వివరాలు వెల్లడిస్తున్న పోలీసులు,(వృత్తంలో నిందితులు)
చిలకలగూడ : మీది బిహారే, మాదీ బిహారే అంటూ అదే రాష్ట్రానికి చెందిన రైలు ప్రయాణీకులను టార్గెట్ చేసుకుని దృష్టి మరల్చి చోరీలకు పాల్పడుతున్న నలుగురు యువకుల బిహారీ ముఠాను మూడు గంటల్లోనే పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. చిలకలగూడ ఠాణా లో గోపాలపురం ఏసీపీ శ్రీనివాసరావు, చిలకలగూడ సీఐ బాలగంగిరెడ్డి, డీఐ నర్సింహరాజులు బుధవారం వివరాలు వెల్లడించారు. బిహార్‌కు చెందిన అనీల్‌కుమార్‌పాటిల్ ఘటకేసర్‌లోని ఓ ఫౌల్ట్రీ సంస్థలో పనిచేస్తున్నాడు. ఆర్‌ఆర్‌బీ పరీక్షల కోసం బిహార్ వెళ్లేందుకు గాను అతను ఈనెల 22న సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు చేరుకుని పాట్నా ఎక్స్‌ప్రెస్ కోసం ఎదురు చూస్తున్నాడు. అదే సమయంలో అక్కడికి వచ్చిన ఇద్దరు యువకులు బిహారీ భాషలో అతడితో మాట్లాడి పరిచయం చేసుకున్నారు. ట్రైన్ టిక్కెట్ కన్‌ఫర్మ్ చేయిస్తామని నమ్మించి సీతాఫల్‌మండి చౌరస్తాకు తీసుకెళ్లి దృష్టి మరల్చి బ్యాగును కాజేసి అక్కడి నుంచి పరారయ్యారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు చిలకలగూడ డీఐ నర్సింహరాజు నేతృత్వంలో నాలుగు బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చేపట్టారు.
టీఆర్‌ఎస్ పోస్టర్ ఆధారంగా...
సీతాఫల్‌మండి చౌరస్తాలోని సీసీ కెమెరాల పుటేజీలో నిందితులు కాజేసిన లగేజీతో ఆటోలో వెళ్లిన దృశ్యాలు రికార్డయ్యాయి. ఆటో నంబరు స్పష్టంగా లేకపోవడంతో ఆటో వెనుక ఉన్న టీఆర్‌ఎస్ పోస్టర్ ఆధారంగా సికింద్రాబాద్ పరిసరాల్లోని ఆటో స్టాండ్‌ల వద్ద విచారణ చేపట్టారు. ఓ ఆటోడ్రైవర్ నిందితులను గుర్తు పట్టి, సీతాఫల్‌మండిలో ఎక్కిన నలుగురు యువకులను మాణికేశ్వరినగర్‌లో దించినట్లు తెలిపారు. మాణికేశ్వరినగర్‌లో నిందితులు నివసిస్తున్న గదిపై దాడి చేసిన పోలీసులు నలుగురు బిహారీలను అదుపులోకి తీసుకుని విచారించగా నేరం చేసినట్లు అంగీకరించారు. వారి నుంచి రూ.10వేల నగదు, ఐఫోను స్వాధీనం చేసుకున్నారు. గది నిండా ప్రయాణీకుల నుంచి కాజేసిన బ్యాగులు, సూట్‌కేసులు ఉన్నట్లు గుర్తించారు.
బిహారీలే టార్గెట్..
బిహార్‌లోని సీతామడి జిల్లాకు చెందిన భువనేశ్వర్ పాస్మాన్ , శంకర్ కుమార్ పూర్వీ, సుభాష్‌కుమార్, రాంబు నగరానికి వలస వచ్చి మాణికేశ్వరినగర్‌లో నివాసం ఉంటున్నారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ పరిసరరాల్లో సంచరిస్తూ ఒంటరిగా బిహారీలను మాత్రమే టార్గెట్ చేసి వారితో పరిచయం పెంచుకుని దృష్టి మరల్చి లగేజీలను కాజేసేవారు. నిందితులను అరెస్ట్ చేసిన చిలకలగూడ పోలీసులు, క్రైం సిబ్బందిని ఉత్తరమండలం డీసీపీ కల్మేశ్వర్, గోపాలపురం ఏసీపీ శ్రీనివాసరావు అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment