ఒడిశా: నవరంగ్‌పూర్ జిల్లా అదనపు సబ్ కలెక్టర్ ప్రశాంత్‌కుమార్ రౌత్ నివాసంలో కోట్లాది రూపాయల నగదు పట్టుబడింది. శుక్రవారం తెల్లవారుజామునే 9వేర్వేరు ప్రాంతాల్లో ఆయనకు చెందిన ఆస్తులపై విజిలెన్స్ బృందాలు ఏకకాలంలో దాడులకు దిగారు. నవరంగ్‌పూర్ మెయిన్ రోడ్డులోని తహసీల్దార్ కార్యాలయం సమీపంలో ఉన్న ప్రభుత్వ క్వార్టర్స్‌లో ఉన్న ఏడీఎంను నిద్ర లేపి, తనిఖీలు ప్రారంభించారు. అక్కడ రూ.12 లక్షల నగదు పట్టుబడింది. రెండు ప్రభుత్వ ఉద్యోగాలలో ఉండటంతో డీఆర్‌డీఏ కార్యాలయం పక్కన ఉన్న మరో ప్రభుత్వ క్వార్టర్‌లో రూ.77 లక్షల నగదు లభించింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా విజిలెన్స్ అధికారులు ఖంగు తిన్నారు. వెంటనే దూకుడు పెంచారు.
అధికారులను చూసి..
భువనేశ్వర్‌లోని కన్న విహార్‌లో ప్రశాంత్‌కుమార్‌కు మరో ఇల్లు ఉందని తెలిసి మెరుపు దాడికి దిగారు. అధికారులు రావడం దూరం నుంచి గమనించిన కొందరు వ్యక్తులు భవనం పైనుంచి కొన్ని పెట్టెలు మరో భవనం పైకి విసరడాన్ని గమనించారు. దీంతో తలుపులు విరగ్గొట్టి, అధికారులు ప్రవేశించే సరికే దుండుగులు పరారయ్యారు. అక్కడి పెట్టెలను స్వా«దీనం చేసుకోగా, ఇందులో రూ.2 కోట్ల 25 లక్షల నగదు బయటపడింది. దీంతో పరిస్థితిని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుని వెళ్లారు. అతని స్వస్థలం భద్రక్, నవరంగ్‌పూర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ కార్యాలయాల వద్ద తనిఖీలు చేపట్టారు. సాయంత్రం ఉమ్మర్‌కోట్ పట్టణంలో అత్యంత ఖరీదైన ప్రాంతంలో 24సెంట్ల వాణిజ్య స్థలాన్ని అతని సోదరుడి పేరుమీద, ఖరీదైన భవనాలు సైతం ఉన్నట్లు గుర్తించారు. వీటితో పాటు బంగారం బిస్కెట్లు, లెక్కలేనన్ని డిపాజిట్లు, భూ పత్రాలు, వివిధ బ్యాంకుల్లో లాకర్లు స్వాధీనం చేసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన దాడుల్లో ఇద్దరు అదనపు ఎస్పీలు, ఏడుగురు డీఎస్పీలు, 8మంది ఇన్‌స్పెక్టర్లు పాల్గొన్నట్లు రాష్ట్ర విజిలెన్స్ కార్యాలయం ప్రకటించింది.
గతంలో కూడా..
ఏడీఎం ప్రశాంత్‌కుమార్ గతంలో సుందర్‌గడ్ జిల్లా బిశ్రా సమితి కేంద్రంలో సమితి అభివృద్ధి అధికారిగా పని చేస్తున్న సమయంలో రూ.లక్ష లంచం తీసుకుంటుండగా విజిలెన్స్‌కు పట్టుబడ్డారు. ఆ కేసులో జైలుకు వెళ్లి, తిరిగి వచ్చి మళ్లీ విధుల్లో చేరారు. నవరంగ్‌పూర్ జిల్లాలో ఇసుక మాఫియాతో ప్రత్యక్ష సంబంధాలు ఉన్నట్లు అనేక ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహరంపై గతం లో ట్రాక్టర్ల యజమానులు ఆందోళనకు దిగడం గమనార్హం. ఏడీఎం నివాసంలో కోట్ల రూయాల నగదు లభ్యం కావడంపై కాంగ్రెస్ పార్టీ మండిపడింది. పేదరికంతో బాధపడే గిరిజన జిల్లా.. ఓ ఉన్నతాధికారి వద్ద భారీ స్థాయిలో నగదు పట్టుబడటం ఆందోళన కలిగించే అంశమని డీసీసీ అధ్యక్షుడు మున్నా త్రిపాఠి ఆగ్రహం వ్యక్తంచేశారు. శుక్రవారం సాయంత్ర నవరంగపూర్ లోని తన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. అవినీతి అధికారిని ఉద్యోగం నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment