మోదీ మరోసారి ప్రధాని కాలేరు: రాహుల్ గాంధీ
కనౌజ్/కాన్పూర్: విపక్షాల ‘ఇండియా’ కూటమి తుపాను ఉత్తరప్రదేశ్‌లోకి దూసుకొస్తోందని ఈ ధాటికి మరోసారి మోదీ ప్రధాని కాలేరని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. యూపీలో 80 స్థానాలకుగాను కనీసం 50 చోట్ల మా కూటమి విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తంచేశారు. శుక్రవారం ఉత్తరప్రదేశ్‌లోని కనౌజ్, కాన్పూర్‌లలో ఎన్నికల ప్రచార ర్యాలీల్లో రాహుల్ మాట్లాడారు. ‘‘ దేశ ప్రధానిగా మోదీ మరోసారి పగ్గాలు చేపట్టలేరని లిఖితపూర్వక గ్యారెంటీగా భావించండి. ఇక అంతా అయిపోయింది. బీజేపీ ఓటమి ఖాయం.
అందుకు అనుగుణంగానే విపక్షాల కూటమి చాన్నాళ్ల క్రితమే ఎన్నికల ప్రచార వ్యూహాలు రచించింది. విద్వేష బజార్లలో ప్రేమ దుకాణాలను తెరిచాం. భారత్ జోడో యాత్ర, న్యాయయాత్ర చేశాం. దేశవ్యాప్తంగా విపక్షాల సమావేశాలు నిర్వహించాం’’ అని అన్నారు. పారిశ్రామికవేత్తలు అదానీ, అంబానీలతో కాంగ్రెస్ లోపాయికారీ ఒప్పందం చేసుకుందన్న మోదీ ఆరోపణలపై రాహుల్ స్పందించారు. ‘‘ ఓటర్లు పదేళ్ల నుంచి చూస్తున్నారు. ఒక్కసారైనా మోదీ అదానీ, అంబానీల పేరెత్తలేదు. కానీ ఇప్పుడు ఓటమి సుడిగుండం నుంచి కాపాడతారేమోనని వాళ్ల పేర్లు తొలిసారిగా ప్రస్తావిస్తున్నారు. ఓడిపోతున్నాను.. కాపాడండి అదానీ, అంబానీజీ అంటూ మోదీ ప్రాథేయపడుతున్నారు’’ అని రాహుల్ వెటకారంగా మాట్లాడారు.
మోదీకి టెంపో బాగా తెలుసు
టెంపోల నిండా అదానీ, అంబానీల నుంచి నగదు మూటలు వచ్చినందుకేæ కాంగ్రెస్ నోరుమూసుకుందని మోదీ అనడంపై రాహుల్.. ‘‘ అంటే మోదీకి తరచూ అదానీ డబ్బులను టెంపోలో పంపిస్తారన్నమాట. ఏ రకం టెంపోలో డబ్బులు పంపిస్తారో ఆయనకు బాగా తెలుసు. టెంపోల గురించి మోదీకి బాగా అవగాహన ఉన్నట్లుంది’’ అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment