సాక్షి,మెదక్ : అతడో దొంగ. అసలే కొత్త సంవత్సరం (new year). సెలబ్రేట్ చేసుకుందామని అనుకున్నాడు. డబ్బులు కావాలి కదా. వైన్ షాపులో డబ్బులు బాగా ఉంటాయ్. దోచేద్దామని అనుకున్నాడు. అనుకున్నదే తడువుగా రెండ్రోజుల పాటు రెక్కీ కాచాడు. మూడో రోజు ప్లాన్ ప్రకారం.. తాను ముందుగా రెక్కి నిర్వహించిన వైన్ షాప్‌లో దొంగతనం చేశాడు.
దొంగతనానికి ముందే తాను ఎవరికి దొరక్కూడదనే ఉద్దేశ్యంతో సీసీ టీవీ కెమెరాల్ని ధ్వంసం చేశాడు. గల్లా పెట్టెలో ఉన్న డబ్బుంతా ఊడ్చేశాడు. అనంతరం బయటకు వచ్చేందుకు ప్రయత్నించాడు. అప్పటి వరకు అనుకున్నది అనుకున్నట్లుగా చేశాడు. కానీ చివరి నిమిషంలో తీసుకున్న నిర్ణయం బెడిసి కొట్టడంతో పోలీసులకు అడ్డంగా దొరికి పోయాడు.
మెదక్ జిల్లా నార్సింగ్ ప్రాంతంలో నిర్వాహకులు కనకదుర్గా వైన్స్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. ఎప్పటిలాగే ఆదివారం రాత్రి 10 వైన్ షాపును క్లోజ్ చేసి ఇంటికి వెళ్లారు. అప్పటికే ఆ వైన్ షాప్‌లో దొంగతనం ప్లాన్ చేసిన దొంగ రూఫ్‌ను తొలగించి షాప్‌లో చొరబడ్డాడు. డబ్బుల్ని కాజేశాడు. అనంతరం, దొంగతనానికి వచ్చిన ఆ దొంగకి మందు మీద కుతిపుట్టింది. వెంటనే వైన్ షాపులో ఏ బ్రాండ్ దొరికితే.. ఆ బ్రాండ్‌ని ఫుల్లుగా సేవించాడు. మత్తులో తాను దొంగతనానికి వచ్చానన్న విషయాన్ని మర్చిపోయి ఎంచక్కా పడుకున్నాడు.
ఆ మరుసుటి రోజు అంటే నిన్న ఉదయం నిర్వహాకులు వైన్ షాప్‌ను ఓపెన్ చేశారు. దొంగతనం జరిగినట్లు గుర్తించారు. ఆ పక్కనే మత్తులో ఉన్న దొంగను గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. దొంగను పరిశీలించి అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మోతాదుకు మించి మద్యం సేవించడం వల్ల స్పృహ కోల్పోయాడని పోలీసులు తెలిపారు. స్పృహలోకి వచ్చిన తర్వాత విచారణ ప్రారంభిస్తామని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment