IT professional
-
ఆ ఐటీ నిపుణులకు కాగ్నిజెంట్ తీపి కబురు
సాక్షి,న్యూఢిల్లీ: కొంత విరామం తర్వాత మళ్లీ కెరియర్ ప్రారంభించాలనుకుంటున్న టెక్నాలజీ నిపుణుల కోసం ఐటీ దిగ్గజం కాగ్నిజెంట్ ’రిటర్న్‌షిప్ ప్రోగ్రాం’ ప్రారంభించింది. ఇది 12 వారాల పాటు ఉంటుంది. మారిన పరిస్థితులకు అనుగుణంగా ప్రతిభావంతులైన నిపుణులకు అవసరమైన శిక్షణ కల్పించడం, సలహాలివ్వడం, ఇతరత్రా అవసరమైన వనరులను సమకూర్చేందుకు ఈ ప్రోగ్రాం దోహదపడుతుందని కాగ్నిజెంట్ ఇండియా సీఎండీ రాజేష్ నంబియార్ తెలిపారు. మళ్లీ ఉద్యోగాల్లో చేరాలనుకునే ప్రొఫెషనల్స్‌లో చాలామంది మహిళలు కూడా ఉంటున్నారని, తొలి బ్యాచ్‌లో ఇంజినీరింగ్ మేనేజ్మెంట్ విధులపై ఆసక్తి ఉన్న వారికి చోటు కల్పిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. (సుప్రీం తీర్పు నిరాశపర్చింది : సైరస్ మిస్త్రీ ) -
డిగ్రీలుంటే సరిపోదు స్కిల్స్ ఉండాలి
సాక్షి ప్రతినిధి, ఏలూరు : ఇంజినీరింగ్ చదివి నాలుగేళ్లు ఐటీ ప్రొఫెషనల్‌గా పని చేశారు. అయితే ఆయన లక్ష్యం సివిల్స్. దేశ అత్యున్నత సర్వీస్‌లో చేరి ప్రజలకు సేవ చేయాలనేది చిన్నప్పటి నుంచి తపన. అందుకు తగ్గట్టుగా కష్టపడ్డారు. మారుమూల గ్రామం నుంచి ఐఏఎస్‌కు ఎంపికయ్యారు. 29 ఏళ్ల వయసులో జిల్లాలో కీలకమైన నరసాపురం రెవెన్యూ సబ్‌డివిజన్ అధికారిగా తన మొట్టమొదటి బాధ్యతలు స్వీకరించారు. రాజకీయ వత్తిళ్లు, అవినీతి వ్యవహారాలు ఆయన దరిదాపులకు రానివ్వరు. 14 నెలల ఉద్యోగ జీవితంలో పాలనా పరంగా ఎన్నో సంస్కరణలు చేపట్టి, ప్రజల నుంచి మన్ననలు పొందుతున్న నరసాపురం సబ్‌కలెక్టర్ సుమిత్‌కుమార్ గాంధీ ఆదర్శంగా నిలుస్తున్నారు. 10వ తరగతి వరకూ ప్రభుత్వ పాఠశాలలోనే చదివానని చెపుతున్న ఆయన నేటి యువత అందుబాటులో ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలంటున్నారు. దినపత్రికలు చదవడం, ఇంటర్నెట్ను సక్రమంగా వినియోగించుకోవడం చేయాలని చెపుతున్నారు. లక్ష్యం, ప్రణాళికతో కష్టపడితే సివిల్స్ సాధించడం సులభమేనని అం టున్నారు. అవినీతి నిరోధంపై ప్రజలకు అవగాహన పెరగాలని, అవినీతిని అన్నికోణాల్లో ప్రశ్నించే తత్వం రావాలని కోరుతున్నారు. ఆయన సాక్షితో పంచుకున్న అంతరంగం వివరాలు.. మీ విద్యాభ్యాసం ఎక్కడ మొదలైంది మాది హర్యానా రాష్ట్రం. రోహతక్ జిల్లాలోని కోనూర్ గ్రామంలో పుట్టాను. మాది మధ్యతరగతి కుటుంబం. 10వ తరగతి వరకూ ప్రభుత్వ పాఠశాలలోనే చదివా. ఇంజినీరింగ్ అయిన తరువాత గురుగావ్‌లో నాలుగేళ్లుపాటు ఐటీ ప్రొఫెషనల్‌గా పని చేశా. అయితే నాకు చిన్నప్పటి నుంచి సివిల్స్ అంటే మక్కువ. ఐఏఎస్ అవ్వడం ద్వారా ప్రజలకు ఎక్కువ సేవ చేసే అవకాశం ఉంటుంది. అందుకే ఐటీ ఉద్యోగం చేస్తూనే సివిల్స్ ప్రిపేర్ అయ్యా. రెండవ ప్రయత్నంలో 2014లో ఐఏఎస్‌కు ఎంపికయ్యా. ఏపీ క్యాడర్‌కు కేటాయిం చారు. అనంతపురంలో ట్రైనీ కలెక్టర్‌గా పని చేసిన తరువాత, నరసాపురం సబ్‌కలెక్టర్‌గా మొదటి పోస్టింగ్ ఇచ్చారు. గ్రామీణ ప్రాంతాల వారికి అవకాశాలు ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు అవకాశాలు ఎక్కువ. ఆధునిక పరిజ్ఞానం బాగా అందుబాటులోకి వచ్చింది. ఇంటర్నెట్ ద్వారా అంతా తెలుసుకోవచ్చు. అవకాశాలను అన్వేషించుకుని అందుకు తగ్గట్టుగా ముందుకెళితే కచ్చితంగా విజయం సాధించవచ్చు. గ్రామీణ ప్రాంతాలవారు, ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్నవారు ఎవరైనా ఐఏఎస్ చదవొచ్చు. కానీ స్కిల్స్ పెంచుకోవాలి. ముఖ్యంగా ఇంగ్లిష్ భాషపై పట్టు సాధించాలి. అప్పుడే ఇంటర్నెట్ లాంటి మాధ్యమాలను పూర్తిస్థాయిలో ఉపయోగించుకోగలం. నా మాతృభాష హిందీ. అయితే ఇంగ్లిష్ నేర్చుకోవడంలో చిన్నప్పటి నుంచి ప్రత్యేక శ్రద్ధ పెట్టాను. నేను ఐఏఎస్ కావడానికి అది చాలా ఉపయోగపడింది. ఐఏఎస్ లక్ష్యం ఎలా సాధించారు? న్యూస్ పేపర్ చదవడానికి ప్రతిరోజు ఓ అరగంట కేటాయించేవాడిని. తరువాత ఇంటర్నెట్. ప్రస్తుతం యువత పేపర్ చదవడంలేదు. సివిల్స్‌గానీ, పోటీ పరీ క్షలు గానీ రాసేవాళ్లు కచ్చితంగా న్యూస్ పేపర్ చదవాలి. ఇంగ్లీష్‌పై పట్టు పెంచుకోవాలి. ఇక ఇంటర్నెట్, యూట్యూబ్ లాంటి మాధ్యమాలను యువత వేరే రకంగా వినియోగించుకుంటున్నారు. కానీ వాటిలో మంచి విషయాలు ఎక్కువగా ఉన్నాయి. వాటిని పట్టించుకోవడంలేదు. ఇక ప్రధానంగా నేను గమనించింది. డిగ్రీలకు విలువ తగ్గింది. చదవుతో పాటు స్కిల్స్ పెంచుకోవాలి. నేను చేసింది అదే. ఆరకంగా యువత కష్టపడాలి రెవెన్యూలో సవాళ్లు ఎక్కువ కదా? ఎలా పరిష్కరిస్తున్నారు? ఈ శాఖలో సవాళ్లు ఎక్కువ. పూర్తిగా చేసేశాం అని చెపితే అబద్దమవుతుంది. 80 శాతం పనులు చేయగలితే ప్రజలకు న్యాయం చేసినట్టు లెక్క. నరసాపురం సబ్‌డివిజన్‌లో శ్మశానవాటికల కోసం దాదాపు 200 ఎకరాల స్థలం అవసరం. ఇది చాలా దారుణమైన పరిస్థితి. నేను వచ్చిన తరువాత శ్మశానవాటికల కోసం మొత్తం ఎంత స్థలం అవసరమో సర్వే చేయించా. దీనికి పరిష్కారం చూపించాలని ప్రయత్నిస్తున్నాను. మీకోసం కార్యక్రమంలో వృద్ధుల సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి. వారంలో నాలుగురోజులు వారి సమస్యల పరిష్కారానికి కేటాయిస్తున్నాను. ఇందుకోసం ఓ టైమ్‌టేబుల్ అమలు చేస్తున్నాము. ఇక డివిజన్లో అనేక మంది అర్హులైనవారికి ఇళ్ల పట్టాలు ఇవ్వాలి. కానీ ప్రభుత్వ భూములులేవు. అవినీతిపై ఫిర్యాదులు ఎందుకు రావడం లేదు ? అవినీతి, రాజకీయ వత్తిళ్లు లాంటి సమస్యలు రెవెన్యూలో ఉన్నాయి. నా డివి జన్‌లో దీనిపై దృష్టిపెట్టాను. డివిజన్లో చేపట్టిన రేషన్‌షాపుల భర్తీ నుంచి అనేక కార్యక్రమాలు పారదర్శకంగా చేశారు. డివిజన్లో అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది ఎవరు లంచం అడిగినా నేరుగా నాకు ఫిర్యాదు చేయమని చెప్పాను. నా కార్యాలయంలో ఓ ఫిర్యాదుల పెట్టె పెట్టాను. కానీ ఒక్క ఫిర్యాదు కూడా రావడంలేదు. అంతా కరెక్ట్‌గా ఉందని నేను చెప్పను. నాకు చెప్పడానికి ఎందుకు వెనకాడుతున్నారో? అవినీతిపై తిరగబడే తత్వం ప్రజల్లో పెరగాలి. -
ఉద్యోగులకు గుడ్‌న్యూస్
సాక్షి,న్యూఢిల్లీ: వచ్చే ఏడాది ఉద్యోగులకు తీపికబురు అందనుంది. అరకొర వేతన పెంపుపై అసంతృప్తితో ఉన్న ఉద్యోగులకు 2018లో మాత్రం ఊరట కలగనుంది. 2017లో భారత ఉద్యోగుల వేతనాలు 8-10 శాతం పెరిగితే..2018లో పలు రంగాల ఉద్యోగులకు 10-15 శాతం వరకూ వేతన పెంపు ఉంటుందని ప్రముఖ మానవనరుల కన్సల్టెన్సీ గ్రూప్ అంచనా వేసింది. మరోవైపు నియామకాలు సైతం వచ్చే ఏడాది భారీగా ఊపందుకోనున్నాయనే అంచనాలూ జాబ్ మార్కెట్లో ఉత్తేజం నింపుతున్నాయి. టెక్నాలజీ, ఫైనాన్షియల్ సేవలు, రిటైల్, మీడియా, ఎంటర్టైన్మెంట్ రంగాల్లో పెద్ద ఎత్తున నియామకాలు చోటుచేసుకోనున్నాయి. ఐటీలో సంప్రదాయ ఉద్యోగాలతో పాటు డిజిటల్, డేటా సైన్స్ వంటి నైపుణ్యాలకు డిమాండ్ నెలకొందని నిపుణులు పేర్కొంటున్నారు. వచ్చే ఏడాది ప్రధానంగా మౌలిక, టెలికాం, తయారీ, ఐటీ రంగాల్లో గణనీయమైన వృద్ధి నమోదవుతుందని, ఫలితంగా నియామకాలు భారీగా పెరుగుతాయని హెచ్ఆర్ నిపుణులు అంచనా వేస్తున్నారు. -
భర్తకు ఫొటోలు పంపి.. అమెరికా మహిళకు బెదిరింపులు!
కోల్‌కతా: తనతో సన్నిహితంగా ఉన్న ఫొటోలను చూపి.. ఓ ప్రముఖ కంపెనీకి చెందిన ఐటీ ఉద్యోగి అమెరికా మహిళను బ్లాక్మెయిల్ చేశాడు. ఈ వ్యవహారంలో కోల్‌కతాకు చెందిన అవినాష్ గుప్తాను పోలీసులు అరెస్టు చేశారు. 30 ఏళ్లకుపైగా వయస్సున్న అవినాష్ గుప్తా ఓ ఐటీ కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. గత ఏడాది ఓ అమెరికా మహిళ కోల్‌కతాకు వచ్చింది. వీరిద్దరూ కొంతకాలం సన్నిహితంగా ఉన్నారు. ఆమె అమెరికాకు తిరిగి వెళ్లిన తర్వాత ఈ ప్రణయ సంబంధం దెబ్బతిన్నది. దీంతో తాము సన్నిహితంగా ఉన్నప్పటి ఫొటోలను తన భర్తకు పంపించడం ద్వారా అవినాష్ బ్లాక్ మెయిలింగ్‌కు పాల్పడుతున్నాడని అమెరికా మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదుపై విచారణ జరిపిన కోల్‌కతా పోలీసులు ఆదివారం ముకుందనగర్‌లోని తన నివాసం నుంచి అవినాష్‌ను అరెస్టు చేశారు. అమెరికా మహిళతో సన్నిహితంగా ఉన్న ఫొటోలను తరచూ ఆమె భర్తకు పంపిస్తూ అవినాష్ బెదిరిస్తున్నాడని బాధితురాలు ఫిర్యాదు చేసిందని, దీంతో ఐటీ చట్టంలోని పలు సెక్షన్ల కింద అతన్ని అరెస్టుచేశామని పోలీసులు తెలిపారు. -
'అవును.. ఐసిస్ నుంచి డబ్బులందాయి'
న్యూఢిల్లీ: ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్‌తో సంబంధాలున్నాయన్న ఆరోపణల కింద జాతీయ దర్యాప్తు అరెస్టు చేసిన ఐటీ ఉద్యోగి ముదాబ్బిర్ ముస్తాక్ షేక్(34) ఐసిస్ నుంచి రూ.8 లక్షలను ఓ హవాలాదారుడి ద్వారా తీసుకున్నట్లు తెలిసింది. ఈ విషయాన్ని ఎన్ఐఏ అధికారులు తెలిపారు. ముస్తాక్ భారత్ నుంచి ఉగ్రవాద సంస్థ కోసం రిక్రూట్మెంట్ నిర్వహిస్తున్నాడని ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో అతడిని అరెస్టు ఎన్ఐఏ అధికారులు విచారించగా తాను ఇస్లామిక్ స్టేట్ నుంచి రూ.8లక్షలు ఓ వ్యక్తి ద్వారా తీసుకున్నట్లు తెలిపాడు. ఆ సొమ్మును ఐసిస్ నియామకాలకోసం ఖర్చుపెట్టినట్లు చెప్పాడు. హుస్సేన్ ఖాన్ అనే వ్యక్తి రూ.50 వేలు, లక్నోకు చెందిన యువకుడికి రూ.3లక్షలు ఇచ్చినట్లు తెలిపాడు. ఇక మిగితావి ముంబాయితోపాటు ఇతర రాష్ట్రాల్లోని యువకులకు పంచినట్లు చెప్పాడు. అయితే, అతడు చెప్పిన ఇద్దరినీ ఎన్ఐఏ అధికారులు ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. ముంబయిలోని ముంబ్రా అపార్ట్ మెంట్ లో అద్దెకు ఉంటున్న ముస్తాక్‌ను ఎన్ఐఏ అధికారులు ఇటీవల అరెస్టు చేసిన విషయం తెలిసిందే. -
ఆస్ట్రాలజీ జోస్యానికి కొత్త భాష్యం
ఒకరు రిటైర్డ్ ప్రిన్సిపాల్.. ఇంకొకరు డాక్టర్.. మరొకరు ఐటీ ప్రొఫెషనల్.. ఇలా డిఫరెంట్ వృత్తుల వారంతా ఒక చోటికి చేరారు. వీరే కాదు.. ఇంకా ఎందరెందరో.. అక్కడికి చేరుకున్నారు. వారి ఉద్యోగాలే కాదు.. ఏజ్ గ్రూప్‌లు కూడా వేర్వేరే. మరి వీరందరినీ కలిపింది ఏమిటంటే.. జ్యోతిషం. అవును గ్రహగతులే వీరందరినీ ఒక్కతాటిపైకి తెచ్చాయి. అవును వీరంతా ఆస్ట్రాలజీలో పీహెచ్డీ చేస్తున్నారు. సికింద్రాబాద్‌లోని లయన్స్ భవన్లో ఆదివారం జరిగిన ఆస్ట్రో సదస్సులో వీరంతా పాల్గొన్నారు. ..:: దార్ల వెంకటేశ్వరరావు ఒకప్పుడు కొందరికి మాత్రమే పరిమితమైన జ్యోతిష జ్ఞానంపై ఇప్పుడు ఎందరికో ఆసక్తి పెరుగుతోంది. జ్యోతిషాన్ని ఉపాధిమార్గంగా ఎంచుకుని కొందరు శాస్త్రీయంగా ఈ విద్యను అభ్యసిస్తున్నారు. ఇతర వృత్తుల్లో ఉన్నవారు సైతం జ్యోతిషాన్ని ప్రవృత్తిగా స్వీకరించి.. శాస్త్రాన్ని అభ్యసిస్తున్నారు. బేసిక్స్‌తో వదిలేయకుండా.. పీహెచ్డీ వరకూ చేస్తున్నారు. ‘శాస్త్రాన్ని అధ్యయనం చేయకుండా.. మిడిమిడి జ్ఞానంతో గ్రహాల అనుగ్రహాన్ని, ఆగ్రహాన్ని అంచనా వేస్తూ చాలా మంది అమాయక జనం నుంచి వేలకు వేలు కొల్లగొడుతున్నారు. శాస్త్రాన్ని సబ్జెక్ట్‌లా చదివిన ఆస్ట్రాలజర్స్ అవసరం ఎంతైనా ఉంది’ అని అంటారు ఈ సదస్సుకు హాజరైన ఓ ఐటీ ప్రొఫెషనల్. సీరియస్ స్టడీ.. గ్రహగతులను పక్కాగా లెక్క కడితే.. భవిష్యత్తును ఈజీగా చెప్పేయొచ్చు అంటున్నారీ పీహెచ్డీ విద్యార్థులు. ‘గ్రహాలు, నక్షత్రాలు మనిషి ప్రవర్తనపై ప్రభావం చూపుతాయి. జీవితంలో ప్రతి మార్పునకు ఆస్ట్రాలజీ కచ్చితమైన సమాధానం ఇవ్వగలదు. అయితే దీన్ని చాలా మంది ఆదాయ వనరుగానే భావిస్తున్నారు కాని, ఆసక్తిగా పరిశీలించడం లేదు’ అని ఐటీ ఉద్యోగి శ్రీనివాస్ అభిప్రాయపడ్డారు. ఎమ్మెస్సీ మైక్రోబయోలజీ చేసిన కాత్యాయిని అందులోనే పీహెచ్డీ చేసింది. తెలుగు ఎంఏ కూడా చేసింది. ప్రస్తుతం మెడికల్ ఆస్ట్రాలజీలో పీహెచ్డీ చేస్తోంది. జ్యోతిషాన్ని సైన్స్ కోణంలో చూస్తూ నూతన ఆవిష్కరణల దిశగా ఆమె ప్రయాణిస్తున్నారు. సంతాన లేమి, ఒబెసిటీ, గర్భాశయ వ్యాధులు.. వీటికి కారణాలను ఆస్ట్రోలజీ ద్వారా కనుగొనే ప్రయత్నం చేస్తున్నారామె. ‘ నా భర్త గాంధీ ఆస్పత్రిలో ఫోరెన్సిక్ విభాగాధిపతి. అలాగే ఆయన దగ్గరకు వచ్చిన సంచలనాత్మక కేసుల్లో కొన్ని స్టడీ చేశా. అలాంటి వారి మరణాల కారణాలను విశ్లేషించాను కూడా’ అని వివరించారు. ఇలా చాలామంది ఔత్సాహికులు జ్యోతిషాన్ని సీరియస్‌గా తీసుకుంటున్నారు. ముందుగానే గుర్తించొచ్చు సాప్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాను. ప్రస్తుతం మెడికల్ ఆస్ట్రాలజీలో పీహెచ్డీ చేస్తున్నాను. అమెరికాలో పదేళ్లు సాప్ట్వేర్ కన్సల్టెంట్‌గా పనిచేశా. అక్కడ ఇండియన్, ఫారిన్ ఆస్ట్రాలజీ సంబంధాలపై కొంత పరిశోధన చేశాను. ఇప్పుడు మెడికల్ ఆస్ట్రాలజీలో నేను చేసిన కొన్ని పరిశోధనల ద్వారా క్యాన్సర్ వ్యాధి వచ్చే సంగతి ముందుగానే గుర్తించవచ్చు. దాదాపు 200 కేసుల్లో ఇది నిరూపితమైంది. ముందుగానే గుర్తించడం వల్ల వ్యాధి నివారణకు ముందస్తు జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంది. - రఘునాథ్ సాప్ట్వేర్ ఇంజనీర్ (టెక్ మహీంద్రా సీనియర్ ప్రాజెక్టు మేనేజర్) ఉచిత బోధన అవగాహన లేకుండా చాలామంది జోస్యం చెప్పి లాభం కంటే నష్టం ఎక్కువ చేస్తున్నారు. ప్రతి సమస్యకు జ్యోతిషం పరిహారం చూపింది. చిన్న చిన్న రెమెడీలు కూడా చెప్పింది. దీన్ని అందరికీ పరిచయం చేసేందుకు 2000 సంవత్సరంలో జేకేఆర్ ఆస్ట్రో రీసెర్చ్ ఫౌండేషన్ ఏర్పాటు చేశాను. ఇందులో ఆస్ట్రాలజీ ఉచితంగా నేర్పిస్తాం. ఫ్లోరిడాలోని యోగ సంస్కృతం యూనివర్శిటీ 2011 సంవత్సరంలో మాకు అప్లియేషన్ ఇచ్చింది. అప్పటి నుంచి పీహెచ్డీ కూడా ప్రవేశపెట్టాం. - డాక్టర్ ఎన్‌వీఆర్‌ఏ రాజ (జేకేఆర్ ఆస్ట్రో రిసెర్చ్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు)