అక్రమ ఆయుధాల సుపారీ గ్యాంగ్‌ అరెస్ట్‌ | Supari gang of illegal arms arrested Andhra Pradesh | Sakshi
Sakshi News home page

అక్రమ ఆయుధాల సుపారీ గ్యాంగ్‌ అరెస్ట్‌

Published Tue, Dec 27 2022 6:12 AM | Last Updated on Tue, Dec 27 2022 6:14 AM

Supari gang of illegal arms arrested Andhra Pradesh - Sakshi

పోలీసులు స్వాధీనం చేసుకున్న ఆయుధాలు

సాక్షి, అమరావతి: అక్రమ ఆయుధాల తయారీ, విక్రయాలతోపాటు నకిలీ నోట్ల దందా నిర్వహిస్తు­న్న అంతర్‌ రాష్ట్ర ముఠాను ఏపీ పోలీసులు అరెస్ట్‌ చేశారు. కర్ణాటకలోని బెంగళూరుకు చెందిన ముఠా అనంతపురం, బళ్లారి కేంద్రాలుగా వివిధ రాష్ట్రాల్లో కిరాయి హత్యలకు పాల్పడుతూ, నకిలీ నోట్ల ము­ద్రణ, చలామణి చేస్తున్నట్టు గుర్తించారు. ఈ గ్యాంగ్‌కు చెందిన ఆరుగురు సభ్యులను అరెస్ట్‌ చేయడంతోపాటు వారి నుంచి 18 ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. మంగళగిరిలోని రాష్ట్ర పోలీస్‌ ప్రధాన కార్యాలయంలో డీజీపీ కేవీ రాజేంద్రనాథ్‌రెడ్డి సోమవారం వెల్లడించిన వివరాలిలా ఉన్నాయి.

తీగ లాగితే..
అనంతపురం జిల్లాలో నకిలీ నోట్లు చలామణి చేస్తున్న కొందర్ని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా.. అంతర్‌ రాష్ట్ర అక్రమ ఆయుధాల ముఠా వ్యవహారం బయటపడింది. దాంతో అనంతపురం జిల్లా పోలీసులతో స్పెషల్‌ ఆపరేషన్స్‌ టీమ్‌ ఏర్పాటు చేసి లోతుగా దర్యాప్తు చేపట్టారు. బెంగళూరుకు చెందిన రౌడీషీటర్లు జంషీద్, ముబారక్, అమీర్‌ పాషా, రియల్‌ అబ్దుల్‌ షేక్‌ మహారాష్ట్రలోని సిర్పూర్‌ నుంచి గంజాయి, మధ్యప్రదేశ్‌ నుంచి ఆయుధాలు కొనుగోలు చేస్తున్నట్టు పోలీసులకు సమాచారం అందింది.

స్పెషల్‌ ఆపరేషన్స్‌ టీమ్‌ వారిని అరెస్ట్‌ చేసి 12 అక్రమ ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. స్పెషల్‌ టీమ్‌ వారిని విచారించి మరింత కీలక సమాచారాన్ని రాబట్టింది. అనంతరం మధ్యప్రదేశ్‌లోని బర్వానీ జిల్లాలో హిరేహాల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో అక్రమ ఆయుధాల తయారీ కేంద్రంపై దాడులు నిర్వహించింది. ఆయుధాల తయారీదారుడు, డీలర్‌ రాజ్‌పాల్‌సింగ్‌తోపాటు ఆయుధాల సరఫరాదారుడిగా ఉన్న సుతార్‌ను అరెస్ట్‌ చేశారు. వారి నుంచి 6 అక్రమ ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.

మధ్యప్రదేశ్‌కు చెందిన ఆయుధాల డీలర్ల నుంచి కొనుగోలు చేసిన ఆయుధాలతో బెంగళూరుకు చెందిన ముఠా సభ్యులు కర్ణాటకలో వివిధ ప్రాంతాల్లో హత్యలు, దోపిడీలకు పాల్పడుతున్నట్టు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. రాజ్‌పాల్‌సింగ్‌ దేశంలోని వందలాది ప్రాంతాలకు అక్రమ ఆయుధాలు సరఫరా చేస్తున్నట్టు కూడా బయటపడింది. నిందితులు ఆరుగురిపై గంజాయి అక్రమ రవాణా, నకిలీ నోట్ల రాకెట్, అక్రమ ఆయుధాలు, కిరాయి హత్యలు తదితర అభియోగాలపై ఏపీ, కర్ణాటక, మధ్యప్రదేశ్, గోవాలలో పలు కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ ముఠా నెట్‌వర్క్‌పై మరిన్ని కోణాల్లో పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. 


అసాంఘిక శక్తులను ఉపేక్షించేదే లేదు
సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశాల మేరకు రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు అత్యధిక ప్రాధాన్యమిస్తున్నాం. ఈ క్రమంలో అనంతపురం జిల్లా పోలీసులు కీలక కేసును ఛేదించారు. బెంగళూరుకు చెందిన కిరాయి హంతకుల ముఠా అనంతపురం–బళ్లారి కేంద్రాలుగా  కొంతకాలంగా నకిలీ నోట్లు, అక్రమ ఆయుధాల దందా నిర్వహిస్తున్నట్టు గుర్తించాం. అక్రమ ఆయుధాల తయారీదారు, డీలర్‌తోపాటు అంతర్‌ రాష్ట్ర ముఠాకు చెందిన ఆరుగురిని అరెస్ట్‌ చేసి 18 ఆయుధాలను స్వాధీనం చేసుకున్నాం.  
– కేవీ రాజేంద్రనాథ్‌రెడ్డి, డీజీపీ 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement