ఆరో తరగతిలో నాన్న మృతి.. అమ్మ కళ్లలో ఆనందం కోసం ఐఏఎస్‌గా | - | Sakshi
Sakshi News home page

ఆరో తరగతిలో నాన్న మృతి.. అమ్మ కళ్లలో ఆనందం కోసం ఐఏఎస్‌గా

Published Thu, Jun 1 2023 9:16 AM | Last Updated on Thu, Jun 1 2023 10:03 AM

- - Sakshi

తనను చదివించేందుకు తల్లి పడుతున్న కష్టాన్ని ఆ యువకుడు మరువలేదు. ఉన్నత స్థానానికి చేరి మాతృమూర్తి కళ్లలో ఆనందం నింపడమే లక్ష్యంగా అహర్నిశలు కష్టపడి చదివాడు. జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే పరీక్షలో సత్తా చాటి ఉద్యోగానికి ఎంపికయ్యాడు. పట్టుదల ఉండాలే గానీ సాధించలేనిదంటూ ఏదీ లేదని చెబుతున్న ఆ యువకుడు మరెవరో కాదు.. అసిస్టెంట్‌ కలెక్టర్‌ సురపాటి ప్రశాంత్‌కుమార్‌. వృత్తి శిక్షణలో భాగంగా ఆత్మకూరు వచ్చిన ఆయన తన అంతరంగాన్ని ‘సాక్షి’తో పంచుకున్నారు. ఆయన మాటల్లోనే.. 

మాది పార్వతీపురం. నాన్న బాబురావు ఆర్మీలో పని చేసి రిటైర్డయ్యారు. అమ్మ స్వర్ణలత ఏఎన్‌ఎం. అన్నయ్య ప్రదీప్‌. ప్రస్తుతం మల్టీ నేషనల్‌ కంపెనీలో పనిచేస్తున్నాడు. నేను ఒకటో తరగతి నుంచి 7వ తరగతి వరకు పార్వతీపురంలో, 8 నుంచి 10 వరకూ మహారాష్ట్రలోని నాసిక్‌లో చదివా. వైజాగ్‌లో డిప్లొమా చేశా. హైదరాబాదులోని వాసవీ కాలేజ్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌ కళాశాల నుంచి 2017లో ఇంజినీరింగ్‌ పూర్తి చేశా.

అమ్మ కష్టమే చదివించింది..
నేను ఆరో తరగతి చదివేటప్పుడు రోడ్డు ప్రమాదంలో నాన్న బాబురావు మరణించారు. మా కోసం అమ్మ ఆ దుఃఖాన్ని దిగమింగి నన్ను, అన్నయ్యను కష్టపడి చదివించింది. తనకు వచ్చే జీతంతోనే మాకు ఏ లోటూ తెలియకుండా పెంచింది. అందుకే అమ్మ కళ్లలో ఆనందం నింపడమే లక్ష్యంగా కష్టపడి చదివా. ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపా. అనుకున్నది సాధించి ఐఏఎస్‌గా ఎంపికై అమ్మకు కానుక అందించా.

మార్కుల కోసం చదవొద్దు..
పట్టుదల ఉంటే సాధించలేనిది ఏదీ లేదు. మనపై ఉన్న నమ్మకమే మనల్ని ఉన్నత స్థాయికి చేరుస్తుంది. అనుకున్నది సాధించడానికి మూడు సంవత్సరాలు తీవ్రంగా కష్టపడ్డా. నేను మార్కుల కోసం ఎప్పుడూ చదవలేదు, చదివింది అర్థం అయేటప్పుడు ఆ సంతోషం వేరుగా ఉంటుంది. చాలా మంది డబ్బు ఉంటేనే సివిల్స్‌కు చదవగలం, రాయగలం అనుకుంటారు. కానీ నేను మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన వాడినే. కష్టపడి చదివా. మనం అనుకున్నది సాధించడానికి స్పష్టమైన లక్ష్యం ఉంటే చాలు.

ఆయన ప్రేరణతోనే సివిల్స్‌కు..
పార్వతీపురం మన్యం జిల్లాలోని మన్యం ఐటీడీఏ పీఓగా కొంతకాలం క్రితం ఐఏఎస్‌ లక్ష్మీష పనిచేశారు. పార్వతీపురం సమీపంలోని ఓ కొండపై కొన్ని గ్రామాలు ఉండేవి. సరైన వైద్య సదుపాయాలు లేక అక్కడి ప్రజలు పడే బాధలు వర్ణనాతీతం. మహిళలు గర్భం ధరిస్తే ప్రసవం కోసం కొండ మీద నుంచి అవస్థలు పడుతూ కిందకు తీసుకురావాల్సి వచ్చేది. అలా తీసుకొచ్చాక చాలా సార్లు ఆ మహిళనో లేదా పుట్టిన బిడ్డో చనిపోయేవారు. ఆ సమస్యను పరిష్కరించేందుకు ఐఏఎస్‌ లక్ష్మీష హాస్టళ్లను ఏర్పాటు చేశారు. ప్రసవానికి మూడు నెలలు ఉందనగానే సదరు మహిళను తీసుకువచ్చి అక్కడ ఉంచి.. వారితో యోగా సాధన చేయించడంతో పాటు మంచి ఆహారం అందించేవారు. దీంతో ప్రసవం తర్వాత తల్లీ బిడ్డ క్షేమంగా ఉండేవారు. ఎందుకో తెలియదు ఒకసారి లక్ష్మీష గురించి మా అమ్మ నాకు చెప్పింది. ఒక ఐఏఎస్‌ తలచుకుంటే సమాజంలో ఎంతో మార్పు తీసుకురావొచ్చని వివరించింది. దీంతో నేనూ ఐఏఎస్‌ కావాలనిపించింది. నేను ఇంజినీరింగ్‌ చదువుతున్న సమయంలో శ్రీకాకుళంకు చెందిన గోపాల కృష్ణ అనే వ్యక్తి దేశస్థాయిలో సివిల్స్‌లో 3వ ర్యాంక్‌ సాధించారు. కష్టపడితే ఎవరైనా ఏదైనా సాధించవచ్చన్న విషయం ఆయన విజయంతో నాకు బోధపడింది.

నెగెటివ్‌గా మాట్లాడేవారిని పట్టించుకోవద్దు..
చాలా మంది విద్యార్థులు పదో తరగతిలో తప్పామనో, ఇంటర్‌ ఫెయిల్‌ అయ్యామనో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. అలా చేయడం చాలా తప్పు. ప్రతి విషయాన్ని పాజిటివ్‌గా తీసుకోవాలి. నెగెటివ్‌గా మాట్లాడే వారిని పట్టించుకోవద్దు. మన మీద మనకు నమ్మకం ఉండాలి. ఆ నమ్మకమే ఉన్నత స్థాయికి తీసుకెళ్తుంది. నేను మూడో ప్రయత్నంలో సివిల్స్‌కు ఎంపికయ్యా. మొదటి రెండు సార్లు చేసిన తప్పుల్ని సరిదిద్దుకుని సులువుగా గట్టెక్కా.

జిల్లావాసులు చాలా మంచివారు..
అనంతపురంలో కొన్ని నెలలుగా పనిచేస్తున్నా. జిల్లా ప్రజలు చాలా మంచి వారు. ఎలాంటి కల్మషం లేని మనుషులు. ఆత్మీయంగా పలకరిస్తారు. ఈ ప్రాంతంలో ముఖ్యంగా నాకు నచ్చిన విషయం ఏంటంటే ఎటుచూసినా పండ్ల తోటలు ఉండటం.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement