఇచ్చారు. దీంతో ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. దాడుల్లో ఏసీబీ సీఐలు డి.రమేష్, ఎస్.లక్ష్మోజీ, గౌస్ఆజాద్ సిబ్బంది పాల్గొన్నారు. ఫిర్యాదు దారు వివరాల ప్రకారం.. చింతలవలస లోని 5వ ఏపీఎస్పీ బెటాలియన్ లో కానిస్టేబుల్‌గా పనిచేసిన దాడిశెట్టి రాంబాబు, భార్య అన్నపూర్ణ మృతి చెందడంతో వారి కుమారులు తులసీరావు, దామోదరావు పెదనాన్న అప్పలరాజు సంరక్షణలో ఉన్నారు. 2005లో అప్పలరాజు కూడా మృతి చెందడంతో ప్రస్తుతం పెద్దమ్మ వద్ద ఉంటున్నారు. ఈనేపథ్యంలో పింఛనుకు సంబంధించి ఎరియర్స్ వచ్చాయని నెల్లిమర్ల మండల కేంద్రంలోని ఉప ఖజానా కార్యాలయంలో సీనియర్ అకౌంటెంట్‌గా పనిచేస్తున్న శంక ర పోలినాయుడు రెండు నెలల క్రితం రాంబాబు కుటుంబీకులకు సమాచారం అం దించారు. ఎరియర్స్‌కు సంబంధించిన బిల్లును మంజూరు చేసేందుకు గాను డెంకాడ పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న దివంగత రాంబాబు సోదరుడు దాడిశెట్టి శంకరరావు పోలినాయుడును సంప్రదించారు. అయితే బిల్లు వ్యవహారమంతా జిల్లా కేంద్రంలోని ఖజానా కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న యుగంధర్ చూస్తున్నారని పోలినాయుడు శంకరరావుకు చెప్పారు. బిల్లు మం జూరు చేయాలంటే ఎరియర్స్ మొత్తంలో సగం తమకు అందజేయాలని డిమాండ్ చేశారు. దీనికి ఎరియర్స్‌గా మంజూరైన రూ.90వేలలో రూ.25 వేలు ఇచ్చేందుకు శంకరరావు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ నేపథ్యంలో నెల్లిమర్ల ఎస్టీఓ పద్మిని ఆచారిణిని శంకరరావు కలిసి బిల్లు మంజూరు చేయాలని కోరారు. అయితే బిల్లు మంజూరు చేసేందుకు తనకు రూ.3500 లంచంగా ఇవ్వాలని ఎస్టీఓ డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంతో విసిగి పోయిన శంకరరావు ఏసీబీని ఆశ్రయించారు. ఆనందంలో ప్రభుత్వ ఉద్యోగులు అవినీతికి అడ్డాగా మారిన ఉపఖాజానా శాఖ కార్యాలయంలోని అధికారులు ఏసీబీకి చిక్కారనే వార్త మండల వ్యాప్తంగా దావానలంలా వ్యాపించడంతో పలు ప్రభుత్వ శాఖలకు చెందిన సిబ్బంది, పలు గ్రామాల ప్రజాప్రతినిధులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి చిన్నపనికి లంచం ముట్టచెప్పనిదే ఫైలు కదిలే పరిస్థితి ఉండేది కాదని వారు అంటున్నారు. ప్రతి నెలా జీతాల బిల్లులకు సైతం ఎంతోకొంత చెల్లిస్తేగాని మంజూరయ్యేవి కాదని చెబుతున్నారు. ఈ దెబ్బతో లంచం తీసుకునే అధికారులు కాస్తై జంకుతారని వారు అంటున్నారు. అధికారుల గుండెల్లో గుబులు ఒకే నెలలో మూడు శాఖలకు చెందిన అధికారులు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కడంతో జిల్లాలోని అధికారుల గుండెల్లో గుబులు మొదలైంది. అవినీతిపై ప్రజల్లో మరింత చైతన్యం వచ్చినప్పుడే అధికారుల్లో జవాబుదారీతనం వస్తుందని పలువురు అంటున్నారు.