సాక్షి, హైదరాబాద్: ఈ-కామర్స్ పేరుతో మోసాలకు పాల్పడుతున్న ముఠా గుట్టును హైదరాబాద్ క్రైం పోలీసులు ఛేదించారు. ఈ ముఠాకు చెందిన 4 నిందితులను శుక్రవారం అరెస్టు చేసినట్లు సైబరాబాద్ పోలీసు కమిషనర్ సజ్జనార్ తెలపారు. ఈ సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీహార్‌లోని కబీర్‌పూర్‌కు చెందిన ముఠాలోని నలుగురిని అరెస్టు చేశామని చెప్పారు. ఈ ముఠాలో ప్రధాన నిందితుడైన సందీప్ కుమార్‌తో పాటు మరో ముగ్గురిని అరెస్టు చేయగా, మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు వెల్లడించారు. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, స్నాప్‌డీల్ వంటి ఈ-కామర్స్ వెబ్‌సైట్ల నుంచి డేటాను సేకరించి అక్రమాలకు పాల్పడుతున్నారని చెప్పారు. ఇప్పటి వరకు మొత్తం రూ. 5 కోట్ల వరకు మోసాలు చేసినట్లు నిందితుల విచారణలో తెలిందన్నారు. వారి నుంచి 12 సెల్‌ఫోన్‌లు, 2 ల్యాప్‌టాప్‌లు, 1 స్కానర్ ప్రింటర్‌తో పాటు ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.
అయితే ‘స్నాప్‌డీల్లో ఓ మహిళ పొటాటో కటర్ను కొనుగోలు చేసింది. ఆ తరువాత మీరు మొదటి బహుమతి పొందారు అంటూ ఆమెకు ఫోన్ చేశారు. సదరు మహిళకు రూ. 6 లక్షల 90వేలు విలువ చేసే కారును గెలుచుకున్నట్లు నమ్మించి రిజిస్ట్రేషన్ పేరుతో ఆమె నుంచి రూ. 2 లక్షల 30 వేల నగదు ఈ ముఠా వసూలు చేశారు’ అని ఆయన మీడియా ముందు వివరించారు. ఈ ముఠా స్నాప్ డీల్ పేరుతో ఫేక్ టోల్ ఫ్రీ నెంబర్ సృష్టించి మోసాలకు పాల్పడుతున్నారని, ఈ కామర్స్ లో సేకరించిన డేటా ఆధారంగా వినియోగదారులకు గాలం వేస్తున్నారని చెప్పారు. ఈ క్రమంలో బహుమతుల పేరుతో ఇలా చాలా మందిని మోసాలు చేస్తూ వస్తున్నారని అన్నారు. స్నాప్ డీల్, క్లబ్ ఫ్యాక్టరీ, అమెజాన్, ఫ్లిప్ కార్డ్ లాంటి ప్రముఖ ఈ-కామర్స్ సంస్థల యొక్క నకిలీ వెబ్ సైట్లు సృష్టించారని, టోల్ ఫ్రీ నెంబర్ నుంచి ఫోన్ వస్తే ఒకటికీ రెండుసార్లు చెక్ చేసుకోవాలని సూచించారు. అదేవిధంగా బహుమతులు గెలుచుకున్నారని మెసేజ్‌లు వస్తే వాటిని నమ్మోద్దని ఆయన హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment