'అవును.. ఐసిస్ నుంచి డబ్బులందాయి'
న్యూఢిల్లీ: ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్తో సంబంధాలున్నాయన్న ఆరోపణల కింద జాతీయ దర్యాప్తు అరెస్టు చేసిన ఐటీ ఉద్యోగి ముదాబ్బిర్ ముస్తాక్ షేక్(34) ఐసిస్ నుంచి రూ.8 లక్షలను ఓ హవాలాదారుడి ద్వారా తీసుకున్నట్లు తెలిసింది. ఈ విషయాన్ని ఎన్ఐఏ అధికారులు తెలిపారు. ముస్తాక్ భారత్ నుంచి ఉగ్రవాద సంస్థ కోసం రిక్రూట్మెంట్ నిర్వహిస్తున్నాడని ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో అతడిని అరెస్టు ఎన్ఐఏ అధికారులు విచారించగా తాను ఇస్లామిక్ స్టేట్ నుంచి రూ.8లక్షలు ఓ వ్యక్తి ద్వారా తీసుకున్నట్లు తెలిపాడు. ఆ సొమ్మును ఐసిస్ నియామకాలకోసం ఖర్చుపెట్టినట్లు చెప్పాడు.
హుస్సేన్ ఖాన్ అనే వ్యక్తి రూ.50 వేలు, లక్నోకు చెందిన యువకుడికి రూ.3లక్షలు ఇచ్చినట్లు తెలిపాడు. ఇక మిగితావి ముంబాయితోపాటు ఇతర రాష్ట్రాల్లోని యువకులకు పంచినట్లు చెప్పాడు. అయితే, అతడు చెప్పిన ఇద్దరినీ ఎన్ఐఏ అధికారులు ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. ముంబయిలోని ముంబ్రా అపార్ట్ మెంట్ లో అద్దెకు ఉంటున్న ముస్తాక్ను ఎన్ఐఏ అధికారులు ఇటీవల అరెస్టు చేసిన విషయం తెలిసిందే.