
క్యూఎస్ ప్రపంచ ర్యాంకింగ్‌లో 318 శాతం పురోగతి
జీ–20 దేశాల్లో ఇదే అత్యధిక వృద్ధి.. పబ్లిక్ స్టేట్ వర్సిటీల ద్వారా 3.24 కోట్ల మంది విద్యార్థులకు విద్య
1947లో 0.4 శాతం నుంచి 71 రెట్ల పెరుగుదలతో 28.4 శాతానికి చేరిన గ్రాస్ ఎన్‌రోల్‌మెంట్ రేషియో
2035 నాటికి 50 శాతం లక్ష్యంగా అడుగులు
దేశ విద్యా వ్యవస్థ పురోగతి వివరాలు వెల్లడించిన కేంద్రం
సాక్షి, న్యూఢిల్లీ: మనకు స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు దేశంలో విద్యా వ్యవస్థ అంచెలంచెలుగా విస్తరిస్తూ అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని కేంద్ర విద్యాశాఖ వెల్లడించింది. ముఖ్యంగా గత పదేళ్ల ఎన్‌డీఏ హయాంలో విద్యకు ఎంతో ప్రాధాన్యత ఇవ్వడంవల్ల గ్రామస్థాయి నుంచి దేశ రాజధాని వరకు ఈ పురోగతి సాధ్యమైనట్లు తెలిపింది.
స్వాతంత్య్రం వచ్చే సమయానికి 0.4 శాతంగా ఉన్న ‘గ్రాస్ ఎన్‌రోల్‌మెంట్ రేషియో’ (జీఈఆర్).. 2021–22 నాటికి ఏకంగా 71 రెట్ల పెరుగుదలతో 28.4 శాతానికి చేరినట్లు తెలిపింది. ఇక క్యూఎస్ (క్వాక్వారెల్లి సైమండ్స్) వరల్డ్ ర్యాంకింగ్స్‌తో దీనిని పోల్చుకుంటే భారత విద్యా వ్యవస్థ 318 శాతం పెరుగుదలను నమోదు చేసిందని, ఇది జీ–20 దేశాల్లోనే అత్యధిక వృద్ధి, పురోగతి అని కేంద్ర విద్యాశాఖ ప్రకటించింది.
ఎస్‌పీయూల ద్వారా 3.25 కోట్ల మందికి విద్య..
దేశవ్యాప్తంగా విశ్వవిద్యాలయాలు నాణ్యమైన విద్యను విస్తరించడం, అందించడంపై ‘నీతి ఆయోగ్’ ఫిబ్రవరి 10న ఓ నివేదిక విడుదల చేసింది. ఇందులో.. స్టేట్ పబ్లిక్ యూనివర్సిటీలు (ఎస్‌పీయూ) 3.25 కోట్ల మంది విద్యార్థులకు సేవలు అందిస్తున్నట్లు పేర్కొంది. 2035 నాటికి ఈ సంఖ్యను రెట్టింపు చేసే లక్ష్యంతో నూతన విద్యా విధానం(ఎన్‌ఈపీ) ద్వారా విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తున్నట్లు వివరించింది. నిజానికి.. 1857లో కలకత్తా, ముంబై, మద్రాసులలో తొలి విశ్వవిద్యాలయాలు స్థాపించినప్పటి నుంచి దేశంలోని ఉన్నత విద్యావ్యవస్థ గణనీయంగా విస్తరించింది.
1947లో స్వాతంత్రం వచ్చేనాటికి దేశంలో ఉన్న విశ్వవిద్యాలయాలు, కళాశాలల ద్వారా 2.38 లక్షల మంది విద్యార్థులు మాత్రమే విద్యను అభ్యసిస్తున్నారు. అప్పట్లో విశ్వవిద్యాలయాల్లో విద్యార్థుల హాజరు నమోదు కేవలం 14 శాతం ఉండడంతో ఆ రోజుల్లో విద్యా వ్యవస్థ ఆందోâýæనకరంగా ఉండేది. నాటి నుంచి నేటివరకు ప్రభుత్వాల చర్యల కారణంగా విద్యా రంగం చెప్పుకోదగ్గ స్థాయిలో పురోగతి సాధించింది. దీంతో ప్రస్తుతం విద్యార్థుల హాజరు నమోదు 81 శాతానికి పెరిగినట్లు నీతి ఆయోగ్ నివేదిక వెల్లడించింది.
ఎస్‌పీయూల ద్వారా పురోగతి..
ఎస్‌పీయూల ద్వారా దేశంలో విద్య అత్యధిక పురోగతి సాధించిందని కేంద్ర విద్యాశాఖ వెల్లడించింది. 2011–12లో వీటిల్లో 2.34 కోట్ల మంది విద్యార్థులుండగా.. 2021–22 నాటికి అది 3.24 కోట్లకు చేరుకుందని తెలిపింది. వీరిలో ఓబీసీలు 80.9 శాతం మంది, ఎస్సీలు 76.3% మంది ఉన్నారు. అలాగే, ఉన్నత విద్యాసంస్థల్లో దాదాపు 16 లక్షల మంది విధులు నిర్వర్తిస్తున్నారు. వీరిలో 68% మంది లెక్చరర్లు/అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఉన్నారు.
రీడర్లు/అసోసియేట్ ప్రొఫెసర్లు 10 శాతం మంది ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మరోవైపు.. ప్రపంచస్థాయి పరిశోధనలకు ప్రభుత్వాల సహకారం కూడా గణనీయంగా పెరిగింది. 2017లో 3.5%ఉండగా.. 2024లో 5.2 శాతానికి పెరిగింది. ఇక 2035 నాటికి 50 శాతం ‘గ్రాస్ ఎన్‌రోల్‌మెంట్ రేషియో’ (జీఈఆర్) లక్ష్యంగా అడుగులు వేస్తున్నాం’ అని కేంద్ర విద్యాశాఖ వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment