= కాలినడకన 2 గంటల ప్రయాణం
=చలిసింగం చిన్నారుల మృతిపై విచారణ
చలిసింగం(రావికమతం), న్యూస్‌లైన్ : మండలంలోని చలిసింగంలో ఇద్దరు పసికందుల మృతిపై విచారణకు నర్సీపట్నం సబ్‌కలెక్టర్ శ్వేత తెవతియ గురువారం ఉదయమే కొత్తకోట వచ్చారు. అక్కడి నుంచి కాలినడకన రాళ్లు, రప్పలను దాటుకుంటూ, కొండలెక్కి దిగుతూ చలిసింగం వెళ్లారు. కొద్ది దూరం బైక్‌పై, ఆపై మూడు కొండలు కాలినడకనే వెళ్లారు. ఆ గ్రామం వెళ్లిన మొదటి ఐఏఎస్ అధికారి కావడంతో అక్కడి గిరిజనులు ఆమెకు హారతి పట్టారు. పాటలు పాడుతూ స్వాగతించారు.
ఆపై బాధితులు గంగరాజు, గంగా భవానీలను ఆమె విచారించారు. తమ బిడ్డలకు ఆరోగ్యం బాగానే ఉండేదని, బంగారుతల్లి పథకం, ఇతర పనులపై బిడ్డలతో పలుమార్లు కొండదిగి వెళ్లామని, దీంతో వారి ఆరోగ్యం క్షీణించి వైద్యం అందించినా మృతి చెందారని చెప్పారు. తమ బిడ్డలకు ఆర్‌ఎంపీ వైద్యుని వద్ద చికిత్స చేయించామని చెప్పడంతో ఇకపై ప్రభుత్వాస్పత్రిలో చేయించాలని సూచించారు. కొత్తకోట పీహెచ్‌సీలో డాక్టరు సక్రమంగా ఉండ క ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు.
ప్రత్యేక సెల్‌కు ప్రతిపాదన
నర్సీపట్నం ఏరియా ఆస్పత్రిలో గిరిజనుల సేవల కోసం ప్రత్యేక సెల్ ఏర్పాటుకు కలెక్టర్‌కు ప్రతిపాదిస్తామని సబ్ కలెక్టర్ వారికి చెప్పారు. గర్భిణులు, బాలింత లకు చికిత్సలందించాలని ఆమె ఆదేశించారు. విచారణ అనంతరం సబ్‌కలెక్టర్ అక్కడి పాఠశాలను సందర్శించి పిల్లలను పలు ప్రశ్నలడిగి సమాధానాలు రాబట్టారు. తాను రోజూ కొండెక్కలేక ఆ గ్రామంలోనే ఉంటున్నట్టు ఉపాధ్యాయిని జ్యోతి తెలపడంతో సబ్‌కలెక్టర్ ఆమెను అభినందించారు. అంగన్వాడీ కేంద్రం రికార్డులు నిర్వహించక పోవడంతో మందలించారు. అంగన్వాడీ కేంద్రానికి, పాఠశాలకు మధ్యాహ్న బోజన పథకం బియ్యం, సరుకులు, గుడ్లు ఆ గ్రామానికి గుర్రాలపై తరలించాల్సి వస్తోందని, నిర్వహణ కష్టంగా ఉందని నిర్వహకులు ఆమె దృష్టికి తెచ్చారు.
‘మార్పు’తో అవగాహన
‘మార్పు’ కార్యక్రమాన్ని చలిసింగంలో అమలు చేస్తామని సబ్‌కలెక్టర్ ఆదేశాల మేరకు ఎస్‌పీహెచ్‌ఓ సుజాత తెలిపారు. గర్భిణులు ప్రసవానికి ముందు, తర్వాత మూడు రోజుల పాటు ఆస్పత్రిలో ఉండవచ్చని చెప్పారు. వారికి ఉచిత సేవలతో పాటు భోజనం అందిస్తారని వివరించారు. సబ్‌కలెక్టర్ వెంట కొత్తకోట పీహెచ్‌సీ వైద్యాధికారి నరేంద్రకుమార్, ఆర్‌ఐ గంగరాజు, వీఆర్‌వో, కార్యదర్శి ఉన్నారు.
కొండలెక్కిన సబ్‌కలెక్టర్
Published Fri, Jan 10 2014 1:09 AM | Last Updated on Sat, Sep 2 2017 2:26 AM
Advertisement
Advertisement