Enforcement Directorate Notices To 26 Benamis Of Chandrababu - Sakshi
Sakshi News home page

‘స్కిల్‌’ స్కాంపై ఈడీ కొరడా

Published Mon, Dec 5 2022 6:23 AM | Last Updated on Thu, Dec 8 2022 12:51 PM

Enforcement Directorate Notices to 26 Benamis of Chandrababu - Sakshi

సాక్షి, అమరావతి: చంద్రబాబు హయాంలో యథేచ్ఛగా సాగిన అవినీతి కుంభకోణాల బండారాలు జాతీయస్థాయిలో బట్టబయలవుతున్నాయి. టీడీపీ ప్రభుత్వ పెద్దలు ‘ఏపీ స్టేట్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఏపీఎస్‌ఎస్‌డీసీ)లో నిధులను అడ్డగోలుగా కొల్లగొట్టిన అవినీతి బాగోతంపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) కొరడా ఝళిపించింది. టీడీపీ హయాంలో సీమెన్స్‌ కంపెనీతో రూ.3,300 కోట్ల ప్రాజెక్టు పేరిట కథ నడిపించి.. ఒక్క రూపాయి కూడా పెట్టుబడి రాకుండానే.. అసలు ప్రాజెక్టు లేకుండానే రూ.241కోట్ల ప్రజాధనాన్ని కొల్లగొట్టారు.

ఈ అవినీతి దందాలో సూత్రధారులు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన తనయుడు.. ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌ కాగా.. చంద్రబాబు సన్నిహితులు, బినామీలు పాత్రధారులుగా వ్యవహరించారు. ఈ కుంభకోణంలో పాత్రధారులుగా వ్యవహరించిన వారికి ఆదివారం ఈడీ నోటీసులు జారీచేసింది. చంద్రబాబు స్నేహితుడు, ఏపీఎస్‌ఎస్‌డీసీ ఎండీగా చేసిన కే లక్ష్మీనారాయణ, ప్రత్యేక కార్యదర్శి గంటా సుబ్బారావు, ఓఎస్డీ నిమ్మగడ్డ వెంకట కృష్ణప్రసాద్, చీఫ్‌ ఫైనాన్షియల్‌ ఆఫీసర్‌ కే ప్రతాప్‌కుమార్‌లతోపాటు ఈ కుంభకోణంలో కీలకంగా వ్యవహరించిన షెల్‌ కంపెనీల ప్రతినిధులతో సహా మొత్తం 26మందికి నోటీసులు జారీచేశారు.

ఆ జాబితాలో డిజైన్‌ టెక్, స్కిల్లర్, ఇన్‌వెబ్‌ సర్వీసెస్, అలైడ్‌ కంప్యూటర్స్‌ ఇంటర్మేషనల్, ప్రతీక్‌ ఇన్ఫో సర్వీసెస్, ఐటీ స్మిత్‌ సొల్యూషన్స్, నాలెడ్జ్‌ పోడియం, ట్యాలెంట్‌ ఎడ్జ్‌ మొదలైన షెల్‌ కంపెనీలున్నాయి. ఈ కేసులో ఇప్పటికే ఏపీ సీఐడీ అధికారులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తూ కీలక ఆధారాలు సేకరించి ఎనిమిది మందిని అరెస్టుచేశారు. మరోవైపు.. ఈడీ కూడా నాలుగైదు నెలలుగా ఈ కుంభకోణంపై గుట్టుచప్పుడు కాకుండా దర్యాప్తు చేసి కీలక ఆధారాలను సేకరించింది.

ప్రధానంగా షెల్‌ కంపెనీల పేరిట ప్రజాధనాన్ని కొల్లగొట్టి సింగపూర్‌ కంపెనీలకు తరలించి.. తిరిగి తమ ఖాతాల్లో వేసుకున్న వైనాన్ని ఈడీ పూర్తి ఆధారాలతో గుర్తించింది. తద్వారా చంద్రబాబు సన్నిహితులు మనీల్యాండరింగ్‌కు పాల్పడినట్లు  నిర్ధారించింది. అనంతరమే ఈ కేసులో వారిని విచారించేందుకు నిర్ణయించి నోటీసులు జారీచేసింది. మరోవైపు.. హైదరాబాద్‌లోని ఈడీ కార్యాలయంలో విచారణకు సోమవారం  హాజరుకావాలని వారిని ఆదేశించింది.

కాగితాలపై ప్రాజెక్టు.. బాబు బినామీల ఖాతాల్లో రూ.241 కోట్లు
ఇక టీడీపీ ప్రభుత్వ పెద్దలు జర్మనీకి చెందిన సీమెన్స్‌ కంపెనీతో ఓ ప్రాజెక్టు అంటూ కేవలం కాగితాలపై చూపించి ఏకంగా రూ.241 కోట్లు కొల్లగొట్టారు. రాష్ట్రంలో యువతకు నైపుణ్యాభివృద్ధిలో శిక్షణ ఇప్పిస్తామని చెప్పి పన్నాగం పన్నారు. అందుకోసం చంద్రబాబు కనుసన్నల్లోనే ఎలాంటి శాస్త్రీయ మదింపు లేకుండానే ఏకంగా రూ.3,300 కోట్లతో ప్రాజెక్టును రూపొందించారు. ఆ పన్నాగంలో భాగంగానే 2014–15లో అప్పటి సీఎం చంద్రబాబును  సీమెన్స్‌ ఇండియా లిమిటెడ్‌ ఎండీ సుమన్‌ బోస్, డిజైన్‌ టెక్‌ కంపెనీ ఎండీ వికాస్‌ కన్విల్కర్‌ కలిశారు.

ప్రభుత్వం 10శాతం నిధులు సమకూరిస్తే సీమెన్స్, డిజైన్‌టెక్‌ సంస్థలు 90శాతం నిధులు పెట్టుబడి పెడతాయని ఒప్పందం కుదుర్చుకున్నారు. నిజానికి.. అసలు సీమెన్స్‌ కంపెనీకి ఈ ఒప్పందం గురించే తెలీదు. భారత్‌లో గతంలో ఆ కంపెనీ ఎండీగా వ్యవహరించిన సుమన్‌ బోస్‌ అలియాస్‌ సౌమ్యాద్రి శేఖర్‌ బోస్‌తోపాటు టీడీపీ పెద్దలు డిజైన్‌ టెక్‌తో కలిసి కథ నడిపించారు. చంద్రబాబు ఆదేశాలతో అప్పటి ముఖ్య కార్యదర్శి పీవీ రమేశ్‌ నిధులు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీచేశారు.

ఈ కుంభకోణంలో ఏపీఎస్‌ఎస్‌డీసీ’కి అప్పట్లో ఎండీగా ఉన్న రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి కే లక్ష్మీనారాయణ, ప్రత్యేక కార్యదర్శిగా ఉన్న గంటా సుబ్బారావు కీలకంగా వ్యవహరించారు. ఇక ఏపీఎస్‌ఎస్‌డీసీ సీఈఓగా డిప్యూటీ ఐఏఎస్‌ అధికారి అపర్ణ ఉపాధ్యాయను నియమించారు. ఈమె సీమెన్స్‌ కంపెనీ కమిటీలో సభ్యుడైన జీవీఎస్‌ భాస్కర్‌ సతీమణి. ఈ విధంగా పరస్పర విరుద్ధ ప్రయోజనాలకు నిబంధనలను ఉల్లంఘిస్తూ మరీ ఆమెకు పోస్టింగ్‌ ఇవ్వడం గమనార్హం. కనీసం ఆ రెండు సంస్థల నుంచి బ్యాంకు గ్యారంటీ కూడా తీసుకోలేదు.

ఇక ప్రాజెక్టు పనులు మొదలు పెట్టకుండానే ప్రభుత్వం తరపున 10 శాతం వాటాగా జీఎస్టీతో కలుపుకుని రూ.371 కోట్లను ఆ సంస్థలకు చెల్లించేశారు. ఇందులో సీమెన్స్‌ కంపెనీ సరఫరా చేసిన రూ.56 కోట్ల సాఫ్ట్‌వేర్, మరికొన్నింటికి చెల్లింపులు చేసి కథ ముగించారు. మిగిలిన రూ.241 కోట్లను నకిలీ ఇన్‌వాయిస్‌తో పలు షెల్‌ కంపెనీలు, బినామీ కంపెనీ డిజైన్‌టెక్‌ ఖాతాలోకి మళ్లించారు.

ఇక ఢిల్లీలోని ఇన్‌వెబ్‌ సర్వీసెస్, పూణేకు చెందిన స్కిల్లర్‌ అనే షెల్‌ కంపెనీలకు నిధులు మళ్లించి ఆ నిధులను సింగపూర్‌లోని కంపెనీలకు తరలించి అక్కడి నుంచి టీడీపీ పెద్దల ఖాతాల్లోకి బదిలీ చేశారు. అందుకుగాను షెల్‌ కంపెనీలకు కేవలం కమీషన్లు చెల్లించి టీడీపీ పెద్దలు రూ.241కోట్లు కొల్లగొట్టారు. 

కీలక ఫైళ్లు గల్లంతు..
వాస్తవానికి ఏపీఎస్‌ఎస్‌డీసీ కుంభకోణాన్ని 2018లోనే కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. కేంద్ర జీఎస్టీ అధికారులు 2018లో పూణేలో కొన్ని సంస్థలపై నిర్వహించిన తనిఖీల్లో నకిలీ ఇన్వాయిస్‌లు వెలుగు చూశాయి. అవి ఏపీఎస్‌ఎస్‌డీసీ ప్రాజెక్టుకు సంబంధించినవిగా గుర్తించి ఆ సమాచారాన్ని ఏపీ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ)కి తెలిపాయి. దాంతో ఈ వ్యవహారంపై ఏసీబీ దర్యాప్తు చేయాల్సి ఉంది. కానీ, చంద్రబాబు ప్రభుత్వం అప్పట్లో ఇందుకు అనుమతించలేదు.

ఆ విషయాన్ని కప్పిపుచ్చింది. అంతేకాదు.. వెంటనే సీమెన్స్‌ కంపెనీతో ఒప్పందానికి సంబంధించి ఏపీఎస్‌ఎస్‌డీసీలో కీలకమైన ఫైళ్లను మాయం చేశారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కేంద్ర జీఎస్టీ అధికారులు ఏసీబీ దృష్టికి తీసుకువచ్చిన విషయం వెలుగుచూసింది. దీంతో టీడీపీ పెద్దలు లేని ప్రాజెక్టు ముసుగులో రూ.241 కోట్లు దోచుకున్న అవినీతి బాగోతం బట్టబయలైంది.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement