
తిరుపతి లడ్డూపై బాబుకు సుప్రీం చీవాట్లను ‘ఎక్స్’ వేదికగా గుర్తు చేసిన సుబ్రమణియన్ స్వామి
బీజేపీని బాబు ఎప్పుడు వదిలేస్తారని ప్రశ్న
సాక్షి, న్యూఢిల్లీ: తిరుపతి లడ్డూ విషయంలో అసత్యాలు చెప్పినందుకు అత్యున్నత న్యాయస్థానం మందలించడంపై ఏపీ సీఎం చంద్రబాబు నుంచి ఇంతవరకూ సమాధానమే లేదని బీజేపీ సీనియర్ నేత, ప్రముఖ ఆర్థికవేత్త డాక్టర్ సుబ్రమణియన్ స్వామి మండిపడ్డారు. ఈమేరకు తిరుపతి లడ్డూ కల్తీ కేసు విచారణ సందర్భంగా గతేడాది సెప్టెంబర్ 30న సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలను ఉటంకిస్తూ స్వామి ఆదివారం తన ఎక్స్ ఖాతాలో మూడు పోస్టులు చేశారు.
తిరుపతి లడ్డూ వివాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబును కోర్టు తీవ్రంగా మందలించిందని, కల్తీ నెయ్యిని వాడారనేందుకు ఎలాంటి ప్రాథమిక ఆధారాలు లేవని న్యాయస్థానం స్పష్టం చేసిందని గుర్తు చేశారు. ‘ఆ అసత్యాలపై ఇప్పటికీ చంద్రబాబు నుంచి సమాధానం లేదు. ఆయన నిర్లక్ష్యంపై మోదీ ఎందుకు చర్యలు తీసుకోరు? బాబు ఎప్పడు బీజేపీని వదిలేస్తారు?’ అని ఎక్స్‌లో స్వామి ప్రశ్నలు సంధించారు.
సుప్రీంలో పిల్ దాఖలు చేసిన స్వామి..: తిరుమల శ్రీవారి లడ్డూ తయారీకి ఉపయోగించే నెయ్యిలో జంతు కొవ్వులను కలిపారన్న ఆరోపణలపై వాస్తవాలను నిగ్గు తేల్చేందుకు సుప్రీం కోర్టు పర్యవేక్షణలో ఓ కమిటీని నియమించాలని కోరుతూ సుబ్రమణియన్ స్వామి గతేడాది సెప్టెంబర్‌లో సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేయడం తెలిసిందే. ల్యాబ్ నివేదికపై పూర్తిస్థాయి ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించేలా ఆదేశాలు జారీ చేయాలని అభ్యర్ధించారు.
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి, టీటీడీ ఈవోలను ఈ వ్యాజ్యంలో ప్రతివాదులుగా పేర్కొన్నారు. ఈ కేసులో సుబ్రమణియన్ స్వామి స్వయంగా (పార్టీ ఇన్ పర్సన్) వాదనలు వినిపించారు. ఏ నివేదిక ఆధారంగా రాద్ధాంతం చేస్తూ భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నారో.. దాన్ని రూపొందించేందుకు ఉపయోగించిన నెయ్యి ఎక్కడిది? టీటీడీ తిరస్కరించిన నెయ్యిలో అది ఉందా? నివేదిక వెనుక రాజకీయ పార్టీల దురుద్దేశాలున్నాయా? అనే విషయాలను తేల్చాలని స్వామి తన పిటిషన్‌లో సుప్రీంకోర్టును అభ్యర్థించారు.
దేవుడిని రాజకీయాలకు దూరంగా ఉంచాలన్న కోర్టు..
లడ్డూ తయారీకి జంతువుల కొవ్వుతో కూడిన నెయ్యిని వాడారంటూ దాఖలైన పిటిషన్‌పై సెప్టెంబర్ 30న విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు.. దేవుడిని రాజకీయాలకు దూరంగా ఉంచాలంటూ చంద్రబాబు ప్రభుత్వాన్ని ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేసింది.
తిరుపతి లడ్డూ తయారీకి జంతువుల కొవ్వుతో కూడిన నెయ్యిని వాడారంటూ ప్రభుత్వం చేసిన వాదనను నిరూపించేందుకు ఖచ్చితమైన ఆధారాలు లేవంటూ.. ఆ ఆరోపణలను తీవ్రంగా తప్పుబట్టింది. ఏపీ ప్రభుత్వం సమర్పించిన ల్యాబ్ నివేదికను పరిశీలించిన సుప్రీంకోర్టు.. పరీక్ష కోసం పంపిన నెయ్యిని తిరస్కరించారని, లడ్డూల తయారీకి దాన్ని ఉపయోగించలేదని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment