కొరాపుట్: విజిలెన్స్ వలలో చిక్కిన నబరంగ్‌పూర్ అదనపు సబ్ కలెక్టర్ ప్రశాంత్ కుమార్ రౌత్ లక్ష్యంగా సోదాలు కొనసాగుతున్నాయి. శనివారం సోదాలు జరిపిన ప్రాంతాలను అధికారులు పెంచారు. దర్యాప్తులో అనేక కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అనేక బినామీ బ్యాంక్ ఖాతాలు, డెబిట్, క్రెడిట్ కార్డులు పట్టుబడ్డాయి. అందులో భుబనేశ్వర్‌లోని చంద్రశేఖర్‌పూర్ యాక్సిస్ బ్యాంక్‌లో ఖాతా ఉన్న నివేదిత జెన్న అనే మహిళని అధికారులు పిలిపించారు. అయితే పేరుతో అకౌంట్ ఉండడంపై ఆమె ఆశ్చర్యం వ్యక్తం చేశారు. 2016లో రాజఖనికలో బీడీవోగా ఉన్న ప్రశాంత్ కుమార్ రౌత్‌ని తాను కలిసినట్లు తెలియజేశారు. తనకు బియ్యం కార్డు ఇప్పించమని ప్రాదేయపడ్డానని, అప్పుడే తన ఆధార్ వివరాలు అందజేశానని వెల్లడించారు. ఈమె పేరు మీద ఉన్న అకౌంట్ నుంచి అనేక రూ.లక్షలు లావాదేవీలు జరిగాయి. ఆమెలాగే అనేక మంది పనివాళ్లు, డ్రైవర్లు పేరు మీద ఆస్తులు బయటపడుతున్నాయి. ప్రస్తుతం రూ.5 కోట్ల నగదు, ఒక ఇల్లు, వాహనాలు విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
మండిపడిన బీజేపీ
నబరంగ్‌పూర్ అదనపు సబ్ కలెక్టర్ ప్రశాంత్ కుమార్ రౌత్ వద్ద రూ.కోట్ల నగదు పట్టుబడడంపై బీజేపీ మండిపడింది. ఇది ప్రభుత్వంలోని అధికారులకు, పార్టీ నాయకులకు చెందిన నగదు అని ఆ పార్టీ మాజీ ఎంపీ బలభద్ర మజ్జి ఆరోపించారు. శనివారం సాయంత్రం నబరంగ్‌పూర్ జిల్లా కేంద్రంలోని చమిరియా గుడలో ఉన్న పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. దీనిని వాటాల పంపిణీలో వచ్చిన విభేదాల వలన వెలుగులోనికి వచ్చిన నల్లధనంగా అభివర్ణించారు. నగదు పట్టుకున్న అధికారులు, ఆ నగదు ఎలా వచ్చిందో, ఎవరెవరు ఇచ్చారో విచారణ చేయాలన్నారు. ఇంత నగదు లంచంగా ఇచ్చినవారు ఇంకెంత ప్రజాధనం దోపిడీ చేసి ఉంటారోనని అనుమానం వ్యక్తం చేశారు. సమావేశంలో పార్టీ నాయకులు జగదీష్ బిసాయి, గౌరి మజ్జి, షర్మిష్టా దేవ్, దేవదాస్ మహంకుడో తదితరులు పాల్గొన్నారు.
భారతమాల నిర్వాసితుల హర్షం
ప్రశాంత్ కుమార్ పట్టుబడడంపై భారతమాల నిర్వాసితులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా రూ.20 వేల కోట్ల వ్యయంతో విశాఖపట్నం నుంచి రాయ్‌పూర్‌కి 6 అంచెల ఎకనామిక్ కారిడర్‌ని భారతమాల పేరిట రోడ్డు నిర్మిస్తుంది. దీనిలో నబరంగ్‌పూర్ జిల్లాలో అత్యధిక భాగం భూసేకరణ జరిగింది. భూసేకరణలో భాగంగా వేలాది మంది గిరిజనులు నిర్వాసితులయ్యారు. వారికి అందే పరిహారాల విషయంలో ప్రశాంత్ ఎంతో కీలకంగా వ్యవహరించారని ఆరోపణలు ఉన్నాయి. సబ్ కలెక్టర్ హోదాలో అనేక ప్రభుత్వ భూములకు నకిలీ యజమానులను సృష్టించి రూ.కోట్లు దోచుకున్నట్లు తెలుస్తోంది. ఈ వ్యవహరంపై రాయిఘర్ బీజేపీ నాయకులు కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. దీంతో కేంద్ర హోం శాఖ ఈ వ్యవహరంపై చర్యలకు ఉపక్రమించిందని రాయిఘర్ నేతలు ప్రకటించారు. అందులో భాగంగానే దాడులు జరిగాయని పేర్కొన్నారు. మరోవైపు కొద్దిరోజుల క్రితం ఒక ప్రైవేటు పరిశ్రమకి వెళ్లి ప్రశాంత్ తనికీలు చేపట్టడం సంచలనం కలిగించింది. దీంతో సదరు పరిశ్రమల యజమానుల సంఘం ప్రతినిధులు తమను వేధిస్తున్నట్లు ఫిర్యాదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment