‘మామూలు’ ఇస్తే.. ఆ ఒక్కటీ సరైపోతుందని హింట్‌ | Adilabad: Registration Officials Bribe Taking With English Letter Codes | Sakshi
Sakshi News home page

‘మామూలు’ ఇస్తే.. ఆ ఒక్కటీ సరైపోతుందని హింట్‌

Published Fri, Apr 22 2022 5:24 PM | Last Updated on Sat, Apr 23 2022 2:57 PM

Adilabad: Registration Officials Bribe Taking With English Letter Codes - Sakshi

‘సీ’ అని రాయడం ద్వారా రూ.3వేలు ఇవ్వాలని సూచిస్తున్న కోడ్, కింద అధికారి సంతకం, ‘ఏ’ పక్కన జీరో అని రాసి రూ.10వేలు ఇవ్వాలని పరోక్షంగా సూచిస్తున్న కోడ్‌

సాక్షి, ఆదిలాబాద్‌: ఓ సినిమాలో ఓ పోలీస్‌ ఆఫీసర్‌.. ఎర్ర చందనం అక్రమ రవాణాకు భారీగా లంచం తీసుకుంటాడు. డబ్బంతా లెక్కబెట్టిన తర్వాత ఒక్కటి తగ్గింది అంటాడు.. అన్నీ సరిగానే ఉన్నాయి కదా అని చెప్పినా.. ఒక్కటి తగ్గింది అంటూ టార్చర్‌ పెడతాడు.. అచ్చం ఇలాగే ఉంది ఆదిలాబాద్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో అధికారుల తీరు.

భూమి రిజిస్ట్రేషన్‌ కోసం అన్ని పత్రాలు సక్రమంగా తీసుకుని వెళ్లినా.. ఒక్కటి తగ్గింది అంటూ కొర్రీలు పెడుతున్నారు. డాక్యుమెంట్‌పైనే కోడ్‌ రాసి డాక్యుమెంట్‌ రైటర్‌ ద్వారా ఏం తగ్గిందో హింట్‌ ఇస్తారు. ఆమేరకు ముట్టజెబితే డాక్యుమెంట్‌ రిజిస్ట్రేషన్‌ సాఫీగా అయిపోతుంది. లేదంటే అంతే..      

ఆంగ్ల అక్షరమే కోడ్‌..
ఆంగ్ల అక్షర రూంలో ‘ఏ’ అంటే రూ.వెయ్యి, ‘బీ’ అంటే రూ.2 వేలు, ‘సీ’ అంటే రూ.3 వేలు, ‘డీ’ అంటే రూ.4 వేలు, ‘ఇ’ అంటే రూ.5 వేలు.. ఏ పక్కన ఒక జీరో పెడితే అది రూ.10 వేలు, బీ పక్కన జీరో పెడితే రూ.20 వేలు, సీ పక్కన జీరో పెడితే రూ.30 వేలు.. ఇలా ఆదిలాబాద్‌ సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయంలో కోడ్‌ భాషలో లంచం వసూలు చేసుకుంటూ డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్‌ చేస్తున్నారు.  

డబ్బులు గుంజేందుకు ఎత్తులు
గతంలో పేదలు సాగు చేసుకునేందుకు ఇచ్చిన అసైన్డ్‌ భూములు వెంచర్లుగా మారి ప్లాట్లుగా విక్రయాలు జరిపే క్రమంలో వీటికి సంబంధించి ప్రభుత్వం నుంచి నో ఆబ్జెక్షన్‌ సర్టిఫికెట్‌ (ఎన్‌ఓసీ) జారీ చేశారు. అవి అప్పుడు హోదాలో ఉన్న వివిధ రెవెన్యూ అధికారుల ద్వారా జారీ అయ్యాయి. వీటికి సంబంధించి పలుమార్లు ప్లాట్లు చేతులు మారి రిజిస్ట్రేషన్‌ కూడా జరిగాయి. ఇప్పుడు ఎవరైనా ఎన్‌ఓసీ ఉన్న ప్లాట్‌కు సంబంధించి రిజిస్ట్రేషన్‌కు వచ్చినప్పుడు ఆ డాక్యుమెంట్‌పై రిజిస్ట్రేషన్‌ అధికారులు డబ్బులు గుంజేందుకు ఎత్తులు వేస్తున్నారు.

ఈ ఎన్‌ఓసీ విషయంలో జిల్లా అధికారుల నుంచి అభ్యంతరాలు ఉన్నాయని, వాళ్ల నుంచి మాకు మళ్లీ క్లియరెన్స్‌ రాలేదని, జాబితా పంపలేదని.. ఇలా రకరకాలుగా చెప్పడం ద్వారా రిజిస్ట్రేషన్‌కు వచ్చిన పార్టీని డైలమాలో పడేస్తారు. ఒకవేళ తాము డాక్యుమెంట్‌పై రాత ద్వారా సూచించిన విధంగా డబ్బులిస్తే రిజిస్ట్రేషన్‌ అయిపోతుందని చెబుతారు.

ఇలా వ్యవసాయ భూములను వెంచర్లుగా మార్చేందుకు ఉద్దేశించిన నాలా కన్జర్వేషన్, ఇండ్ల రిజిస్ట్రేషన్‌కు సంబంధించి మున్సిపల్‌ సంబంధిత పత్రాలు, ఇలా అనేక రకాలుగా డాక్యుమెంట్‌కు ఏదో ఒక అభ్యంతరం చూయించి పార్టీ నుంచి డబ్బులు వసూలు చేయడం ద్వారా ఆదిలాబాద్‌ సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయంలో అధికారుల తీరు హద్దు మీరిపోయిందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వీరికంటే జలగలే నయమన్న పరిస్థితి పలువురిలో వ్యక్తమవుతోంది.

వసూళ్లకు దళారులు
సాధారణంగా ఎస్‌ఆర్‌ఓ కార్యాలయంలో డాక్యుమెంట్‌ రైటర్లకు ప్రవేశం లేదు. అయితే పార్టీలు డాక్యుమెంట్‌ రైటర్లను మొదట దస్తావేజు రూపొందించేందుకు ఆశ్రయిస్తారు. అదే సమయంలో ఈ డాక్యుమెంట్‌ రైటర్‌ దాన్ని రూపొందించిన తర్వాత సబ్‌రిజిస్ట్రార్‌ దగ్గరికి పంపించినప్పుడు పరిశీలన చేసిన తర్వాత దాంట్లో ఏదో ఒక లోపం చూపిస్తూ ఆంగ్ల అక్షరం రాసి పంపిస్తారు.

కోడ్‌ పద్ధతిలో డాక్యుమెంట్‌పై రావాల్సిన లంచం రూపం చెప్పిన తర్వాత దానికి పార్టీ ‘సై’ అంటే సబ్‌రిజిస్ట్రార్‌కు సంబంధించిన ఇద్దరు ముగ్గురు వ్యక్తులు రంగంలోకి దిగుతారు. ఆ ఆంగ్ల అక్షరం మేరకు లంచం డబ్బులు వసూలు చేస్తారు. ఆ తర్వాతే ఆ డాక్యుమెంట్‌ మళ్లీ సబ్‌రిజిస్ట్రార్‌ టేబుల్‌పైకి వెళ్తుంది. ఇదంతా రోజూ మామూలుగా జరిగే తతంగమే.

ఏసీబీకి పట్టుబడినా తీరు మారలే..
ఆదిలాబాద్‌లో ప్రస్తుతం ఇన్‌చార్జి సబ్‌రిజిస్ట్రార్‌గా వ్యవహరిస్తున్న ఓ అధికారి గతంలో ఇలాగే లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. దీనికి సంబంధించి ఈ మధ్యకాలంలో శాఖ పరంగా సర్వీస్‌ రిమూవల్‌ జరిగిందనే ప్రచారం సాగింది. అయితే రిజిస్ట్రేషన్‌ శాఖలో ఉన్నతాధికారులను మచ్చిక చేసుకుని దీనినుంచి బయటపడ్డాడని శాఖలో చెప్పుకుంటున్నారు. అయినప్పటికీ ఆ అధికారి తీరు మారలేదు. ప్రస్తుతం సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయంలో ఈ కోడ్‌ పద్ధతిని అమలులోకి తీసుకొచ్చి యథేచ్ఛగా వసూలు చేస్తున్నా పట్టించుకునే నాథుడే లేడు. ప్రతీరోజు ఈ అధికారి లక్షల రూపాయలు లంచం రూపంలో వసూలు చేస్తున్నాడని చెప్పుకుంటున్నారు.

చేతులెత్తేసిన రిజిస్ట్రార్‌
ఆదిలాబాద్‌ సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయంలో విచ్చలవిడిగా సాగుతున్న అక్రమాలపై కొంతమంది డాక్యుమెంట్‌ రైటర్లు ఇటీవల జిల్లా రిజిస్ట్రార్‌ ఫణీంద్రను కలిసి ఈ విషయంలో చర్యలు తీసుకోవాలని కోరారు. అయితే జిల్లా రిజిస్ట్రార్‌ మా టలు వారిని విస్తుపోయేలా చేశాయి. ప్రధానంగా ఆదిలాబాద్‌ సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయంలో రెగ్యులర్‌ సబ్‌రిజిస్ట్రార్లు పనిచేసేందుకు ముందుకు రావడం లేదని, పనిచేసేవారిని ఇక్కడ ఉన్నవారు పనిచేయనివ్వడం లేదని, ఇలాంటి పరిస్థితుల్లో ప్రస్తుతం చేస్తున్న వారితోనే వ్యవస్థను నడిపియ్యాల్సి వస్తుందని చెప్పారు.

దీంతో అక్కడ వ్యవస్థ పరమైన లోపమా? లేనిపక్షంలో జిల్లా రిజి స్ట్రారే ఇలాంటి అక్రమాలకు పాల్పడే అధికారులకు వెన్నుదన్నుగా నిలుస్తున్నాడా? అన్న అనుమానాలను పలువురు వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో ‘సాక్షి’ జిల్లా రిజిస్ట్రార్‌ ఫణీంద్రను వివరణ కోరేందుకు గురువారం సాయంత్రం ఫోన్‌ చేయగా ఆయన అందుబాటులోకి రాలేదు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement