పోలీసు శాఖలో ప్రక్షాళనకు శ్రీకారం | Rinsing in police department | Sakshi
Sakshi News home page

పోలీసు శాఖలో ప్రక్షాళనకు శ్రీకారం

Published Wed, May 31 2017 11:18 PM | Last Updated on Tue, Sep 5 2017 12:28 PM

పోలీసు శాఖలో ప్రక్షాళనకు శ్రీకారం

పోలీసు శాఖలో ప్రక్షాళనకు శ్రీకారం

– 386 మంది పోలీసులు ఒకేసారి బదిలీ
– కౌన్సెలింగ్‌ విధానం ద్వారా స్టేషన్ల కేటాయింపు
 
కర్నూలు: జిల్లా పోలీసు శాఖలో ప్రక్షాళన మొదలైంది. ఉన్నతాధికారుల పర్యవేక్షణ, నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో ఏళ్ల తరబడి స్టేషన్లలో పాతుకుపోయిన వారిపై బదిలీ వేటు పడింది. పైరవీలు, స్టేషన్లలో పంచాయతీలు, ఇసుక అక్రమ రవాణా, మట్కా, పేకాట, క్రికెట్‌ బెట్టింగ్‌ల నిర్వాహకులతో సంబంధాలు తదితర కారణాలతో కొంతమందికి స్థానచలనం కల్పిస్తూ ఎస్పీ ఆకె రవికృష్ణ కీలక నిర్ణయం తీసుకున్నారు. జంబో జాబితాగా ఉదయం 9.30 నుంచి రాత్రి పొద్దుపోయే వరకు ఒకేసారి 386 మంది కానిస్టేబుళ్లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
 
5ఏళ్ల సర్వీసు పూర్తయిన వారిపై వేటు
ఒకే స్టేషన్‌లో ఐదేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న కానిస్టేబుళ్లను జిల్లా పోలీసు కార్యాలయంలోని వ్యాస్‌ ఆడిటోరియానికి రప్పించి బుధవారం ఎస్పీ ఆకే రవికృష్ణ బదిలీల కౌన్సెలింగ్‌ను నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా 83 పోలీసుస్టేషన్లు ఉండగా.. ఇందులో 62 శాంతిభద్రతలు, 16 అప్‌గ్రేడ్, నాలుగు ట్రాఫిక్, ఒక మహిళా పోలీసు స్టేషన్‌ ఉన్నాయి. ఆయా స్టేసన్లలో పనిచేస్తున్న సిబ్బంది జాబితాను ముందుగానే సిద్ధం చేసి మొత్తం 386 మంది కానిస్టేబుళ్లకు కౌన్సెలింగ్‌ నిర్వహించి బదిలీలు చేపట్టారు. ఖాళీలు ఏఏ చోట ఉన్నాయనే వివరాలను పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా మూడు ఆప్షన్లను చూపి ఖాళీలకు అనుగుణంగా కోరుకున్న స్థానాలను కేటాయించారు. ఒకే సబ్‌ డివిజన్‌ లేదా ఒకే సర్కిల్‌లో దీర్ఘకాలికంగా పనిచేసిన వారిని మరోస్టేషన్‌కు బదిలీ చేస్తూ ఎస్పీ నిర్ణయం తీసుకున్నారు. 
 
ఈసారీ రాజకీయ జోక్యమే..
వాస్తవంగా ప్రతిసారి పోలీసుల బదిలీల్లో రాజకీయ జోక్యం ఎక్కుగా ఉంటుంది. తమకు అనువైన వ్యక్తులను దగ్గర స్టేషన్లకు వేయించుకునేందుకు అధికార పార్టీ నేతలు ఈసారి కూడా పోటీ పడ్డారు. నంద్యాల, శ్రీశైలం, ఆళ్లగడ్డ, ఎమ్మిగనూరు, డోన్, పత్తికొండ, ఆదోని, నందికొట్కూరు తదితర ప్రాంతాల నుంచి సిబ్బంది తమకు అనుకూలమైన నాయకులతో సిఫారసులు చేయించారు. అయితే సిబ్బంది పనితీరు, ఆయా స్టేషన్లలో కొనసాగిన సమయం ఆధారంగా బదిలీలకు ప్రాధాన్యత ఇచ్చినట్లు చర్చ జరుగుతున్నా.. ఆయా ప్రాంతాల్లో అధికార పార్టీ నేతల ఆశీస్సులు ఉన్న పోలీసు కానిస్టేబుళ్లు అనుకూలమైన స్టేషన్లను దక్కించుకున్నట్లు సమాచారం. 5ఏళ్ల సర్వీసు పూర్తయినప్పటికీ బదిలీల జాబితాలో ఖాళీలు చూపకుండా సిబ్బంది పలుకుబడి ఉపయోగించి ప్రాధాన్యత స్టేషన్లలోనే కొనసాగుతున్నారనే చర్చ జరుగుతోంది. నంద్యాల, ఆదోని ప్రాంతాల్లో ఖాళీలను సరిగ్గా చూపకపోవడంతో కొంతమంది బదిలీల నుంచి తప్పించుకున్నట్లు తెలిసింది. కర్నూలు సబ్‌ డివిజన్‌ పరిధిలోని ఓర్వకల్‌లో 11 మంది బదిలీలకు అర్హులు కాగా, కేవలం 9 మందిని మాత్రమే అర్హుల జాబితాలో చూపించినట్లు చర్చ సాగుతోంది.
 
ఐదేళ్ల నిబంధనతో కొంతమందికి ఊరట
బదిలీల ప్రక్రియలో భాగంగా ఐదేళ్ల నిబంధన అమలు చేయడంతో కొంతమంది అక్రమార్కులకు ఊరట లభించిందనే చర్చ ఉంది. నాలుగేళ్లుగా ఒకే ప్రాంతంలో ఉంటూ ఇసుక మాఫియా, మట్కా, పేకాట వంటి అసాంఘిక కార్యకలాపాల నిర్వాహకులతో సంబంధాలు కొనసాగిస్తున్న వారు బదిలీల నుంచి బయటపడ్డారు. కొన్ని స్టేషన్లలో ఎక్కువ మంది బదిలీ కావడంతో అన్నీ కొత్త ముఖాలే కనిపిస్తున్నాయి. కర్నూలు ట్రాఫిక్‌ పోలీసుస్టేషన్‌కు గతంలో 20 మందిని అటాచ్‌మెంట్‌ కింద నియమించడంతో కేవలం ఐదుగురిపై మాత్రమే బదిలీ వేటు పడింది. రెండో పట్టణ పోలీసు స్టేషన్‌లో 13, మూడో పట్టణ పోలీసు స్టేషన్‌లో 13 మందిపై బదిలీ వేటు పడింది. గతంలో దరఖాస్తులు, ఆరోపణలు ఆధారంగా బదిలీలు జరిగేవి. ఈసారి నిఘావర్గాల హెచ్చరికల నేపథ్యంలో బదిలీల ప్రక్రియను నికచ్చిగా చేపట్టినట్లు కూడా ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు. కార్యక్రమంలో అడిషనల్‌ ఎస్పీ షేక్షావలి, డీపీఓ ఏఓ అబ్దుల్‌సలాం, స్పెషల్‌ బ్రాంచ్‌ సీఐలు ములకన్న, సుబ్రమణ్యం, ఈకాప్స్‌ ఇన్‌చార్జి రాఘవరెడ్డి, డీపీఓ సిబ్బంది పాల్గొన్నారు. 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement