Northern states
-
ఉత్తరాదిన కుండపోత.. 28 మంది మృతి
న్యూఢిల్లీ: ఉత్తరాది రాష్ట్రాలను భారీ వర్షాలు రెండు రోజులుగా వణికిస్తున్నాయి. ఇళ్లు కూలి, కొండచరియలు విరిగిపడి, జలాశయాలు పొంగిపొర్లిన ఘటనల్లో 28 మంది మృతి చెందారు. హరియాణాలో పలు గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. జమ్మూకశీ్మర్ యంత్రాంగం అమర్నాథ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేసింది. రాజస్తాన్‌లో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో 16 మంది చనిపోయారు. రాష్ట్రంలోని కరౌలీ జిల్లాలో రికార్డు స్థాయిలో 38 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. పంజాబ్‌లోని హోషియార్‌పూర్‌లో ఆదివారం వరదల్లో వాహనం కొట్టుకుపోయిన ఘటనలో ఒకే కుటుంబంలోని 8 మంది చనిపోయారు. దేశ రాజధాని ఢిల్లీలో జన జీవనం స్తంభించింది. పలు ప్రాంతాల్లో నీరు నిల్చి ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఏడేళ్ల బాలుడు నీట మునిగి చనిపోయాడు. హిమాచల్ ప్రదేశ్‌లో ఆకస్మిక వరదలతో కొండచరియలు విరిగిపడి ముగ్గురు బాలికలు మృత్యువాత పడ్డారు. -
ఢిల్లీలో భూ ప్రకంపనలు
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీతోపాటు ఉత్తరాది రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. గురువారం మధ్యాహ్నం రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 6.1 గా నమోదైనట్లు జాతీయ భూకంప కేంద్రం వెల్లడించింది. భూకంప కేంద్రం పాకిస్తాన్–అఫ్గానిస్తాన్ సరిహద్దుల్లోని హిందూకుష్ ప్రాంతంలో ఉంది. దీంతో దేశరాజధానితో పాటు పంజాబ్, చండీగఢ్, జమ్మూకశ్మీర్ సహా ఉత్తరాది రాష్ట్రాల్లో కొద్దిసేపు భూమి కంపించింది. పాక్‌లోని లాహోర్, ఇస్లామాబాద్, ఖైబర్ ఫఖ్తుఖ్వా సహా పలు ప్రాంతాల్లో భూ ప్రకంపనలు నమోదైనట్లు అక్కడి మీడియా వెల్లడించింది. -
ఉత్తరాదిని ‘కమ్ముకున్న పొగమంచు’
సాక్షి, న్యూఢిల్లీ: చలి పులికి ఉత్తరాది రాష్ట్రాలు గజగజ వణుకుతున్నాయి. ఉష్ణోగ్రతలు తగ్గడంతో పొగమంచు కమ్ముకుంటోంది. దీంతో ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, పంజాబ్, హరియాణా, రాజస్థాన్ రాష్ట్రాల్లో మంచుతెరలు దట్టంగా పరుచుకున్నాయి. ఢిల్లీసహా ఆరు రాష్ట్రాల విమానాశ్రయాల్లో సోమవారం ఉదయం పొగమంచు తీవ్రతంగా ఉండటంతో రన్‌వే కూడా కనిపించని పరిస్తితి ఏర్పడింది. దీంతో పలు విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ల్యాండింగ్‌కు ఇబ్బందులు ఏర్పడటంతో పలు విమానాలను అధికారులు దారి మళ్లించారు. సోమవారం ఉదయం ఢిల్లీ, అమృత్సర్, ఆగ్రా, ప్రయాగ్‌రాజ్, గ్వాలియర్, జైసల్మేర్ విమానాశ్రయాల్లో జీరో విజిబిలిటీ నమోదైందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. వచ్చే కొద్ది రోజులు చలి మరింత పెరిగే అవకాశం ఉందని ఐఎండీ అంచనావేసింది. ప్రతికూల వాతావరణ ప్రభావంతో పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. సోమవారం ఉదయం పొగమంచు కారణంగా ఢిల్లీ, హైదరాబాద్, బెంగళూరు విమానాల రాకపోకలపై ప్రభావం పడింది. ప్రాణం తీసిన పొగమంచు! బహ్రెయిచ్(యూపీ): దట్టంగా కమ్ముకున్న పొగమంచు ముగ్గురి ప్రాణాలు పోవడానికి కారణమైంది. సోమవారం ఉత్తరప్రదేశ్‌లోని బహ్రెయిచ్–బల్రామ్పూర్ రహదారిలో ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. మంచుదుప్పటి కప్పిన రోడ్డుపై వేగంగా వస్తున్న ట్రక్కును ప్రయాణికుల బస్సు ఢీకొట్టింది. డ్రైవర్లతో పాటు ఒక ప్రయాణికుడు మరణించాడు. 20 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. -
ప్రస్తుతానికి ‘అడ్హాక్’ కమిటీలే
సాక్షి, హైదరాబాద్: జాతీయ స్థాయిలో బీఆర్ఎస్ కార్యకలాపాల విస్తరణకు సర్వశక్తులూ ఒడ్డుతున్న ఆ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ఇతర రాష్ట్రాల్లో కాలుమోపేందుకు అవసరమైన ప్రణాళికలు రచిస్తున్నారు. ఇందులో భాగంగా వివిధ రాష్ట్రాల్లో నేతలను పార్టీలోకి ఆహ్వానిస్తున్న ఆయన... వారికి ఆయా రాష్ట్రాల్లో పార్టీ పగ్గాలు అప్పగించడంపై భిన్న వ్యూహాన్ని అనుసరిస్తున్నారు. బీఆర్ఎస్ ఆంధ్రప్రదేశ్ శాఖ అధ్యక్షుడిగా తోట చంద్రశేఖర్‌ను నియమించిన కేసీఆర్... ఇతర రాష్ట్రాల్లో మాత్రం ప్రస్తుతానికి అడ్హాక్ కమిటీలు ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. గత నెలలో బీఆర్ఎస్లో చేరిన ఒడిశా మాజీ ముఖ్యమంత్రి గిరిధర్ గమాంగ్‌కు పార్టీ ఒడిశా పగ్గాలు అప్పగిస్తారన్న ప్రచారం జరిగినప్పటికీ కేసీఆర్ మాత్రం అటువంటి నిర్ణయమేదీ తీసుకోలేదు. పార్టీలోకి చేరికల వేగం పెరిగాక సమర్థులైన నేతలకు ఆయా రాష్ట్రాల బీఆర్ఎస్ అధ్యక్ష బాధ్యతలు అప్పగించాలని ఆయన భావిస్తున్నారని తెలిసింది. ప్రస్తుతానికి ఒడిశా, మహారాష్ట్ర శాఖలకు అడ్హాక్ కమిటీలను ఏర్పాటు చేసే దిశగా కేసీఆర్ కసరత్తు చేస్తున్నారని బీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. ఈ నెలాఖరులో భువనేశ్వర్‌లో సభ... బీఆర్ఎస్ ఆవిర్భావం తర్వాత ఖమ్మం, నాందేడ్ బహిరంగ సభలు విజయవంతం కావడంతో మరిన్ని సభల నిర్వహణకు కేసీఆర్ కసరత్తు చేస్తున్నారు. ఈ నెల 17న తెలంగాణ సచివాలయం ప్రారంభోత్సవం అనంతరం పరేడ్ మైదానంలో భారీ బహిరంగ సభను నిర్వహించనుండగా ఈ నెల 25 తర్వాత ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లో సభ నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు ముగిశాక ఒడిశాకు చెందిన బీఆర్ఎస్ నేతలతో భేటీకి కేసీఆర్ హామీ ఇచ్చారు. ఈ భేటీలో భువనేశ్వర్ సభ ఏర్పాట్ల గురించి దిశానిర్దేశనం చేయనున్నారు. ఇప్పటికే సభ నిర్వహణ ఏర్పాట్ల సమన్వయ బాధ్యతను ఒడిశాలోని బరంపురానికి చెందిన ఓ నేతకు అప్పగించినట్లు తెలిసింది. మరోవైపు మధ్యప్రదేశ్, గుజరాత్, యూపీ తదితర రాష్ట్రాలకు చెందిన వివిధ పార్టీల నేతలు, ప్రజాసంఘాలు, రైతుసంఘాల నేతలు కేసీఆర్‌తో వరుస భేటీలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే హైదరాబాద్‌కు వారి రాక, బీఆర్ఎస్లో చేరికకు సంబంధించి గోప్యత పాటిస్తున్నారు. ప్రగతిభవన్ సమీపంలోని రెండు స్టార్ హోటళ్లలో ఆయా నేతలు, ఇతరులకు బీఆర్ఎస్ బస ఏర్పాట్లు చేస్తోంది. సమయానుకూలతను బట్టి వారు కేసీఆర్‌తో భేటీ కావడంతోపాటు హైదరాబాద్, ఇతర జిల్లాల్లో ప్రభుత్వ కార్యక్రమాలను పరిశీలిస్తున్నారు. -
ఉత్తరాది గ్యాంగ్స్టర్లు దక్షిణాది జైళ్లకు
సాక్షి, న్యూఢిల్లీ: ఉత్తరాది రాష్ట్రాల్లో గ్యాంగ్స్టర్ల ఆగడాలను చెక్‌పెట్టేందుకు, వారి విస్తృత నెట్‌వర్క్‌ను సమూలంగా నాశనం చేసేందుకు ఎన్ఐఏ కొత్త ఆలోచనను తెరపైకి తెచ్చింది. ఢిల్లీ, పంజాబ్, హరియాణా, రాజస్థాన్ జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న గ్యాంగ్స్టర్లను దక్షిణాది రాష్ట్రాల జైళ్లకు తరలించాలని భావిస్తోంది. నాలుగు ఉత్తరాది రాష్ట్రాల్లో డ్రగ్స్, అక్రమ ఆయుధాల సరఫరా, సుపారీ హత్యలు, హవాలా దందా, బెదిరింపు వసూళ్లు, మానవ అక్రమ రవాణా వంటి తీవ్ర నేరాల్లో కొందరు గ్యాంగ్స్టర్లను అరెస్ట్ చేసి సెంట్రల్ జైళ్లలో పడేశారు. వాళ్లు అక్కడి నుంచే నిక్షేపంగా తమ కార్యకలాపాలను సాగిస్తున్నారు. తొలి దశలో వారిలో 25 మందిని దక్షిణాది జైళ్లకు బదిలీ చేయాలని కోరినట్లు సమాచారం. మూసావాలా హత్యతో అలర్ట్ పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలా హత్యోదంతం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెల్సిందే. దక్షిణాసియాలోని అతిపెద్ద, అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లుండే జైళ్లలో ఒకటైన ఢిల్లీలోని తీహార్ జైలు నుంచే మూసేవాలా హత్య ప్రణాళికను గ్యాంగ్స్టర్లు అమలు చేశారని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. తిహార్‌లో జైలు శిక్ష అనుభవిస్తున్న గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ తన నెట్వర్క్ ద్వారా ఈ హత్య చేయించారనే కేసు దర్యాప్తు ప్రస్తుతం కొనసాగుతోంది. తిహార్‌లోనే ఉన్న మరో గ్యాంగ్‌స్టర్ నీరాజ్ బవానా సైతం జైలు నుంచే తన వ్యాపారాన్ని ఇష్టారీతిగా కొనసాగిస్తున్నారనే ఆరోపణలున్నాయి. పంజాబ్, హరియాణా, రాజస్థాన్ జైళ్లలో ఉన్న గ్యాంగ్స్టర్లదీ ఇదే పంథా. జైళ్లలో కొత్తగా చిన్న ముఠాలుగా ఏర్పడి తమ ప్రణాళికను అమలుచేస్తున్నారు. ఏప్రిల్‌లో గ్యాంగ్‌స్టర్ జితేంద్ర గోగిను చంపేశాడనే కోపంతో మరో గ్యాంగ్‌స్టర్ శేఖర్ రాణాను గోగి సన్నిహితుడు రోహిత్ మోయి జైలు నుంచే కుట్ర పన్ని హత్య చేయించాడు. ఇలాంటి ఘటనలు ఇటీవలి కాలంలో ఉత్తరాదిన పెరిగాయి. కొన్ని కేసుల్లో గ్యాంగ్స్టర్లకు జైలు సిబ్బంది సహకరిస్తున్నారనే ఆరోపణలు గుప్పుమన్నాయి. ఉత్తరాది రాష్ట్రాల జైళ్లలో సామర్థ్యానికి మించి ఖైదీలుండటం మధ్య ఆధిపత్య పోరు పెరిగి గొడవలకు దారితీస్తోంది. వీరికి విదేశాల నుంచి ఆర్ధిక సహకారం అందుతోందనే దారుణ వాస్తవాలు ఎన్ఐఏ దర్యాప్తులో వెల్లడయ్యాయి. ఉత్తరాది జైళ్లలో సామర్థ్యానికి మించి ఖైదీలుండటం కూడా ఎన్ఐఏ ప్రతిపాదనకు మరో కారణం. ఢిల్లీలో 14 సెంట్రల్ జైళ్ల సామర్ధ్యం 9,346 కాగా 17,733 మంది ఖైదీలున్నారు. పంజాబ్‌లో జైళ్లలో 103 శాతం, హరియాణాలో 127 శాతం, రాజస్థాన్‌లో 107 శాతం ఖైదీలున్నారు. -
ఈసారి వణుకుడే..
అప్పుడే చలి మొదలైంది. అయితే ఇది జస్ట్ శాంపిలే.. మున్ముందు జనమంతా గజగజ వణికిపోక తప్పదట. ముఖ్యంగా ఉత్తర భారత రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతాయని,మంచు కురిసే అవకాశమూ ఉందని వాతావరణ నిపుణులు చెప్తున్నారు. దీనంతటికీ లానినా పరిస్థితి కారణమని అంటున్నారు. మరి లానినా ఏంటి, చలి విపరీతంగా పెరగడం ఏమిటి, దీనికి దానికి లంకె ఏమిటో తెలుసుకుందామా? – సాక్షి సెంట్రల్ డెస్క్ ఇప్పటిదాకా భారీ వర్షాలు.. సాధారణంగా ఎల్‌నినో, లానినా పరిస్థితులు ఏర్పడినప్పుడు మన దేశంలో నైరుతి, ఈశాన్య రుతుపవనాల సీజన్లలో గణనీయంగా మార్పులు వస్తాయి. ఈసారి లానినా కారణంగా నైరుతి రుతు పవనాలు ఎక్కువకాలం కొనసాగాయి. 1975 త ర్వాత ఇంత సుదీర్ఘంగా నైరుతి సీజన్ ఉండటం ఇదే తొలిసారి అని వాతావరణ నిపుణులు చెప్తున్నారు. ►మన దేశానికి సంబంధించినంత వరకు.. ఎల్‌నినో సమయంలో ఏ సీజన్ అయినా కూడా ఉష్ణోగ్రతలు పెరగడం, వానలు తగ్గి కరువు పరిస్థితులు ఏర్పడటం జరుగుతుంది. లానినా సమయంలో ఎండాకాలంలో ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదైనా.. వానాకాలంలో భారీ వర్షాలు, వరదలు వస్తాయి. ►పసిఫిక్ మహా సముద్రంపై రెండేళ్లుగా లానినా పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఈ ఏడాది దాని ప్రభావం మరింతగా పెరిగింది. ఈ నేపథ్యంలోనే ఉత్తర భారత రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు సాధారణానికి మించి నమోదయ్యాయి. తర్వాత వానాకాలం మొదలైనప్పటి నుంచీ విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. ఉత్తర భారత రాష్ట్రాల్లో అక్కడక్కడా ఇప్పటికీ భారీ వర్షాలు కొనసాగుతున్నాయి. ఇక చలిచలిగా.. లానినా కారణంగా పసిఫిక్ మహా సముద్రం వైపు నుంచి శీతల గాలులు వీస్తాయని.. దీనితో భూమి ఉత్తర అర్ధభాగంలో ఉష్ణోగ్రతలు పడిపోతాయని ప్రపంచ వాతావరణ సంస్థ (డబ్ల్యూఎంవో)’ తాజాగా ప్రకటించింది. ఇదే సమయంలో దక్షిణ అమెరికా, ఆస్ట్రేలియా, ఆఫ్రికా ఖండంలో దిగువభాగంలోని దేశాల్లో ఉష్ణోగ్రతలు పెరుగుతాయని పేర్కొంది. ఈ మేరకు ఇటీవల ఓ నివేదిక విడుదల చేసింది. దాని ప్రకారం.. దక్షిణ, ఆగ్నేయాసియా దేశాలపై లానినా ఎక్కువగా ప్రభావం చూపుతుంది. చలి తీవ్రత పెరుగుతుంది. ఇప్పటికే ఉత్తర భారత ప్రాంతంలో చలి మొదలైందని.. చాలా ప్రాంతాల్లో మూడు డిగ్రీల సెల్సియస్ దాకా ఉష్ణోగ్రతలు పడిపోయే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. ►ముఖ్యంగా డిసెంబర్ మూడో వారం నుంచి ఫిబ్రవరి రెండో వారం వరకు చలి విపరీతంగా ఉంటుందని పేర్కొంది. జమ్మూకశ్మీర్, ఉత్తరాఖండ్, హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే మంచు కురవడం మొదలైందని తెలిపింది. దక్షిణ భారత రాష్ట్రాల్లోనూ సాధారణంతో పోలిస్తే.. మూడు నుంచి ఐదు డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించింది. ►చైనాలోని తూర్పు ప్రాంతాల్లో ఇప్పటికే ఉష్ణోగ్రతలు పడిపోయాయని.. జపాన్, దక్షిణ కొరియా దేశాల్లోనూ చలి తీవ్రత మొదలైందని.. ఆయా దేశాల వాతావరణ అధికారులు ప్రకటించడం గమనార్హం. ఏమిటీ ఎల్‌నినో, లానినా? భూమ్మీద అతిపెద్ద మహా సముద్రమైన పసిఫిక్ సముద్రం ఉపరితలంలోని నీటి ఉష్ణోగ్రతల్లో కొన్నేళ్లకోసారి హెచ్చుతగ్గులు వస్తుంటాయి. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా సముద్ర ప్రవాహాల్లో.. ఖండాల మీదుగా వీచే పవనాల (గాలుల) ఉష్ణోగ్రతలు, తేమ శాతంలో మార్పులు వస్తాయి. పసిఫిక్ ఉష్ణోగ్రతలు పెరగడాన్ని ఎల్నినోగా.. తగ్గడాన్ని లానినాగా పిలుస్తారు. ఈ రెండు కూడా పసిఫిక్ మహా సముద్రం చుట్టూ ఉన్న వేర్వేరు ప్రాంతాలపై ఒకదానికొకటి వేర్వేరుగా, వ్యతిరేక ప్రభావం చూపుతాయి. ►ఉదాహరణకు ఎల్‌నినోతో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు, వరదలు వస్తే.. మరికొన్నిచోట్ల వానలు తగ్గి, ఎండలు పెరిగి కరువులు ఏర్పడతాయి. ►అదే లానినా వచ్చినప్పుడు దీనికి వ్యతిరేకంగా.. ఎల్‌నినోతో వరదలు వచ్చే చోట కరువులు వస్తాయి, ఎండలు ఉండే చోట భారీ వర్షాలు కురుస్తాయి. ఓ వైపు కరువు.. మరోవైపు వరదలు లానినా కారణంగా దక్షిణ అమెరికా ఖండంలోని పెరూ, ఈక్వెడార్ వంటి దేశాల్లో తీవ్ర కరువు పరిస్థి తులు ఏర్పడ్డాయి. పసిఫిక్ మహా సముద్రానికి పశ్చి మాన ఉన్న దేశాల్లో, హిందూ మహాసముద్ర ప్రాంతదేశాల్లో ఉష్ణోగ్రతలు కాస్త పెరిగాయి. భారత్‌తోపాటు దక్షిణాసియా దేశాల్లో మంచి వర్షాలు కురిశాయి. ►ప్రస్తుతం అమెరికాలో వానాకాలం మొదలైంది. లానినా ప్రభావం కారణంగా ఈసారి భారీ వర్షాలు కురుస్తాయని, తుపానులు వస్తాయని, తర్వాత చలికాలంలో ఉష్ణోగ్రతలు బాగా తగ్గిపోవచ్చని ఆ దేశ వాతావరణ శాఖ ఇటీవలే ప్రకటించింది. -
ఉత్తరాదిన భానుడి సెగలు
సాక్షి, న్యూఢిల్లీ: ఉత్తరాది రాష్ట్రాలు వేడి గాలులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. ఇప్పటికే రావాల్సిన రుతుపవనాలు 2 వారాలుగా ఆగిపోవడంతో వేడి పెరిగింది. దీంతో, ఉత్తర భారతదేశంలో ఇప్పుడు వాతావరణం వేసవిని తలపిస్తోంది. ఎండల ప్రభావంతో సుమారు 7 డిగ్రీలు ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఢిల్లీలో 90 ఏళ్ల రికార్డు బద్దలైంది. పశ్చిమ దిశ నుంచి వస్తున్న గాలులు వాతావరణంలో వేడిని పెంచాయి. రుతుపవనాల ప్రారంభ దశలో తేలికపాటి వర్షాలతో కాస్త ఉపశమనం పొందిన ప్రజలకు ఇప్పుడు వేడి గాలుల కారణంగా ఉక్కపోతతో అవస్థలు పెరిగాయి. రికార్డు బద్దలు: దేశ రాజధాని ఢిల్లీలో భానుడి ప్రతాపంతో వేడి 90 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టింది. రాజధానిలోని మంగేష్‌పూర్ ప్రాంతంలో గురువారం 45.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అంతకుముందు 1931 జూలై 1న 45 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డు అయ్యింది. అయితే అదే సమయంలో జూలై మొదటి రోజు 9 ఏళ్ల తర్వాత అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. సాధారణంగా జూన్ చివరి వారంలో రుతుపవనాల ప్రభావం కారణంగా ఉష్ణోగ్రత 37–38 డిగ్రీలుగా ఉంటుంది. కానీ ఈ ఏడాది వేడిగాలుల కారణంగా రుతుపవనాలు ఆలస్యం కావడంతో భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. అంతకుముందు 2012 జూలైలో గరిష్ట ఉష్ణోగ్రత 43.5 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. మూడు రోజులుగా ఢిల్లీలో ఉష్ణోగ్రత సుమారు 43 డిగ్రీల సెల్సియస్‌గా ఉంది. ఇది సాధారణ ఉష్ణోగ్రత కంటే 7 డిగ్రీల సెల్సియస్ ఎక్కువ. అయితే పలుచోట్ల తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉంది. ఢిల్లీతోపాటు హరియాణా, చండీగఢ్, యూపీల్లోనూ వేడిగాలులతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. పాకిస్తాన్ వైపు నుంచి వస్తున్న వేడిగాలులు రుతు పవనాలను అడ్డుకుంటున్నాయి. త్వరలో ఉపశమనం.. రెండు రోజులు ఆలస్యంగా కేరళలో ప్రవేశించిన రుతుపవనాలు కేవలం 10 రోజుల్లోనే దేశంలోని 80% ప్రాంతాన్ని కవర్ చేశాయి. జూలై 3 నుంచి అరేబియా సముద్రం నుంచి గుజరాత్, రాజస్తాన్ మీదుగా ఢిల్లీ వైపు తేమ గాలులు చేరుకోవడం ప్రారంభమవుతుందని, అప్పుడు ఉపశమనం లభిస్తుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. రుతుపవనాల బ్రేక్ జూలై 7 వరకు కొనసాగవచ్చని, ఆ తరువాత బంగాళాఖాతం నుంచి వచ్చే గాలులు ఉత్తర భారతదేశానికి చేరిన తర్వాత రుతుపవనాలు చురుగ్గా ఉంటాయని అంటోంది. -
తమిళనాడు నుంచి ఉత్తరాదికి వెళ్లే రైళ్లు రద్దు
చెన్నై : భారీ వర్షాలు, వరదలు నేపథ్యంలో తమిళనాడు నుంచి పుదుచ్చేరి, ఉత్తరాదికి వెళ్లే రైళ్లు నేడు రద్దు చేసినట్లు రైల్వే శాఖ బుధవారం వెల్లడించింది. అలాగే ఆంధ్రప్రదేశ్ మీదుగా ఉత్తరాది రాష్ట్రాలకు వెళ్లే 27 రైళ్లు రద్దు చేసినట్లు పేర్కొంది. భారీ వర్షాలతో రైల్వే ట్రాక్‌పైకి నీరు వచ్చి చేరింది. ఈ నేపథ్యంలో రైల్వే ట్రాక్ పాడైంది. నేడు చెన్నై, కాంచీపురం, తిరువళ్లూరు, వేలూరు జిల్లాల్లోని పాఠశాలలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. -
యూపీఏపై 70 శాతం మందికి అసంతృప్తి: అమెరికా
రానున్న లోక్‌సభ ఎన్నికలలో బీజేపీ అధికార పగ్గాలు చేపట్టే అవకాశాలు ఉన్నాయా అంటే అవును అనే అంటుంది అమెరికాకు చెందని 'ప్యూ' రిసెర్చ్ సెంటర్. భారత్‌లో మరికొన్ని వారాలలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ తరుణంలో 'ప్యూ' రిసెర్చ్ సెంటర్ భారత్‌లోని వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో గతేడాది డిసెంబర్ 7 నుంచి జనవరి 12 వరకు ఆ సర్వే నిర్వహించింది. ఆ సర్వే నివేదికను గురువారం వాషింగ్టన్లో విడుదల చేసింది. కేంద్రంలో కమలం వికసించాలని 63 శాతం మంది దేశ ప్రజలు అభిలాషిస్తున్నారని తెలిపింది. అయితే ప్రస్తుతం అధికారాన్ని వెలగబెడుగున్న కాంగ్రెస్ పార్టీ ముచ్చటగా మూడోసారి అధికారం చేపట్టాలని కేవలం 19 శాతం మందే కోరుకుంటున్నారని చెప్పింది. ప్రధాని పీఠంపై కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కంటే బీజేపీ ప్రధాని అభ్యర్థి మోడీని కూర్చో బెట్టేందుకే భారతీయులు ఆసక్తి చూపిస్తున్నారని పేర్కొంది. యూపీఏ పాలనపై దేశంలో 70 శాతం మంది ప్రజలు అసంతృప్తితో ఉన్నారని వెల్లడించింది. అవినీతి నిర్మూలన, ఉద్యోగ అవకాశాలు కల్పించడం, సమర్థమైన పాలన... అన్ని బీజేపీతోనే సాధ్యమని భారతీయులు ప్రగాఢంగా విశ్వసిస్తున్నారని తెలిపింది. ఉత్తరాది రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, హర్యానా, పంజాబ్, ఢిల్లీలలో 74 శాతం మంది ప్రజలు బీజేపీకే పట్టం కట్టేందుకు సిద్దంగా ఉన్నారని, అలాగే మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, గుజరాత్ రాష్ట్రాలలో 54 శాతం మంది ప్రజలు బీజేపీ అధికారంలోకి తీసుకురావాలని ఊవిళ్లూరుతున్నారని ప్యూ విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది.