ఎట్టకేలకు కదలిక
ఎట్టకేలకు కదలిక
Published Fri, Nov 4 2016 7:11 PM | Last Updated on Mon, Sep 4 2017 7:11 PM
- వార్డెన్లకు పోస్టింగ్‌లు ఇచ్చేందుకు గ్రీన్‌సిగ్నల్
– నేడు డీడీ, బీసీడబ్ల్యూఓ సమక్షంలో కౌన్సెలింగ్
– ఐదుగురికి రెగ్యులర్ పోస్టింగ్‌లు
– డెప్యుటేషన్‌పై 14 మంది వెళ్లే అవకాశం
కర్నూలు(అర్బన్): నాలుగు నెలలుగా గాలిలో ఉన్న 19 మంది సాంఘిక సంక్షేమ శాఖ వసతి గృహ సంక్షేమాధికారులకు ఎట్టకేలకు పోస్టింగ్‌లు దక్కనున్నాయి. కౌన్సెలింగ్ పద్ధతి ద్వారా వీరిని ఎస్‌సీ, బీసీ వసతి గృహాలకు పంపేందుకు జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ ఆమోదం తెలిపారు. ఈ నేపథ్యంలోనే ఈ నెల 5వ తేదీన ఉదయం 9 గంటలకు స్థానిక సాంఘిక సంక్షేమ శాఖ ఉప సంచాలకుల కార్యాలయంలో ఆయా వసతి గృహ సంక్షేమాధికారులకు కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. డీడీ యు. ప్రసాదరావు, బీసీ సంక్షేమాధికారి డి. హుసేన్‌సాహెబ్ ఆధ్వర్యంలో వీరికి పోస్టింగ్‌లు ఇవ్వనున్నారు.
ఏమయిందంటే..
రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది నుంచి అద్దె భవనాలు, శిధిలావస్థకు చేరిన వసతి గృహాలు, 70 మంది విద్యార్థుల కంటే తక్కువ సంఖ్య ఉన్న వసతి గృహాలను రద్దు చేసింది. ఈ నేపథ్యంలోనే జిల్లాలో ఈ విద్యా సంవత్సరం ప్రారంభంలోనే 23 సాంఘిక సంక్షేమ వసతి గృహాలు రద్ధయ్యాయి. అయితే ఆయా వసతి గృహాల్లో విధులు నిర్వహిస్తున్న సంక్షేమాధికారులకు మాత్రం పోస్టింగ్‌లు ఇవ్వకుండా నాన్చుతు వచ్చారు.
ఇదీ నిర్ణయం..
19 మంది వార్డెన్లకు సాంఘిక సంక్షేమం, బీసీ సంక్షేమ శాఖల్లో ఖాళీగా ఉన్న ప్రీ మెట్రిక్ వసతి గృహాలతో పాటు సాంఘిక సంక్షేమంలో వార్డెన్ పోస్టులు ఖాళీగా ఉన్న కళాశాల వసతి గృహాలకు పంపాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలోనే 8 బీసీ, 6 ఎస్‌సీ కళాశాల వసతి గృహాలతో పాటు ఐదు సాంఘిక సంక్షేమ వసతి గృహాలకు వీరిని పంపేందుకు నిర్ణయం తీసుకున్నారు.
బీసీ సంక్షేమంలో ఖాళీగా చూపిన వసతి గృహాలు ...
కొక్కెరచేడు, పెద్దహరివాణం, పెద్దకడుబూరు, నందవరం, సి. బెళగల్, నంద్యాల, ఉయ్యాలవాడ, నందికొట్కూరు.
ఖాళీగా ఉన్న ఎస్‌సీ కళాశాల వసతి గృహాలు ...
కర్నూలులో రెండు, ఆత్మకూరు, బనగానపల్లె, డోన్, కోవెలకుంట్ల, నంద్యాలలో రెండు, ఎమ్మిగనూరు, నందికొట్కూరు. వీటిలో ఆరు వసతి గృహాలకు డెప్యూటేషన్‌పై వార్డెన్ల నియామకం జరగనుంది.
సాంఘిక సంక్షేమంలో మంజూరైన పోస్టులు ....
ఆదోని ఇంటిగ్రేటెడ్, ఆదోని ఆనంద నిలయం, ఆదోని, కళాశాల వసతి గృహం, సి. బెళగల్, నందివర్గం ప్రీమెట్రిక్ వసతి గృహాల్లో పోస్టులు ఉన్నాయి.
కేర్ టేకర్ పోస్టులకు వార్డెన్లు ...
జూనియర్ అసిస్టెంట్ క్యాడర్‌కు చెందిన ఆనంద నిలయాలకు హెచ్‌డబ్ల్యూఓలను పంపడం పట్ల అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఆనంద నిలయాలు కేవలం కేర్ టేకర్ పోస్టులని, వీటికి హెచ్‌డబ్ల్యూఓలను పంపితే జీతాలకు సంబంధించి హెడ్డు వేరు కావడం వల్ల రిటైర్మెంట్ సమయంలో ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉంటాయనే భావన వ్యక్తమవుతోంది. ప్రస్తుతం ఖాళీగా ఉన్న ఆదోని ఆనందనిలయం కేర్ టేకర్ పోస్టుకు ఎవరిని ఎంపిక చేస్తారనే విషయం ప్రస్తుతానికి సస్పెన్స్.
Advertisement