అవినీతి నిరోధక చట్టానికి చేసిన 17ఏ సవరణను ఏ ఉద్దేశంతో తీసుకొచ్చారో చూడాలి. దీని ప్రకారం పబ్లిక్ సర్వెంట్లు అక్రమాలకు పాల్పడకూడదు. చట్టంలోని ప్రధాన ఉద్దేశాన్ని పక్కనపెట్టి ఓ వ్యక్తికి మేలు జరిగేలా ఈ చట్టాన్ని అన్వయించుకోకూడదు. అది చట్టం లక్ష్యాన్నే దెబ్బతీస్తుంది – సుప్రీంకోర్టు
సాక్షి, న్యూఢిల్లీ: ‘అవినీతి నిరోధక చట్టం (పీసీ యాక్ట్)లోని సెక్షన్ 17ఏ అనేది నేరం జరిగిన తేదీకి వర్తిస్తుంది కానీ నిందితులకు కాదేమో’ అని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. చట్టం చేసిన ఉద్దేశాన్ని అర్థం చేసుకోవాలే తప్ప, దానిని తప్పుగా అన్వయించుకోవడానికి వీల్లేదని వ్యాఖ్యానించింది. సవరణలు వచ్చినప్పుడల్లా కొత్తగా మార్పులు వస్తున్నాయని, సెక్షన్ 17ఏ చంద్రబాబు కేసుకు వర్తిస్తుందా అని న్యాయమూర్తులు జస్టిస్ అనిరుద్ద బోస్, జస్టిస్ బేలా ఎం.త్రివేదిలతోకూడిన ధర్మాసనం సందేహం వ్యక్తం చేసింది. స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణంలో తనపై సీఐడీ నమోదు చేసిన కేసును కొట్టేయాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్ తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేసింది.
సోమవారం చంద్రబాబు తరఫున సీనియర్ న్యాయవాది హరీశ్ సాల్వే వాదనలు వినిపించారు. హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో 2021లో ఎఫ్‌ఐఆర్ నమోదైందని సీఐడీ పేర్కొందని, అందువల్ల ఈ కేసుకు సెక్షన్ 17ఏ వర్తిస్తుందని ఆయన తెలిపారు. 2018కి ముందే విచారణ ప్రారంభమైందన్న రాష్ట్ర ప్రభుత్వ వాదన సరికాదన్నారు. గతంలో కొంత విచారణ జరిగినట్లు కనిపిస్తున్నా, ఈ ఎఫ్‌ఐఆర్‌కు, దానికి సంబంధం లేదన్నారు.
ప్రభుత్వాలు మారిన తర్వాత వ్యక్తుల్ని లక్ష్యంగా చేసుకొని పెట్టే కేసులను నిరోధించడానికి సెక్షన్ 17ఏను తీసుకొచ్చారన్నారు. 2018 కన్నా ముందే దర్యాప్తు జరిగిందని రుజువు చేసే డాక్యుమెంట్లను ప్రభుత్వం సమర్పించలేదని, ఏసీబీ కోర్టు ముందు కూడా ఉంచలేదని తెలిపారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ.. మీరు రిమాండ్ రిపోర్టును సవాలు చేస్తున్నారా అని ప్రశ్నించగా.. అవునని సాల్వే బదులిచ్చారు.
సీఐడీ సమర్పించిన డాక్యుమెంట్ ద్వారానే దర్యాప్తు మొదలైందని లేదా ఎఫ్‌ఐఆర్ నమోదైందని భావిస్తే ఆ డాక్యుమెంటును కోర్టు పరిగణనలోకి తీసుకోవాలన్నారు. పీసీ చట్టంలోని 17ఏ పై కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ (ఎస్‌ఓపీ) ప్రకారం ప్రతి దశలోనూ గవర్నర్ అనుమతి తప్పనిసరి అని అన్నారు. ఈ ఎస్‌వోపీ కోర్టు సమీక్షకు లోబడి ఉండదని, సెక్షన్ 17ఏ ను అర్థం చేసుకోవడానికి సహకరిస్తుందన్నారు.
ఈ దశలో జస్టిస్ బేలా ఎం త్రివేది జోక్యం చేసుకొని.. చట్టం లక్ష్యాన్ని భంగపరిచే వివరణలు కోర్టు స్వీకరించదని స్పష్టం చేశారు. ఎస్‌వోపీని మూడేళ్ల కిందట ప్రకటించారని, అంతకు ముందు సంగతేమిటని, ప్రభుత్వం మారిన తర్వాత రాజకీయ కక్ష అని ఎవరన్నారని జస్టిస్ త్రివేది ప్రశ్నించారు. కేసును పరిశీలిస్తే ఫిర్యాదులో అంశాలు చంద్రబాబుకు వర్తించవన్నారు. ఈ కేసు మొత్తం సీమెన్స్, డిజైన్‌టెక్‌లకు సంబంధించిందన్నారు.
డిజైన్‌టెక్ కంపెనీ స్కిల్ టెక్ కంపెనీ నుంచి జీఎస్టీ క్రెడిట్‌లు పొందిందని, దానికి సంబంధించిందే 2021 సెప్టెంబరులోని ఫిర్యాదు అని సాల్వే తెలిపారు. ఈ సమయంలో ధర్మాసనం స్పందిస్తూ, డిజైన్‌టెక్ ఒప్పందం ఎవరితో చేసుకుందని ప్రశ్నించగా... అప్పటి రాష్ట్ర ప్రభుత్వంతో అని సాల్వే తెలిపారు. దర్యాప్తు ఎప్పుడు ప్రారంభమైందని ధర్మాసనం ప్రశ్నించగా.. 2021 సెప్టెంబరు 7న అని అన్నారు. ఏ ఆధారంతో చెబుతున్నారని ధర్మాసనం తిరిగి ప్రశ్నించింది. అవినీతిని నిరోధించడమే ఈ చట్టం ప్రధాన లక్ష్యమని, చట్టం లక్ష్యాన్ని భంగపరిచే వివరణ స్వీకరించలేమని జస్టిస్ బేలాఎం త్రివేది వ్యాఖ్యానించారు.
వాదనలు అయ్యాక దీనికి సంబంధించి ఏవైనా డాక్యుమెంట్లు సమర్పిస్తే వాటిని కౌంటర్ చేసే అవకాశం ఉండదని, అప్పుడు మెరిట్స్ జోలికి వెళ్లకుండా తిప్పి పంపుతామని సాల్వేనుద్దేశించి జస్టిస్ త్రివేది అన్నారు. సెక్షన్ 17ఏ నేరం జరిగిన తేదీతో సంబంధమని హైకోర్టు న్యాయమూర్తి చెప్పినందున తిప్పి పంపటం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదని సాల్వే తెలిపారు. హైకోర్టులో వాదనల తర్వాత ప్రభుత్వం డాక్యుమెంట్లు సమర్పించిందన్నదే పిటిషనర్ వాదన అని, అసలు ఏమీ వినకుండానే కేసు కొట్టేస్తారా అని జస్టిస్ త్రివేది ప్రశ్నించారు.
హైకోర్టులో వాదనలు పూర్తయిన తర్వాత డాక్యుమెంటు సమర్పించామన్న సాల్వే వాదనలను రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది నిరంజన్‌రెడ్డి తప్పుపట్టారు. కేసు రిమాండ్‌లోనే మొత్తం విషయం ఉందని తెలిపారు. ఈ కేసులో రెండు అంశాలు పరిశీలిస్తున్నామని.. ఒకటి హైకోర్టు ముందు సీఐడీ దాఖలు చేసిన డాక్యుమెంట్.. 2018 జులై 5న దర్యాప్తు ప్రారంభమైందని చెప్పే డాక్యుమెంట్ అని జస్టిస్ బోస్ పేర్కొన్నారు. ఇక రెండోది.. హైకోర్టు ముందు వాదన వినిపించడానికి పిటిషనర్ అవకాశం కోల్పోయారా అనే అంశమని జస్టిస్ బోస్ వ్యాఖ్యానించారు.
దర్యాప్తు పేరుతో ఒక వ్యక్తిని ఇబ్బంది పెట్టడం చట్టం ఉద్దేశం కాదని సాల్వే అన్నారు. సెక్షన్ 17ఏ సవరణను అవినీతి నిరోధక చట్టం ఉద్దేశంతో చూడాలని, దాని ప్రకారం పబ్లిక్ సర్వెంట్లు అక్రమాలకు పాల్పడకూడదని జస్టిస్ త్రివేది చెప్పారు. చట్టం ప్రధాన ఉద్దేశాన్ని పక్కనపెట్టి ఓ వ్యక్తికి మేలు జరిగేలా చట్టాన్ని విశ్లేషించుకోవడం ద్వారా చట్టం లక్ష్యాన్నే దెబ్బతీస్తుందని జస్టిస్ త్రివేది వ్యాఖ్యానించారు.
ఈ కేసులో చంద్రబాబు పేరు సెప్టెంబరు 2023న చేర్చారని, 37వ నిందితుడిగా ఉన్న చంద్రబాబును ఏ1 అంటున్నారని సాల్వే ఆరోపించారు. దర్యాప్తు అధికారి ప్రకారం ఏ 37 (చంద్రబాబు) సూచనల మేరకు ఏ 36 నేరానికి పాలడ్డారని, ఇది అవినీతి నిరోధక చట్టానికి వర్తిస్తుందని చెప్పారని, అదే సమయంలో గవర్నర్ అనుమతి తీసుకొని ఉండాల్సిందని సాల్వే తెలిపారు. సెక్షన్ 17 ఏ సవరణను ఎలాగైనా చూడొచ్చని, అంతకు ముందు జరిగిన నేరాల సంగతేమిటని జస్టిస్ త్రివేది ప్రశ్నించారు. 17ఏ అనేది నేరం జరిగిన తేదీకే కానీ నిందితులకు కాదు కదా అని జస్టిస్ బోస్ ప్రశ్నించారు.
సెక్షన్ 6ఏ ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్‌మెంట్ యాక్టుపై ఐదుగురు న్యాయమూర్తుల సుప్రీంకోర్టు ధర్మాసనం చెప్పిన అంశాలు చూడాలని, ఇది కూడా 17ఏ సవరణ తరహాలో ఉందని జస్టిస్ త్రివేది వ్యాఖ్యానించారు. ఒక ప్రజాప్రతినిధి సైకిలు దొంగతనం చేస్తే దాంట్లో జరిగిన అక్రమం తనకు కేటాయించిన విధులకు సంబంధించినదై ఉండాలని, అవినీతి నిరోధక చట్టం వర్తించరాదని సాల్వే పేర్కొన్నారు. అంటే సెక్షన్ పూర్తిగా కాకుండా పైపైన వర్తిస్తుందా అని జస్టిస్ బోస్ ప్రశ్నించారు.
ఈ కేసులో పరిపాలన పరమైన అంశాలు ఉన్నాయని, అభియోగాలు చూస్తే పది శాతం అడ్వాన్స్ నిధులు ముందే విడుదల చేశారని ఉందని జస్టిస్ బోస్ పేర్కొన్నారు. అరెస్టు చేసిన విధానం సరికాదు కాబట్టే సెక్షన్ 17ఏ పైనే వాదన చేస్తున్నామని సాల్వే పేర్కొన్నారు. మంగళవారం సీఐడీ తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి వాదనలు వినిపించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment