illegal arms
-
అక్రమ ఆయుధాల సుపారీ గ్యాంగ్ అరెస్ట్
సాక్షి, అమరావతి: అక్రమ ఆయుధాల తయారీ, విక్రయాలతోపాటు నకిలీ నోట్ల దందా నిర్వహిస్తున్న అంతర్ రాష్ట్ర ముఠాను ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. కర్ణాటకలోని బెంగళూరుకు చెందిన ముఠా అనంతపురం, బళ్లారి కేంద్రాలుగా వివిధ రాష్ట్రాల్లో కిరాయి హత్యలకు పాల్పడుతూ, నకిలీ నోట్ల ముద్రణ, చలామణి చేస్తున్నట్టు గుర్తించారు. ఈ గ్యాంగ్‌కు చెందిన ఆరుగురు సభ్యులను అరెస్ట్ చేయడంతోపాటు వారి నుంచి 18 ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. మంగళగిరిలోని రాష్ట్ర పోలీస్ ప్రధాన కార్యాలయంలో డీజీపీ కేవీ రాజేంద్రనాథ్‌రెడ్డి సోమవారం వెల్లడించిన వివరాలిలా ఉన్నాయి. తీగ లాగితే.. అనంతపురం జిల్లాలో నకిలీ నోట్లు చలామణి చేస్తున్న కొందర్ని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా.. అంతర్ రాష్ట్ర అక్రమ ఆయుధాల ముఠా వ్యవహారం బయటపడింది. దాంతో అనంతపురం జిల్లా పోలీసులతో స్పెషల్ ఆపరేషన్స్ టీమ్ ఏర్పాటు చేసి లోతుగా దర్యాప్తు చేపట్టారు. బెంగళూరుకు చెందిన రౌడీషీటర్లు జంషీద్, ముబారక్, అమీర్ పాషా, రియల్ అబ్దుల్ షేక్ మహారాష్ట్రలోని సిర్పూర్ నుంచి గంజాయి, మధ్యప్రదేశ్ నుంచి ఆయుధాలు కొనుగోలు చేస్తున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. స్పెషల్ ఆపరేషన్స్ టీమ్ వారిని అరెస్ట్ చేసి 12 అక్రమ ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. స్పెషల్ టీమ్ వారిని విచారించి మరింత కీలక సమాచారాన్ని రాబట్టింది. అనంతరం మధ్యప్రదేశ్‌లోని బర్వానీ జిల్లాలో హిరేహాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమ ఆయుధాల తయారీ కేంద్రంపై దాడులు నిర్వహించింది. ఆయుధాల తయారీదారుడు, డీలర్ రాజ్‌పాల్‌సింగ్‌తోపాటు ఆయుధాల సరఫరాదారుడిగా ఉన్న సుతార్‌ను అరెస్ట్ చేశారు. వారి నుంచి 6 అక్రమ ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. మధ్యప్రదేశ్‌కు చెందిన ఆయుధాల డీలర్ల నుంచి కొనుగోలు చేసిన ఆయుధాలతో బెంగళూరుకు చెందిన ముఠా సభ్యులు కర్ణాటకలో వివిధ ప్రాంతాల్లో హత్యలు, దోపిడీలకు పాల్పడుతున్నట్టు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. రాజ్‌పాల్‌సింగ్ దేశంలోని వందలాది ప్రాంతాలకు అక్రమ ఆయుధాలు సరఫరా చేస్తున్నట్టు కూడా బయటపడింది. నిందితులు ఆరుగురిపై గంజాయి అక్రమ రవాణా, నకిలీ నోట్ల రాకెట్, అక్రమ ఆయుధాలు, కిరాయి హత్యలు తదితర అభియోగాలపై ఏపీ, కర్ణాటక, మధ్యప్రదేశ్, గోవాలలో పలు కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ ముఠా నెట్‌వర్క్‌పై మరిన్ని కోణాల్లో పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. అసాంఘిక శక్తులను ఉపేక్షించేదే లేదు సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు అత్యధిక ప్రాధాన్యమిస్తున్నాం. ఈ క్రమంలో అనంతపురం జిల్లా పోలీసులు కీలక కేసును ఛేదించారు. బెంగళూరుకు చెందిన కిరాయి హంతకుల ముఠా అనంతపురం–బళ్లారి కేంద్రాలుగా కొంతకాలంగా నకిలీ నోట్లు, అక్రమ ఆయుధాల దందా నిర్వహిస్తున్నట్టు గుర్తించాం. అక్రమ ఆయుధాల తయారీదారు, డీలర్‌తోపాటు అంతర్ రాష్ట్ర ముఠాకు చెందిన ఆరుగురిని అరెస్ట్ చేసి 18 ఆయుధాలను స్వాధీనం చేసుకున్నాం. – కేవీ రాజేంద్రనాథ్‌రెడ్డి, డీజీపీ -
ఉత్తరాది గ్యాంగ్స్టర్లు దక్షిణాది జైళ్లకు
సాక్షి, న్యూఢిల్లీ: ఉత్తరాది రాష్ట్రాల్లో గ్యాంగ్స్టర్ల ఆగడాలను చెక్‌పెట్టేందుకు, వారి విస్తృత నెట్‌వర్క్‌ను సమూలంగా నాశనం చేసేందుకు ఎన్ఐఏ కొత్త ఆలోచనను తెరపైకి తెచ్చింది. ఢిల్లీ, పంజాబ్, హరియాణా, రాజస్థాన్ జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న గ్యాంగ్స్టర్లను దక్షిణాది రాష్ట్రాల జైళ్లకు తరలించాలని భావిస్తోంది. నాలుగు ఉత్తరాది రాష్ట్రాల్లో డ్రగ్స్, అక్రమ ఆయుధాల సరఫరా, సుపారీ హత్యలు, హవాలా దందా, బెదిరింపు వసూళ్లు, మానవ అక్రమ రవాణా వంటి తీవ్ర నేరాల్లో కొందరు గ్యాంగ్స్టర్లను అరెస్ట్ చేసి సెంట్రల్ జైళ్లలో పడేశారు. వాళ్లు అక్కడి నుంచే నిక్షేపంగా తమ కార్యకలాపాలను సాగిస్తున్నారు. తొలి దశలో వారిలో 25 మందిని దక్షిణాది జైళ్లకు బదిలీ చేయాలని కోరినట్లు సమాచారం. మూసావాలా హత్యతో అలర్ట్ పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలా హత్యోదంతం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెల్సిందే. దక్షిణాసియాలోని అతిపెద్ద, అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లుండే జైళ్లలో ఒకటైన ఢిల్లీలోని తీహార్ జైలు నుంచే మూసేవాలా హత్య ప్రణాళికను గ్యాంగ్స్టర్లు అమలు చేశారని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. తిహార్‌లో జైలు శిక్ష అనుభవిస్తున్న గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ తన నెట్వర్క్ ద్వారా ఈ హత్య చేయించారనే కేసు దర్యాప్తు ప్రస్తుతం కొనసాగుతోంది. తిహార్‌లోనే ఉన్న మరో గ్యాంగ్‌స్టర్ నీరాజ్ బవానా సైతం జైలు నుంచే తన వ్యాపారాన్ని ఇష్టారీతిగా కొనసాగిస్తున్నారనే ఆరోపణలున్నాయి. పంజాబ్, హరియాణా, రాజస్థాన్ జైళ్లలో ఉన్న గ్యాంగ్స్టర్లదీ ఇదే పంథా. జైళ్లలో కొత్తగా చిన్న ముఠాలుగా ఏర్పడి తమ ప్రణాళికను అమలుచేస్తున్నారు. ఏప్రిల్‌లో గ్యాంగ్‌స్టర్ జితేంద్ర గోగిను చంపేశాడనే కోపంతో మరో గ్యాంగ్‌స్టర్ శేఖర్ రాణాను గోగి సన్నిహితుడు రోహిత్ మోయి జైలు నుంచే కుట్ర పన్ని హత్య చేయించాడు. ఇలాంటి ఘటనలు ఇటీవలి కాలంలో ఉత్తరాదిన పెరిగాయి. కొన్ని కేసుల్లో గ్యాంగ్స్టర్లకు జైలు సిబ్బంది సహకరిస్తున్నారనే ఆరోపణలు గుప్పుమన్నాయి. ఉత్తరాది రాష్ట్రాల జైళ్లలో సామర్థ్యానికి మించి ఖైదీలుండటం మధ్య ఆధిపత్య పోరు పెరిగి గొడవలకు దారితీస్తోంది. వీరికి విదేశాల నుంచి ఆర్ధిక సహకారం అందుతోందనే దారుణ వాస్తవాలు ఎన్ఐఏ దర్యాప్తులో వెల్లడయ్యాయి. ఉత్తరాది జైళ్లలో సామర్థ్యానికి మించి ఖైదీలుండటం కూడా ఎన్ఐఏ ప్రతిపాదనకు మరో కారణం. ఢిల్లీలో 14 సెంట్రల్ జైళ్ల సామర్ధ్యం 9,346 కాగా 17,733 మంది ఖైదీలున్నారు. పంజాబ్‌లో జైళ్లలో 103 శాతం, హరియాణాలో 127 శాతం, రాజస్థాన్‌లో 107 శాతం ఖైదీలున్నారు. -
యూపీ మంత్రికి షాక్.. అక్రమ ఆయుధాల కేసులో దోషిగా తేల్చిన కోర్టు..
లక్నో: ఉత్తర్‌ప్రదేశ్ మంత్రి రాకేశ్ సచాన్కు కాన్పూర్ కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. 1991 అక్రమ ఆయుధాల కేసులో శనివారం ఆయనను దోషిగా తేల్చింది న్యాయస్థానం. ఈ నిర్ణయంతో తీవ్ర అసహనానికి గురైన మంత్రి, ఆయన మద్దతుదారులు, న్యాయవాదులు వెంటనే కోర్టు గది నుంచి వెనుదిరిగినట్లు తెలుస్తోంది. అయితే మంత్రి మాత్రం ఈ ఆరోపణలను ఖండించారు. ఇంకా కొన్ని కేసులు పెండింగ్‌లో ఉన్నాయని, ప్రస్తుత పరిణామాలు తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని పేర్కొన్నారు. కోర్టు తీర్పును తాను గౌరవిస్తానని స్పష్టం చేశారు. మరోవైపు శనివారం రాత్రి రాకేశ్ సచాన్‌పై కోత్వాలి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయాలని కోర్టు ఆదేశించింది. కాన్పుర్ జాయింట్ కమిషనర్ ఆనంద్ ప్రకాశ్ తివారీ ఫిర్యాదు అందినట్లు చెప్పారు. విచారణ జరిపి చర్యలు తీసుకుంటామన్నారు. రెండు రోజుల్లో దర్యాప్తు పూర్తి చేస్తామని పేర్కొన్నారు. రాకేశ్ సచాన్ 1993 నుంచి 2002వరకు సమాజ్‌వాదీ పార్టీలో ఉన్నారు. ఘాటంపూర్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2009లో ఫతేపూర్ నుంచి ఎంపీగా విజయం సాధించారు. ములాయం సింగ్, శివ్‌పాల్ సింగ్‌కు సన్నిహితుడని గుర్తింపు ఉంది. అయితే ఎస్పీ నుంచి కాంగ్రెస్‌లో చేరిన ఆయన 2022 అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీలోకి వెళ్లారు. భోగ్నిపూర్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు. అనంతరం యోగి ఆదిత్యనాథ్ మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు. చదవండి: ప్రభుత్వం ఏర్పడి 36 రోజులు.. ఇప్పటివరకు నోచుకోని మంత్రివర్గ విస్తరణ -
2.78 లక్షల అక్రమ గన్ లైసెన్స్‌లు!
శ్రీనగర్/న్యూఢిల్లీ: ఆయుధాల అక్రమ లైసెన్స్‌ల వ్యవహారంపై కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) విచారణను ముమ్మరం చేసింది. జమ్మూకశ్మీర్‌తోపాటు దేశ రాజధాని ఢిల్లీలో శనివారం ఒకేరోజు 40 చోట్ల సోదాలు నిర్వహించింది. 2012 నుంచి 2016 దాకా ఐదేళ్లపాటు జమ్మూకశ్మీర్‌లో ఏకంగా 2.78 లక్షలకు పైగా ఆయుధ లైసెన్స్‌లను స్థానికేతరులకు జారీ చేసినట్లు ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఈ వ్యవహారంలో భారీగా అక్రమాలు జరిగాయని, అనర్హులు ఫోర్జరీ డాక్యుమెంట్లు సమర్పించి లైసెన్స్‌లు పొందినట్లు సీబీఐ గుర్తించింది. ఈ కేసుకు సంబంధించి ఆధారాలు సేకరించేందుకు సీబీఐ అధికారులు జమ్మూ, శ్రీనగర్, ఉధంపూర్, రాజౌరీ, అనంతనాగ్, బారాముల్లా, ఢిల్లీలలో 40 చోట్ల సోదాలు జరిపారు. ఆయుధాల లైసెన్స్‌ల రాకెట్‌ను ఛేదించేందుకు కొందరు ఐఏఎస్‌లతోపాటు ప్రభుత్వ అధికారుల నివాసాలు, కార్యాలయాలు, 20 ఆయుధాల దుకాణాల్లో ఈ సోదాలు చేపట్టామని సీబీఐ అధికార ప్రతినిధి ఒక ప్రకటనలో వెల్లడించారు. జమ్మూకశ్మీర్ ప్రభుత్వ గిరిజన వ్యవహారాల శాఖ కార్యదర్శి, ఐఏఎస్ అధికారి షాహిద్ ఇక్బాల్ చౌదరి, మరో ఐఏఎస్ అధికారి, ఢిల్లీలో అడిషనల్ రెసిడెంట్ కమిషనర్ ఆఫ్ యూటీ నీరజ్ కుమార్ నివాసాలు, ఆఫీసుల్లో సోదాలు సాగినట్లు తెలిపారు. స్థానికేతరులకు లైసెన్సులు రాజౌరీ జిల్లా మాజీ కలెక్టర్, రిటైర్డ్ అధికారి షబ్బీర్ అహ్మద్ భట్ నివాసంతోపాటు పూంచ్, కుప్వారా, బందీపురా, బారాముల్లా, రాంబన్ జిల్లాల్లో 2012–2016లో అదనపు మేజిస్ట్రేట్లుగా పని చేసిన ఆరుగురు అధికారుల ఇళ్లల్లోనూ సీబీఐ అధికారులు సోదాలు జరిపారు. ఆయుధాల లైసెన్సుల జారీలో అక్రమాలపై సీబీఐ 2018 అక్టోబర్ 16న రెండు వేర్వేరు ఎఫ్ఐఆర్లు నమోదు చేసింది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా 2019 డిసెంబర్లో శ్రీనగర్, జమ్మూ, గుర్గావ్, నోయిడాలలో పలువురు అధికారుల ఇళ్లల్లో సోదాలు నిర్వహించింది. జమ్మూకశ్మీర్‌లో పలు జిల్లాల్లో మేజిస్ట్రేట్లుగా పనిచేసిన అధికారులు ఆయుధాల లైసెన్సుల జారీలో పెద్ద ఎత్తున అవినీతి ఆక్రమాలకు పాల్పడినట్లు, అనర్హులకు వీటిని అందజేసినట్లు ఫిర్యాదులొచ్చాయి. చాలామంది స్థానికంగా నివాసం ఉండకుండానే ఉన్నట్లు తప్పుడు పత్రాలు సమర్పించిన లైసెన్సులు పొందినట్లు తమ పరిశీలనలో తేలిందని, ఇందులో పలువురు ఆయుధ డీలర్ల పాత్ర ఉందని సీబీఐ ప్రతినిధి ఆర్.సి.జోషీ చెప్పారు. స్థానికేతరులకు ఆయుధ లైసెన్సులు ఇవ్వడం చట్టవిరుద్ధమని పేర్కొన్నారు. జమ్మూకశ్మీర్‌లో 22 జిల్లాల్లో ఈ తరహా అక్రమాలు జరిగాయన్నారు. అక్రమ లైసెన్సుల కుంభకోణాన్ని తొలుత 2017లో రాజస్తాన్ ఏటీఎస్ బహిర్గతం చేసింది. అప్పట్లో 50 మందిని అరెస్టు చేసింది. సైనిక సిబ్బంది పేరిట 3,000కు పైగా లైసెన్సులు జారీ చేశారని రాజస్తాన్ ఏటీఎస్ వెల్లడించింది. ఏటీఎస్ సేకరించిన ఆధారాలను బట్టి అప్పటి జమ్మూకశ్మీర్ గవర్నర్ ఎన్.ఎన్.వోహ్రా ఈ కేసును సీబీఐకి అప్పగించారు. సీబీఐకి పూర్తిగా సహకరిస్తా: షాహిద్ ఇక్బాల్ చౌదరి ఆయుధాల లైసెన్స్‌ల కేసులో తన ఇంట్లో సీబీఐ అధికారులు సోదాలు జరిపిన మాట నిజమేనని షాహిద్ ఇక్బాల్ చౌదరి పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. కేసులో నేరారోపణకు సంబంధించి ఎలాంటి ఆధారాలు సీబీఐకి లభించలేదని చెప్పారు. సీబీఐకి పూర్తిగా సహకరిస్తానని తెలిపారు. 2012–2016 మధ్యకాలంలో ఉధంపూర్‌లో 36,000 లైసెన్స్‌లు జారీ చేశారని, తన హయాంలో కేవలం 1,500 లైసెన్సులే జారీ అయ్యాయని స్పష్టం చేశారు. తన హయాంలో ఇచ్చిన లైసెన్స్‌లకు తాను జవాబుదారీగా ఉంటానని అన్నారు. అన్ని జిల్లాల కలెక్టర్ల కంటే తానే తక్కువ లైసెన్స్‌లు జారీ చేశానని చెప్పారు. ఈ కేసు విషయంలో సీబీఐ అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చానని తెలిపారు. తాను 2012–2016 మధ్య జమ్మూకశ్మీర్‌లోని రియాసీ, కథువా, ఉధంపూర్ జిల్లాల మేజిస్ట్రేట్‌గా పనిచేశానని గుర్తుచేశారు. ఈ మూడు జిల్లాల్లో కలిపి 2012–2016 మధ్యకాలంలో మొత్తం 56,000 ఆయుధ లైసెన్స్‌లు జారీ చేశారని, తన హయాంలో కేవలం 1,720 లైసెన్సులు ఇచ్చారని, మొత్తం లైసెన్సుల్లో ఇవి 3 శాతమేనని పేర్కొన్నారు. -
ఏకే–47 రెడీ ఫర్ సేల్!
అక్కడ అన్ని రకాల మారణాయుధాలు దొరుకుతాయి. నాటు తుపాకీ నుంచి ఏకే–47 వరకు ఏది కావాలన్నా అమ్మకానికి రెడీ! అంతేనా.. అమ్మకం తర్వాత అవసరమైన రిపేర్లు, సర్వీసింగ్ సౌకర్యాలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఇవన్నీ చూస్తుంటే ఇదేదో ఇంటర్నేషనల్ తుపాకుల దుకాణం అనుకుంటున్నారా? కాదు.. ఇవన్నీ దొరికేది బిహార్‌లోని సీతా కుంద్‌గా పేరుగాంచిన ప్రాంతంలో. ఈ ప్రాంతానికి చెందిన మీర్జాపూర్– బర్దా గ్రామం అక్రమాయుధ మార్కెట్‌కు ప్రసిద్ధి. విదేశాల నుంచి ఆయుధాలు.. రెండువేల కుటుంబాలకు పైగా నివసిస్తున్న మీర్జాపూర్లో అన్నిరకాల ఆయుధాలు అమ్ముతున్నారు. ఈ గ్రామానికి చెందిన పలువురు డిఫెన్స్ సర్వీసెస్‌తో పాటు టీచర్లుగానూ పనిచేస్తున్నారు. సులభంగా డబ్బు సంపాదనకు అవకాశం ఉండడంతో ఈ ఊర్లో ఎక్కువమంది అక్రమ ఆయుధాల వ్యాపారంలో భాగస్వాములవుతున్నారు. ఇక్కడి అక్రమాయుధ తయారీ పరిశ్రమలపై పోలీసులు తరచుగా దాడులు చేసి ధ్వంసం చేస్తున్నారు. అయినప్పటికీ మయన్మార్, బంగ్లాదేశ్, నేపాల్లలోని అంతర్జాతీయ ఆయుధాల పంపిణీదారులతో స్థానిక ఆయుధాల వ్యాపారుల సంబంధాలకు మాత్రం బ్రేక్ వేయలేకపోయారు. పోలీసుల దాడులు పెరగడంతో కొందరు వ్యాపారులు పొరుగున ఉన్న పశ్చిమబెంగాల్, యూపీ, జార్ఖండ్‌కు మకాం మార్చారు. నక్సల్స్‌కు అమ్ముతున్నారు.. గత ఆగస్టు 29న మీర్జాపూర్–బర్దా వాసి ఇమ్రాన్ ఆలం నుంచి మూడు ఏకే 47 తుపాకులను స్వాధీనం చేసుకున్న సందర్భంగా జబల్పూర్ సెంట్రల్ ఆర్డినెన్స్ డిపో ఉద్యోగులతో స్థానిక ఆయుధాల వ్యాపారులకున్న సంబంధాలు బయటపడ్డాయి. ఆ తర్వాత మధ్యప్రదేశ్, పశ్చిమబెంగాల్, జార్ఖండ్‌లో జరిపిన దాడుల్లో 20 ఏకే 47 తుపాకులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా 22 అక్రమ ఆయుధవ్యాపారులను అరెస్ట్ చేసినపుడు తాము నిషేదిత ఆయుధాలను నక్సల్ చీలిక గ్రూపులు, నేరబృందాలు, చివరకు రాజకీయవేత్తలకు కూడా విక్రయించినట్లు తెలియజేశారు. యువకులకు పెళ్లిళ్లు కావట్లేదు.. ‘కొందరి వల్ల బర్దా పంచాయతీకి ఉన్న మంచిపేరు పోతోంది. కొన్ని కుటుంబాలు నిర్వహిస్తున్న అక్రమ ఆయుధాల వ్యాపారం వల్ల మాకు తీరని నష్టం జరుగుతోంది. ఈ గ్రామంలోని యువకులతో పెళ్లిళ్లు చేసేందుకు ఆడపిల్లల తల్లిదండ్రులు జంకుతున్నారు. ప్రభుత్వ కార్యాలయాలు, మార్కెట్లలో మమ్మల్ని అనుమానంగా చూస్తున్నారు. నన్ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని రెండ్రోజుల పాటు ప్రశ్నించారు’అని రాష్ట్రీయ జనతాదళ్ జిల్లా పరిషత్ సభ్యుడు మహ్మద్ పర్వేజ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ గ్రామానికి చెందిన ఇమ్రాన్ ఆలం జబల్పూర్ ఆయుధాల డిపో నుంచి పెద్దసంఖ్యలో ఏకే 47 ఆయుధాలు దొంగిలించాడు. ఈ ఊరిలోని ఒక బావి నుంచి 12 ఏకే 47 తుపాకులను ఆ తర్వాత పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.అక్రమ ఆయుధాల కేసులో అతడి కుటుంబానికి చెందిన ఆరుగురిని అరెస్ట్‌చేశారు. సంప్రదాయంగా ఆయుధాల తయారీ.. 1760 నుంచి 1764 వరకు ఈ ప్రాంతాన్ని పాలించిన బెంగాల్‌కు చెందిన మీర్ ఖాసిం అలీ అనే నవాబ్ ఆయుధాల తయారీ ఫ్యాక్టరీని ఇక్కడ స్థాపించాడు. వందల కుటుంబాలు ఆయుధాల తయారీ పరిశ్రమలో నిమగ్నం కావడంతో తయారీ సంప్రదాయంగా కొనసాగింది. తుపాకీ మందులో ప్రధాన వనరు ‘పొటాషియం నైట్రేట్’ముంగేర్ ప్రాంతంలో అధికంగా లభ్యం కావడం కూడా ఈ పరిశ్రమ నిరాటంకంగా కొనసాగేందుకు ప్రధాన కారణంగా పోలీసులు అంచనా వేస్తున్నారు. నేటికీ అక్కడ ‘తోప్ బజార్లు’, ‘బ్యారెల్ బజార్లు’అనే పేర్లతో మార్కెట్లు కొనసాగుతున్నాయంటే ఆయుధాల ప్రభావం ఎంతగా ఉందో అర్థం చేసుకోవచ్చు. -
జగిత్యాలలో ఆయుధాల కలకలం
-
జగిత్యాలలో అక్రమ ఆయుధాల కలకలం
సాక్షి, జగిత్యాల: ఇద్దరు వ్యక్తులు అక్రమ ఆయుధాలతో పట్టుబడటం జిల్లా కేంద్రంలో కలకలం రేపింది. జగిత్యాల పట్టణంలో తనిఖీలు చేపట్టిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు అక్రమ ఆయుధాలు కలిగి ఉన్న ముంబైకి చెందిన రాజుభాయ్, వేములవాడకు చెందిన తిరుపతిలను అదుపులోని తీసుకున్నారు. వారి వద్ద నుంచి రెండు తుపాకులు, 12 బులెట్లను స్వాధీనం చేసుకున్నారు. గతంలో ధర్మపురిలో కాంగ్రెస్ నాయకుడు సత్యనారాయణ గౌడ్‌ను కాల్చి చంపిన కేసులో రాజుభాయ్ ప్రధాన నిందితుడు, కాగా తిరుపతి అతనికి ఆయుధం విక్రయించాడు. కాగా ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న టాస్క్‌ఫోర్స్ పోలీసులు నిందితులను రహస్యంగా విచారిస్తున్నారు. మీడియా కంటపడకుండా వారిని రిమాండ్‌కు తరలించారు. -
అక్రమ ఆయుధ కర్మాగారం .. ఇద్దరు అరెస్ట్
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్లో అక్రమంగా నిర్వహిస్తున్న ఆయుధ తయారీ పరిశ్రమను పోలీసు అధికారులు కనుగొన్నారు. ఉత్తర 24 పరగణాలలోని అశోక్‌నగర్‌లో ఉన్న ఓ మామిడి తోటలో దీన్ని నిర్వహిస్తున్నారు. తమకు అందిన పక్కా సమాచారం మేరకు పోలీసులు ఆ ప్రాంతంపై మంగళవారం దాడి చేసి టెంట్ కింద కర్మాగారం నిర్వహిస్తున్న కుములియా ప్రాంతానికి చెందిన సుదామ్ మజుందార్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఆ ప్రదేశం నుంచి తొమ్మిది తుపాకులను, ఆయుధాల తయారీకి ఉపయోగించే విడి భాగాలను భారీ మొత్తంలో స్వాధీనం చేసుకున్నారు. అతడిని విచారించగా వీటిని స్థానికంగా తయారు చేస్తున్నట్లు చెప్పాడు. ఈ ఆయుధాల తయారీలో ప్రమేయం ఉన్న మరో వ్యక్తిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిద్దరిని అరెస్టు చేసి బరాసత్ జిల్లా కోర్టులో బుధవారం హాజరుపరిచినట్లు జిల్లా సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. -
అక్రమ ఆయుధాల కేసులో ఎంపీకి నోటీసులు
అనంతపురం: అక్రమ ఆయుధాల కోనుగోలు వ్యవహారంలో ఓ ఎంపీకి అనంతపురం జిల్లా పోలీసులు నోటీసులు జారీచేశారు. ఈ నెల 20వ తేదీలోపు అనంతపురం త్రీటౌన్ పోలీస్‌స్టేషన్‌లో హాజరుకావాలని బళ్లారి (కర్ణాటక) ఎంపీగా కొనసాగుతున్న శ్రీరాములుకు శుక్రవారం పోలీసులు నోటీసులు అందించారు. మూడు రోజుల కిందట అనంతపురం రైల్వే స్టేషన్ వద్ద నలుగురు వ్యక్తులు అనుమానాస్పదంగా సంచరించడాన్ని పోలీసులు గుర్తించారు. వారిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా తుపాకీ కొనుగోలు వ్యవహారం బయటికొచ్చింది. అయితే పట్టుబడ్డ నలుగురూ తాము బళ్లారి ఎంపీ శ్రీరాములు సంబంధీకులమని చెప్పారు. దీంతో ఎంపీని ప్రశ్నించాలని పోలీసులు భావించారు. ఈ మేరకు తమ ఎదుట హాజరు కావాలని నోటీసులు ఇచ్చారు.