ఏసీబీ డీజీగా అనురాగ్ శర్మకు అదనపు బాధ్యతలు
⇒ డైరెక్టర్‌గా ఉన్న చారుసిన్హాపై బదిలీ వేటు
⇒ ట్రైనింగ్ ఐజీగా పోస్టింగ్
⇒ ఐజీ శ్రీనివాస్‌రెడ్డి గ్రేహౌండ్స్‌కు ట్రాన్స్‌ఫర్
⇒ నల్లగొండ కేసులే చారుసిన్హా బదిలీకి కారణమన్న ఏసీబీ వర్గాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర అవినీతి నిరోధక శాఖ డైరెక్టర్ జనరల్ (డీజీ)గా డీజీపీ అనురాగ్ శర్మకు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఏసీబీ డైరెక్టర్‌గా ఉన్న ఐజీ చారుసిన్హాపై ప్రభుత్వం బదిలీ వేటు వేసింది. ట్రైనింగ్ ఐజీగా ఉన్న కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డిని గ్రేహౌండ్స్ ఐజీగా నియమిం చడంతోపాటు ఆయన స్థానంలో చారుసిన్హా ను ట్రైనింగ్ ఐజీగా నియమించింది. అయితే అకస్మాత్తుగా జరిగిన ఈ బదిలీలపై అటు ఏసీబీలోనూ, ఇటు ప్రభుత్వ వర్గాల్లోనూ తీవ్ర చర్చ మొదలైంది.
చారుసిన్హాపై నల్లగొండ నేతల వార్
ఏసీబీ డీజీగా పదవీ విరమణ పొందిన ఏకే ఖాన్ తర్వాత ఆ విభాగాన్ని చారుసిన్హా పర్యవేక్షిస్తున్నారు. అప్పటి నుంచి అక్రమా ర్కులుగా ముద్రపడ్డ విజిలెన్స్ అధికారులు, రెవెన్యూ, కమర్షియల్ ట్యాక్స్ అధికారులపై ఏసీబీ ప్రధానంగా దృష్టి సారించింది. అయితే ఇక్కడే చారుసిన్హాకు ఎదురుదెబ్బ తగిలినట్టు ఏసీబీ వర్గాలు పేర్కొన్నాయి. నల్లగొండ జిల్లాలో ఈ మూడు విభాగాల్లోని అధికారులపై ఏసీబీ ప్రధానంగా దృష్టి సారించడంతో అక్కడి అవి నీతి అధికారులు ప్రజా ప్రతినిధులను ఆశ్రయిం చారు. తాము తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పని చేశామని, అయినా తమను ఏసీబీ వెంటాడుతోందని, ఆ కేసులు తమపైకి రాకుండా చూడాలని కీలక నేతలపై ఒత్తిడి తెచ్చా రని తెలిసింది. ఇటీవలే విజిలెన్స్ నల్లగొండ విభాగం ఎస్పీ ఏసీబీకి చిక్కి కటకటాల పాలయ్యారు.
అలాగే ఇద్దరు రెవెన్యూ అధికారులపై అక్రమాస్తుల కేసును ఏసీబీ... ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లింది. ఇక్కడి వరకు ప్రభుత్వ పెద్దల నుంచి ఎలాంటి ఒత్తిడి ఏసీబీపై పడలేదు. కానీ కమర్షియల్ ట్యాక్స్ విభాగంలో పనిచేస్తున్న కీలక అధికారులపై ఏసీబీ దృష్టి సారించి పూర్తి నివేదికను ప్రభుత్వానికి పంపింది. సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవడానికి అనుమతి కావాలని ఏసీబీ జనరల్ అడ్మినిస్ట్రేటివ్ విభాగంపై ఒత్తిడి తెచ్చింది. దీంతో సంబంధిత ఆరోపణలెదుర్కొం టున్న అధికారి కీలక నేతలకు విషయాన్ని తెలియజేశారు. వెంటనే సంబంధిత నేతలు ప్రభుత్వ పెద్దల వద్ద ఏసీబీ వ్యవహరిస్తున్న తీరుపై ఫిర్యాదు చేశారు. ఈ తరుణంలోనే ముందస్తు అనుమతులు లేకుండా ఏసీబీ ఉన్నతాధికారులు వ్యవహరిస్తున్నారంటూ పరోక్షంగా చారుసిన్హాపై నేతలు ఫిర్యాదు చేసినట్లు విశ్వసనీయంగా తెలిసింది. కావాలనే తమ మనుషులను ఏసీబీ టార్గెట్ చేస్తోందని, దీనంతటికీ చారుసిన్హాయే కారణమని తెలియడంతో అప్పటికప్పుడు ఐజీని బదిలీచేసినట్లు ఏసీబీ వర్గాలు తెలిపాయి.