రాహుల్ గాంధీ (పాత చిత్రం)
సాక్షి, బెంగళూరు : కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ’జనాశీర్వాద్’ పేరిట కర్ణాటక ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న విషయం తెలిసిందే. ఆదివారం సాయంత్రం సింధనూర్‌లో నిర్వహించిన బహిరంగ సభలో ప్రసంగించిన ఆయన బీజేపీపై విరుచుకుపడ్డారు. ముఖ్యంగా ప్రధాని మోదీని టార్గెట్ చేస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలకు ప్రజల నుంచి అనూహ్యమైన స్పందన వచ్చింది.
‘క్రికెట్ పిచ్‌లో మోదీ బ్యాటింగ్‌కు దిగితే.. వికెట్లు, కీపర్ వైపు బ్యాట్ పట్టుకుని నిలుచుంటాడు. అలా బ్యాటింగ్ చేస్తే సచిన్ కూడా ఒక్క పరుగు చేయలేడు. అంటే బాల్ ఏ దిశగా వస్తుందో కూడా తెలియని బ్యాట్స్‌మన్ మన ప్రధాని. ఎంత సేపు ఆయన కాంగ్రెస్ గతం గురించి మాత్రమే మాట్లాడుతూ విమర్శలు చేస్తున్నాడు. కానీ, భవిష్యత్తు కాంగ్రెస్‌దేనన్న విషయం ఎందుకనో ఆయన గుర్తించలేకపోతున్నారు’ అంటూ రాహుల్ చురకలు అంటించారు. బీజేపీ పాలనకు రోజులు దగ్గర పడ్డాయని సంకేతాలు అందుతుండటంతో.. తన ప్రభుత్వం సాధించిన ఘనతలంటూ ఏవేవో చెప్పుకుంటూ వెళ్లిన ప్రతీచోటల్లా మోదీ ఉపన్యాసాలు దంచుతున్నారంటూ రాహుల్ ఎద్దేవా చేశారు.
అంతకు ముందు రాయ్‌చూర్ జిల్లాలో జరిగిన ర్యాలీలో కూడా రాహుల్ బీజేపీ, మోదీలపై విరుచుకుపడ్డారు. అవినీతిలో బీజేపీ ప్రపంచ రికార్డులు సాధించిందని.. అధికారంలో ఉన్నప్పుడు స్కాములతో ప్రజాధనాన్ని లూటీ చేశారని ఆయన ఆరోపించారు. గత బీజేపీ ప్రభుత్వంలో ముగ్గురు సీఎంలు మారారని, నలుగురు మంత్రులు జైలు శిక్ష అనుభవిస్తూ రాజీనామాలు చేశారని గుర్తుచేశారు. ఇంత జరిగినా ప్రధాని మోదీ ఇక్కడకి వచ్చి కాంగ్రెస్‌పై అవినీతి ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment