లక్నో: ఉత్తర్‌ప్రదేశ్ మంత్రి రాకేశ్ సచాన్‌కు కాన్పూర్ కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. 1991 అక్రమ ఆయుధాల కేసులో శనివారం ఆయనను దోషిగా తేల్చింది న్యాయస్థానం. ఈ నిర్ణయంతో తీవ్ర అసహనానికి గురైన మంత్రి, ఆయన మద్దతుదారులు, న్యాయవాదులు వెంటనే కోర్టు గది నుంచి వెనుదిరిగినట్లు తెలుస్తోంది.
అయితే మంత్రి మాత్రం ఈ ఆరోపణలను ఖండించారు. ఇంకా కొన్ని కేసులు పెండింగ్‌లో ఉన్నాయని, ప్రస్తుత పరిణామాలు తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని పేర్కొన్నారు. కోర్టు తీర్పును తాను గౌరవిస్తానని స్పష్టం చేశారు.
మరోవైపు శనివారం రాత్రి రాకేశ్ సచాన్‌పై కోత్వాలి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేయాలని కోర్టు ఆదేశించింది. కాన్పుర్ జాయింట్ కమిషనర్ ఆనంద్ ప్రకాశ్ తివారీ ఫిర్యాదు అందినట్లు చెప్పారు. విచారణ జరిపి చర్యలు తీసుకుంటామన్నారు. రెండు రోజుల్లో దర్యాప్తు పూర్తి చేస్తామని పేర్కొన్నారు.
రాకేశ్ సచాన్ 1993 నుంచి 2002వరకు సమాజ్‌వాదీ పార్టీలో ఉన్నారు. ఘాటంపూర్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2009లో ఫతేపూర్ నుంచి ఎంపీగా విజయం సాధించారు. ములాయం సింగ్, శివ్‌పాల్ సింగ్‌కు సన్నిహితుడని గుర్తింపు ఉంది. అయితే ఎస్పీ నుంచి కాంగ్రెస్‌లో చేరిన ఆయన 2022 అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీలోకి వెళ్లారు. భోగ్నిపూర్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు. అనంతరం యోగి ఆదిత్యనాథ్ మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు.
చదవండి: ప్రభుత్వం ఏర్పడి 36 రోజులు.. ఇప్పటివరకు నోచుకోని మంత్రివర్గ విస్తరణ
Comments
Please login to add a commentAdd a comment