ముఖియా గ్యాంగ్‌ సర్వెంట్స్‌.. డేంజర్‌ క్రిమినల్స్‌! | Mukhiya Gang Arrest in Hyderabad | Sakshi
Sakshi News home page

ఈ సర్వెంట్స్‌.. డేంజర్‌ క్రిమినల్స్‌!

Published Thu, Feb 13 2020 7:55 AM | Last Updated on Thu, Feb 13 2020 7:55 AM

Mukhiya Gang Arrest in Hyderabad - Sakshi

వివరాలు వెల్లడిస్తున్న నగర సీపీ అంజనీకుమార్‌

సాక్షి, సిటీబ్యూరో: దేశ వ్యాప్తంగా వివిధ నగరాల్లో ఉన్న సంపన్నుల ఇళ్లను టార్గెట్‌గా చేసుకుని, పనివాళ్లుగా చేరి అదును చూసుకుని అందినకాడికి ఎత్తుకుపోయే ముఖియా గ్యాంగ్‌కు పశ్చిమ మండల పరిధిలోని బంజారాహిల్స్‌ పోలీసుల చెక్‌ చెప్పారు. గత ఏడాది డిసెంబర్‌లో బంజారాహిల్స్‌ పరిధిలో నివసించే కపిల్‌ గుప్త ఇంటి నుంచి ఈ ముఠా రూ.5.7 లక్షల నగదుతో సహా రూ.2.5 కోట్ల సొత్తు చోరీ చేసింది. ఈ ముఠా కోసం మూడు రాష్ట్రాల్లో గాలించిన బంజారాహిల్స్‌ పోలీసులు నలుగురిని అరెస్టు చేయగలిగారని, మరో ఇద్దరు పరారీలో ఉన్నారని నగర పోలీసు కమిషనర్‌ అంజనీకుమార్‌ బుధవారం తెలిపారు. వెస్ట్‌జోన్‌ డీసీపీ ఏఆర్‌ శ్రీనివాస్, బంజారాహిల్స్‌ ఏసీపీ కేఎస్‌ రావులతో కలిసి తన కార్యాలయంలో వివరాలు వెల్లడించారు. 

సుమారు 20 మంది..  
బిహార్‌లోని మధుబని ప్రాంతానికి చెందిన ముఖియా గ్యాంగ్‌లో 20 మంది వరకు సభ్యులు ఉన్నారు. వీరిలో ఒకరు తొలుత ఓ నగరానికి వెళ్లి సంపన్నులు నివసించే ప్రాంతాల్లో పనివాళ్లు అవసరమైన ఇల్లను గుర్తిస్తాడు. ఆ యజమానితో పరిచయం పెంచుకోవడం ద్వారా డ్రైవర్, వంటవాడు, పనివాడిగా చేరతారు. కొన్ని రోజుల పాటు నమ్మకంగా పని చేసి తన యజమాని వద్ద నమ్మకం సంపాదిస్తారు. ఆపై ఆయన బంధువులు, స్నేహితుల్లో పనివాళ్లు  అవసరం ఉన్న వారిని గుర్తిస్తారు. తన యజమాని ద్వారానే రిఫర్‌ చేయించుకున్న మధుబని ప్రాంతంలో ఉండే అనుచరుల్ని రప్పించి ఆ ఇళ్లల్లో పనికి పెడతారు. ఇలా గ్యాంగ్‌ మొత్తం సెటిల్‌ అయిన తర్వాత ఎవరికి వారుగా అదను కోసం ఎదురుచూస్తారు. ఎవరి ఇంటి యజమానులు నిర్లక్ష్యంగా వ్యవహరించి అవకాశం ఇస్తారో.. అంతా కలిసి ఆ ఇంటిపై పడి చోరీ చేస్తారు. అవసరమైతే యజమానుల్ని చంపి, సొత్తు, సొమ్ము తీసుకుపోవడానికీ వెనుకాడరు. ఈ పంథాలో ముఖియా గ్యాంగ్‌ 2005 నుంచి బీహార్, ఉత్తరప్రదేశ్, గుజరాత్, తమిళనాడు, హరియాణా, ఢిల్లీ సహా మొత్తం ఎనిమిది రాష్ట్రాల్లో నేరం చేసింది. ప్రది చోరీలోనూ కనిష్టంగా రూ.కోటి సొత్తు ఎత్తుకుపోయింది. ఢిల్లీలోని ఓ ఇంట్లో పనికి కుదిరిన ఈ గ్యాంగ్‌ కేవలం 15 రోజుల్లోనే యజమాని చంపి రూ.కోటిన్నర సొత్తు ఎత్తుకుపోయింది. 

బంజారాహిల్స్‌లో రూ.2.5 కోటుల
ఈ గ్యాంగ్‌కు చెందిన భోలా ముఖియా గత ఏడాది అక్టోబర్‌లో నగరానికి వచ్చాడు. మహేష్‌ అగర్వాల్‌ అనే వ్యాపారి వద్ద డ్రైవర్‌గా చేరాడు. ఇతడే ఏజెంట్‌గా మారి మహేష్‌ స్నేహితులు, బంధువుల ఇళ్లలో పని చేయడానికి తమ ముఠా సభ్యుల్నే రప్పించాడు. ఈ గ్యాంగ్‌ లీడర్‌ రామషీష్‌ ముఖియా కపిల్‌ అగర్వాల్‌ ఇంట్లో వంటవాడిగా, మిగిలిన గ్యాంగ్‌ మెంబర్స్‌ భగవత్‌ ముఖియా, రాహుల్‌ ముఖియా, పీతాంబర్‌ మండల్, హరిశ్చంద్ర ముఖియాలు వేర్వేరు ఇళ్లలో పనివాళ్ళుగా చేరారు. గత ఏడాది డిసెంబర్‌ 8న కపిల్‌ అగర్వాల్‌ కుటుంబం శంషాబాద్‌లోని ఓ శుభకార్యానికి వెళ్ళింది. రామషీష్‌తో పాటు కొంతసేపు ఉన్న కపిల్‌ అగర్వాల్‌ బంధువు కూడా అదే ఫంక్షన్‌కు వెళ్లాడు. ఇదే అదనుగా భావించిన రామషీష్‌ మిగిలిన గ్యాంగ్‌ మెంబర్లకు సమాచారం ఇచ్చాడు. అంతా కపిల్‌ అగర్వాల్‌ ఇంటికి వచ్చి, బీరువాలో ఉన్న రూ.కోటి బంగారు ఆభరణాలు, రూ.1.5 కోట్ల వజ్రాభరణాలతో పాటు రూ.5.7 లక్షల నగదు ఎత్తుకుని రైలులో బిహార్‌కు ఉడాయించారు.  ఆపై బంగారు ఆభరణాలను విక్రయించేసి ముఠా డబ్బు పంచుకోగా... వజ్రాభరణాలను మాత్రం రామషీష్‌ తన ఇంటి గోడను పగులకొట్టి, అందులో ఉంచి, పైన ప్లాస్టింగ్‌ చేసేశాడు. 

ఎవరికి వారుగా తలదాచుకుని...
చోరీ చేసిన బంగారు ఆభరణాలను అమ్మేసి సొమ్ము చేసుకున్న ఈ ముఖియా గ్యాంగ్‌ ఆ డబ్బును పంచుకుంది. ఆపై ఎవరికి వారుగా అవకాశం ఉన్న చోట తలదాచుకున్నారు. రామషీష్‌ సరిహద్దులు దాటి బిహార్‌ వెళ్లిపోయాడు. కపిల్‌ అగర్వాల్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న బంజారాహిల్స్‌ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇన్‌స్పెక్టర్‌ ఆర్‌.కళింగరావు నేతృత్వంలో డిటెక్టివ్‌ ఇన్‌స్పెక్టర్‌ కె.రవికుమార్, ఎస్సై జి.భరత్‌ భూషణ్‌ నిందితుల కోసం రంగంలోకి దిగారు. బిహార్‌తో పాటు గుజరాత్, మహారాష్ట్ర, రాజస్థాన్‌ల్లో గాలించారు. చివరకు గత నెల 12న ఈ గ్యాంగ్‌కు చెందిన భాగవత్‌ ముఖియా, భోలా ముఖియా, హరిశ్చంద్ర ముఖియాలను అరెస్టు చేశారు. అయితే వీరి వద్ద సొత్తు రికవరీ కాకపోవడంతో పాటు విచారణ నేపథ్యంలో రామషీష్‌ వద్దే వజ్రాభరణాలు ఉన్నట్లు తేలింది. దీంతో మధుబని వెళ్లిన ప్రత్యేక బృందం ఆరా తీయగా.. అతడు నేపాల్‌లో ఉన్నట్లు వెల్లడైంది. దీంతో అప్పటి నుంచి అక్కడే కాపుకాసిన బంజారాహిల్స్‌ పోలీసులు తిరిగి వచ్చిన రామషీష్‌ను వెంబడించారు. గోడలో దాచిన వజ్రాభరణాలను తీసుకుని హైదరాబాద్‌ రావడం గమనించారు. దీంతో ఇక్కడ కాపుకాసిన అధికారులు అతడిని పట్టుకుని రూ.1.5 కోట్ల విలువైన వజ్రాభరణాలు స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న రాహుల్‌ ముఖియ, పీతాంబర్‌ మండల్‌ వద్ద మరికొంత సొత్తు ఉండటంతో వారి కోసం గాలిస్తున్నారు.

ఉచిత వెరిఫికేషన్‌ చేస్తాం నగర సీపీ అంజనీకుమార్‌   
సాక్షి, సిటీబ్యూరో: బిహార్‌ కేంద్రంగా దాదాపు 15 ఏళ్లుగా ఎనిమిది రాష్ట్రాల్లో భారీ నేరాలు చేసిన ముఖియా గ్యాంగ్‌ బంజారాహిల్స్‌ ప్రాంతానికి చెందిన సంపన్నుల ఇళ్లలో తేలిగ్గా ఉద్యోగాలు సంపాదించింది. అదను చూసుకుని కపిల్‌ అగర్వాల్‌ ఇంటి నుంచి రూ.2.5 కోట్ల సొత్తు, నగదుతో ఉడాయించింది. ఈ గ్యాంగ్‌కు చెందిన నలుగురిని అరెస్టు చేసిన బంజారాహిల్స్‌ పోలీసులు రూ.1.5 కోట్ల సొత్తు రికవరీ చేశారు. దీనికి సంబంధించిన బుధవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసిన నగర పోలీసు కమిషనర్‌ అంజనీకుమార్‌ ఈ ముఖియాలకు ఉన్న నేరచరిత్ర ముందే తెలిసి ఉంటే కపిల్‌ అసలు ఉద్యోగంలో చేర్చుకునే వాడే కాదని, అప్పుడు ఈ నేరం జరిగే ఆస్కారమే లేదని అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలోనే ప్రతి ఒక్కరూ పోలీసు అధికారిక యాప్‌ హాక్‌–ఐ ద్వారా టెనింట్స్, సర్వెంట్స్‌ వెరిఫికేషన్‌కు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. పోలీసు అధికారులు పూర్తి ఉచితంగా ఈ ప్రక్రియ పూర్తి చేసి నివేదిక ఇస్తారని కొత్వాల్‌ స్పష్టం చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement