అక్కడ అన్ని రకాల మారణాయుధాలు దొరుకుతాయి. నాటు తుపాకీ నుంచి ఏకే–47 వరకు ఏది కావాలన్నా అమ్మకానికి రెడీ! అంతేనా.. అమ్మకం తర్వాత అవసరమైన రిపేర్లు, సర్వీసింగ్ సౌకర్యాలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఇవన్నీ చూస్తుంటే ఇదేదో ఇంటర్నేషనల్ తుపాకుల దుకాణం అనుకుంటున్నారా? కాదు.. ఇవన్నీ దొరికేది బిహార్‌లోని సీతా కుంద్‌గా పేరుగాంచిన ప్రాంతంలో. ఈ ప్రాంతానికి చెందిన మీర్జాపూర్– బర్దా గ్రామం అక్రమాయుధ మార్కెట్‌కు ప్రసిద్ధి.
విదేశాల నుంచి ఆయుధాలు..
రెండువేల కుటుంబాలకు పైగా నివసిస్తున్న మీర్జాపూర్‌లో అన్నిరకాల ఆయుధాలు అమ్ముతున్నారు. ఈ గ్రామానికి చెందిన పలువురు డిఫెన్స్ సర్వీసెస్‌తో పాటు టీచర్లుగానూ పనిచేస్తున్నారు. సులభంగా డబ్బు సంపాదనకు అవకాశం ఉండడంతో ఈ ఊర్లో ఎక్కువమంది అక్రమ ఆయుధాల వ్యాపారంలో భాగస్వాములవుతున్నారు. ఇక్కడి అక్రమాయుధ తయారీ పరిశ్రమలపై పోలీసులు తరచుగా దాడులు చేసి ధ్వంసం చేస్తున్నారు. అయినప్పటికీ మయన్మార్, బంగ్లాదేశ్, నేపాల్‌లలోని అంతర్జాతీయ ఆయుధాల పంపిణీదారులతో స్థానిక ఆయుధాల వ్యాపారుల సంబంధాలకు మాత్రం బ్రేక్ వేయలేకపోయారు. పోలీసుల దాడులు పెరగడంతో కొందరు వ్యాపారులు పొరుగున ఉన్న పశ్చిమబెంగాల్, యూపీ, జార్ఖండ్‌కు మకాం మార్చారు.
నక్సల్స్‌కు అమ్ముతున్నారు..
గత ఆగస్టు 29న మీర్జాపూర్–బర్దా వాసి ఇమ్రాన్ ఆలం నుంచి మూడు ఏకే 47 తుపాకులను స్వాధీనం చేసుకున్న సందర్భంగా జబల్‌పూర్ సెంట్రల్ ఆర్డినెన్స్ డిపో ఉద్యోగులతో స్థానిక ఆయుధాల వ్యాపారులకున్న సంబంధాలు బయటపడ్డాయి. ఆ తర్వాత మధ్యప్రదేశ్, పశ్చిమబెంగాల్, జార్ఖండ్‌లో జరిపిన దాడుల్లో 20 ఏకే 47 తుపాకులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా 22 అక్రమ ఆయుధవ్యాపారులను అరెస్ట్ చేసినపుడు తాము నిషేదిత ఆయుధాలను నక్సల్ చీలిక గ్రూపులు, నేరబృందాలు, చివరకు రాజకీయవేత్తలకు కూడా విక్రయించినట్లు తెలియజేశారు.
యువకులకు పెళ్లిళ్లు కావట్లేదు..
‘కొందరి వల్ల బర్దా పంచాయతీకి ఉన్న మంచిపేరు పోతోంది. కొన్ని కుటుంబాలు నిర్వహిస్తున్న అక్రమ ఆయుధాల వ్యాపారం వల్ల మాకు తీరని నష్టం జరుగుతోంది. ఈ గ్రామంలోని యువకులతో పెళ్లిళ్లు చేసేందుకు ఆడపిల్లల తల్లిదండ్రులు జంకుతున్నారు. ప్రభుత్వ కార్యాలయాలు, మార్కెట్లలో మమ్మల్ని అనుమానంగా చూస్తున్నారు. నన్ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని రెండ్రోజుల పాటు ప్రశ్నించారు’అని రాష్ట్రీయ జనతాదళ్ జిల్లా పరిషత్ సభ్యుడు మహ్మద్ పర్వేజ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ గ్రామానికి చెందిన ఇమ్రాన్ ఆలం జబల్‌పూర్ ఆయుధాల డిపో నుంచి పెద్దసంఖ్యలో ఏకే 47 ఆయుధాలు దొంగిలించాడు. ఈ ఊరిలోని ఒక బావి నుంచి 12 ఏకే 47 తుపాకులను ఆ తర్వాత పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.అక్రమ ఆయుధాల కేసులో అతడి కుటుంబానికి చెందిన ఆరుగురిని అరెస్ట్‌చేశారు.
సంప్రదాయంగా ఆయుధాల తయారీ..
1760 నుంచి 1764 వరకు ఈ ప్రాంతాన్ని పాలించిన బెంగాల్‌కు చెందిన మీర్ ఖాసిం అలీ అనే నవాబ్ ఆయుధాల తయారీ ఫ్యాక్టరీని ఇక్కడ స్థాపించాడు. వందల కుటుంబాలు ఆయుధాల తయారీ పరిశ్రమలో నిమగ్నం కావడంతో తయారీ సంప్రదాయంగా కొనసాగింది. తుపాకీ మందులో ప్రధాన వనరు ‘పొటాషియం నైట్రేట్’ముంగేర్ ప్రాంతంలో అధికంగా లభ్యం కావడం కూడా ఈ పరిశ్రమ నిరాటంకంగా కొనసాగేందుకు ప్రధాన కారణంగా పోలీసులు అంచనా వేస్తున్నారు. నేటికీ అక్కడ ‘తోప్ బజార్లు’, ‘బ్యారెల్ బజార్లు’అనే పేర్లతో మార్కెట్లు కొనసాగుతున్నాయంటే ఆయుధాల ప్రభావం ఎంతగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment