ఓ మాజీ సైనికుడిని లంచం అడిగితే ఏంచేశాడంటే!! | Demand For Bribe By Prakasam District Military Welfare Officer | Sakshi
Sakshi News home page

ఓ మాజీ సైనికుడిని లంచం అడిగితే ఏంచేశాడంటే!!

Published Sat, Nov 16 2019 7:32 AM | Last Updated on Sat, Nov 16 2019 7:32 AM

Demand For Bribe By Prakasam District Military Welfare Officer - Sakshi

నిందితుడు జమీర్‌ అహ్మద్‌ను విచారిస్తున్న ఏసీబీ ఏఎస్పీ సురేష్‌బాబు (ఏసీబీకి పట్టించిన  ఆంజనేయులు)

లంచావతారులు చేయి తడపనిదే ఏ పనీ చేయడం లేదు. పైసలిస్తే కాని ఫైల్‌ కదిలించడం లేదు. దేశ రక్షణకు పాటు పడే జవానులైనా అందుకు అతీతులు కాదంటున్నారు. కుమార్తె స్కాలర్‌షిప్‌ కోసం దరఖాస్తు చేసుకున్న ఓ మాజీ సైనికుడిని జిల్లా సైనిక సంక్షేమశాఖ అధికారి కార్యాలయ ఉద్యోగి లంచం డిమాండ్‌ చేశాడు. భారత సైన్యంలో పనిచేసిన ఆయన అది సహించలేకపోయాడు. లంచం పేరెత్తగానే ఆయన రక్తం మరిగిపోయింది. ఆ లంచావతారాన్ని రెడ్‌ హ్యాండెడ్‌గా ఏసీబీకి పట్టించాడు. 

సాక్షి, ఒంగోలు: ఇంకొల్లు మండలం కొణికి గ్రామానికి చెందిన నీలం ఆంజనేయులు కొంతకాలం భారత సైన్యంలో పనిచేశాడు. రిటైర్‌మెంట్‌ తర్వాత గుంటూరు జిల్లా బాపట్లలో నివాసం ఉంటున్నాడు. ప్రస్తుతం అక్కడే ఓ సంస్థలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. అతని కుమార్తె గుంటూరు జిల్లాలోని ఓ ఇంజనీరింగ్‌ కాలేజీలో బీటెక్‌ మొదటి సంవత్సరం చదువుతోంది.  తండ్రి మాజీ సైనికుడు కావడంతో ప్రధానమంత్రి స్కాలర్‌షిప్‌ స్కీము కింద ఆమెకు ఏటా రూ.36 వేలు వస్తుంది. దీని కోసం దరఖాస్తు చేసుకోవాలంటే మాజీ సైనికుని రికార్డును పరిశీలించి అనెగ్జర్‌–1 పై జిల్లా సైనిక సంక్షేమశాఖ అధికారి సంతకం చేయాలి. దానిని ప్రాసెస్‌ చేసి అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది. ఉపకార వేతనం కోసం సైనిక్‌ బోర్డుకు నెలరోజుల క్రితం ఆంజనేయులు దరఖాస్తు చేసుకున్నాడు. అందులో వివరాలను జిల్లా సైనిక సంక్షేమశాఖ అధికారులు పరిశీలించి అన్ని సక్రమంగా ఉన్నట్లు నిర్థారించుకుని జిల్లా సైనిక సంక్షేమశాఖ అధికారి రజనీకుమారి దానిపై సంతకం చేశారు. 

అడ్డుగా మారిన జూనియర్‌ అసిస్టెంట్‌..
అయితే అధికారి సంతకం చేసినా దానిని అప్‌లోడ్‌ చేసేందుకు జూనియర్‌ అసిస్టెంట్‌ షేక్‌ ఆర్‌ జమీర్‌ అహ్మద్‌ అడ్డుగా మారాడు. గడువు దగ్గరపడుతోంది. దయచేసి అప్‌లోడ్‌ చేయమని ఆంజనేయులు అభ్యర్థించినా పట్టించుకోలేదు. చివరకు బాపట్ల నుంచి సెలవు పెట్టుకుని మరీ వచ్చి ప్రకాశం భవనం ఎదురుగా గల పాత రిమ్స్‌ భవనంలోని జిల్లా సైనిక సంక్షేమశాఖ అధికారి కార్యాలయానికి ఉన్నతాధికారిని కలిసేందుకు వచ్చాడు. ఆమె సెలవులో ఉండటంతో అతను జూనియర్‌ అసిస్టెంట్‌పై ఒత్తిడి తీసుకువచ్చి సకాలంలో అప్‌లోడ్‌ కాకపోతే తాను తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందంటూ నచ్చజెప్పేందుకు యత్నించాడు. దీంతో జమీర్‌ రూ.10వేలు ఇస్తే సరి.. లేకుంటే కుదరదంటూ తేల్చి చెప్పాడు  చివరకు కనీసం రూ.8వేలైనా ఇవ్వక తప్పదన్నాడు. 

స్వాధీనం చేసుకున్న నగదు 
ఏసీబీకి ఫిర్యాదు..
ఇటువంటి అవినీతిపరుడికి వారికి డబ్బిచ్చి పని చేయించుకునే కంటే కటకటాల వెనక్కు పంపడమే కరెక్ట్‌ అని భావించిన ఆంజనేయులు ఈనెల 12న అవినీతి నిరోధక శాఖ అధికారులను కలిశాడు. తన సమస్యను రాతపూర్వకంగా తెలియజేశాడు.  ఫిర్యాదును రికార్డు చేసుకున్న అధికారులు రెండురోజులపాటు జిల్లా సైనిక సంక్షేమశాఖ అధికారి కార్యాలయంపై నిఘా పెట్టారు. తమకు వచ్చిన ఫిర్యాదు వాస్తవమేనని నిర్థారించుకుని ఉన్నతాధికారులకు తెలియపర్చారు. అవినీతి నిరోధక శాఖ గుంటూరు అదనపు ఎస్పీ సురేష్‌బాబు నేతృత్వంలో శుక్రవారం అహ్మద్‌పై వల పన్నారు. ఫిర్యాదిదారుకి పలు సూచనలు చేశారు. ఆయన వెళ్లి సర్టిఫికేట్‌ అడగడం, జమీర్‌ అహ్మద్‌ డబ్బులు డిమాండ్‌ చేయడం.. ఫిర్యాది ఇచ్చిన సిగ్నల్‌తో రూ.8 వేలు ఇస్తుండగా ఏసీబీ అధికారులు మధ్యవర్తుల సమక్షంలో నిందితుడిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకోవడం వెంటవెంటనే జరిగిపోయాయి. ఈ దాడులలో ఏసీబీ సీఐలు ఎన్‌.రాఘవరావు, ఎ.వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
 
అదనపు ఎస్పీ ఏమంటున్నారంటే..
నిందితుడ్ని అరెస్టు చేసిన అనంతరం అదనపు ఎస్పీ సురేష్‌బాబుతోపాటు మీడియాతో మాట్లాడుతూ సర్టిఫికేట్‌పై సంతకం చేసిన అనంతరం దానిని పద్ధతి ప్రకారం అప్‌లోడ్‌ చేయాలి. ఇందుకు జూనియర్‌ అసిస్టెంట్‌ జమీర్‌ అహ్మద్‌ రూ.10వేలు లంచం డిమాండ్‌ చేశాడు. చివరకు రూ.8వేలు తప్పనిసరి అనడంతో తమకు ఫిర్యాదు వచ్చింది. దీంతో తమ సిబ్బంది నిఘా పెట్టి వాస్తవమే అని నిర్థారించుకున్న అనంతరం రంగంలోకి దిగాం. చివరగా కూడా ఫిర్యాదికి పలు సూచనలు చేశాం. ముందుగా ఎట్టి పరిస్థితులలోను డబ్బులు ఇవ్వొద్దని, సర్టిఫికేట్‌ గురించి మాత్రమే మాట్లాడమని చెప్పాం. మరలా డబ్బు సంగతి ఎత్తితే అప్పుడు ఇవ్వమంటూ రూ.10 వేలు ఇచ్చి పంపాం. ఫిర్యాది సర్టిఫికేట్‌ గురించి ప్రస్తావించగానే డబ్బులు తప్పనిసరి అనడం, అతను డబ్బులు ఇస్తూ తమకు సూచన చేయడంతోనే అరెస్టు చేశాం. నిందితుడిని నెల్లూరు ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తాం. మాజీ సైనికుని కుమార్తె దరఖాస్తుకు సంబంధించిన ఫైల్‌ను కూడా సీజ్‌ చేస్తాం.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement