తెనాలి: వ్యాయామ ఉపాధ్యాయిని, వితరణశీలి దివంగత మొవ్వా విజయలక్ష్మి స్మారక ద్వితీయ అవార్డును తెనాలి సబ్‌కలెక్టర్ గీతాంజలి శర్మకు ప్రదానం చేయనున్నారు. విజయలక్ష్మి వర్ధంతి రోజైన ఈనెల 20న ఉదయం 9 గంటలకు తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో ఏర్పాటయ్యే ప్రత్యేక సభలో స్థానిక ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ చేతులమీదుగా గీతాంజలి శర్మకు అవార్డును అందజేసి సత్కరిస్తారు.
అనంతరం ‘విద్యార్థులు–భవిష్యత్ సవాళ్లు’ అనే అంశంపై గీతాంజలి శర్మ ప్రసంగిస్తారు. గతేడాది తొలిసారిగా ఈ అవార్డును అప్పటి సీఐడీ అడిషనల్ ఎస్పీ, ప్రస్తుత ఇంటెలిజెన్స్ ఎస్పీ కేజీవీ సరితకు బహూకరించారు. తన లక్ష్యం వేరైనప్పటికీ తల్లిదండ్రుల సూచనపై సివిల్స్‌లో నెగ్గి ఐఏఎస్‌కు ఎంపికై న గీతాంజలి శర్మ కాకినాడలో ట్రైనీ కలెక్టర్‌గా పనిచేసి, తెనాలి సబ్‌కలెక్టర్‌గా గతేడాది బాధ్యతలు స్వీకరించారు. ప్రజాసేవపై ఆకాంక్ష, విధులపై చిత్తశుద్ధితో అనతికాలంలోనే ప్రజలు, ఉన్నతాధికారుల మన్ననలు పొందారు. గత రిపబ్లిక్ దినోత్సవాన జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ప్రశంసాపత్రాన్నీ అందుకున్నారు.
పశువైద్యురాలు కావాలనుకుని..
గీతాంజలి శర్మ స్వస్థలం రాజస్థాన్. తండ్రి యశ్వంత్‌శర్మ నౌకాదళంలో అధికారిగా చేశారు. తల్లి వేదవతిశర్మ శాస్త్రవేత్త. సోదరుడు యశ్‌దేవ్ శర్మ నౌకాదళంలో అధికారిగా ఉన్నారు. గీతాంజలి శర్మ భర్త కుమార్ సౌరభ్ ఐఆర్‌ఎస్ అధికారి. జైపూర్, ముంబయి, ఢిల్లీలో విద్యాభ్యాసం చేసిన గీతాంజలి శర్మ ప్రతి తరగతిలోనూ ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులవుతూ వచ్చారు. పక్షులు, జంతువులంటే ప్రేమ కలిగిన ఆమె పశువైద్యురాలు కావాలనుకున్నారు. సివిల్స్‌లో విజయం సాధిస్తే, ఎందరో ప్రజలకు సేవ చేయొచ్చన్న తల్లిదండ్రుల సూచనను పాటించారు. 2020 అక్టోబర్‌లో ఐఏఎస్ సాధించారు. తన వ్యక్తిత్వం, దక్షతతో ప్రజాసేవలో రాణిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment