సాక్షి, హైదరాబాద్: వరంగల్ జిల్లా పర్వతగిరి మండలంలో ఆరు వైన్‌షాప్‌లు ఉన్నాయి. అవన్నీ సిండికేట్‌గా దందా చేస్తున్నాయని.. మండలంలోని ఓ గోదాంలో సరుకు నిల్వచేసి మరీ సిండికేట్ నిర్వాహకులు బెల్ట్‌షాపులకు మందు పంపిస్తుంటారని ఎక్సైజ్ వర్గాలకూ తెలుసు. ఎమ్మార్పీ కన్నా ఎక్కువ ధరకు అమ్మడం ద్వారా బెల్టుషాపులతో నెలకు లక్షల రూపాయలు దోచుకుంటున్నారు. అయితే సిండికేట్ నుంచి కొందరు ఎక్సైజ్ సిబ్బందికి నెలకు రూ.1.20 లక్షలు, సివిల్ పోలీసు అధికారులు, సిబ్బందికి మరో రూ.1.20 లక్షలు ముడుపులు అందుతుండటంతో ఈ వ్యవహారమంతా చూసీచూడనట్టు వదిలేస్తున్నట్టు ప్రచారముంది.
.. ఇది కేవలం పర్వతగిరి మండలానికి చెందిన విషయం కాదు. దాదాపు రాష్ట్రమంతటా ఇదే తరహాలో దందా కొనసాగుతోందని.. అటు ఎక్సైజ్ పోలీసులు, ఇటు సివిల్ పోలీసులు వైన్‌షాపులు, బార్ల యజమానుల నుంచి నెలవారీ మామూళ్లను ముక్కు పిండి వసూలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇది ఎప్పటి నుంచో కొనసాగుతున్నా ఈ మధ్య ‘వసూళ్ల’ డిమాండ్ పెరిగిందని.. లేకుంటే ఏదో ఒక పేరిట ఇబ్బందిపెడుతున్నారని అంటున్నారు. ‘సాక్షి’ క్షేత్రస్థాయి పరిశీలనలో ఇలాంటి అంశాలు మరిన్ని వెలుగుచూశాయి.
అమ్మకాలను బట్టి మామూళ్ల లెక్క..
రాష్ట్రంలోని వైన్‌షాపులు, బార్ అండ్ రెస్టారెంట్ల నుంచి వసూళ్లు గత రెండేళ్ల కాలంలో రెండింతల వరకు పెరిగినట్టు అంచనా. ముఖ్యంగా సివిల్ పోలీసుల దందా ఎక్కువైందని వైన్‌షాప్‌ల నిర్వాహకులు అంటున్నారు. దీనికితోడు అప్పుడప్పుడూ మద్యం బాటిళ్లు కూడా ఫ్రీగా తీసుకెళ్తుంటారని చెప్తున్నారు. ఇక ఎక్సైజ్ సిబ్బందికి అయితే లైసెన్సు తీసుకున్నప్పుడు, రెన్యువల్ సమయంలో, ఫైనల్ క్లియరెన్స్ సందర్భంగా వారికి లక్షల్లోనే ముట్టజెప్పాల్సి వస్తుందని అంటున్నారు.
ఈ మామూళ్లలో స్టేషన్ నుంచి డీఎస్పీ కార్యాలయం వరకు, నగరాల్లో అయితే ఏసీపీ స్థాయి అధికారుల వరకు వాటాలు చేరుతుంటాయనే ఆరోపణలు ఉన్నాయి. మొత్తంగా వైన్స్, బార్ల నిర్వాహకుల అక్రమ దందాలు ఓవైపు.. ఎక్సైజ్, సివిల్ పోలీసుల మామూళ్లు మరోవైపు కలిసి మందుబాబుల జేబుకు మాత్రం చిల్లు పడుతోందన్న విమర్శలు ఉన్నాయి.
ఊరి నుంచి రాజధాని దాకా ఇంతే..
హైదరాబాద్ నగర శివార్లలోని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలో మొత్తం 44 వైన్‌షాపులు, 38 బార్ అండ్ రెస్టారెంట్లు ఉన్నాయి. వాటినుంచి ఎక్సైజ్ సిబ్బందికి నెలకు రూ.10.40 లక్షలు, సివిల్ పోలీసులకు రూ.5.20 లక్షలు మామూళ్ల రూపంలో వెళుతున్నట్టు ప్రచారముంది. కొన్ని నెలల కింద మామూళ్లను 50శాతం పెంచారని అంటున్నారు. మామూళ్లు ముట్టకపోతే వైన్‌షాపుల ముందు కానిస్టేబుల్ ప్రత్యక్షమవుతారని.. పార్కింగ్ నుంచి జనాలు గుమికూడే వరకు అన్ని విషయాల్లో ఇబ్బంది పెడుతుంటారని వైన్‌షాపుల నిర్వాహకులు చెప్తున్నారు.
జనగామ జిల్లాలో వైన్‌షాపుల నిర్వాహకులు ఎక్సైజ్ పోలీసులకు నెలకు రూ.15వేల–30 వేలవరకు, సివిల్ పోలీసులకు రూ.20–35వేల వరకు ఇస్తున్నట్టు సమాచారం. గ్రేటర్ వరంగల్‌లో గతంలో ఎక్సైజ్ సిబ్బంది నెలకు రూ.15వేలు వసూలు చేసేవారని, ఇప్పుడు రూ.20వేలు తీసుకుంటున్నారని.. సివిల్ పోలీసులు కూడా రూ.10 వేల నుంచి రూ.15వేలకు పెంచారని వైన్స్‌షాపుల నిర్వాహకులు అంటున్నారు. పోలీసులకు మామూలు ముట్టకపోతే.. వైన్‌షాపు ఎదురుగా ట్రాఫిక్ ఉల్లంఘనలు జరుగుతున్నాయని, న్యూసెన్స్ జరుగుతోందని కేసులు పెడుతున్నారని చెప్తున్నారు. కొన్నిచోట్ల సివిల్ పోలీసులే తనిఖీలు కూడా చేస్తున్నారని పేర్కొంటున్నారు.
నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో పోలీసులకు గతంలో నెలకు రూ.25 వేలు ఇచ్చేవారమని, ఇప్పుడు రూ.50 వేలు వసూలు చేస్తున్నారని వైన్స్‌షాపుల వర్గాలు చెప్తున్నాయి. లేకుంటే డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు, బెల్ట్‌షాపులపై దాడులు చేస్తుంటారని అంటున్నాయి. తమ వ్యాపారం ఎక్కడ దెబ్బతింటుందోనని ప్రతినెలా ఠంచన్‌గా ముట్టజెప్పాల్సి వస్తోందని చెప్తున్నాయి.
హైదరాబాద్ నడిరోడ్డు హిమాయత్‌నగర్, నారాయణగూడ ప్రాంతాల్లో సివిల్ పోలీసుల దందా ఎక్కువైందని వైన్‌షాపుల యజమానులు చెప్తున్నారు. కేవలం ఎక్సైజ్ వాళ్లకు మాత్రమే ఇస్తే సరిపోదని, తమకూ ఇవ్వకపోతే కేసులు పెడతామని బెదిరిస్తున్నారని అంటున్నారు. నారాయణగూడలో వైన్‌షాపుల నుంచి పోలీసులకు నెలకు రూ.25 వేల చొప్పున అందుతుంటాయని.. అందుకే సిబ్బంది ఆ షాపులు సమయం దాటి తెరిచి ఉన్నా, రోడ్డుపై ఇబ్బంది అవుతున్నా పట్టించుకోరని స్థానికులు ఆరోపిస్తున్నారు.
మేడ్చల్ డివిజన్ పరిధిలో సివిల్ పోలీసులు తరచూ దావత్‌ల పేరుతో పెద్ద సంఖ్యలో మద్యం బాటిళ్లు తీసుకెళ్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇక్కడి బార్ల నుంచి నెలకు రూ.15 వేల దాకా వసూలు చేస్తున్నారని వైన్స్ నిర్వాహకులు చెప్తున్నారు. రాత్రి సమయం ముగిశాక మద్యం అమ్మితే.. అందినంత దోచుకుని ఏమీ జరగనట్టు వెళ్లిపోతుంటారని స్థానికులు అంటున్నారు.
ఖమ్మం జిల్లాలో గోదావరి జిల్లాలకు ఆనుకుని ఉండే ప్రాంతాల్లోని వైన్స్ నుంచి పోలీసులకు నెలకు రూ.50వేల చొప్పున అందుతాయని.. పైగా అడిగినన్ని మద్యం బాటిళ్లూ ఇవ్వాల్సిందేనని నిర్వాహకులు చెప్తున్నారు. అలా ఇవ్వకుంటే వైన్‌షాపుల్లో మద్యం అన్‌లోడ్ కూడా కానివ్వరని అంటున్నారు. ఇక ఎక్సైజ్ మామూళ్లు సాధారణమేనని.. లేకుంటే పర్మిట్ రూం, ఇతర అంశాల్లో తీవ్రంగా ఇబ్బందిపెడతారని ఆరోపిస్తున్నారు.
కరీంనగర్ జిల్లా గోదావరిఖని ప్రాంతంలో కొందరు పోలీసుల మామూళ్ల దందా మరీ ఎక్కువన్న ఆరోపణలు ఉన్నాయి. ఇక్కడ సమయానికి డబ్బులు అందకుంటే అలుగుతారని.. కొన్నిరోజులు ఇబ్బందిపెడతారని వైన్ షాపుల నిర్వాహకులు చెప్తున్నారు.
స్టేషన్‌కు తీసుకెళ్లి ఇబ్బంది పెడుతున్నారు
నెలవారీగా సివిల్ పోలీసులకు మామూళ్లు ఇవ్వకపోతే షాప్ వద్దకు వచ్చి ఇబ్బందిపెడతారు. షాప్‌లో పనిచేసే వారిని స్టేషన్‌కు తీసుకెళుతుంటారు. లేదంటే షాప్ దగ్గర డ్రంకెన్ డ్రైవ్ టెస్టులు పెట్టి భయాందోళనకు గురిచేస్తున్నారు. గ్రేటర్ వరంగల్ పరిధిలోని ఓ వైన్‌షాప్ నిర్వాహకుడు మద్యం కూడా ఫ్రీగా తీసుకెళ్తారు ప్రభుత్వ జీతాలైనా ఆలస్యంగా అందుతాయేమోగానీ పోలీసులకు ఇచ్చే మామూళ్లకు మాత్రం ఆలస్యం జరగకూడదు. డబ్బులేకాదు వారు అడిగినప్పుడల్లా మద్యం బాటిళ్లు ఫ్రీగా ఇవ్వాలి. లేదంటే వేధింపులు మొదలవుతాయి. మాకు మిగిలే దాంట్లో ఎంతోకొంత ఇచ్చి ప్రశాంతంగా వ్యాపారం చేసుకుంటున్నాం. డబ్బులిస్తే మా జోలికి వచ్చే వారే ఉండరు.
– వైన్‌షాప్ యజమాని, నారాయణగూడ, హైదరాబాద్
Comments
Please login to add a commentAdd a comment