- రాష్ట్ర ప్రాథమిక విద్యాశాఖ మంత్రి కిమ్మనె రత్నాకర్
- నూతనంగా 11 వేల ఉద్యోగాల భర్తీ
- పాఠ్యపుస్తకాల ముద్రణలో అక్రమాలపై విచారణకు ఆదేశం
బెంగళూరు : ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా 11 వేల మంది ఉపాధ్యాయులను కౌన్సెలింగ్ ద్వారా బదిలీ చేయనున్నట్లు ప్రాథమిక విద్యాశాఖ మంత్రి కిమ్మనె రత్నాకర్ తెలిపారు. శుక్రవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 46 వేల మంది ఉపాధ్యాయులు బదిలీలు కోరారని అయితే ఇది సాధ్యం కాదని అన్నారు. వీరిలో 15 నుంచి 16 వేల మంది భార్యభర్తలు ఉన్నారని వివరించారు. విద్యా శాఖలో 28 వేల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని ఈ ఏడాది నూతనంగా 11,400 ఉపాధ్యాయుల నియామకాలు చేపట్టనున్నట్లు తెలిపారు.
ఇకపై ప్రతి ఏడాది ఐదు వేల ఉపాధ్యాయుల నియామకాలు చేపట్టాలని ముఖ్యమంత్రి సూచించారని గుర్తు చేశారు. విద్యాహక్కు చట్టంపై కోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వం నడుచుకుంటుందని అన్నారు. పీయూసీ పాఠ్య పుస్తకాల ముద్రణ, వితరణలో చోటుచేసుకున్న అక్రమాలపై విచారణకు ఆదేశించినట్లు చెప్పారు. అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు.
ప్రతి ప్రాథమిక పాఠశాలకు ఓ ప్రధానోపాధ్యుడి ఏర్పాటు చేస్తామని చెప్పారు. పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు గాను ప్రతి నియోజకవర్గానికి రూ. 40 లక్షలు నిధులు ఖర్చు చేయవచ్చునని, ఇందుకు సంబంధించి జాబితా ఇవ్వాలని ఎమ్మెల్యేలను కోరినట్లు తెలిపారు.