Welfare Officer
-
ఓ మాజీ సైనికుడిని లంచం అడిగితే ఏంచేశాడంటే!!
లంచావతారులు చేయి తడపనిదే ఏ పనీ చేయడం లేదు. పైసలిస్తే కాని ఫైల్ కదిలించడం లేదు. దేశ రక్షణకు పాటు పడే జవానులైనా అందుకు అతీతులు కాదంటున్నారు. కుమార్తె స్కాలర్షిప్ కోసం దరఖాస్తు చేసుకున్న ఓ మాజీ సైనికుడిని జిల్లా సైనిక సంక్షేమశాఖ అధికారి కార్యాలయ ఉద్యోగి లంచం డిమాండ్ చేశాడు. భారత సైన్యంలో పనిచేసిన ఆయన అది సహించలేకపోయాడు. లంచం పేరెత్తగానే ఆయన రక్తం మరిగిపోయింది. ఆ లంచావతారాన్ని రెడ్ హ్యాండెడ్‌గా ఏసీబీకి పట్టించాడు. సాక్షి, ఒంగోలు: ఇంకొల్లు మండలం కొణికి గ్రామానికి చెందిన నీలం ఆంజనేయులు కొంతకాలం భారత సైన్యంలో పనిచేశాడు. రిటైర్మెంట్ తర్వాత గుంటూరు జిల్లా బాపట్లలో నివాసం ఉంటున్నాడు. ప్రస్తుతం అక్కడే ఓ సంస్థలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. అతని కుమార్తె గుంటూరు జిల్లాలోని ఓ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ మొదటి సంవత్సరం చదువుతోంది. తండ్రి మాజీ సైనికుడు కావడంతో ప్రధానమంత్రి స్కాలర్షిప్ స్కీము కింద ఆమెకు ఏటా రూ.36 వేలు వస్తుంది. దీని కోసం దరఖాస్తు చేసుకోవాలంటే మాజీ సైనికుని రికార్డును పరిశీలించి అనెగ్జర్–1 పై జిల్లా సైనిక సంక్షేమశాఖ అధికారి సంతకం చేయాలి. దానిని ప్రాసెస్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఉపకార వేతనం కోసం సైనిక్ బోర్డుకు నెలరోజుల క్రితం ఆంజనేయులు దరఖాస్తు చేసుకున్నాడు. అందులో వివరాలను జిల్లా సైనిక సంక్షేమశాఖ అధికారులు పరిశీలించి అన్ని సక్రమంగా ఉన్నట్లు నిర్థారించుకుని జిల్లా సైనిక సంక్షేమశాఖ అధికారి రజనీకుమారి దానిపై సంతకం చేశారు. అడ్డుగా మారిన జూనియర్ అసిస్టెంట్.. అయితే అధికారి సంతకం చేసినా దానిని అప్లోడ్ చేసేందుకు జూనియర్ అసిస్టెంట్ షేక్ ఆర్ జమీర్ అహ్మద్ అడ్డుగా మారాడు. గడువు దగ్గరపడుతోంది. దయచేసి అప్లోడ్ చేయమని ఆంజనేయులు అభ్యర్థించినా పట్టించుకోలేదు. చివరకు బాపట్ల నుంచి సెలవు పెట్టుకుని మరీ వచ్చి ప్రకాశం భవనం ఎదురుగా గల పాత రిమ్స్ భవనంలోని జిల్లా సైనిక సంక్షేమశాఖ అధికారి కార్యాలయానికి ఉన్నతాధికారిని కలిసేందుకు వచ్చాడు. ఆమె సెలవులో ఉండటంతో అతను జూనియర్ అసిస్టెంట్‌పై ఒత్తిడి తీసుకువచ్చి సకాలంలో అప్లోడ్ కాకపోతే తాను తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందంటూ నచ్చజెప్పేందుకు యత్నించాడు. దీంతో జమీర్ రూ.10వేలు ఇస్తే సరి.. లేకుంటే కుదరదంటూ తేల్చి చెప్పాడు చివరకు కనీసం రూ.8వేలైనా ఇవ్వక తప్పదన్నాడు. స్వాధీనం చేసుకున్న నగదు ఏసీబీకి ఫిర్యాదు.. ఇటువంటి అవినీతిపరుడికి వారికి డబ్బిచ్చి పని చేయించుకునే కంటే కటకటాల వెనక్కు పంపడమే కరెక్ట్ అని భావించిన ఆంజనేయులు ఈనెల 12న అవినీతి నిరోధక శాఖ అధికారులను కలిశాడు. తన సమస్యను రాతపూర్వకంగా తెలియజేశాడు. ఫిర్యాదును రికార్డు చేసుకున్న అధికారులు రెండురోజులపాటు జిల్లా సైనిక సంక్షేమశాఖ అధికారి కార్యాలయంపై నిఘా పెట్టారు. తమకు వచ్చిన ఫిర్యాదు వాస్తవమేనని నిర్థారించుకుని ఉన్నతాధికారులకు తెలియపర్చారు. అవినీతి నిరోధక శాఖ గుంటూరు అదనపు ఎస్పీ సురేష్‌బాబు నేతృత్వంలో శుక్రవారం అహ్మద్‌పై వల పన్నారు. ఫిర్యాదిదారుకి పలు సూచనలు చేశారు. ఆయన వెళ్లి సర్టిఫికేట్ అడగడం, జమీర్ అహ్మద్ డబ్బులు డిమాండ్ చేయడం.. ఫిర్యాది ఇచ్చిన సిగ్నల్‌తో రూ.8 వేలు ఇస్తుండగా ఏసీబీ అధికారులు మధ్యవర్తుల సమక్షంలో నిందితుడిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకోవడం వెంటవెంటనే జరిగిపోయాయి. ఈ దాడులలో ఏసీబీ సీఐలు ఎన్.రాఘవరావు, ఎ.వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. అదనపు ఎస్పీ ఏమంటున్నారంటే.. నిందితుడ్ని అరెస్టు చేసిన అనంతరం అదనపు ఎస్పీ సురేష్‌బాబుతోపాటు మీడియాతో మాట్లాడుతూ సర్టిఫికేట్‌పై సంతకం చేసిన అనంతరం దానిని పద్ధతి ప్రకారం అప్లోడ్ చేయాలి. ఇందుకు జూనియర్ అసిస్టెంట్ జమీర్ అహ్మద్ రూ.10వేలు లంచం డిమాండ్ చేశాడు. చివరకు రూ.8వేలు తప్పనిసరి అనడంతో తమకు ఫిర్యాదు వచ్చింది. దీంతో తమ సిబ్బంది నిఘా పెట్టి వాస్తవమే అని నిర్థారించుకున్న అనంతరం రంగంలోకి దిగాం. చివరగా కూడా ఫిర్యాదికి పలు సూచనలు చేశాం. ముందుగా ఎట్టి పరిస్థితులలోను డబ్బులు ఇవ్వొద్దని, సర్టిఫికేట్ గురించి మాత్రమే మాట్లాడమని చెప్పాం. మరలా డబ్బు సంగతి ఎత్తితే అప్పుడు ఇవ్వమంటూ రూ.10 వేలు ఇచ్చి పంపాం. ఫిర్యాది సర్టిఫికేట్ గురించి ప్రస్తావించగానే డబ్బులు తప్పనిసరి అనడం, అతను డబ్బులు ఇస్తూ తమకు సూచన చేయడంతోనే అరెస్టు చేశాం. నిందితుడిని నెల్లూరు ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తాం. మాజీ సైనికుని కుమార్తె దరఖాస్తుకు సంబంధించిన ఫైల్‌ను కూడా సీజ్ చేస్తాం. -
కలెక్టర్ కన్నెర్ర !
ఇందూరు(నిజామాబాద్ అర్బన్): పేద విద్యార్థుల కడుపు నింపడానికి సంక్షేమ హాస్టళ్లకు సరఫరా చేస్తున్న సన్నబియ్యాన్ని వార్డెన్లు పక్కదారి పట్టించడంపై కలెక్టర్ రామ్మోహన్ రావు కన్నెర్రజేశారు. ఇప్పటికే ఎస్సీ బాలుర వసతిగృహం వార్డెన్‌పై వేటు పడగా, తాజాగా బియ్యం అక్రమాల్లో మరొకరి హస్తం ఉందని తేలడంతో ఎస్సీ బాలికల హాస్టల్ వార్డెన్ ఇందిరాను శనివారం సస్పెండ్ చేశారు. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు కలెక్టర్ సస్పెన్షన్ ఫైలుపై సంతకం చేయగా, ఉత్తర్వులు ఇంకా బయటకు తీయలేదని తెలిసింది. దీంతో ‘సాక్షి’ చెప్పినట్లుగానే హాస్టళ్ల సన్నబియ్యం తరలింపు వ్యవహారంలో మరి కొందరు వార్డెన్ల హస్తం ఉందని తేలిపోయింది. ఇంకెవరెవరి హస్తం ఉందో అధికారులతో లోతైన విచారణ చేయిస్తున్నారు. ఈ నెల 12న నిజామాబాద్ నగరంలోని చంద్రశేఖర్ కాలనీలో 34 క్వింటాళ్ల హాస్టళ్ల సన్నబియ్యం బస్తాలు పట్టుబడిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో బాధ్యులైన వారందరిపై కలెక్టర్ చర్యలకు ఉపక్రమించారు. ఇద్దరు వార్డెన్లను సస్పెండ్ చేయగా వీరితో పాటు బియ్యం దాచడానికి సహకరించిన ఇంటి యజమాని శ్రీనివాస్, మధ్యవర్తి కిరణ్, సివిల్ సప్లయి హమాలీ మహబూబ్‌లపై క్రిమినల్ కేసులు పెట్టారు. ఈ మేరకు కలెక్టర్ ఒక ప్రకటన కూడా విడుదల చేశారు. ఇక ముందు అవినీతికి పాల్పడితే సహించేది లేదని పై కలెక్టర్ చర్యలతో హెచ్చరించారు. ఇటు సన్నబియ్యం తరలింపు కేసు రోజుకో మలుపు తిరుగుతుండడం ఎస్సీ సంక్షేమ శాఖ అధికారుల్లో కలవరం పెడుతోంది. మున్ముందు ఇంకెవరు బలి కావాల్సి వస్తుందోనని జంకుతున్నారు. కాగా వార్డెన్ ఇందిరాను తప్పించడానికి ఓ రాజకీయ నేత గట్టి ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలించలేదు. అధికారులకు జేసీ రవీందర్ రెడ్డి వార్నింగ్... హాస్టళ్ల సన్నబియ్యం పక్కదారి పట్టించి అక్రమాలకు పాల్పడుతుండడంపై జాయింట్ కలెక్టర్ కూడా సీరియస్ అయ్యారు. శనివారం సాయంత్రం తన చాంబర్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ శాఖల అధికారులు, వార్డెన్లు, రెసిడెన్షియల్ స్కూళ్ల అధికారులు, ఎంఎల్ఎస్ పాయింట్ల అధికారులు, సివిల్ సప్లయి అధికారులతో సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం ఇంత మొత్తంలో వేతనాలు ఇస్తున్నప్పటికీ పేద విద్యార్థుల కడుపు నింపే సన్నబియ్యంను పక్కదారి పట్టించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దొంగ చాటుగా ఎవరు ఎలాంటి పనులు చేస్తున్నారో అన్నీ తెలుస్తున్నాయని, అక్రమాలకు పాల్పడితే క్రిమినల్ కేసులు పెట్టడానికి వెనుకాడబోనని హెచ్చరించారు. ప్రతి నెల 25న బియ్యం క్లోజింగ్ బ్యాలెన్స్‌ను చూపాలని, 5వ తేదీలోగా బియ్యం రిసీవ్ చేసుకోవాలన్నారు. పర్యవేక్షణ చేయని సంక్షేమాధికారులపై జేసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. -
26న ఎస్సీ, ఎస్టీ గ్రీవెన్స్ రద్దు
కర్నూలు(అర్బన్): ప్రతినెల చివరి సోమవారం జరుగుతున్న ఎస్సీ, ఎస్టీ స్పెషల్ గ్రీవెన్స్‌ను ఈనెల 26న రంజాన్ పండుగ సందర్భంగా రద్దు చేసినట్లు జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి ప్రకాష్ రాజ్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జూలై నెల చివరి సోమవారం యథావిధిగా ఈ గ్రీవెన్స్‌ను నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ విషయాన్ని జిల్లాలోని వివిద దళిత సంఘాల నాయకులు, ప్రజలు, అధికారులు గమనించాలని ఆయన కోరారు. -
ఎట్టకేలకు కదలిక
- వార్డెన్లకు పోస్టింగ్‌లు ఇచ్చేందుకు గ్రీన్‌సిగ్నల్ – నేడు డీడీ, బీసీడబ్ల్యూఓ సమక్షంలో కౌన్సెలింగ్ – ఐదుగురికి రెగ్యులర్ పోస్టింగ్‌లు – డెప్యుటేషన్‌పై 14 మంది వెళ్లే అవకాశం కర్నూలు(అర్బన్): నాలుగు నెలలుగా గాలిలో ఉన్న 19 మంది సాంఘిక సంక్షేమ శాఖ వసతి గృహ సంక్షేమాధికారులకు ఎట్టకేలకు పోస్టింగ్‌లు దక్కనున్నాయి. కౌన్సెలింగ్ పద్ధతి ద్వారా వీరిని ఎస్సీ, బీసీ వసతి గృహాలకు పంపేందుకు జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ ఆమోదం తెలిపారు. ఈ నేపథ్యంలోనే ఈ నెల 5వ తేదీన ఉదయం 9 గంటలకు స్థానిక సాంఘిక సంక్షేమ శాఖ ఉప సంచాలకుల కార్యాలయంలో ఆయా వసతి గృహ సంక్షేమాధికారులకు కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. డీడీ యు. ప్రసాదరావు, బీసీ సంక్షేమాధికారి డి. హుసేన్‌సాహెబ్ ఆధ్వర్యంలో వీరికి పోస్టింగ్‌లు ఇవ్వనున్నారు. ఏమయిందంటే.. రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది నుంచి అద్దె భవనాలు, శిధిలావస్థకు చేరిన వసతి గృహాలు, 70 మంది విద్యార్థుల కంటే తక్కువ సంఖ్య ఉన్న వసతి గృహాలను రద్దు చేసింది. ఈ నేపథ్యంలోనే జిల్లాలో ఈ విద్యా సంవత్సరం ప్రారంభంలోనే 23 సాంఘిక సంక్షేమ వసతి గృహాలు రద్ధయ్యాయి. అయితే ఆయా వసతి గృహాల్లో విధులు నిర్వహిస్తున్న సంక్షేమాధికారులకు మాత్రం పోస్టింగ్‌లు ఇవ్వకుండా నాన్చుతు వచ్చారు. ఇదీ నిర్ణయం.. 19 మంది వార్డెన్లకు సాంఘిక సంక్షేమం, బీసీ సంక్షేమ శాఖల్లో ఖాళీగా ఉన్న ప్రీ మెట్రిక్ వసతి గృహాలతో పాటు సాంఘిక సంక్షేమంలో వార్డెన్ పోస్టులు ఖాళీగా ఉన్న కళాశాల వసతి గృహాలకు పంపాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలోనే 8 బీసీ, 6 ఎస్సీ కళాశాల వసతి గృహాలతో పాటు ఐదు సాంఘిక సంక్షేమ వసతి గృహాలకు వీరిని పంపేందుకు నిర్ణయం తీసుకున్నారు. బీసీ సంక్షేమంలో ఖాళీగా చూపిన వసతి గృహాలు ... కొక్కెరచేడు, పెద్దహరివాణం, పెద్దకడుబూరు, నందవరం, సి. బెళగల్, నంద్యాల, ఉయ్యాలవాడ, నందికొట్కూరు. ఖాళీగా ఉన్న ఎస్సీ కళాశాల వసతి గృహాలు ... కర్నూలులో రెండు, ఆత్మకూరు, బనగానపల్లె, డోన్, కోవెలకుంట్ల, నంద్యాలలో రెండు, ఎమ్మిగనూరు, నందికొట్కూరు. వీటిలో ఆరు వసతి గృహాలకు డెప్యూటేషన్‌పై వార్డెన్ల నియామకం జరగనుంది. సాంఘిక సంక్షేమంలో మంజూరైన పోస్టులు .... ఆదోని ఇంటిగ్రేటెడ్, ఆదోని ఆనంద నిలయం, ఆదోని, కళాశాల వసతి గృహం, సి. బెళగల్, నందివర్గం ప్రీమెట్రిక్ వసతి గృహాల్లో పోస్టులు ఉన్నాయి. కేర్ టేకర్ పోస్టులకు వార్డెన్లు ... జూనియర్ అసిస్టెంట్ క్యాడర్‌కు చెందిన ఆనంద నిలయాలకు హెచ్డబ్ల్యూఓలను పంపడం పట్ల అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఆనంద నిలయాలు కేవలం కేర్ టేకర్ పోస్టులని, వీటికి హెచ్డబ్ల్యూఓలను పంపితే జీతాలకు సంబంధించి హెడ్డు వేరు కావడం వల్ల రిటైర్మెంట్ సమయంలో ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉంటాయనే భావన వ్యక్తమవుతోంది. ప్రస్తుతం ఖాళీగా ఉన్న ఆదోని ఆనందనిలయం కేర్ టేకర్ పోస్టుకు ఎవరిని ఎంపిక చేస్తారనే విషయం ప్రస్తుతానికి సస్పెన్స్. -
అధికారులు కావలెను
జిల్లా స్థాయి అధికారుల పోస్టులు ఖాళీ ఇన్చార్జీల పాలనలో పలుశాఖలు మిగతా శాఖల్లో 213 సిబ్బంది సిటీ బ్యూరో: ప్రభుత్వ పనులు సకాలంలో జరగాలన్నా, ప్రజాసమస్యలు సత్వరం పరిష్కారం కావాలన్నా అధికారులు ఉండాలి. ప్రజాప్రతినిధులు ఎందరున్నా అధికారుల చేతుల మీదుగానే సమస్యలు ఓ కొలిక్కి వస్తా యి. ప్రభుత్వ పాలనలో అధికారుల పాత్ర కీలకం. అయితే హైదరాబాద్ జిల్లాలో ఇందుకు విరుద్ధంగా సాగుతోంది. అధికారులు, ఉద్యోగుల పోస్టులు ఖాళీగా ఉండటంతో ఎక్కడి సమస్యలు అక్కడే పేరుకుపోతున్నాయి. ఖాళీల స్థానంలో ప్రత్యామ్నాయంగా ఇన్చార్జీలు ఉండటంతో వారు పనిభారంతో సతమతమవుతున్నారు. వివిధ కార్యాలయాలకు పనుల కోసం వచ్చే ప్రజలు, ముఖ్యంగా మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పది శాఖలకు జిల్లా స్థాయి అధికారులు లేరు. ఈ కారణంగా పనుల పురోగతికి బ్రేక్ పడుతోంది. ఖాళీగా ఉన్న పోస్టులివే జిల్లా అదనపు జాయింట్ కలెక్టర్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ, వెనుకబడిన తరగతుల సంక్షేమశాఖ (డీబీసీడబ్ల్యూఓ) డీడీ, ఆర్వీఎం పీడీ, హార్టికల్చర్ ఏడీ, హైదరాబాద్ ఎస్టేట్ అధికారి, గృహనిర్మాణ శాఖ పీడీ, ఎన్సీఎల్డీ పీడీ, మైనారిటీ వెల్ఫేర్ అధికారి, వయోజన విద్య డీడీ వంటి కీలక పోస్టులు ఖాళీగా ఉన్నాయి. రెవెన్యూ శాఖలో కూడా ఖాళీలు భారీగా ఉన్నాయి. జిల్లా పరిధిలోని 16 మండలాల్లో 591 మంది ఉద్యోగులకు గానూ 506 మంది మాత్రమే ఉన్నారు. ఇందులో ఇద్దరు తహసీల్దార్లు, ఎనిమిది మంది డీటీలు, పన్నెండు మంది వీఆర్ఓలు, 13 మంది వీఆర్ఏలు, 20 మంది టైపిస్టులతో సహా సీనియర్, జూని యర్ అసిస్టెంట్లు, వాచ్మెన్లు, అటెండర్లు, డైవర్లు మొత్తం కలిపి 85 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. జిల్లాలోని సంక్షేమ హాస్టళ్లలో ఉద్యోగులు, సిబ్బంది కలిసి మొత్తంగా 92 ఖాళీలు ఉన్నాయి. ఇందులో డీఎస్‌డబ్ల్యూఓ పోస్టులు రెండు, ఏఎస్డబ్ల్యూఓ పోస్టులు 13, వార్డెన్ పోస్టులు 22, కామాటీలు, వాచ్మెన్లు, వంటవారికి చెందిన పోస్టులు 55 ఖాళీగా ఉన్నాయి. ప్రస్తుతమున్న సిబ్బందిలో కూడా 120 మంది ఔట్‌సోర్సింగ్‌పై పని చేస్తున్నారు. ఆర్వీఎంలో 24 ఇంజనీర్లకు గానూ 12 మంది మాత్రమే ఉండగా 19 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఐసీడీఎస్‌లో సీడీపీఓతోపాటు అంగన్వాడీ వర్కర్స్, ఆయాల పోస్టు లు మొత్తం 10 ఖాళీగా ఉన్నాయి. ల్యాండ్ సర్వే విభాగంలో 16 మంది సర్వేయర్లకు గాను 9 మంది మాత్రమే ఉన్నారు. ఏడు పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. జిల్లా విద్యాశాఖలో కూడా ఉపాధ్యాయ పోస్టులతోపాటు పలు కీలక అధికారుల పోస్టులు కూడా ఖాళీగా దర్శనమిస్తున్నాయి. -
అంగట్లో ‘వెల్ఫేర్’ పోస్టులు
మంచిర్యాల సిటీ (ఆదిలాబాద్) : సింగరేణిలో సంక్షేమ అధికారుల(వెల్ఫేర్ ఆఫీసర్) పోస్టుల భర్తీకి నేడు యాజమాన్యం పరీక్ష నిర్వహించనుంది. కంపెనీ పరిధిలోని మూడు రీజియన్లలో కలిపి ఖాళీగా ఉన్న 23 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు కేవలం సంస్థలో పనిచేస్తున్న వారే దరఖాస్తు చేసుకోవడానికి ప్రధాన అర్హతగా పేర్కొంది. గని సంక్షేమ అధికారులుగా ఉన్నతమైన ఉద్యో గం కావడంతో ఆశించిన మేరకు వేతనం, సకల సౌకర్యాలు ఉంటా యి. దీంతో సర్వీసులో ఉన్న ఉద్యోగులు ఈ పోస్టు దక్కించుకోడానికి ఆశపడుతున్నారు. దరఖాస్తు చేసుకున్న వారు పైరవీలు ముమ్మరం చేశారు. ఈ క్రమంలో ప్రధాన కార్మిక సంఘాలకు చెందిన ముగ్గురు ముఖ్య నాయకులతో పాటు కోల్‌బెల్ట్‌లోని అధికార పార్టీకి చెందిన ముగ్గురు సీనియర్ ప్రజాప్రతినిధుల చుట్టూ తిరుగుతున్నారు. సింగరేణి డెరైక్టర్ల స్థాయిలో సైతం పలువరు ఉన్నతాధికారులు పైరవీలు చేస్తున్నట్లు తెలిసింది. ఇదే అదనుగా ద్వితీయ శ్రేణి నాయకులు పనిచేసిపెడుతామంటూ భారీస్థాయిలో డబ్బులు దండుకుంటున్నట్లు ఆరోపణలున్నాయి. ఒక్కో పోస్టు రూ.5లక్షల నుంచి రూ.10 లక్షల వరకు డిమాండ్ చేస్తున్నట్లు చర్చ జరుగుతోంది. ఇప్పటికే పలువురు కుదుర్చుకున్న ఒప్పందం మేరకు సగం డబ్బు ముట్టజెప్పినట్లు తెలుస్తోం ది. పైరవీల ప్రచారం జోరందుకోవడంతో ప్రతిభగల కార్మికులు, ఉ ద్యోగులు తీవ్ర అసంతృప్తికి లోనవుతున్నారు. అవినీతికి తావులేకుం డా పరిపాలన ఉంటుందని ప్రకటించిన సీఎం కేసీఆర్ చొరవ తీసుకుని అర్హులకు న్యాయం చేయాలని దరఖాస్తుదారులు కోరుతున్నారు.