పీవీ సింధు, వీవీఎస్ లక్ష్మణ్
సాక్షి, అమరావతి: అవినీతి అంతానికి రాష్ట్ర ప్రభుత్వం మరిన్ని చర్యలు చేపట్టింది. ప్రభుత్వ విభాగాల్లో ఏ స్థాయిలోనూ అవినీతిని సహించబోమని ముఖ్యమంత్రి జగన్ ఇప్పటికే హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ఇటీవల పెద్ద ఎత్తున ఆకస్మిక దాడులు నిర్వహిస్తూ అవినీతిపరుల వేటలో నిమగ్నమైంది. అవినీతిపై ప్రజలను, అధికారులను మరింత జాగృతం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
ఈ క్రమంలో ప్రముఖ క్రీడాకారులు, సినీ నటులతో సందేశాత్మక ఆడియోలు, వీడియో చిత్రాలను రూపొందించాలని భావిస్తోంది. అవినీతిపై సమాజాన్ని జాగృతం చేసేలా తన గళం అందించేందుకు ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణీ పీవీ సింధు ముందుకొచ్చారని ఏసీబీ వర్గాలు తెలిపాయి. అవినీతి వల్ల సమాజానికి జరిగే అనర్థాలు, ప్రజలకు కలిగే ఇబ్బందులను ప్రస్తావిస్తూ చైతన్యం కలిగించేలా సింధు సందేశాలను సిద్ధం చేస్తున్నారు. క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్‌తోపాటు ఇతర క్రీడాకారులు, ప్రముఖ సినీ నటులతో కూడా అవినీతికి వ్యతిరేకంగా సందేశాత్మక చిత్రాలను రూపొందించేందుకు ఏసీబీ అధికారులు కసరత్తు చేస్తున్నారు.
టోల్ ఫ్రీ నెంబర్‌పై పోస్టర్లతో ప్రచారం
అవినీతి అంతానికి ఇప్పటికే పెద్ద ఎత్తున దాడులు నిర్వహిస్తున్న ఏసీబీ ప్రజా చైతన్య కార్యక్రమాలను కూడా చేపట్టడం విశేషం. రాష్ట్ర ప్రభుత్వం 14400 టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేసి అవినీతిపై ప్రజలు నేరుగా ఫిర్యాదు చేసే వెసులుబాటు కల్పించింది. టోల్ ఫ్రీ నెంబర్లకు వచ్చే ఫోన్ కాల్స్‌ను ఎప్పటికప్పుడు సమీక్షించి ఏసీబీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. 14400 టోల్ ఫ్రీ నెంబర్‌పై బస్సులు, ఆటోలు, ఇతర వాహనాలపై పోస్టర్ల ద్వారా పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
ఎక్కడైనా ప్రభుత్వ ఉద్యోగులు సేవలు అందించేందుకు డబ్బులు డిమాండ్ చేస్తే సమాచారం అందించాలని వీటి ద్వారా పౌరులను అప్రమత్తం చేస్తున్నారు. ‘మౌనం వీడండి.. అవినీతిపై గొంతెత్తండి’ అంటూ ప్రముఖ ప్రదేశాలు, కూడళ్లలో బోర్డులు, హోర్డింగ్‌లు ఏర్పాటు చేస్తున్నారు. అవినీతికి వ్యతిరేకంగా ఎఫ్‌ఎం రేడియో ద్వారా కూడా ప్రచారం చేపట్టారు. ‘మీ చుట్టుపక్కల అవినీతి జరిగితే చూస్తూ ఊరుకోకండి. ఏసీబీకి ఫిర్యాదు చేయండి’ అంటూ మొబైల్ ఫోన్లకు సందేశాలను పంపుతున్నారు.
ప్రముఖులను భాగస్వాముల్ని చేస్తున్నాం
రాష్ట్రంలో అవినీతికి తావు లేకుండా చేయాలన్నదే ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తపన. సీఎం ఆలోచనలకు అనుగుణంగా చర్యలు చేపట్టాం. అవినీతిపై ప్రశ్నించడం, ఫిర్యాదు చేయడం ద్వారా ప్రజల్లో చైతన్యం పెరగాలి. సీఎం ఆదేశాలతో తొలి ప్రయత్నంగా ప్రభుత్వ శాఖల్లో అవినీతి, లంచగొండితనం రూపుమాపేందుకు పెద్ద ఎత్తున దాడులు చేస్తున్నాం. ఎక్కడైనా అవినీతి జరిగితే ఏసీబీ దృష్టికి తేవాలని ప్రతి పౌరుడినీ కోరుతున్నాం. సమాచారం ఇచ్చిన వ్యక్తి వివరాలు గోప్యంగా ఉంచడంతోపాటు తగిన పారితోషికం అందచేసి ప్రోత్సహిస్తాం. ప్రముఖ క్రీడాకారులు, నటులను అవినీతి వ్యతిరేక ఉద్యమంలో భాగస్వాముల్ని చేస్తున్నాం’
– ఏసీబీ డీజీ పీఎస్‌ఆర్ ఆంజనేయులు
Comments
Please login to add a commentAdd a comment