సాక్షి, సిటీబ్యూరో: ఉత్తరప్రదేశ్, బీహార్, హర్యానా రాష్ట్రాల నుంచి నాటు తుపాకులు తీసుకువచ్చి సిటీలో విక్రయించే ముఠాలు ఎన్నో ఉన్నాయి. టాస్క్‌ఫోర్స్, ఎస్వోటీ పోలీసులు తరచుగా ఇలాంటి గ్యాంగ్స్‌ను పట్టుకుంటూ ఉంటాయి. ఆయా ప్రాంతాల్లో ఆ మారణాయుధాలు విచ్చలవిడిగా లభిస్తూ ఉండటమే దీనికి కారణం. అయితే ఇక్కడ సీన్ రివర్స్ అయింది. నగరానికి చెందిన శివకుమార్ అనే వ్యక్తి నాటు తుపాకీ, తూటాలు తీసుకుని పుణే చేరుకున్నాడు. అక్కడ ‘ఆసక్తి’ ఉన్న వారికి వీటిని విక్రయించడానికి ప్రయత్నాలు చేశాడు. దీనిపై సమాచారం అందుకున్న ఫర్ఖానా పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఇక్కడి అధికారులు ఎవరీ శివ? అతడికి వ్యవహారాలు ఏంటి? అనే అంశాలను ఆరా తీస్తున్నారు.
నగరానికి చెందిన శివ కుమార్ కొన్నేళ్ల క్రితమే తల్లిదండ్రులను కోల్పోయాడు. ప్రింటింగ్ టెక్నాలజీలో ఇంజినీరింగ్ పూర్తి చేసినా సరైన ఉద్యోగం లభించలేదు. కొన్ని చిన్న చిన్న ఉద్యోగాలు చేసినా వాటిలో వచ్చే జీతంతో బతుకీడ్చటం కష్టసాధ్యంగా మారింది. దీంతో తేలిగ్గా డబ్బు సంపాదించడం కోసం ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించాడు. ఈ నేపథ్యంలో అతడి దృష్టి మారణాయుధాల విక్రయంపై పడింది. ఇటీవల ఓ నాటు తుపాకీ, ఐదు తూటాలు సమీకరించుకున్న అతగాడు వీటిని ఎక్కువ మొత్తానికి అమ్మి సొమ్ము చేసుకోవాలని భావించాడు. దీనికోసం ఖరీదు చేసే వారికి వెతుకుతూ పుణే చేరుకున్నాడు. ఫర్ఖానా పోలీసుస్టేషన్ పరిధిలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న శివను అక్కడి పోలీసులు గత వారం వలపన్ని పట్టుకున్నారు. తనిఖీ చేయగా అతడి వద్ద తుపాకీ, తూటాలు లభించాయి. వీటి విలువ రూ.30 వేలు ఉంటుందని పోలీసులు నిర్థారించారు. అయితే శివకు ఈ తుపాకీ, తూటాలు ఎక్కడి నుంచి వచ్చాయి? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. వీటిని సిటీలో సమీకరించుకుని విక్రయించడానికి అక్కడకు తీసుకువెళ్లాడా? లేక మహారాష్ట్రలోనే తక్కువ ధరకు ఖరీదు చేసి ఎక్కువ రేటుకు విక్రయించాడా? అనేది తేలాల్సి ఉంది. దీనిపై పోలీసులు లోతుగా ఆరా తీస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment