
సాక్షి, న్యూఢిల్లీ: ఉత్తరాది రాష్ట్రాలు వేడి గాలులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. ఇప్పటికే రావాల్సిన రుతుపవనాలు 2 వారాలుగా ఆగిపోవడంతో వేడి పెరిగింది. దీంతో, ఉత్తర భారతదేశంలో ఇప్పుడు వాతావరణం వేసవిని తలపిస్తోంది. ఎండల ప్రభావంతో సుమారు 7 డిగ్రీలు ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఢిల్లీలో 90 ఏళ్ల రికార్డు బద్దలైంది. పశ్చిమ దిశ నుంచి వస్తున్న గాలులు వాతావరణంలో వేడిని పెంచాయి. రుతుపవనాల ప్రారంభ దశలో తేలికపాటి వర్షాలతో కాస్త ఉపశమనం పొందిన ప్రజలకు ఇప్పుడు వేడి గాలుల కారణంగా ఉక్కపోతతో అవస్థలు పెరిగాయి.
రికార్డు బద్దలు: దేశ రాజధాని ఢిల్లీలో భానుడి ప్రతాపంతో వేడి 90 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టింది. రాజధానిలోని మంగేష్‌పూర్ ప్రాంతంలో గురువారం 45.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అంతకుముందు 1931 జూలై 1న 45 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డు అయ్యింది. అయితే అదే సమయంలో జూలై మొదటి రోజు 9 ఏళ్ల తర్వాత అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. సాధారణంగా జూన్ చివరి వారంలో రుతుపవనాల ప్రభావం కారణంగా ఉష్ణోగ్రత 37–38 డిగ్రీలుగా ఉంటుంది.
కానీ ఈ ఏడాది వేడిగాలుల కారణంగా రుతుపవనాలు ఆలస్యం కావడంతో భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. అంతకుముందు 2012 జూలైలో గరిష్ట ఉష్ణోగ్రత 43.5 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. మూడు రోజులుగా ఢిల్లీలో ఉష్ణోగ్రత సుమారు 43 డిగ్రీల సెల్సియస్‌గా ఉంది. ఇది సాధారణ ఉష్ణోగ్రత కంటే 7 డిగ్రీల సెల్సియస్ ఎక్కువ. అయితే పలుచోట్ల తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉంది. ఢిల్లీతోపాటు హరియాణా, చండీగఢ్, యూపీల్లోనూ వేడిగాలులతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. పాకిస్తాన్ వైపు నుంచి వస్తున్న వేడిగాలులు రుతు పవనాలను అడ్డుకుంటున్నాయి.
త్వరలో ఉపశమనం..
రెండు రోజులు ఆలస్యంగా కేరళలో ప్రవేశించిన రుతుపవనాలు కేవలం 10 రోజుల్లోనే దేశంలోని 80% ప్రాంతాన్ని కవర్ చేశాయి. జూలై 3 నుంచి అరేబియా సముద్రం నుంచి గుజరాత్, రాజస్తాన్ మీదుగా ఢిల్లీ వైపు తేమ గాలులు చేరుకోవడం ప్రారంభమవుతుందని, అప్పుడు ఉపశమనం లభిస్తుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. రుతుపవనాల బ్రేక్ జూలై 7 వరకు కొనసాగవచ్చని, ఆ తరువాత బంగాళాఖాతం నుంచి వచ్చే గాలులు ఉత్తర భారతదేశానికి చేరిన తర్వాత రుతుపవనాలు చురుగ్గా ఉంటాయని అంటోంది.
Comments
Please login to add a commentAdd a comment