యూపీఏపై 70 శాతం మందికి అసంతృప్తి: అమెరికా
రానున్న లోక్సభ ఎన్నికలలో బీజేపీ అధికార పగ్గాలు చేపట్టే అవకాశాలు ఉన్నాయా అంటే అవును అనే అంటుంది అమెరికాకు చెందని 'ప్యూ' రిసెర్చ్ సెంటర్. భారత్లో మరికొన్ని వారాలలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ తరుణంలో 'ప్యూ' రిసెర్చ్ సెంటర్ భారత్లోని వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో గతేడాది డిసెంబర్ 7 నుంచి జనవరి 12 వరకు ఆ సర్వే నిర్వహించింది. ఆ సర్వే నివేదికను గురువారం వాషింగ్టన్లో విడుదల చేసింది.
కేంద్రంలో కమలం వికసించాలని 63 శాతం మంది దేశ ప్రజలు అభిలాషిస్తున్నారని తెలిపింది. అయితే ప్రస్తుతం అధికారాన్ని వెలగబెడుగున్న కాంగ్రెస్ పార్టీ ముచ్చటగా మూడోసారి అధికారం చేపట్టాలని కేవలం 19 శాతం మందే కోరుకుంటున్నారని చెప్పింది. ప్రధాని పీఠంపై కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కంటే బీజేపీ ప్రధాని అభ్యర్థి మోడీని కూర్చో బెట్టేందుకే భారతీయులు ఆసక్తి చూపిస్తున్నారని పేర్కొంది. యూపీఏ పాలనపై దేశంలో 70 శాతం మంది ప్రజలు అసంతృప్తితో ఉన్నారని వెల్లడించింది.
అవినీతి నిర్మూలన, ఉద్యోగ అవకాశాలు కల్పించడం, సమర్థమైన పాలన... అన్ని బీజేపీతోనే సాధ్యమని భారతీయులు ప్రగాఢంగా విశ్వసిస్తున్నారని తెలిపింది. ఉత్తరాది రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, హర్యానా, పంజాబ్, ఢిల్లీలలో 74 శాతం మంది ప్రజలు బీజేపీకే పట్టం కట్టేందుకు సిద్దంగా ఉన్నారని, అలాగే మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, గుజరాత్ రాష్ట్రాలలో 54 శాతం మంది ప్రజలు బీజేపీ అధికారంలోకి తీసుకురావాలని ఊవిళ్లూరుతున్నారని ప్యూ విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది.