నెల్లిమర్ల, నెల్లిమర్ల రూరల్, న్యూస్‌లైన్: అవినీతి నిరోధక శాఖ వలకు ఖజానా సిబ్బంది చిక్కారు. నెల్లిమర్ల మండల కేం ద్రంలో ఉప ఖజానాధికారిగా పనిచేస్తున్న పద్మిణీ ఆచారిణి, అదే కార్యాలయంలో సీనియర్ అకౌంటెంట్‌గా పనిచేస్తున్న శంకర పోలినాయుడులు రూ.3,500 లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఒకేసారి ఒక అధికారి మరో ఉద్యోగి ఏసీబీకి చిక్కడంతో మండలానికి చెందిన అధికారులు, ఉద్యోగులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.
ఏసీబీ డీఎస్పీ సి.హెచ్. లక్ష్మీపతి అందించిన వివరాల ప్రకారం..నెల్లిమర్లకు చెందిన 5వ బెటాలియన్ హెడ్ కానిస్టేబుల్ దాడిశెట్టి రాంబాబు 2002లో మృతిచెందారు. ఇతని భార్య అన్నపూర్ణ కూడా అంతకు ముందు రెండేళ్ల క్రితమే మరణించడంతో వీరి కుమారులకు పింఛను మంజూరైంది. దీనికి సంబంధించిన ఎరియర్స్ సుమారు రూ.90 వేలు వచ్చాయి. ఈ మొత్తాన్ని అందజేసేందుకు ఎస్‌టీఓ రూ.3500 లంచం డిమాండ్ చేశారు. దీంతో డెంకాడ పోలీస్‌స్టేషన్‌లో హెచ్‌సీగా పనిచేస్తున్న రాంబాబు తమ్ముడు డి. శంకరరావు ఏసీబీని ఆశ్రయించారు.
పథకం ప్రకారం ఏసీబీ అధికారులు అందజేసిన నగదును శుక్రవారం మధ్యాహ్నం ఎస్‌టీఓకు మూడు వేల రూపాయలు, సీనియర్ అసిస్టెంట్‌కు రూ.అయిదు వందలు శంకరరావు ఇచ్చారు. దీంతో ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. దాడుల్లో ఏసీబీ సీఐలు డి.రమేష్, ఎస్.లక్ష్మోజీ, గౌస్‌ఆజాద్ సిబ్బంది పాల్గొన్నారు.
ఫిర్యాదు దారు వివరాల ప్రకారం..
చింతలవలస లోని 5వ ఏపీఎస్పీ బెటాలియన్ లో కానిస్టేబుల్‌గా పనిచేసిన దాడిశెట్టి రాంబాబు, భార్య అన్నపూర్ణ మృతి చెందడంతో వారి కుమారులు తులసీరావు, దామోదరావు పెదనాన్న అప్పలరాజు సంరక్షణలో ఉన్నారు. 2005లో అప్పలరాజు కూడా మృతి చెందడంతో ప్రస్తుతం పెద్దమ్మ వద్ద ఉంటున్నారు. ఈనేపథ్యంలో పింఛనుకు సంబంధించి ఎరియర్స్ వచ్చాయని నెల్లిమర్ల మండల కేంద్రంలోని ఉప ఖజానా కార్యాలయంలో సీనియర్ అకౌంటెంట్‌గా పనిచేస్తున్న శంక ర పోలినాయుడు రెండు నెలల క్రితం రాంబాబు కుటుంబీకులకు సమాచారం అం దించారు. ఎరియర్స్‌కు సంబంధించిన బిల్లును మంజూరు చేసేందుకు గాను డెంకాడ పోలీస్ స్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న దివంగత రాంబాబు సోదరుడు దాడిశెట్టి శంకరరావు పోలినాయుడును సంప్రదించారు.
అయితే బిల్లు వ్యవహారమంతా జిల్లా కేంద్రంలోని ఖజానా కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న యుగంధర్ చూస్తున్నారని పోలినాయుడు శంకరరావుకు చెప్పారు. బిల్లు మం జూరు చేయాలంటే ఎరియర్స్ మొత్తంలో సగం తమకు అందజేయాలని డిమాండ్ చేశారు. దీనికి ఎరియర్స్‌గా మంజూరైన రూ.90వేలలో రూ.25 వేలు ఇచ్చేందుకు శంకరరావు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ నేపథ్యంలో నెల్లిమర్ల ఎస్‌టీఓ పద్మిని ఆచారిణిని శంకరరావు కలిసి బిల్లు మంజూరు చేయాలని కోరారు. అయితే బిల్లు మంజూరు చేసేందుకు తనకు రూ.3500 లంచంగా ఇవ్వాలని ఎస్టీఓ డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంతో విసిగి పోయిన శంకరరావు ఏసీబీని ఆశ్రయించారు.
ఆనందంలో ప్రభుత్వ ఉద్యోగులు
అవినీతికి అడ్డాగా మారిన ఉపఖాజానా శాఖ కార్యాలయంలోని అధికారులు ఏసీబీకి చిక్కారనే వార్త మండల వ్యాప్తంగా దావానలంలా వ్యాపించడంతో పలు ప్రభుత్వ శాఖలకు చెందిన సిబ్బంది, పలు గ్రామాల ప్రజాప్రతినిధులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ప్రతి చిన్నపనికి లంచం ముట్టచెప్పనిదే ఫైలు కదిలే పరిస్థితి ఉండేది కాదని వారు అంటున్నారు. ప్రతి నెలా జీతాల బిల్లులకు సైతం ఎంతోకొంత చెల్లిస్తేగాని మంజూరయ్యేవి కాదని చెబుతున్నారు. ఈ దెబ్బతో లంచం తీసుకునే అధికారులు కాస్తై జంకుతారని వారు అంటున్నారు.
అధికారుల గుండెల్లో గుబులు
ఒకే నెలలో మూడు శాఖలకు చెందిన అధికారులు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కడంతో జిల్లాలోని అధికారుల గుండెల్లో గుబులు మొదలైంది. అవినీతిపై ప్రజల్లో మరింత చైతన్యం వచ్చినప్పుడే అధికారుల్లో జవాబుదారీతనం వస్తుందని పలువురు అంటున్నారు.
అవినీతి ఖజానా
Published Sat, Dec 21 2013 3:29 AM | Last Updated on Fri, Aug 17 2018 12:56 PM
Advertisement
Advertisement