సాక్షి ప్రతినిధి, ఏలూరు : ఇంజినీరింగ్ చదివి నాలుగేళ్లు ఐటీ ప్రొఫెషనల్‌గా పని చేశారు. అయితే ఆయన లక్ష్యం సివిల్స్. దేశ అత్యున్నత సర్వీస్‌లో చేరి ప్రజలకు సేవ చేయాలనేది చిన్నప్పటి నుంచి తపన. అందుకు తగ్గట్టుగా కష్టపడ్డారు. మారుమూల గ్రామం నుంచి ఐఏఎస్‌కు ఎంపికయ్యారు. 29 ఏళ్ల వయసులో జిల్లాలో కీలకమైన నరసాపురం రెవెన్యూ సబ్‌డివిజన్ అధికారిగా తన మొట్టమొదటి బాధ్యతలు స్వీకరించారు. రాజకీయ వత్తిళ్లు, అవినీతి వ్యవహారాలు ఆయన దరిదాపులకు రానివ్వరు. 14 నెలల ఉద్యోగ జీవితంలో పాలనా పరంగా ఎన్నో సంస్కరణలు చేపట్టి, ప్రజల నుంచి మన్ననలు పొందుతున్న నరసాపురం సబ్‌కలెక్టర్ సుమిత్‌కుమార్ గాంధీ ఆదర్శంగా నిలుస్తున్నారు. 10వ తరగతి వరకూ ప్రభుత్వ పాఠశాలలోనే చదివానని చెపుతున్న ఆయన నేటి యువత అందుబాటులో ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలంటున్నారు. దినపత్రికలు చదవడం, ఇంటర్నెట్‌ను సక్రమంగా వినియోగించుకోవడం చేయాలని చెపుతున్నారు. లక్ష్యం, ప్రణాళికతో కష్టపడితే సివిల్స్ సాధించడం సులభమేనని అం టున్నారు. అవినీతి నిరోధంపై ప్రజలకు అవగాహన పెరగాలని, అవినీతిని అన్నికోణాల్లో ప్రశ్నించే తత్వం రావాలని కోరుతున్నారు. ఆయన సాక్షితో పంచుకున్న అంతరంగం వివరాలు..
మీ విద్యాభ్యాసం ఎక్కడ మొదలైంది
మాది హర్యానా రాష్ట్రం. రోహతక్ జిల్లాలోని కోనూర్ గ్రామంలో పుట్టాను. మాది మధ్యతరగతి కుటుంబం. 10వ తరగతి వరకూ ప్రభుత్వ పాఠశాలలోనే చదివా. ఇంజినీరింగ్ అయిన తరువాత గురుగావ్‌లో నాలుగేళ్లుపాటు ఐటీ ప్రొఫెషనల్‌గా పని చేశా. అయితే నాకు చిన్నప్పటి నుంచి సివిల్స్ అంటే మక్కువ. ఐఏఎస్ అవ్వడం ద్వారా ప్రజలకు ఎక్కువ సేవ చేసే అవకాశం ఉంటుంది. అందుకే ఐటీ ఉద్యోగం చేస్తూనే సివిల్స్ ప్రిపేర్ అయ్యా. రెండవ ప్రయత్నంలో 2014లో ఐఏఎస్‌కు ఎంపికయ్యా. ఏపీ క్యాడర్‌కు కేటాయిం చారు. అనంతపురంలో ట్రైనీ కలెక్టర్‌గా పని చేసిన తరువాత, నరసాపురం సబ్‌కలెక్టర్‌గా మొదటి పోస్టింగ్ ఇచ్చారు.
గ్రామీణ ప్రాంతాల వారికి అవకాశాలు
ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు అవకాశాలు ఎక్కువ. ఆధునిక పరిజ్ఞానం బాగా అందుబాటులోకి వచ్చింది. ఇంటర్నెట్ ద్వారా అంతా తెలుసుకోవచ్చు. అవకాశాలను అన్వేషించుకుని అందుకు తగ్గట్టుగా ముందుకెళితే కచ్చితంగా విజయం సాధించవచ్చు. గ్రామీణ ప్రాంతాలవారు, ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్నవారు ఎవరైనా ఐఏఎస్ చదవొచ్చు. కానీ స్కిల్స్ పెంచుకోవాలి. ముఖ్యంగా ఇంగ్లిష్ భాషపై పట్టు సాధించాలి. అప్పుడే ఇంటర్నెట్ లాంటి మాధ్యమాలను పూర్తిస్థాయిలో ఉపయోగించుకోగలం. నా మాతృభాష హిందీ. అయితే ఇంగ్లిష్ నేర్చుకోవడంలో చిన్నప్పటి నుంచి ప్రత్యేక శ్రద్ధ పెట్టాను. నేను ఐఏఎస్ కావడానికి అది చాలా ఉపయోగపడింది.
ఐఏఎస్ లక్ష్యం ఎలా సాధించారు?
న్యూస్ పేపర్ చదవడానికి ప్రతిరోజు ఓ అరగంట కేటాయించేవాడిని. తరువాత ఇంటర్నెట్. ప్రస్తుతం యువత పేపర్ చదవడంలేదు. సివిల్స్‌గానీ, పోటీ పరీ క్షలు గానీ రాసేవాళ్లు కచ్చితంగా న్యూస్ పేపర్ చదవాలి. ఇంగ్లీష్‌పై పట్టు పెంచుకోవాలి. ఇక ఇంటర్నెట్, యూట్యూబ్ లాంటి మాధ్యమాలను యువత వేరే రకంగా వినియోగించుకుంటున్నారు. కానీ వాటిలో మంచి విషయాలు ఎక్కువగా ఉన్నాయి. వాటిని పట్టించుకోవడంలేదు. ఇక ప్రధానంగా నేను గమనించింది. డిగ్రీలకు విలువ తగ్గింది. చదవుతో పాటు స్కిల్స్ పెంచుకోవాలి. నేను చేసింది అదే.
ఆరకంగా యువత కష్టపడాలి
రెవెన్యూలో సవాళ్లు ఎక్కువ కదా? ఎలా పరిష్కరిస్తున్నారు?
ఈ శాఖలో సవాళ్లు ఎక్కువ. పూర్తిగా చేసేశాం అని చెపితే అబద్దమవుతుంది. 80 శాతం పనులు చేయగలితే ప్రజలకు న్యాయం చేసినట్టు లెక్క. నరసాపురం సబ్‌డివిజన్‌లో శ్మశానవాటికల కోసం దాదాపు 200 ఎకరాల స్థలం అవసరం. ఇది చాలా దారుణమైన పరిస్థితి. నేను వచ్చిన తరువాత శ్మశానవాటికల కోసం మొత్తం ఎంత స్థలం అవసరమో సర్వే చేయించా. దీనికి పరిష్కారం చూపించాలని ప్రయత్నిస్తున్నాను. మీకోసం కార్యక్రమంలో వృద్ధుల సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి. వారంలో నాలుగురోజులు వారి సమస్యల పరిష్కారానికి కేటాయిస్తున్నాను. ఇందుకోసం ఓ టైమ్‌టేబుల్ అమలు చేస్తున్నాము. ఇక డివిజన్‌లో అనేక మంది అర్హులైనవారికి ఇళ్ల పట్టాలు ఇవ్వాలి. కానీ ప్రభుత్వ భూములులేవు.
అవినీతిపై ఫిర్యాదులు ఎందుకు రావడం లేదు ?
అవినీతి, రాజకీయ వత్తిళ్లు లాంటి సమస్యలు రెవెన్యూలో ఉన్నాయి. నా డివి జన్‌లో దీనిపై దృష్టిపెట్టాను. డివిజన్‌లో చేపట్టిన రేషన్‌షాపుల భర్తీ నుంచి అనేక కార్యక్రమాలు పారదర్శకంగా చేశారు. డివిజన్‌లో అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది ఎవరు లంచం అడిగినా నేరుగా నాకు ఫిర్యాదు చేయమని చెప్పాను. నా కార్యాలయంలో ఓ ఫిర్యాదుల పెట్టె పెట్టాను. కానీ ఒక్క ఫిర్యాదు కూడా రావడంలేదు. అంతా కరెక్ట్‌గా ఉందని నేను చెప్పను. నాకు చెప్పడానికి ఎందుకు వెనకాడుతున్నారో? అవినీతిపై తిరగబడే తత్వం ప్రజల్లో పెరగాలి.
Comments
Please login to add a commentAdd a comment