సాక్షి, న్యూఢిల్లీ: ఉత్తరాది రాష్ట్రాల్లో గ్యాంగ్‌స్టర్ల ఆగడాలను చెక్‌పెట్టేందుకు, వారి విస్తృత నెట్‌వర్క్‌ను సమూలంగా నాశనం చేసేందుకు ఎన్‌ఐఏ కొత్త ఆలోచనను తెరపైకి తెచ్చింది. ఢిల్లీ, పంజాబ్, హరియాణా, రాజస్థాన్ జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న గ్యాంగ్‌స్టర్‌లను దక్షిణాది రాష్ట్రాల జైళ్లకు తరలించాలని భావిస్తోంది.
నాలుగు ఉత్తరాది రాష్ట్రాల్లో డ్రగ్స్, అక్రమ ఆయుధాల సరఫరా, సుపారీ హత్యలు, హవాలా దందా, బెదిరింపు వసూళ్లు, మానవ అక్రమ రవాణా వంటి తీవ్ర నేరాల్లో కొందరు గ్యాంగ్‌స్టర్లను అరెస్ట్ చేసి సెంట్రల్ జైళ్లలో పడేశారు. వాళ్లు అక్కడి నుంచే నిక్షేపంగా తమ కార్యకలాపాలను సాగిస్తున్నారు. తొలి దశలో వారిలో 25 మందిని దక్షిణాది జైళ్లకు బదిలీ చేయాలని కోరినట్లు సమాచారం.
మూసావాలా హత్యతో అలర్ట్
పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలా హత్యోదంతం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెల్సిందే. దక్షిణాసియాలోని అతిపెద్ద, అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లుండే జైళ్లలో ఒకటైన ఢిల్లీలోని తీహార్ జైలు నుంచే మూసేవాలా హత్య ప్రణాళికను గ్యాంగ్‌స్టర్లు అమలు చేశారని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. తిహార్‌లో జైలు శిక్ష అనుభవిస్తున్న గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ తన నెట్‌వర్క్ ద్వారా ఈ హత్య చేయించారనే కేసు దర్యాప్తు ప్రస్తుతం కొనసాగుతోంది.
తిహార్‌లోనే ఉన్న మరో గ్యాంగ్‌స్టర్ నీరాజ్ బవానా సైతం జైలు నుంచే తన వ్యాపారాన్ని ఇష్టారీతిగా కొనసాగిస్తున్నారనే ఆరోపణలున్నాయి. పంజాబ్, హరియాణా, రాజస్థాన్ జైళ్లలో ఉన్న గ్యాంగ్‌స్టర్‌లదీ ఇదే పంథా. జైళ్లలో కొత్తగా చిన్న ముఠాలుగా ఏర్పడి తమ ప్రణాళికను అమలుచేస్తున్నారు. ఏప్రిల్‌లో గ్యాంగ్‌స్టర్ జితేంద్ర గోగిను చంపేశాడనే కోపంతో మరో గ్యాంగ్‌స్టర్ శేఖర్ రాణాను గోగి సన్నిహితుడు రోహిత్ మోయి జైలు నుంచే కుట్ర పన్ని హత్య చేయించాడు. ఇలాంటి ఘటనలు ఇటీవలి కాలంలో ఉత్తరాదిన పెరిగాయి.
కొన్ని కేసుల్లో గ్యాంగ్‌స్టర్‌లకు జైలు సిబ్బంది సహకరిస్తున్నారనే ఆరోపణలు గుప్పుమన్నాయి. ఉత్తరాది రాష్ట్రాల జైళ్లలో సామర్థ్యానికి మించి ఖైదీలుండటం మధ్య ఆధిపత్య పోరు పెరిగి గొడవలకు దారితీస్తోంది. వీరికి విదేశాల నుంచి ఆర్ధిక సహకారం అందుతోందనే దారుణ వాస్తవాలు ఎన్‌ఐఏ దర్యాప్తులో వెల్లడయ్యాయి. ఉత్తరాది జైళ్లలో సామర్థ్యానికి మించి ఖైదీలుండటం కూడా ఎన్‌ఐఏ ప్రతిపాదనకు మరో కారణం. ఢిల్లీలో 14 సెంట్రల్ జైళ్ల సామర్ధ్యం 9,346 కాగా 17,733 మంది ఖైదీలున్నారు. పంజాబ్‌లో జైళ్లలో 103 శాతం, హరియాణాలో 127 శాతం, రాజస్థాన్‌లో 107 శాతం ఖైదీలున్నారు.
Comments
Please login to add a commentAdd a comment