Sub-Collector
-
విజిలెన్స్ తనిఖీలు.. రూ.2కోట్లు పక్కింట్లో పడేసిన అధికారి
ఒడిశా: నవరంగ్‌పూర్ జిల్లా అదనపు సబ్ కలెక్టర్ ప్రశాంత్‌కుమార్ రౌత్ నివాసంలో కోట్లాది రూపాయల నగదు పట్టుబడింది. శుక్రవారం తెల్లవారుజామునే 9వేర్వేరు ప్రాంతాల్లో ఆయనకు చెందిన ఆస్తులపై విజిలెన్స్ బృందాలు ఏకకాలంలో దాడులకు దిగారు. నవరంగ్‌పూర్ మెయిన్ రోడ్డులోని తహసీల్దార్ కార్యాలయం సమీపంలో ఉన్న ప్రభుత్వ క్వార్టర్స్‌లో ఉన్న ఏడీఎంను నిద్ర లేపి, తనిఖీలు ప్రారంభించారు. అక్కడ రూ.12 లక్షల నగదు పట్టుబడింది. రెండు ప్రభుత్వ ఉద్యోగాలలో ఉండటంతో డీఆర్డీఏ కార్యాలయం పక్కన ఉన్న మరో ప్రభుత్వ క్వార్టర్లో రూ.77 లక్షల నగదు లభించింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా విజిలెన్స్ అధికారులు ఖంగు తిన్నారు. వెంటనే దూకుడు పెంచారు. అధికారులను చూసి.. భువనేశ్వర్‌లోని కన్న విహార్‌లో ప్రశాంత్‌కుమార్‌కు మరో ఇల్లు ఉందని తెలిసి మెరుపు దాడికి దిగారు. అధికారులు రావడం దూరం నుంచి గమనించిన కొందరు వ్యక్తులు భవనం పైనుంచి కొన్ని పెట్టెలు మరో భవనం పైకి విసరడాన్ని గమనించారు. దీంతో తలుపులు విరగ్గొట్టి, అధికారులు ప్రవేశించే సరికే దుండుగులు పరారయ్యారు. అక్కడి పెట్టెలను స్వా«దీనం చేసుకోగా, ఇందులో రూ.2 కోట్ల 25 లక్షల నగదు బయటపడింది. దీంతో పరిస్థితిని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుని వెళ్లారు. అతని స్వస్థలం భద్రక్, నవరంగ్‌పూర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ కార్యాలయాల వద్ద తనిఖీలు చేపట్టారు. సాయంత్రం ఉమ్మర్‌కోట్ పట్టణంలో అత్యంత ఖరీదైన ప్రాంతంలో 24సెంట్ల వాణిజ్య స్థలాన్ని అతని సోదరుడి పేరుమీద, ఖరీదైన భవనాలు సైతం ఉన్నట్లు గుర్తించారు. వీటితో పాటు బంగారం బిస్కెట్లు, లెక్కలేనన్ని డిపాజిట్లు, భూ పత్రాలు, వివిధ బ్యాంకుల్లో లాకర్లు స్వాధీనం చేసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన దాడుల్లో ఇద్దరు అదనపు ఎస్పీలు, ఏడుగురు డీఎస్పీలు, 8మంది ఇన్స్పెక్టర్లు పాల్గొన్నట్లు రాష్ట్ర విజిలెన్స్ కార్యాలయం ప్రకటించింది. గతంలో కూడా.. ఏడీఎం ప్రశాంత్‌కుమార్ గతంలో సుందర్‌గడ్ జిల్లా బిశ్రా సమితి కేంద్రంలో సమితి అభివృద్ధి అధికారిగా పని చేస్తున్న సమయంలో రూ.లక్ష లంచం తీసుకుంటుండగా విజిలెన్స్‌కు పట్టుబడ్డారు. ఆ కేసులో జైలుకు వెళ్లి, తిరిగి వచ్చి మళ్లీ విధుల్లో చేరారు. నవరంగ్‌పూర్ జిల్లాలో ఇసుక మాఫియాతో ప్రత్యక్ష సంబంధాలు ఉన్నట్లు అనేక ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహరంపై గతం లో ట్రాక్టర్ల యజమానులు ఆందోళనకు దిగడం గమనార్హం. ఏడీఎం నివాసంలో కోట్ల రూయాల నగదు లభ్యం కావడంపై కాంగ్రెస్ పార్టీ మండిపడింది. పేదరికంతో బాధపడే గిరిజన జిల్లా.. ఓ ఉన్నతాధికారి వద్ద భారీ స్థాయిలో నగదు పట్టుబడటం ఆందోళన కలిగించే అంశమని డీసీసీ అధ్యక్షుడు మున్నా త్రిపాఠి ఆగ్రహం వ్యక్తంచేశారు. శుక్రవారం సాయంత్ర నవరంగపూర్ లోని తన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. అవినీతి అధికారిని ఉద్యోగం నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. -
డిగ్రీలుంటే సరిపోదు స్కిల్స్ ఉండాలి
సాక్షి ప్రతినిధి, ఏలూరు : ఇంజినీరింగ్ చదివి నాలుగేళ్లు ఐటీ ప్రొఫెషనల్‌గా పని చేశారు. అయితే ఆయన లక్ష్యం సివిల్స్. దేశ అత్యున్నత సర్వీస్‌లో చేరి ప్రజలకు సేవ చేయాలనేది చిన్నప్పటి నుంచి తపన. అందుకు తగ్గట్టుగా కష్టపడ్డారు. మారుమూల గ్రామం నుంచి ఐఏఎస్‌కు ఎంపికయ్యారు. 29 ఏళ్ల వయసులో జిల్లాలో కీలకమైన నరసాపురం రెవెన్యూ సబ్‌డివిజన్ అధికారిగా తన మొట్టమొదటి బాధ్యతలు స్వీకరించారు. రాజకీయ వత్తిళ్లు, అవినీతి వ్యవహారాలు ఆయన దరిదాపులకు రానివ్వరు. 14 నెలల ఉద్యోగ జీవితంలో పాలనా పరంగా ఎన్నో సంస్కరణలు చేపట్టి, ప్రజల నుంచి మన్ననలు పొందుతున్న నరసాపురం సబ్‌కలెక్టర్ సుమిత్‌కుమార్ గాంధీ ఆదర్శంగా నిలుస్తున్నారు. 10వ తరగతి వరకూ ప్రభుత్వ పాఠశాలలోనే చదివానని చెపుతున్న ఆయన నేటి యువత అందుబాటులో ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలంటున్నారు. దినపత్రికలు చదవడం, ఇంటర్నెట్ను సక్రమంగా వినియోగించుకోవడం చేయాలని చెపుతున్నారు. లక్ష్యం, ప్రణాళికతో కష్టపడితే సివిల్స్ సాధించడం సులభమేనని అం టున్నారు. అవినీతి నిరోధంపై ప్రజలకు అవగాహన పెరగాలని, అవినీతిని అన్నికోణాల్లో ప్రశ్నించే తత్వం రావాలని కోరుతున్నారు. ఆయన సాక్షితో పంచుకున్న అంతరంగం వివరాలు.. మీ విద్యాభ్యాసం ఎక్కడ మొదలైంది మాది హర్యానా రాష్ట్రం. రోహతక్ జిల్లాలోని కోనూర్ గ్రామంలో పుట్టాను. మాది మధ్యతరగతి కుటుంబం. 10వ తరగతి వరకూ ప్రభుత్వ పాఠశాలలోనే చదివా. ఇంజినీరింగ్ అయిన తరువాత గురుగావ్‌లో నాలుగేళ్లుపాటు ఐటీ ప్రొఫెషనల్‌గా పని చేశా. అయితే నాకు చిన్నప్పటి నుంచి సివిల్స్ అంటే మక్కువ. ఐఏఎస్ అవ్వడం ద్వారా ప్రజలకు ఎక్కువ సేవ చేసే అవకాశం ఉంటుంది. అందుకే ఐటీ ఉద్యోగం చేస్తూనే సివిల్స్ ప్రిపేర్ అయ్యా. రెండవ ప్రయత్నంలో 2014లో ఐఏఎస్‌కు ఎంపికయ్యా. ఏపీ క్యాడర్‌కు కేటాయిం చారు. అనంతపురంలో ట్రైనీ కలెక్టర్‌గా పని చేసిన తరువాత, నరసాపురం సబ్‌కలెక్టర్‌గా మొదటి పోస్టింగ్ ఇచ్చారు. గ్రామీణ ప్రాంతాల వారికి అవకాశాలు ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు అవకాశాలు ఎక్కువ. ఆధునిక పరిజ్ఞానం బాగా అందుబాటులోకి వచ్చింది. ఇంటర్నెట్ ద్వారా అంతా తెలుసుకోవచ్చు. అవకాశాలను అన్వేషించుకుని అందుకు తగ్గట్టుగా ముందుకెళితే కచ్చితంగా విజయం సాధించవచ్చు. గ్రామీణ ప్రాంతాలవారు, ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్నవారు ఎవరైనా ఐఏఎస్ చదవొచ్చు. కానీ స్కిల్స్ పెంచుకోవాలి. ముఖ్యంగా ఇంగ్లిష్ భాషపై పట్టు సాధించాలి. అప్పుడే ఇంటర్నెట్ లాంటి మాధ్యమాలను పూర్తిస్థాయిలో ఉపయోగించుకోగలం. నా మాతృభాష హిందీ. అయితే ఇంగ్లిష్ నేర్చుకోవడంలో చిన్నప్పటి నుంచి ప్రత్యేక శ్రద్ధ పెట్టాను. నేను ఐఏఎస్ కావడానికి అది చాలా ఉపయోగపడింది. ఐఏఎస్ లక్ష్యం ఎలా సాధించారు? న్యూస్ పేపర్ చదవడానికి ప్రతిరోజు ఓ అరగంట కేటాయించేవాడిని. తరువాత ఇంటర్నెట్. ప్రస్తుతం యువత పేపర్ చదవడంలేదు. సివిల్స్‌గానీ, పోటీ పరీ క్షలు గానీ రాసేవాళ్లు కచ్చితంగా న్యూస్ పేపర్ చదవాలి. ఇంగ్లీష్‌పై పట్టు పెంచుకోవాలి. ఇక ఇంటర్నెట్, యూట్యూబ్ లాంటి మాధ్యమాలను యువత వేరే రకంగా వినియోగించుకుంటున్నారు. కానీ వాటిలో మంచి విషయాలు ఎక్కువగా ఉన్నాయి. వాటిని పట్టించుకోవడంలేదు. ఇక ప్రధానంగా నేను గమనించింది. డిగ్రీలకు విలువ తగ్గింది. చదవుతో పాటు స్కిల్స్ పెంచుకోవాలి. నేను చేసింది అదే. ఆరకంగా యువత కష్టపడాలి రెవెన్యూలో సవాళ్లు ఎక్కువ కదా? ఎలా పరిష్కరిస్తున్నారు? ఈ శాఖలో సవాళ్లు ఎక్కువ. పూర్తిగా చేసేశాం అని చెపితే అబద్దమవుతుంది. 80 శాతం పనులు చేయగలితే ప్రజలకు న్యాయం చేసినట్టు లెక్క. నరసాపురం సబ్‌డివిజన్‌లో శ్మశానవాటికల కోసం దాదాపు 200 ఎకరాల స్థలం అవసరం. ఇది చాలా దారుణమైన పరిస్థితి. నేను వచ్చిన తరువాత శ్మశానవాటికల కోసం మొత్తం ఎంత స్థలం అవసరమో సర్వే చేయించా. దీనికి పరిష్కారం చూపించాలని ప్రయత్నిస్తున్నాను. మీకోసం కార్యక్రమంలో వృద్ధుల సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి. వారంలో నాలుగురోజులు వారి సమస్యల పరిష్కారానికి కేటాయిస్తున్నాను. ఇందుకోసం ఓ టైమ్‌టేబుల్ అమలు చేస్తున్నాము. ఇక డివిజన్లో అనేక మంది అర్హులైనవారికి ఇళ్ల పట్టాలు ఇవ్వాలి. కానీ ప్రభుత్వ భూములులేవు. అవినీతిపై ఫిర్యాదులు ఎందుకు రావడం లేదు ? అవినీతి, రాజకీయ వత్తిళ్లు లాంటి సమస్యలు రెవెన్యూలో ఉన్నాయి. నా డివి జన్‌లో దీనిపై దృష్టిపెట్టాను. డివిజన్లో చేపట్టిన రేషన్‌షాపుల భర్తీ నుంచి అనేక కార్యక్రమాలు పారదర్శకంగా చేశారు. డివిజన్లో అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది ఎవరు లంచం అడిగినా నేరుగా నాకు ఫిర్యాదు చేయమని చెప్పాను. నా కార్యాలయంలో ఓ ఫిర్యాదుల పెట్టె పెట్టాను. కానీ ఒక్క ఫిర్యాదు కూడా రావడంలేదు. అంతా కరెక్ట్‌గా ఉందని నేను చెప్పను. నాకు చెప్పడానికి ఎందుకు వెనకాడుతున్నారో? అవినీతిపై తిరగబడే తత్వం ప్రజల్లో పెరగాలి. -
ప్రదేశాలే వేరు...ప్రయాణాలు ఒకటే...
ఒకరి తల మీద ఒకరు జీలకర్ర బెల్లం ఉంచితే... అక్కడితో వివాహం పూర్తయినట్లే. మిగతా తంతు అంతా వేడుక కోసమే. అయితే ఈ దంపతులు వేడుకల వరకు వెళ్లలేదు. పెళ్లి మాత్రం అయ్యిందనిపించి, వెంటనే ఎవరి డ్యూటీకి వారు వెళ్లిపోయారు! వాళ్లేమీ సామాన్యులు కాదు... ఇద్దరూ ఐఏఎస్ ఆఫీసర్లు! ఐదు వందల రూపాయల ఖర్చుతో వివాహం చేసుకుని 48 గంటల లోపే మధ్యప్రదేశ్‌కి ఒకరు, ఆంధ్రప్రదేశ్‌కి ఒకరు విధి నిర్వహణకు వెళ్లిపోయారు. ఈ సందర్భంగా వధువు ‘సలోని సిదానా’ను సాక్షి ‘ఫ్యామిలీ’ పలకరించింది. ‘‘మా వివాహం గురించి పెద్దగా రాయవలసింది ఏమీ లేదు. మా ఇరుపక్షాల పెద్దల అంగీకారంతోనే ఇలా.. ఖర్చు లేకుండా చేసుకున్నాం. అన్ని వివాహ విధానాలనూ నేను గౌరవిస్తాను. అయితే మేము ఎంచుకున్న విధానం అందరికీ ఆదర్శంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడిప్పుడే బాధ్యతలలోకి వచ్చాను. ఇంకా ఎన్నో చేయాలి. కొత్తగా చిగుళ్లు తొడుగుతున్న రాజధానికి సబ్‌కలెక్టర్‌గా రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను’’ అని అంటున్న సలోని మనోభావాలివి. మెడిసిన్ చదివి... సివిల్స్ లోకి మాది వ్యవసాయ కుటుంబం. పంజాబ్‌లోని జలాలాబాద్‌లోని చిన్న గ్రామం మా ఊరు. మేము ముగ్గురం. తమ్ముడు అనిష్, అక్క మమతా సిదాని, నేను. తమ్ముడు ఐఐటి చదువుతున్నాడు. నేను ఢిల్లీలో ఎంబిబిఎస్ పూర్తి చేసి, ఎయిమ్స్‌లో రేడియాలజిస్టుగా పనిచేశాను. అయితే నా మనసు నన్ను సివిల్స్ వైపు లాగుతుండేది. ఆ సమయంలోనే అమెరికాలోని ఒక విశ్వవిద్యాలయంలో పీజీ సీటు వచ్చింది. సివిల్ సర్వీసులో చేరాలని ఆసక్తి ఉండటంతో, పీజీ వదులుకున్నాను. సివిల్స్‌కి ప్రిపేర్ అయ్యాను. 2013లో యుపిఎస్సి పరీక్ష రాశాను. 74వ ర్యాంకు వచ్చింది. సివిల్ సర్వీసులో చేరడం వల్ల నేను ఎక్కువమందికి సేవలు అందించగలుగుతాను. ముఖ్యంగా పేదలకు సహాయం చేయడం కోసమే ఇటువైపు వచ్చాను. పెద్ద నోట్ల రద్దు కారణం కాదు శిక్షణా కాలంలో విజయవాడలో ట్రెయినీ కలెక్టర్‌గా పనిచేశాను. పోస్టింగ్ కూడా విజయవాడలోనే వచ్చింది. తెలుగు వారి కోసం కేవలం నెల రోజుల వ్యవధిలో తెలుగులో మాట్లాడటం నేర్చుకున్నాను. దక్షిణ భారతదేశానికి ఇది నా మొదటి ప్రయాణం. అంతకుముందే ముస్సోరి ట్రైనింగ్‌లో లాల్‌బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్‌లో అవినాష్‌కి నాకు సాన్నిహిత్యం ఏర్పడింది. ఆ సాన్నిహిత్యం ప్రేమగా, ప్రేమ పెళ్లిగా మారింది. నవంబరు 28 న మధ్యప్రదేశ్‌లోని భిండ్ కోర్టులో అతి సామాన్యంగా మా పెళ్లి జరిగింది. అవినాష్‌ది రాజస్థాన్. అతడి పోస్టింగ్ మధ్యప్రదేశ్‌లో. అక్కడి వశిష్ఠ గోహాడ్‌లో సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్‌గా పని చేస్తున్నారు. పెద్ద నోట్లు రద్దయిన కారణంగా ఇలా నిరాడంబరంగా మేము పెళ్లి చేసుకోలేదు కానీ, ఆదర్శ వివాహానికి ఒక మంచి అవకాశం లభించిందనుకున్నాం. సంభాషణ: డా. వైజయంతి, సాక్షి, విజయవాడ -
సామూహిక ఆత్మహత్యలే శరణ్యం
విజయవాడ : స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో మెట్రోరైలు ప్రాజెక్టు భూసేకరణౖపై ప్రజాభిప్రాయ సేకరణ బుధవారం చేపట్టారు. సబ్‌కలెక్టర్ డాక్టర్ జి. సృజన సమావేశానికి హాజరయ్యారు. ప్రాజెక్టుకు పూర్తి వ్యతిరేకమని చేతులెత్తి నిరసన తెలిపారు. పేదలు, మద్యతరగతి వర్గాల ప్రజలను రోడ్లపాలు చేయవద్దని పలువురు విలపించారు. చంద్రబాబుకు, కలెక్టర్‌కు శాపనార్ధాలు పెట్టారు. మెట్రోప్రాజెక్టును అలంకార్ నుంచి సాంబమూర్తి రోడ్డు మీదుగా రైవస్ కాలువ పక్కనుంచి నిర్మించాలని సూచించారు. మరి కొందరు బీఆర్టీఎస్ ప్రాజెక్టు మాదిరిగా మెట్రో రైలు ప్రాజెక్టు మూలన పడుతుందన్నారు. జనసంచారం లేని ప్రాంతంలో మెట్రోరైలు సాగదని, అనవసరంగా స్థలాలు లాక్కుని ప్రజలను ఇబ్బందులు పెట్ట వద్దన్నారు. డీఆర్డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ చంద్రశేఖరరాజు పాల్గొని ప్రజాభిప్రాయాలను రికార్డు చేశారు. కార్యక్రమంలో మెట్రో రైలు ప్రాజెక్టు జీఎం కామేశ్వరరావు, అర్బన్ తహసీల్దార్ ఆర్.శివరావు పాల్గొన్నారు. -
పుష్కర తొక్కిసలాటపై చర్యలుండవు : గాలి
కోటగుమ్మం (రాజమహేంద్రవరం)/పోలవరం : లక్షలాది మంది భక్తులు పాల్గొనే చోట అపశ్రుతులు జరుగుతుంటాయని టీడీపీ ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమనాయుడు అన్నారు. ఏడాది క్రితం గోదావరి పుష్కరాల సందర్భంగా ఊహించని రీతిలో తొక్కిసలాట జరిగిందని, దాన్ని రాద్ధాంతం చేయాల్సిన అవసరం లేదన్నారు.ఏంచేసినా ఎవరిపైనా చర్యలుండవని తేల్చి చెప్పారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం సబ్ కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం జిల్లా అధికారులతో ఆయన సమావేశమయ్యారు. -
ఏం తమాషాగా ఉందా...!
♦ ప్రతి సమావేశానికి ఆలస్యంగా వస్తున్నావ్ ♦ ఆఫీసర్లు అంటే అంత చులకనా.. ♦ వికారాబాద్ మున్సిపల్ కమిషనర్‌పై మండిపడిన సబ్ కలెక్టర్ వికారాబాద్ : ఆఫీసర్లు అంటే అంత లోకువా.. ఏందీ విషయం.. ప్రతి మీటింగ్‌కు ఆలస్యంగా వస్తావ్.. కొన్ని మీటింగ్‌లకు హాజరే కావు.. వచ్చినా ఎలాంటి నివేదికలు ఉండవు.. అసలు నీ ఉద్దేశం ఏమిటంటూ స్థానిక మున్సిపల్ కమిషనర్ ఎంకేఐ అలీపై వికారాబాద్ సబ్ కలెక్టర్ శ్రుతిఓజా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రతి మంగళవా రం సమీక్ష సమావేశం ఉంటుందనే సమాచారం నీకు తెలియదా.. తెలిస్తే ఎందుకు రాలేదు.. ఫోన్ చేస్తేనే మీటింగ్‌కు వస్తావా.. ఎం తమాషాగా ఉందా.. పద్ధతి మార్చుకోకుంటే ఫలితం అనుభవించక తప్పదని తనదైన శైలిలో హెచ్చరించారు. మంగళవారం వికారాబాద్ మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశానికి సబ్ కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సమావేశానికి మున్సిపల్ కమిషనర్ హాజరుకాకపోవడంతో ఫోన్ చేసి పిలిపించారు. ప్రతి వారం మున్సిపాలిటీ లో నిర్వహించే సమావేశానికి సైతం మున్సిపల్ అధికారులు హాజరుకాకపోవడంతో ఈసారి సమావేశాన్ని మండల పరిషత్‌కు మార్చినట్లు తెలిపారు. తీరుమార్చుకోకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. కాగా సమావేశానికి అధికారులు పూర్తిస్థాయి సమాచారంతో హాజరు కావాలని ఆదేశించారు. మొక్కుబడిగా వచ్చినా శాఖా పరమైన చర్యలు తప్పవన్నారు. వేసవి దృష్ట్యా ప్రజలకు తాగునీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకోవాలని చెప్పారు. పశువుల దాహార్తిని తీర్చేందుకు వీలుగా నీటి తొట్లు నిర్మించాలన్నారు. నీటి ఎద్దడి ఉన్న ప్రాం తాల్లో ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని తెలిపారు. ఆర్డబ్ల్యూఎస్ పనితీరును మరింత మెరుగు పడాల న్నారు. అర్హులైన వారికి కార్పొరేషన్ రుణాలు అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. సమావేశానికి ఎంపీడీఓ సత్తయ్య, తహసీల్దార్ గౌతంకుమార్‌తో పాటు వివిధ శాఖల అధికారులు హాజరయ్యారు. -
తిరుపతికి సబ్‌కలెక్టర్
ఇమామ్‌సు శుక్లా నియామకం మదనపల్లెకు క్రిటిక భత్రా ఏ.మల్లికార్జున విజయవాడ సీఆర్డీఏ అడిషనల్ కమిషనర్‌గా బదిలీ తిరుపతి మంగళం/మదనపల్లె రూరల్: తిరుపతి రెవెన్యూ డివిజన్‌కు ఆర్డీవో స్థానంలో ఇమామ్‌సు శుక్లాను సబ్‌కలెక్టర్‌గా నియ మిస్తూ బుధవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అదేవిధంగా మదనపల్లె సబ్‌కలెక్టర్ మల్లికార్జునను బదిలీచేసి ఆయన స్థానంలో ఢిల్లీకి చెందిన మహిళా సబ్‌కలెక్టర్ క్రిటిక భత్రాను నియమించింది. తిరుపతి నగరాన్ని స్మార్ట్‌సిటీగా అభివృద్ధి చేయనున్న నేపధ్యంలో ఇప్పటికే ఐఏఎస్ అధికారి వినయ్‌చంద్‌ను కార్పొరేషన్ కమిషనర్‌గా నియమించింది. ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేయాలనే ఆలోచనతో ఆర్డీవో కేడర్ లేకుండా ఏకంగా సబ్‌కలెక్టర్‌ను నియమిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. అయితే ఆర్డీవోగా పనిచేస్తున్న వీరబ్రహ్మయ్యను తిరుపతి నుంచి బదిలీ చేస్తున్నట్టు ఇప్పటివరకు ఎలాంటి ఉత్తర్వులు అందలేదు. మదనపల్లెకు క్రిటిక భత్రా మదనపల్లె సబ్ కలెక్టర్ డాక్టర్ ఏ.మల్లికార్జున విజయవాడ సీఆర్డీఏ అడిషనల్ కమిషనర్‌గా బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో మహిళా సబ్‌కలెక్టర్ క్రిటిక భత్రా నియమితులయ్యారు. -
అమ్మ ఒడికి
అక్కున చేర్చుకున్న అమ్మఒడి ఆశ్రమం చేయూతనిచ్చిన సబ్ కలెక్టర్ మదనపల్లెరూరల్ : అమ్మకు ఆపన్నహస్తం అందిం ది. తాము ఆశ్రమం కల్పిస్తామని చిత్తూరుకు చెందిన అమ్మ ఒడి సంస్థ ముందుకొచ్చింది. మదనపల్లె సబ్‌కలెక్టర్ డాక్టర్ ఏ.మల్లికార్జున సహకారం అందించారు. ‘అమ్మ అనాథయ్యింది’అనే శీర్షికన శుక్రవారం ‘సాక్షి’ దినపత్రిలో ప్రచురితమైన సంగతి పాఠకులకు విదితమే. దీనిపై చిత్తూరుకు చెందిన అమ్మ ఒడి సంస్థ నిర్వాహకులు నలగాంపల్లె చెరకూరి పద్మనాభనాయుడు, కార్యదర్శి చంద్రశేఖర్, వార్డెన్లు శ్రీమతి, అముజ, ఉచిత అంబులెన్స్ సేవలందించే డ్రైవర్ రమేష్‌లు మదనపల్లె ప్రభుత్వాస్పత్రి క్రానిక్‌వార్డులో ఉన్న లక్ష్మీదేవమ్మకు వద్దకు చేరుకున్నారు. సబ్‌కలెక్టర్ మల్లికార్జున ,ఆస్పత్రి సూపరింటెండెంట్ ఆంజనేయులు, నర్సింగ్ సిబ్బంది సహకారంతో ఆమెను అంబులెన్స్‌లో అమ్మ ఒడి ఆశ్రమానికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా సబ్‌కలెక్టర్ మాట్లాడుతూ అవసాన దశలో ఉన్న తల్లిదండ్రులను బిడ్డలు వీధులు పాలు చేస్తే క్రిమినల్ కేసులతో పాటు రూ.10వేలు వసూలు చేసి వారి పోషణకు నెలనెలా చెల్లించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. -
సమస్యలు వింటూ.. పరిష్కారం చూపుతూ
ప్రజలతో మమేకం రిపోర్టర్ ఆర్.వీ.కర్ణన్ - సబ్ కలెక్టర్, మదనపల్లె మదనపల్లె డివిజన్ కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్న కుగ్రామం బోడుమల్లదిన్నె. గ్రామంలో సమస్యలు తాండవిస్తున్నాయి. ఇటీవల గ్రామంలో విషజ్వరాలతో నలుగురు మృతి చెందారు. 500 కుటుంబాలకుపైగా ఉన్న గ్రామంలో నాలుగైదు మరుగుదొడ్లు మాత్రమే ఉన్నాయి. మరుగుదొడ్లు లేక మహిళలు అష్టకష్టాలు పడుతున్నారు. పారిశుద్ధ్య లోపం, తాగునీటి సమస్యతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ప్రజల సమస్యలను ఎత్తిచూపాలని ‘సాక్షి’ భావించింది. మదనపల్లె డివిజన్ పరిపాలన అధికారి(సబ్ కలెక్టర్) ఆర్వీ.కర్ణన్‌ను ఆ బాధ్యత స్వీకరించాల్సిందిగా కోరింది. అందుకు అంగీకరించిన ఆయన వీఐపీ రిపోర్టర్‌గా మారారు. మదనపల్లె రూరల్ మండలం కొండామారిపల్లె పంచాయతీ బోడుమల్లదిన్నె గ్రామానికి చేరుకుని ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుంటూ, వాటికి పరిష్కార మార్గాలను చూపారు. ఓ వైపు చిరుజల్లులు కురుస్తున్నా ప్రజల వద్దకే వెళ్లి వారితో మమేకమయ్యారు. ఈ సందర్భంగా ప్రజలతో ఆయన జరిపిన సంభాషణలు, పరిష్కార మార్గాలు మీకోసం.. ప్రెజెంటేషన్: చిట్టెం సుధాకర్, మాడా చంద్రమోహన్ సబ్ కలెక్టర్ హామీలు వందశాతం మరుగుదొడ్లు నిర్మిస్తాం.. బోడుమల్లదిన్నె గ్రామంలో పర్యటించినప్పుడు గ్రామంలోని సమస్యలు తెలుసుకున్నా. వాటిని పరిష్కరించేలా మా అధికారులను ఆదేశిస్తాను. రిపబ్లిక్ డే (జనవరి26) నాటికి వంద శాతం మరుగుదొడ్లు అన్ని ఇళ్లకు చేయిస్తా. కలెక్టర్ సిద్ధార్థజైన్ ఆదేశాల మేరకు గ్రామంలో మరుగుదొడ్ల నిర్మాణానికి ప్రత్యేక చొరవ చూపుతాను. మొదటి దశలోనే లబ్ధిదారులకు సగం డబ్బులు అందజేశాం. మిగిలిన వాటిని కూడా త్వరలో ఇస్తాం. డ్రాప్ అవుట్స్‌ను గుర్తించి పాఠశాలలో చేర్పిస్తా. తాగునీరు, పారిశుద్ధ్య పనులు చేపట్టేలా చర్యలు తీసుకుంటా. బోడుమలదిన్నె గోడు విన్న సబ్ కలెక్టర్ సమస్యలు తెలుసుకుంటూ మార్గాలు చూపారు సబ్ కలెక్టర్: ఏమ్మా? నీ పేరేంటి? మరుగుదొడ్డిని ఎప్పటి నుంచి కట్టుకుంటున్నావు? ఇబ్బందులుంటే మొహమాటం లేకుండా చెప్పండమ్మా! ఇమామ్‌బీ: సారూ.. మూడు రోజుల నుంచి కట్టుకుంటున్నా. మీరిచ్చే డబ్బు సాలలేదు. ఇటుకకు రూ.5 వేలు, ఇసుకకు రూ.2 వేలు,కూలీల ఖర్చులు ఇలా దాదాపు రూ.15 వేలు అయిపోతోంది. సబ్ కలెక్టర్: ప్రభుత్వం ఎంత డబ్బులు ఇస్తుందమ్మా? ఇమామ్‌బీ: రూ.12 వేలు ఇస్తారు సారూ సబ్ కలెక్టర్: ప్రభుత్వం ఇచ్చిన సొమ్ముతో కట్టుకోవాలి. ఇమామ్‌బీ: అలాగే సార్ సబ్ కలెక్టర్: ఎంత మంది పిల్లలమ్మా? ఇమామ్‌బీ: నలుగురు ఆడబిడ్డలు సార్ సబ్ కలెక్టర్: ఆడ బిడ్డలు ఉంటే మరుగుదొడ్డి కట్టుకోవాలని లేదా? ఇమామ్‌బీ: ఉంది, డబ్బు లేక కట్టుకోలేదు. సబ్ కలెక్టర్: ఇప్పుడు డబ్బులు ఇచ్చారు కదా, కట్టుకోండి ఇమామ్‌బీ: తప్పకుండా కట్టుకుంటాం సార్. సబ్ కలెక్టర్: ఏమయ్యా నీ పేరేంటి? గ్రామంలో విషజ్వరాలు అదుపులో ఉన్నాయా? తాగునీటి సమస్య ఎలా ఉంది? రామచంద్ర: జ్వరాలు అదుపులోకి వచ్చాయి. వాంతులు, విరేచనాలు తగ్గుముఖం పట్టాయి. కాచిన నీళ్లు తాగమన్నారు. రెండు రోజుల క్రితం తాగునీటి బోరు వేశారు. నీళ్లు కూడా బాగా వస్తున్నాయి. అంతా కలెక్టర్, మీ దయ సార్. సబ్ కలెక్టర్: బాబు, నీ పేరేంటి? గ్రామంలో సమస్యలు ఏమైనా ఉన్నాయా? ప్రసాద్: సార్ నా పేరు ప్రసాద్. గ్రామంలో పారిశుద్ధ్యం మెరుగుపడింది. గ్రామంలోని కాలువలు, డ్రైనేజీల్లో చెత్తాచెదారం ఎత్తివేశారు. ఇలాగే ఉంటే బాగుంటుంది. సబ్ కలెక్టర్: స్వచ్ఛ భారత్ కార్యక్రమం చేశారా? ప్రసాద్: త్వరలో చేస్తాం సార్, మీరు చెప్పారు కాబట్టి సర్పంచును కలిసి స్వచ్ఛ భారత్ చేస్తాం. సబ్ కలెక్టర్: పెద్దాయనా.. నీకు పెన్షన్ వస్తుందా? ఇమామ్: వస్తుంది సారూ.. సబ్ కలెక్టర్: ఎంత వస్తుంది? ఇమామ్: వెయ్యి రూపాయలు సార్ సబ్ కలెక్టర్: చౌక దుకాణాల్లో బియ్యం ఇస్తున్నారా? ఇమామ్: ఇస్తున్నారు సార్ సబ్ కలెక్టర్: సంక్రాంతి పండుగకు అదనంగా చక్కెర, ఇతర వస్తువులు కూడా ఇస్తారు. ఇమామ్: సంతోషం సార్ సబ్ కలెక్టర్: ఏమయ్యా.. నీకు పెన్షన్ వస్తుందా? షేక్ ఇమామ్ సాహెబ్: రాలేదు సార్ సబ్ కలెక్టర్: అర్హత ఉంటే తప్పకుండా వచ్చే నెల నుంచి వస్తుంది. షేక్ ఇమామ్ సాహెబ్: గతంలో కూడా ఇచ్చారు, వయస్సు కూడా ఉంది వచ్చేలా చూడండి సార్. సబ్ కలెక్టర్: ఏమ్మా నీ పేరేంటి? మరుగుదొడ్డి ఎందుకు కట్టుకోలేదు? మంగమ్మ: స్థలం లేక కట్టుకోలేదు సార్ సబ్ కలెక్టర్: ఇంటిలోని కాంపౌండ్ చూపిస్తూ ఇక్కడ కట్టుకోవచ్చు కదా? ప్రభుత్వం డబ్బులు ఇస్తుంది కదా? మంగమ్మ: తప్పకుండా కట్టుకుంటాం సార్. సబ్ కలెక్టర్: తాగునీరు బాగా వస్తుందా? తట్టి నాగరాజురెడ్డి (సర్పంచు భర్త): రెండు రోజుల క్రితం బోర్ వేశాం సార్, కుళాయిల ద్వారా నీటిని అందజేస్తున్నాం. సబ్ కలెక్టర్: ఓవర్‌హెడ్ ట్యాంకును తరచూ శుభ్రం చేస్తున్నారా? తట్టి నాగరాజురెడ్డి: క్రమం తప్పకుండా చేస్తున్నాం సార్. సబ్ కలెక్టర్: ఏమయ్యా మీ పేర్లు ఏమిటి? మీ సమస్యల గురించి చెప్పండి? వెంకటరమణ, లక్ష్మన్న: సార్ మా పేరు వెంకటరమణ, లక్ష్మన్న సార్. మాకు పెన్షన్ రాలేదు. సబ్ కలెక్టర్: మీ వయస్సు ఎంత? వెంకటరమణ, లక్ష్మన్న: తెలవదు సార్ సబ్ కలెక్టర్: 65 సంవత్సరాలైతే పింఛన్ వస్తుంది. వయస్సు ఉంటే తప్పకుండా వచ్చే నెల నుంచి పింఛన్ వస్తుంది. వెంకటరమణ, లక్ష్మన్న: అలాగే సార్. సబ్ కలెక్టర్: మీ పేరేంటి? మరుగుదొడ్లు ఎలా కట్టుకుంటున్నారు? సయ్యద్ సాహెబ్: నా పేరు సయ్యద్ సాహెబ్ సార్, నిన్నటి నుంచి మరుగుదొడ్లు కట్టుకుంటున్నాం. సబ్ కలెక్టర్: త్వరగా కట్టుకోవాలి. సయ్యద్ సాహెబ్: అలాగే సార్ సబ్ కలెక్టర్: మీకు పిల్లలు ఎంత మంది? సయ్యద్‌సాహెబ్: ఒక కూతురు సార్ అంటూ కూతురు రోష్నిని చూపించారు. సబ్ కలెక్టర్: చదువుకుంటున్నావా అమ్మా? రోష్ని: నిలిపివేశాను. సబ్ కలెక్టర్: ఎంతవరకు చదివావు? రోష్ని: పదో తరగతి నిలిపివేశా. సబ్ కలెక్టర్: ఇంటి దగ్గర ఉండి ఓపెన్ స్కూల్ ద్వారా డిగ్రీ వరకు చదవవచ్చు. సయ్యద్‌సాహెబ్: ఇంటి దగ్గర పనుల కోసం చదువు నిలిపివేశాను. సబ్ కలెక్టర్: ఓపెన్ స్కూల్ ద్వారా చదివించాలి. సయ్యద్‌సాహెబ్: తప్పకుండా సార్ సబ్ కలెక్టర్: మీ పేరేంటమ్మ? మరుగుదొడ్లు కట్టుకుంటున్నారా? గుల్జార్బీ: మూడు రోజుల నుంచి మరుగుదొడ్లు కట్టుకుంటున్నాం. మీరు చెప్పినట్లు త్వరగా కట్టుకుంటాం. సబ్ కలెక్టర్: ఇటుకలు ఎక్కడి నుంచి తెస్తున్నారు? రామయ్య: తట్టివారిపల్లె వద్ద ఇటుకల ఫ్యాక్టరీ సార్ సబ్ కలెక్టర్: ఊరిలో పాఠశాల ఉందా? సీతారాములు: ఉంది సార్, ఊరిలో పిల్లలందరూ పాఠశాలకు పోతున్నారు. సబ్ కలెక్టర్: ఉపాధి పనులు జరుగుతున్నాయా? గోపాలు: జరుగుతున్నాయి సార్ సబ్ కలెక్టర్: వైద్య సిబ్బంది వస్తున్నారా? రంగప్ప: వస్తున్నారు, జ్వరాలకు మందులు కూడా ఇచ్చారు. (అంతలోనే ఎంపీడీవో లక్ష్మిపతి, డీఎల్పీవో జగదీశ్వరమ్మ, ఈవోఆర్డీ గంగయ్య, ఆర్డబ్ల్యూఎస్ డీఈ రఫి, కార్యదర్శి అక్కడికి చేరుకున్నారు) సబ్ కలెక్టర్: గ్రామంలో మరుగుదొడ్ల నిర్మాణాలు జరుగుతున్నాయి. దగ్గరుండి పూర్తి చేయించాలి. తాగునీటి సమస్య లేకుండా చూడాలి. చదువు నిలిపివేసిన వారిని గుర్తించి పాఠశాలకు వెళ్లేలా చూడాలి. అధికారులు: తప్పకుండా చేయిస్తాం సార్. సబ్ కలెక్టర్: గ్రామాల్లో తరచూ తిరుగుతూ సమస్యలు తెలుసుకోవాలి. అధికారులు: మీరు చెప్పినట్లు చేస్తాం సార్. -
ప్రతీ సమస్యపై దృష్టిపెట్టండి
సబ్ కలెక్టర్ ప్రశాంత్ పాటిల్ ఆసిఫాబాద్‌లో అర్జీల స్వీకరణ ప్రజా ఫిర్యాదుల విభాగంలో ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నట్లు సబ్ కలెక్టర్ ప్రశాంత్ పాటిల్ తెలిపారు. సోమవారం కార్యాలయంలో డివిజన్లోని ప్రజల నుంచి సమస్యలపై దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా కెరమెరి మండలం అనార్‌పల్లికి చెందిన రాథోడ్ వెంకట్రావు, కాగజ్‌నగర్ మండలం చింత గూడకు చెందిన జుమ్మిడి పోచయ్య భూమి నష్ట పరిహారం చెల్లించాలని, సిర్పూర్(టి)కి చెందిన ఐనబోయిన లక్ష్మీనారాయణ,మోసంకు చెందిన దిలీప్‌కుమార్ ఆర్వోఆర్ పట్టా పాస్‌బుక్ కోసం, వివిధ సమస్యలపై సబ్ కలెక్టర్‌కు దరఖాస్తు చేసుకున్నారు. డీఏవో సూరిబాబు, అధికారులు పాల్గొన్నారు. ఆదిలాబాద్ అర్బన్ : ప్రజలు వివిధ సమస్యలు పరిష్కరించాలంటూ వ్యయప్రయాసలకోర్చి ఇక్కడికి వచ్చి అర్జీలు అంద జేస్తారని, సంబంధిత అధికారులు వాటిపై ప్రత్యేక దృష్టిపెట్టాలని కలెక్టర్ ఎం.జగన్మోహన్ ఆదేశించారు. ప్రజల సమస్యనూ పరిగణలోకి తీసుకుని పరిష్కారం చూపాల్సిన బాధ్యత అధికారులపై ఉందని స్పష్టం చేశారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన ప్రజా ఫిర్యాదుల విభాగంలో కలెక్టర్ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి సమస్యను పరిశీలించి పరిష్కరించినట్లయితే ఆ సమస్యకు అప్పుడే ముగింపు ఉంటుందని తెలిపారు. చిన్న సమస్యలపైనా అధికారులు దృష్టి సారించకపోవడంతోనే ఒక్కో అర్జీదారు మళ్లీమళ్లీ కార్యాలయాలకు రావాల్సిన పరిస్థితి ఉంటోందని పేర్కొన్నారు. అధికారులు జవాబుదారీతనంతో పని చేయాలని సూచించారు. అనంతరం ఒక్కో అర్జీదారు నుంచి ఫిర్యాదులు స్వీకరించి ఆయా శాఖలకు చెందిన అధికారులకు అందజేశారు. అదనపు జేసీ ఎస్.ఎస్.రాజు, జిల్లా పరిషత్ సీఈవో అనితాగ్రేస్, సీపీవో షేక్మీరా, ఆర్డీవో సుధాకర్‌రెడ్డి, డీఆర్డీఏ పీడీ వెంకటేశ్వర్‌రెడ్డి, డ్వామా పీడీ గణేశ్ జాదవ్, డీఎంహెచ్‌వో రుక్మిణమ్మ, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. అర్జీలు సత్వరమే పరిష్కరించాలి ఉట్నూర్ రూరల్ : గిరిజన దర్బార్‌లో గిరిజనులు అందించే అర్జీలను సత్వరమే పరిష్కరించాలని ఐటీడీఏ ఏవో భీమ్ అ న్నారు. సోమవారం ఐటీడీఏ కార్యాలయంలో నిర్వహించిన గిరిజన దర్బార్‌లో ఆయన జిల్లా నలుమూలల నుంచి వచ్చి న గిరిజనుల నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ గిరిజన ద ర్బార్‌లో కాగజ్‌నగర్ మండల కేంద్రానికి చెందిన కుంర అరుణ్, ఆత్రం కిష్టు తాము సాగు చేస్తున్న భూములకు అటవీ హక్కు పత్రాలు మంజూరు చేయాలని కోరారు. ఇదే మండలానికి చెందిన సూర్పం చందు తాను పేదవాడినని, ఇల్లు కట్టుకునేందుకు ఆర్థిక స్థోమత లేదని, ఐటీడీఏ ద్వారా ఇల్లు మంజూరు చేయాలని అర్జీ పెట్టుకున్నారు. జైనూర్ మండలం పారా గ్రామానికి చెందిన కినాక ఆనంద్‌రావ్ తనకు 4 ఎకరా ల వ్యవసాయ భుమి ఉందని, అరటి తోటను పెంచుకునేం దుకు ఆర్థిక సహాయం చేయాలని దరఖాస్తు అందించాడు. బేల మండలం సోపడ్ గ్రామానికి చెందిన మడావి లక్ష్మి తా ను 40 ఏళ్లుగా సాగు చేస్తున్న భూమి ఇతరులు కబ్జా చేశారని, తన భూమి తనకు ఇప్పించాలని అర్జీ పెట్టుకుంది. నార్నూర్ మండలం గుంజాల గ్రామానికి చెందిన సూర్పం రాజు తన కు 3 ఎకరాల వ్యవసాయ భూమి ఉందని వ్యవసాయం కోసం బోరు మంజూరు చేయాలని వేడుకున్నారు. దండేపల్లి మండలానికి చెందిన నారాయణ తన భూమికి సంబంధించి న కేసు ఐటీడీఏ కార్యాలయంలో పెండింగ్‌లో ఉందని దాన్ని పరిష్కరించాలని అర్జీ పెట్టుకున్నారు. అర్జీలను సంబందిత అధికారులు క్లుప్తంగా పరిశీలించి పరిష్కరించాలని ఏవో ఆదేశించారు. ఐటీడీఏ అధికారులు పాల్గొన్నారు. పీవో, డీడీలను వెంటనే నియమించాలి ఉట్నూర్ రూరల్ : ఐటీడీఏ కార్యాలయంలో రెగ్యులర్ పీవో, డీడీలను వెంటనే నియమించాలని పలువురు ఆదివాసీ సం ఘాల నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం ఐటీడీఏ కా ర్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. నాయకులు మాట్లాడుతూ, ఐటీడీఏలో రెగ్యులర్ పీవో లేకపోవడంతో గిరిజన దర్బార్‌కు సైతం అధికారులు రావడం లేదన్నారు. జిల్లావ్యాప్తంగా సమస్యలు వివరించేందుకు వస్తున్న గిరిజనులు సరైన న్యాయం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివాసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు వెడ్మ బొజ్జు, తుడుందెబ్బ జిల్లా గౌరవ అధ్యక్షుడు ఆత్రం తిరుపతి, తొటి సేవా సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు కుడిమెత తిరుపతి పాల్గొన్నారు. -
మోడల్‌గా తీర్చిదిద్దుతా..
ఆసిఫాబాద్ : వారంతా ఆదిమ గిరిజన విద్యార్థులు. అందరూ గ్రామీణ వాతావరణం నుంచి వచ్చిన వారే. బిడ్డలు దూరంగా ఉన్నా సరే నాణ్యమైన విద్య, పౌష్టికాహారం అందుతుందనే ఉద్దేశంతో తల్లిదండ్రులు గురుకుల పాఠశాలల్లో చేర్పిస్తున్నారు. కొందరు అధికారుల పర్యవేక్షణ లోపం.. సిబ్బంది నిర్లక్ష్యం వెరసి గురుకుల పాఠశాలు, వసతిగృహాల్లో సమస్యలు తిష్టవేస్తున్నాయి. కొన్ని చోట్ల మెనూ కూడా అమలుకు నోచుకోవడం లేదు. విద్యార్థులు చదువులోనూ వెనుకబడుతున్నారు. వీటితోపాటు విద్యార్థుల సమస్యలనూ వెలుగులోకి తెచ్చే ప్రయత్నం చేసింది ‘సాక్షి’. ఐటీడీఏ ఇన్చార్జి పీవో, ఆసిఫాబాద్ సబ్‌కలెక్టర్ ప్రశాంత్‌పాటిల్ ‘వీఐపీ రిపోర్టర్’ గా మారారు. ఆసిఫాబాద్‌లోని పీటీజీ గురుకుల పాఠశాలను సందర్శించారు. ఉపాధ్యాయులు, వార్డెన్ ఉంటే సమస్యలు చెప్పడానికి విద్యార్థులు భయపడుతారనే ఉద్దేశంతో వారిని బయటకు పంపించారు. విద్యార్థులతో మాట్లాడి వారి సాధక, బాధకాలు తెలుసుకున్నారు. సమస్యలపై ఆరా తీశారు. మెనూ అమలు తీరు, విద్యార్థుల బస, సిలబస్, బోధన, ఆరోగ్యం, క్రీడలు ఇలా అన్నింటినీ తెలుసుకున్నారు. విద్యార్థులతో కలెక్టర్ సంభాషణ ఇలా సాగింది.. సబ్ కలెక్టర్‌ను గమనించిన విద్యార్థులు : నమస్కారం సార్.. సబ్ కలెక్టర్ : నమస్కారం... అక్కడున్న ఓ విద్యార్థితో ఏ వూరు బాబు విద్యార్థి పాండు : శాకన్గోంది సబ్‌కలెక్టర్ ప్రశాంత్ పాటిల్ : ఏ క్లాస్ విద్యార్థి పాండు : టెన్త్ సబ్‌కలెక్టర్ : చదువు ఎలా ఉంది, భోజనం సరిపోతుందా..? విద్యార్థి పాండు : బావుంది. సరిపోతుంది సబ్‌కలెక్టర్ : సాయంత్రం స్నాక్స్ ఏమి ఇస్తుండ్రు విద్యార్థి పాండు : పల్లిపట్టి సబ్ కలెక్టర్ : అందరికీ ఇస్తుండ్రా విద్యార్థి : ఇస్తుండ్రు సబ్ కలెక్టర్ : గుడ్లు ఎప్పుడు ఇస్తుండ్రు విద్యార్థి : ప్రతి రోజు సబ్ కలెక్టర్ : ఈ రోజు మెనూ ఏమి ఇచ్చిండ్రు, రాత్రి ఏమి ఇస్తుండ్రు విద్యార్థులు : బాగా తినాలి సబ్ కలెక్టర్ : ఇక్కడ ఏమైనా ఇబ్బంది ఉందా, టీచింగ్ ప్రాబ్లం ఉందా, టీచర్లు సరైన సమయానికి వస్తుండ్రా విద్యార్థి : సరైన సమాధానం చెప్పలేదు అక్కడే ఉన్న ఉపాధ్యాయులందరినీ, వార్డన్‌ను బయటకు వెళ్లాలని, ప్రిన్సిపాల్‌ను పిలవాలని సబ్ కలెక్టర్ ఆదేశించారు. సబ్ కలెక్టర్ : ఇప్పుడు చెప్పండి, మీకు భయం లేదు. రెగ్యులర్‌గా క్లాసెస్ జరుగుతున్నాయా. విద్యార్థులు : జరుగుతున్నాయి. సబ్ కలెక్టర్ : ఉదయం ఎప్పుడు నిద్ర లేస్తున్నారు విద్యార్థులు : 5 గంటలకు.. సబ్ కలెక్టర్ : బ్రేక్‌ఫాస్ట్ ఏమి ఇస్తున్నారు. ఎప్పుడు ఇస్తారు.. విద్యార్థులు : కిచిడి, ఆలు ఉదయం 7.15 గంటలకు ఇస్తారు సబ్ కలెక్టర్ : ఉపాధ్యాయులు రైట్ టైమ్‌కు వస్తారా, అందరూ వస్తారా విద్యార్థులు : వస్తారు సబ్ కలెక్టర్ : స్కూల్‌కు ఎప్పుడు వెళ్తారు విద్యార్థులు : 9 గంటలకు వెళ్తాం సబ్ కలెక్టర్ : రాత్రి పడుకునేటప్పుడు చెద్దర్లు ఉన్నయా.. విద్యార్థి ఎం.మారుతి : ఉన్నాయి కానీ కరెంటు పోతే ఇబ్బందవుతుంది.. సబ్ కలెక్టర్ : నైట్ స్పెషల్ క్లాసులు ఎప్పుడు స్టార్ట్ అవుతయి విద్యార్థి ఎం.మారుతి : రాత్రి 7 గంటలకు సబ్ కలెక్టర్ : టీచర్లు, ప్రిన్సిపాల్ అందరు వస్తరా విద్యార్థి ఎం.మారుతి : వస్తరు సార్ - అదే సమయంలో ప్రిన్సిపాల్ రాజేశ్వరశర్మ వచ్చారు.. సబ్ కలెక్టర్ : ఉదయం విద్యార్థులకు పాలు ఇస్తుండ్రా ప్రిన్సిపాల్ : పాలు, టీ ఇస్తున్నాం సబ్ కలెక్టర్ : విద్యార్థులకు టీ బంద్ చేయాలి. పాలు ఇస్తేనే వారి హెల్త్ బాగుంటుంది. సబ్ కలెక్టర్ : ఉదయం ఏం టిఫిన్ ఇస్తరు విద్యార్థి ఎం.మారుతి : ఇడ్లి, పూరి సబ్ కలెక్టర్ : మధ్యాహ్నం ఎగ్స్ ఇస్తుండ్రా విద్యార్థి : ఇస్తుండ్రు సబ్ కలెక్టర్ : ఎంతమంది విద్యార్థులున్నారు.. ప్రిన్సిపాల్ : 500 మందికి ఈ రోజు 471 మంది ఉన్నారు. మరో విద్యార్థితో.. సబ్ కలెక్టర్ : టెన్త్‌లో పాసైతమని భరోసా ఉందా, మ్యాథ్స్ ఎవరు చెప్తారు.. విద్యార్థి ఉపేందర్ : ఉంది. మ్యాథ్స్ శ్యాంసార్ చెప్తారు. సబ్ కలెక్టర్ : ఎలా చెప్తాడు విద్యార్థులు : బాగా చెప్తాడు సబ్ కలెక్టర్ : మీరు ఏ సబ్జెక్ట్‌లో వీక్ విద్యార్థులు : ఇంగ్లిష్ సబ్ కలెక్టర్ : వాట్ ఈజ్ యువర్ నేమ్ విద్యార్థి : నరేశ్ సబ్ కలెక్టర్ : వాట్ ఈజ్ యువర్ హాబీ విద్యార్థి నరేశ్ : : రైటింగ్ సబ్ కలెక్టర్ : హాబీ అంటే ఖాళీ సమయంలో చేసే పని. ఆటలు ఆడటం, పుస్తకాలు చదవడం, సినిమా చూడడం కూడా హాబీయే. సబ్ కలెక్టర్ : హాస్టల్లో మీరు సంతోషంగా ఉన్నారా. కప్పుకునేందుకు రగ్గులున్నాయా, మీకు ఇంకా ఏం కావాలి విద్యార్థి మారుతి : రగ్గులున్నాయి సబ్ కలెక్టర్ : టాయిలెట్లు ఉన్నయా విద్యార్థి మారుతి : ఉన్నయి కానీ సరిపోతలేవు, వాటర్ప్రాబ్లం ఉంది. సబ్ కలెక్టర్ : ఈ విషయం మీ ప్రిన్సిపాల్‌కు చెప్పారా విద్యార్థి మారుతి : చెప్పాం. ప్రిన్సిపాల్ : టాయిలెట్లు మరమ్మతుకు డబ్బులు లేవు. స్కూల్ నుంచి వచ్చే ఫండ్స్ సరిపోవడం లేదు. సబ్ కలెక్టర్ : ఐటీడీఏ నుండి టాయిలెట్లు మరమ్మతు చేయిస్తా. సబ్ కలెక్టర్ : స్పెషల్ క్లాసెస్ తీసుకోవాలి. బాగా ప్రాక్టీస్ చేయాలి విద్యార్థులు : చేస్తం సార్ సబ్ కలెక్టర్ : స్పెషల్ క్లాస్ ఎప్పుడు తీసుకుంటారు విద్యార్థులు : రాత్రి 7 నుండి 8 గంటల వరకు సబ్ కలెక్టర్ : నిన్న ఏమి ఇచ్చారు, హోంవర్క్ చేస్తున్నారా విద్యార్థులు : చేస్తున్నం సార్ సబ్ కలెక్టర్ : పరీక్షలు వస్తున్నయి కాబట్టి టైంటేబుల్ తయారు చేసుకోవాలి. ఈ యేడాది ఎస్ఎస్సీ పరీక్షల విధానం మారింది. చూచి రాసే అవకాశం లేదు. గదుల్లో సీసీ కెమెరాలు పెడ్తరు కాబట్టి కాపీ కొట్టే అవకాశం లేదు. మంచిగా చదవాలి విద్యార్థులు : సరే సార్ సబ్ కలెక్టర్ : మీకు తెలుసా నేను సబ్ కలెక్టరని విద్యార్థులు : తెలుసు సార్ పార్ట్ టైం ఉపాధ్యాయుల సమస్యలు అక్కడే ఉన్న పార్ట్ టైం ఉపాధ్యాయులు తమ గోడు సబ్ కలెక్టర్‌కు మొరపెట్టుకున్నారు. పార్ట్ టైం ఉపాధ్యాయులు : సార్ మాకు ఉద్యోగ భద్రత కల్పించాలి. రెగ్యులర్ ఉపాధ్యాయులతో సమానంగా పని చేస్తున్నం. గతేడాది నెలకు రూ.ఏడున్నర వేలు ఇవ్వగా, ఈ యేడాది రూ.ఐదు వేలకు తగ్గించారు. విద్యార్థులు అనారోగ్యానికి గురైతే మేమే హైదరాబాద్, కరీంనగర్ ఆస్పత్రులకు తీసుకెళ్తున్నం. సబ్ కలెక్టర్ : ఇది నా చేతుల్లో లేదు. పాలసీ మ్యాటర్. జిల్లా కలెక్టర్ దృష్టికి సమస్యను తీసుకెళ్తా. ఈ సమస్య రాష్ట్ర వ్యాప్తంగా ఉంది కదా.. మళ్లీ విద్యార్థులతో మాట్లాడుతూ.. సబ్ కలెక్టర్ : డాక్టర్లు వస్తున్నారా విద్యార్థులు : వస్తున్నారు. సబ్ కలెక్టర్ : మందులు ఏమి ఇస్తున్నరు వద్యార్థులు : జ్వరం ఉన్నవాళ్లకు టాబ్లెట్స్ ఇస్తుండ్రు. సబ్ కలెక్టర్ : మీ ఫ్రెండ్స్‌కు జ్వరం వస్తే వెంటనే ప్రిన్సిపాల్‌కు చెప్పాలి విద్యార్థులు : చెప్తం సార్ సబ్ కలెక్టర్ : స్కూల్లో గేమ్స్ ఆడిస్తరా, విద్యార్థులు : ఆడిస్తరు. సబ్ కలెక్టర్ : స్పోర్ట్స్ మెటీరియల్ ఉందా విద్యార్థులు : లేదు సబ్ కలెక్టర్ : నేను ప్రొవైడ్ చేస్తా అక్కడి నుండి కిచెన్‌కు వెళ్లి పరిశీలించారు. సబ్ కలెక్టర్ : కిచెన్ ఫ్లోరింగ్ సరిగా లేదు. ఏం ప్రాబ్లమ్ ప్రిన్సిపాల్ : ఫండ్స్ లేవు. సంవత్సరానికి రూ.4 వేలు వస్తయి. ఈయేడాది రాకపోతే నేనే రూ.10 వేలతో మరమ్మతులు చేయించా సబ్ కలెక్టర్ : ఏం పరవాలేదు. రెండు మూడు నెలల్లో మోడల్ పాఠశాలగా అభివృద్ధి చేస్తా. సబ్ కలెక్టర్ : మోటార్ నడుస్తుందా ప్రిన్సిపాల్ : నడుస్తుంది సబ్ కలెక్టర్ : తాగడానికి ఏ నీరు వాడుతున్నారు విద్యార్థులు : ఆర్వో ప్లాంట్ ఉంది సార్ సబ్ కలెక్టర్ : సరిగా పని చేస్తుందా విద్యార్థులు : కొన్ని రోజులు పని చేయలేదు. ఇప్పుడు పని చేస్తుంది. ప్రిన్సిపాల్ : సార్ స్టాఫ్ క్వార్టర్స్ కూలిపోతున్నాయి. సబ్ కలెక్టర్ : ఎన్ని క్వార్టర్స్ ఉన్నయి ప్రిన్సిపాల్ : 16 క్వార్టర్లకు రెండు మాత్రమే బాగున్నయి. సబ్ కలెక్టర్ : ఉపాధ్యాయులు క్యాంపస్‌లోనే ఉంటే విద్యార్థులు బాగు పడతారు. ఉపాధ్యాయులు : విద్యార్థులకు షూస్ రాలేదు. సబ్ కలెక్టర్ : షూ కోసం ప్రాబ్లం లేదు. నేను ఇప్పిస్తా. -
ఇదా చదువు చెప్పే తీరు?
గురువులకు సబ్ కలెక్టర్ క్లాసు మలకపొలం ఆశ్రమ పాఠశాలలో ఆకస్మిక తనిఖీలు ఆదివారం.. సమయం మధ్యాహ్నం 12 గంటలు.. ఏడో తరగతి గదిలోకి యువ ఐఏఎస్ అధికారి ఒకరు ఆకస్మికంగా ప్రవేశించారు. ఓ విద్యార్థిని లేపి.. ఇంగ్లిష్ పుస్తకంలోని ఓ పద్యం చదవమని కోరారు.. పుస్తకంవైపు బిక్కమొహం వేసిన విద్యార్థిని చూసి ఆ అధికారి విస్తుపోయారు. రెండుమూడు సార్లు.. ‘చవువమ్మా.. భయంలేదు’.. అంటూ సముదాయించినా ఒక అక్షరం కూడా నోటి నుంచి పెగల్లేదు. మరో ఇద్దరు విద్యార్థులు కూడా ఇలానే బిత్తరచూపులు చూశారు. తొమ్మిదో తరగతి గదిలోకి ప్రవేశించి.. 9/4= రాస్తే.. 37 అని, 9/5=46 అని రాయడంతో ఈ సారి బిత్తరపోవడం ఆ అధికారి వంతు అయింది. మరో విద్యార్థి 100ను 5తో భాగించాలన్నా నేలచూపులు చూశాడు. అంతే.. ఆ అధికారి, ఆ విద్యార్థులకు పాఠాలు చెప్పే గురువులకు క్లాసు తీసుకున్నారు. ఇదీ.. పాడేరు మండలం మలకపొలం గిరిజన సంక్షేమ ఆశ్రమపాఠశాలలో జరిగిన సన్నివేశం. ఆ అధికారి.. కొత్తగా వచ్చిన సబ్ కలెక్టర్ ప్రసన్న వెంకటేష్. పాడేరు : గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులు ప్రాథమిక స్థాయిలోనే చదువులో వెనుకబడి ఉండటంపై పాడేరు సబ్‌కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ విస్మయం వ్యక్తం చేశారు. మండలంలోని మారుమూల మలకపొలం ఆశ్రమ పాఠశాలను ఆదివారం మధ్యాహ్నం ఆకస్మికంగా తనిఖీ చేశారు. 7 9 తరగతుల విద్యార్థులకు గణితం, ఇంగ్లిష్‌లో సబ్‌కలెక్టర్ పలు ప్రశ్నలు వేశారు. బోర్డుపై చిన్నపాటి అంకెలను వేసి గుణింతాలు, భాగాహారాలు చేయమని పలువురు విద్యార్థులను సబ్‌కలెక్టర్ కోరినా వారు కనీస పరిజ్ఞానం లేకుండా తెల్లముఖాలు వేయడంపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పక్కనే ఉన్న గణిత ఉపాధ్యాయుడిని చూస్తూ.. ఇక్కడి విద్యార్థులు చిన్నపాటి లెక్కల్లో కూడా పరిజ్ఞానం లేకపోవ డం దారుణమంటూ తప్పు పట్టారు. 9వ తరగతి విద్యార్థులు ఎక్కాలు కూడా చెప్పలేకపోవడం సబ్‌కలెక్టర్‌ను మరింత బాధించింది. ఓ విద్యార్థిని సబ్‌కలెక్టర్ లేపి ఇంగ్లిష్‌లో తల్లితండ్రుల పేర్లు రాయమన్నా తెలియదని సమాధానం ఇవ్వడంతో ఇక్కడ విద్యార్థులకు విషయ పరిజ్ఞానం లోపించిందని సబ్‌కలెక్టర్ బేరీజు వేశారు. ఉపాధ్యాయులకు క్లాసు... గ్రామాల్లో చదువుకున్న సమయంలోనే విద్యార్థులకు సరైన ప్రాథమిక విద్య అబ్బలేదని, నేరుగా ఆశ్రమ పాఠశాలలో చేరుతుండటంతో మళ్లీ బోధించాల్సి వస్తోందని గణిత ఉపాధ్యాయుడు సబ్ కలెక్టర్‌కు వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. అంతే వెంటనే సబ్ కలెక్టర్ వెంకటేష్ ప్రసన్న మాట్లాడుతూ పాఠశాల స్థాయిలో విద్యాబోధన సక్రమంగా లేదని హైస్కూల్ స్థాయిలో కూడా బోధన కార్యక్రమాలను నిర్లక్ష్యం చేస్తారా అంటూ ఉపాధ్యాయులను నిలదీశారు. చదువులో గిరిజన విద్యార్థులు ఇంత వెనుకబడితే ఫలితాలు ఎలా వస్తాయని ప్రశ్నించారు. ఒక దశలో వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోసారి ఈ పాఠశాలకు తనిఖీకి వస్తానని అప్పటికైనా విద్యార్థులు అన్ని సబ్జెక్టుల్లోనూ పరిణతి చెందేలా శ్రద్ధ వహించాలని ఆయన సూచించారు. ఉపాధ్యాయుల గైర్హాజరుపై ఆరా అనంతరం పాఠశాల మూవ్మెంట్ రిజిస్టర్‌ను తనిఖీ చేశారు. హెచ్ఎం సెలవు చీటి ఈ రిజిస్టర్లో ఉండటాన్ని సబ్‌కలెక్టర్ తప్పు పట్టారు. హెచ్ఎం సెలవు చీటిని గిరిజన సంక్షేమ కార్యాలయానికి అందజేసి అధికారుల అనుమతి తరువాతే సెలవు తీసుకోవాలనిసూచించారు. డిప్యుటీ వార్డెన్, పీఈటీలు కూడా పాఠశాలలో లేకపోవడంపై సబ్‌కలెక్టర్ విచారణ జరిపారు. విద్యార్థులకు మెనూ, తాగునీటి సదుపాయంపై సమీక్షించారు. తహశీల్దార్ రాజకుమారి, డీటీ వంజంగి త్రినాథనాయుడు, వీఆర్వో పద్మ ఆయన వెంట ఉన్నారు. -
అందుబాటులో ఉంటా
సబ్-కలెక్టర్ నాగలక్ష్మి బాధ్యతల స్వీకరణ విజయవాడ : ప్రజలందరికీ అందుబాటులో ఉంటూ సేవలందిస్తానని విజయవాడ సబ్-కలెక్టర్ షణ్ముగం నాగలక్ష్మి అన్నారు. గురువారం ఆమె బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ పనిచేసి బదిలీ అయిన డి.హరిచందన నుంచి నాగలక్ష్మి బాధ్యతలు స్వీకరించారు. అనంతరం సబ్-కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ తనను ఎవరైనా ఎప్పుడైనా కలవ వచ్చన్నారు. ప్రజల సమస్యలు సత్వర పరిష్కారానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తాన ని చెప్పారు. విజయవాడ రెవెన్యూ డివిజన్ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. చట్టప్రకారం భూసేకరణ నిర్వహిస్తామన్నారు. ప్రభుత్వం రూపొం దించిన పలు అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు అందించడానికి ప్రయత్ని స్తామన్నారు. పేదల సంక్షే మానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని తెలిపారు. అధికారులు, సిబ్బంది సహకారంతో డివిజన్లో పలు కార్యక్రమాలను నిర్వహిస్తామని ఆమె చెప్పారు. విజయవాడ సబ్-కలెక్టర్‌గా తొలి బాధ్యతలు స్వీకరించడం తనకెంతో ఆనందంగా ఉందని అన్నారు. అనంతరం కార్యాలయ అధికారులు,సిబ్బందిని, కార్యాలయ పరిపాలనా అధికారి జయశ్రీ సబ్-కలెక్టర్‌కు పరిచయం చేశారు. ప్రొఫైల్ ఎస్.నాగలక్ష్మి, 2012 బ్యాచ్ ఐఏఎస్, విద్యార్హతలు : బిఇ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, బిట్స్బిలానీ. స్వస్థలం : కోయంబత్తూర్ తమిళనాడు. శిక్షణ : అనంతపురం జిల్లా -
పాడేరు సబ్ కలెక్టర్‌గా ప్రసన్న వెంకటేష్
పాడేరురూరల్: పాడేరు సబ్ కలెక్టర్‌గా ఐఏఎస్ అధికారి వి. ప్రసన్న వెంకటేష్‌ను నియమి స్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. పాడేరు ఆర్డీఓగా పనిచేస్తున్న జి.రాజకుమారికి బదిలీ అయ్యింది. రాజకుమారి పాడేరు ఆర్డీఓగా 2014, ఫిబ్రవరి 14న విధులలో చేరారు. పాడేరు సబ్ కలెక్టర్‌గా తొలి పోస్టింగ్‌పై వస్తున్న తమిళనాడు కేడర్‌కు చెందిన ప్రసన్న వెంకటేష్ కడపలో ట్రైనింగ్ పూర్తి చేసుకున్నారు. రెండేళ్ల క్రితం ఐఏఎస్ అధికారి కార్తికేయ మిశ్రా సబ్ కలెక్టర్‌గా పనిచేశారు. ఆయన అయిదు నెలల్లోనే బదిలీ అయ్యారు. తరువాత గణపతిరావు ఏడాదిపా టు పాడేరు ఆర్డీఓగా సేవలందించారు. గణపతిరావు బదిలీ అయిన తరువాత జి.రాజకుమారి ఆర్డీఓగా బాధ్యతలు చేపట్టారు. రెండేళ్ల తరువాత పాడేరు సబ్ కలెక్టర్‌గా ఐఏఎస్ స్థాయి అధికారిని ప్రభుత్వం నియమించింది. రాజమండ్రి సబ్ కలెక్టర్‌గా విజయరామరాజు రాజమండ్రి : రాజమండ్రి డివిజన్ సబ్ కలెక్టర్‌గా ఐఏఎస్ అధికారి వి.విజయరామరాజును నియమిస్తూ ప్రభుత్వం బుధవారం ఆదేశాలు జారీ చేసింది. ఈయనది విశాఖపట్నంలోని సీతమ్మధార. -
సబ్‌కలెక్టర్ మెడకు కుల ధ్రువీకరణ వివాదం ?
సాక్షి ప్రతినిధి, విజయనగరం : కుల ధ్రువీకరణ అంశం ఐఏఎస్ అధికారిణిని ఇబ్బందుల్లోకి నెట్టనుందా? సాలూరు నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన ఆర్పీ భంజ్‌దేవ్ గిరిజన కులస్తుడేనంటూ జారీ చేసిన ధ్రువీకరణ పత్రంతో పార్వతీపురం సబ్ కలెక్టర్ చిక్కుల్లో పడ్డారా? భంజ్‌దేవ్ కొండదొర అంటూ ఆగమేఘాలపై ధ్రువీకరించి వివాదంలో ఇరుక్కున్నారా? అంటే అవుననే వినిపిస్తోంది. గవర్నర్ హౌస్ నుంచి వచ్చిన విచారణ ఆదేశాలు అందుకు ఊతమిస్తున్నాయి. సాలూరు మాజీ ఎమ్మెల్యే ఆర్పి భంజ్‌దేవ్ గిరిజనుడు కాదని 2006 మార్చి 10న హైకోర్టు తీర్పునిచ్చింది. ఈ తీర్పుపై భంజ్‌దేవ్ స్టే కోరినా కోర్టు తిరస్కరించింది. దీంతో భజంద్దేవ్కు మంజూరు చేసిన ఎస్టీ సర్టిఫికెట్‌ను రద్దుచేయాలని ఏపీ గిరిజన ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు ఆంజనేయులు, సాలూరు ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర, న్యాయవాది రేగు మహేశ్వరరావు.. కలెక్టర్, సబ్కలెక్టర్లకు వినతిపత్రాలు సమర్పించారు. అయితే ప్రభుత్వ మెమో ద్వారా సాలూరు తహశీల్దారుతో దర్యాప్తు చేయాలని న్యాయస్థానం ఆదేశించింది. భంజ్‌దేవ్, అతని కుటుంబంపై విచారణ చేసి ఇతను గిరిజన కులానికి చెందని వారని సాలూరు తహశీల్దారు నిర్ధారించి, డాక్యుమెంట్లతో సహా సబ్‌కలెక్టర్‌కు నివేదిక ఇచ్చారు. దీన్ని ఆధారంగా చేసుకుని ఆప్పటి ఆర్డీఓ స్వయంగా విచారణ చేసి భంజ్‌దేవ్ క్షత్రియుడని నిర్ధారించినట్టు తెలిసింది. అయితే పెండింగ్‌లో ఉన్న భంజ్‌దేవ్ కుల వివాదం ఇటీవల ఎన్నికల ముందు మళ్లీ తెరపైకొచ్చింది. ఈ ఏడాది మార్చి 29న ఆర్పీ భంజ్ దేవ్ గిరిజనుడేనంటూ పార్వతీపురం సబ్ కలెక్టర్ శ్వేతామహంతి తనంతట తానుగా ఆదేశాలు జారీ చేయడంతో ఇబ్బందికర పరిస్థితులు తలెత్తాయి. ఇదే వివాదంపై మళ్లీ రేగు మహేశ్వరరావు గవర్నర్, రాష్ట్రపతిని కలసి కుల వివాదాన్ని వివరించారు. ఇప్పుడు దానిని గవర్నర్ పరిశీలించి విచారణకు ఆదేశించడం చర్చనీయాంశమైంది. ఆరోపణలు నిజమైతే బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. లోతుగా విచారణ జరిపి వాస్తవాలు బయటకు లాగితే, పిటీషనర్ల ఆరోపణలు నిజమైతే సబ్ కలెక్టర్ ఇబ్బందుల్లో పడతారన్న వాదన విన్పిస్తోంది. -
కొండలెక్కిన సబ్‌కలెక్టర్
= కాలినడకన 2 గంటల ప్రయాణం =చలిసింగం చిన్నారుల మృతిపై విచారణ చలిసింగం(రావికమతం), న్యూస్‌లైన్ : మండలంలోని చలిసింగంలో ఇద్దరు పసికందుల మృతిపై విచారణకు నర్సీపట్నం సబ్‌కలెక్టర్ శ్వేత తెవతియ గురువారం ఉదయమే కొత్తకోట వచ్చారు. అక్కడి నుంచి కాలినడకన రాళ్లు, రప్పలను దాటుకుంటూ, కొండలెక్కి దిగుతూ చలిసింగం వెళ్లారు. కొద్ది దూరం బైక్‌పై, ఆపై మూడు కొండలు కాలినడకనే వెళ్లారు. ఆ గ్రామం వెళ్లిన మొదటి ఐఏఎస్ అధికారి కావడంతో అక్కడి గిరిజనులు ఆమెకు హారతి పట్టారు. పాటలు పాడుతూ స్వాగతించారు. ఆపై బాధితులు గంగరాజు, గంగా భవానీలను ఆమె విచారించారు. తమ బిడ్డలకు ఆరోగ్యం బాగానే ఉండేదని, బంగారుతల్లి పథకం, ఇతర పనులపై బిడ్డలతో పలుమార్లు కొండదిగి వెళ్లామని, దీంతో వారి ఆరోగ్యం క్షీణించి వైద్యం అందించినా మృతి చెందారని చెప్పారు. తమ బిడ్డలకు ఆర్ఎంపీ వైద్యుని వద్ద చికిత్స చేయించామని చెప్పడంతో ఇకపై ప్రభుత్వాస్పత్రిలో చేయించాలని సూచించారు. కొత్తకోట పీహెచ్సీలో డాక్టరు సక్రమంగా ఉండ క ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. ప్రత్యేక సెల్‌కు ప్రతిపాదన నర్సీపట్నం ఏరియా ఆస్పత్రిలో గిరిజనుల సేవల కోసం ప్రత్యేక సెల్ ఏర్పాటుకు కలెక్టర్‌కు ప్రతిపాదిస్తామని సబ్ కలెక్టర్ వారికి చెప్పారు. గర్భిణులు, బాలింత లకు చికిత్సలందించాలని ఆమె ఆదేశించారు. విచారణ అనంతరం సబ్‌కలెక్టర్ అక్కడి పాఠశాలను సందర్శించి పిల్లలను పలు ప్రశ్నలడిగి సమాధానాలు రాబట్టారు. తాను రోజూ కొండెక్కలేక ఆ గ్రామంలోనే ఉంటున్నట్టు ఉపాధ్యాయిని జ్యోతి తెలపడంతో సబ్‌కలెక్టర్ ఆమెను అభినందించారు. అంగన్వాడీ కేంద్రం రికార్డులు నిర్వహించక పోవడంతో మందలించారు. అంగన్వాడీ కేంద్రానికి, పాఠశాలకు మధ్యాహ్న బోజన పథకం బియ్యం, సరుకులు, గుడ్లు ఆ గ్రామానికి గుర్రాలపై తరలించాల్సి వస్తోందని, నిర్వహణ కష్టంగా ఉందని నిర్వహకులు ఆమె దృష్టికి తెచ్చారు. ‘మార్పు’తో అవగాహన ‘మార్పు’ కార్యక్రమాన్ని చలిసింగంలో అమలు చేస్తామని సబ్‌కలెక్టర్ ఆదేశాల మేరకు ఎస్పీహెచ్ఓ సుజాత తెలిపారు. గర్భిణులు ప్రసవానికి ముందు, తర్వాత మూడు రోజుల పాటు ఆస్పత్రిలో ఉండవచ్చని చెప్పారు. వారికి ఉచిత సేవలతో పాటు భోజనం అందిస్తారని వివరించారు. సబ్‌కలెక్టర్ వెంట కొత్తకోట పీహెచ్సీ వైద్యాధికారి నరేంద్రకుమార్, ఆర్ఐ గంగరాజు, వీఆర్వో, కార్యదర్శి ఉన్నారు. -
భద్రాద్రిలో నిమజ్జనోత్సవ సందడి
భద్రాచలం ,న్యూస్‌లైన్ : భద్రాచలం గోదావరి తీరం బుధవారం భక్తుల కోలాహలంతో సందడిగా మారింది. తొమ్మిది రోజుల పాటు భక్తి శ్రద్ధలతో పూజలు చేసిన గణనాధుల విగ్రహాలను పవిత్ర గోదావరి నదిలో నిమజ్జనం చేశారు. జై బోలో గణేష్ మహరాజ్‌కీ జై...అనే నినాదాలతో గోదావరి తీరం మార్మోగింది. బై..బై.. గణేశా అంటూ భక్తులు కేరింతలు కొడుతూ గణనాధునికి వీడ్కోలు పలికారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచే కాకుండా తెలంగాణ జిల్లాలతో పాటు హైదరాబాద్ నుంచి విగ్రహాలను భద్రాచలం వద్ద గోదావరి నదిలో నిమజ్జనం చేసేందుకు తీసుకొచ్చారు. ప్రత్యేకంగా అలకంరించిన వాహనాలపై ఆశీనులైన గణనాధులను ఊరేగింపుగా తీసుకురాగా, నిర్వాహకులు, భక్తులు భక్తి భావంతో నృత్యాలు చేశారు. బుధవారం ఉదయం నుంచే భద్రాచలానికి విగ్రహాల రాక మొదలైంది. అయితే చాలా మంది బుధవారం సాయంత్రం విగ్రహాలను ఊరేగింపు చేయటంతో గురువారం అధిక సంఖ్యలో విగ్ర హాలు వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. సుమారు వేయికి పైగా విగ్రహాలు నిమజ్జనం జరిగినట్లుగా అధికారులు చెబుతున్నారు. గురువారం రాత్రి వరకూ సుమారు మూడు వేలకు పైగా విగ్రహాలు వచ్చే అవకాశం ఉందని భావిస్తున్న అధికారులు ఇందుకనుగుణంగా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని, నిమజ్జనోత్సవ సమస్యలపై దృష్టి సారించిన సబ్ కలెక్టర్ నారాయణ భరత్ గుప్తా ఈ సారి ప్రత్యేక ఏర్పాట్లు చేయించారు. గతంలో వాహనాలపై వచ్చే విగ్రహాలను కరకట్టపై నుంచి కల్యాణ కట్ట సమీపంలో క్రేన్ ద్వారా దించి నిమజ్జనానికి తరలించేవారు. అయితే ఈ సారి కరకట్ట నుంచి గోదావరి మెట్ల వరకూ వాహనాలు వెళ్లేలా ప్రత్యేక రహదారిని ఏర్పాటు చేశారు. దీంతో త్వరగా విగ్రహాల నిమజ్జనం జరుగుతోంది. ఉత్సవ కమిటీలు సహకరించాలి : సబ్ కలెక్టర్ గుప్తా నిమజ్జనోత్సవం సజావుగా ప్రశాంత వాతావారణంలో జరిగేందుకు ఉత్సవ కమిటీల వారు అధికారులతో సహకరించాలని భద్రాచలం సబ్ కలెక్టర్ నారాయణ భరత్ గుప్తా సూచించారు. బుధవారం నిమజ్జనోత్సవాన్ని ఆయన స్థానిక అధికారులతో కలసి పరిశీలించారు. ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా ప్రత్యేక దృష్టి సారించాలని పోలీస్ శాఖ అధికారులను ఆదేశించారు.