Hot winds
-
వడగాడ్పుల విజృంభణ
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో ఉష్ణోగ్రతలతో పాటు వడగాడ్పులు తీవ్ర రూపం దాలుస్తున్నాయి. సాధారణం కంటే 3–6 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు రికార్డవుతున్నాయి. ఫలితంగా గురువారం రాష్ట్రంలో సగానికి పైగా జిల్లాల్లో వడగాడ్పులు, తీవ్ర వడగాడ్పులు వీచాయి. రానున్న రెండు రోజులు ఉష్ణోగ్రతలు, వడగాడ్పులు మరింత తీవ్రం కానున్నాయి. అదే సమయంలో ద్రోణి ప్రభావంతో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవనున్నాయి. కాగా.. గురువారం అత్యధికంగా అల్లూరి సీతారామరాజు జిల్లా ఎర్రంపేట, పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడల్లో 45.8 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత రికార్డయింది. నందవరం (నంద్యాల)లో 45.6, జామి (విజయనగరం)లో 45.5, కొవిలం (శ్రీకాకుళం), కొంగలవీడు (వైఎస్సార్)ల్లో 45.4, రేణిగుంటలో, దరిమడుగు (ప్రకాశం)లో 45.3, ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 44 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు 16 జిల్లాల్లో నమోదైనట్టు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. గురువారం 84 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 120 మండలాల్లో వడగాడ్పులు వీచాయి. శుక్రవారం 91 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 245 మండలాల్లో వడగాడ్పులు వీయనున్నాయి. శనివారం 39 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 215 మండలాల్లో వడగాడ్పులు వీచే అవకాశాలున్నాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. ద్రోణి ప్రభావంతో తేలికపాటి వానలు గల్ఫ్ ఆఫ్ మన్నార్ నుంచి దక్షిణ తెలంగాణ వరకు వ్యాపించి ఉన్న ద్రోణి గురువారం కొమరిన్ ప్రాంతం నుంచి దక్షిణ తెలంగాణ, అంతర్గత తమిళనాడు, రాయలసీమ మీదుగా కొనసాగుతోంది. ఫలితంగా శుక్ర, శనివారాలు కోస్తాంధ్ర, రాయలసీమల్లో ఒకట్రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) తెలిపింది. అదే సమయంలో ఉరుములు, మెరుపులతో పాటు అక్కడక్కడా పిడుగులకు ఆస్కారం ఉందని, గంటకు 30–40 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. -
AP: ఆగని భగభగలు.. 46 డిగ్రీల దిశగా ఉష్ణోగ్రతలు
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో భానుడి భగభగలు కొనసాగుతున్నాయి. రోజురోజుకు మరింత తీవ్రరూపం దాలుస్తున్నాయి. పలుచోట్ల 42 నుంచి 45 డిగ్రీలకుపైగా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సాధారణంకంటే 3–6 డిగ్రీలు అధికంగా ఇవి రికార్డవుతుండడంతో అనేక మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, వడగాడ్పులు వీస్తున్నాయి. జనాన్ని బెంబేలెత్తిస్తున్నాయి. బుధవారం అత్యధికంగా వైఎస్సార్ జిల్లా కొంగలవీడులో 45.3 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. పెద్దదేవళాపురం (నంద్యాల జిల్లా) 44.9, రావికమతం (అనకాపల్లి), రామభద్రపురం (విజయనగరం), దొనకొండ (ప్రకాశం), మంగనెల్లూరు (తిరుపతి)ల్లో 44.1 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. 16 జిల్లాల్లో 43 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 67 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 125 మండలాల్లో వడగాడ్పులు వీచాయి. గురువారం 76 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 214 మండలాల్లో వడగాడ్పులు వీయనున్నాయి. విజయనగరం జిల్లాలో 22, పార్వతీపురం మన్యం 13, శ్రీకాకుళం 12, అనకాపల్లి 11, పల్నాడు 7, అల్లూరి సీతారామరాజు 4, కాకినాడ 3, తూర్పు గోదావరి 2, ఎన్టీఆర్ 2 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు వీచే అవకాశాలున్నాయి. ప్రకాశం 24, గుంటూరు 17, తూర్పు గోదావరి 17, పల్నాడు 16, ఎన్టీఆర్ 14, శ్రీకాకుళం 14, కృష్ణా 13, కాకినాడ 12, బాపట్ల 12, ఎస్పీఎస్సార్ నెల్లూరు 11, అల్లూరి సీతారామరాజు 11, ఏలూరు 9, తిరుపతి 7, కోనసీమ 7, అనకాపల్లి 6, విజయనగరం 5, విశాఖ పట్నం 3, పశ్చిమ గోదావరి 3 మండలాల్లోను, పార్వతీపురం మన్యం, నంద్యాల, వైఎస్సార్ జిల్లాల్లో ఒక్కో మండలంలోను వడగాడ్పులు వీచే అవకాశాలున్నాయి. శుక్రవారం 47 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 229 మండలాల్లో వడగాడ్పులు వీస్తాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. మూడురోజులు తేలికపాటి వర్షాలు మరోవైపు గల్ఫ్ ఆఫ్ మన్నార్ నుంచి దక్షిణ తెలంగాణ వరకు తమిళనాడు, రాయలసీమల మీదుగా వ్యాపించి ఉన్న ద్రోణి సగటు సముద్రమట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోంది. దీని ప్రభావంతో రానున్న మూడురోజులు కోస్తాంధ్ర, రాయలసీమల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) బుధవారం నివేదికలో తెలిపింది. అదే సమయంలో ఉరుములు, మెరుపులతో పాటు పిడుగులు కూడా సంభవించవచ్చని పేర్కొంది. అందువల్ల ఆయా ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. గురువారం అల్లూరి సీతారామరాజు, తూర్పు గోదావరి, కర్నూలు, నంద్యాల, వైఎస్సార్, అన్నమయ్య, చిత్తూరు జిల్లాలు, శుక్రవారం ప్రకాశం, అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్సార్, అన్నమయ్య, చిత్తూరు జిల్లాలు, శనివారం అల్లూరి సీతారామరాజు, కాకినాడ జిల్లాల్లో ఈ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ వివరించింది. -
మళ్లీ వడగాడ్పుల దడ
సాక్షి, విశాఖపట్నం: ఇటీవల తగ్గుముఖం పట్టిన వడగాడ్పులు మళ్లీ దడ పుట్టించనున్నాయి. అధిక ఉష్ణోగ్రతలతో ఎండలు మరింత తీవ్రం కానున్నాయి. నాలుగైదు రోజుల క్రితం ద్రోణి, ఆవర్తనాల ప్రభావంతో రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని, ఫలితంగా ఉష్ణతాపం తగ్గుతుందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అంచనా వేసింది. అయితే.. మారిన వాతావరణ పరిస్థితులతో అవి రాష్ట్రంపై ప్రభావం చూపించకపోవడంతో వానలు ఊరించి ఉసూరుమనిపించాయి. దీంతో ఉష్ణోగ్రతల పెరుగుదల మొదలై వడగాడ్పులు మళ్లీ ఉధృతమవుతున్నాయి. సోమవారం నుంచి ఇవి తీవ్రరూపం దాల్చనున్నాయి. ఆదివారం రాష్ట్రంలో ఆదివారం 35 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 67 మండలాల్లో వడగాడ్పులు వీచాయి. సోమవారం 31 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 139 మండలాల్లో వడగాడ్పులు, మంగళవారం 33 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 113 మండలాల్లో వడగాడ్పులు వీచే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. రానున్న మూడు రోజులు పలుచోట్ల 41నుంచి 44 డిగ్రీలు, కొన్నిచోట్ల 45 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని అంచనా వేసింది. పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో 45 డిగ్రీలు, విజయనగరం జిల్లాలో 44, శ్రీకాకుళం, ఎన్టీఆర్, పల్నాడు, ఏలూరు జిల్లాల్లో 43, అనకాపల్లి, తూర్పు గోదావరి, కాకినాడ, కర్నూలు, నంద్యాల, అనంతపురం, వైఎస్సార్, నెల్లూరు జిల్లాల్లో 42 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు కావచ్చని పేర్కొంది. కాగా.. ఆదివారం కర్నూలు జిల్లా గోనవరంలో అత్యధికంగా 42.3 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. -
రాష్ట్రం నిప్పుల కుంపటి!
సాక్షి, విశాఖపట్నం: వేసవి ఉష్ణోగ్రతలు అనూహ్యంగా పెరగడంతో రాష్ట్రం నిప్పుల కుంపటిలా మారింది. మే మధ్యలో నమోదు కావలసిన ఉష్ణోగ్రతలు ఏప్రిల్ మొదటి వారంలోనే రికార్డవుతున్నాయి. అనేక చోట్ల వడగాడ్పులు, కొన్నిచోట్ల తీవ్ర వడగాడ్పులు వీస్తున్నాయి. ఫలితంగా జనం ఇళ్ల నుంచి బయటకు రావడానికి భయపడుతున్నారు. వడగాడ్పులు రోజురోజుకూ అధికమవుతున్నాయి. ఉష్ణోగ్రతలు సాధారణంకంటే 3 నుంచి 6 డిగ్రీలు అధికంగా నమోదవుతూ దడ పుట్టిస్తున్నాయి. కొన్ని చోట్ల 44 డిగ్రీలకు మించిపోగా, పలు చోట్ల 40 నుంచి 43 డిగ్రీలు నమోదయ్యాయి. ముఖ్యంగా రాయలసీమలోని నంద్యాల, కర్నూలు, వైఎస్సార్, చిత్తూరు, తిరుపతి, దక్షిణ కోస్తాంధ్రలోని ప్రకాశం, పల్నాడు, ఏలూరు జిల్లాల్లో, ఉత్తర కోస్తాలోని శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం జిల్లాల్లో ఉష్ణతీవ్రత అధికంగా ఉంది. శుక్రవారం అత్యధికంగా నంద్యాల జిల్లా ఆలమూరులో 44.4 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డయింది. లద్దగిరి (కర్నూలు) 44.2, మద్దూరు (వైఎస్సార్), గురజాల (పల్నాడు)ల్లో 44.1, తిప్పాయపాలెం (ప్రకాశం) 44, జి.సిగడాం (శ్రీకాకుళం) 43.8, మాడుగుల (అనకాపల్లి) 43.7, నిండ్ర (చిత్తూరు) 43.6, గుర్ల (విజయనగరం) 43.5, పెదమాండ్యం (అన్నమయ్య) 43.4, ఎం.నెల్లూరు (తిరుపతి), తలుపుల (సత్యసాయి)ల్లో 43, రెంటచింతల (పల్నాడు) 42.6 డిగ్రీలు డిగ్రీల చొప్పున గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నేడు, రేపు మరింత తీవ్రం రానున్న రెండు రోజులు రాష్ట్రంలో ఎండలు, వడగాడ్పులు మరింత తీవ్రం కానున్నాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ శుక్రవారం తెలిపింది. పార్వతీపురం మన్యం జిల్లాలో ఉష్ణోగ్రతలు 46 డిగ్రీల వరకు చేరుకునే అవకాశం ఉందని తెలిపింది. శుక్రవారం రాష్ట్రంలోని 94 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 159 మండలాల్లో వడగాడ్పులు వీచాయి. ఈ సంస్థ అంచనా ప్రకారం.. శనివారం 179 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 208 మండలాల్లో వడగాడ్పులు, ఆదివారం 44 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 193 మండలాల్లో వడగాడ్పులు వీయనున్నాయి. శనివారం శ్రీకాకుళం జిల్లాలో 26, విజయనగరం 25, పార్వతీపురం మన్యం 15, అనకాపల్లి 16, అల్లూరి సీతారామరాజు 9, కాకినాడ 13, కోనసీమ 7, తూర్పు గోదావరి 16, ఏలూరు 4, కృష్ణా 4, ఎన్టీఆర్ 6, గుంటూరు 14, పల్నాడు 17, బాపట్ల 1, తిరుపతి 1, ప్రకాశం జిల్లాలోని 2 మండలాల్లోను తీవ్ర వడగాడ్పులు వీచే అవకాశం ఉందని వివరించింది. మరోవైపు ఈనెల 8, 9 తేదీల్లో రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవవచ్చని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) వెల్లడించింది. ఫలితంగా ఆ రెండు రోజులు ఉష్ణోగ్రతలు తగ్గి ఉష్ణతాపం నుంచి తాత్కాలిక ఉపశమనం కలిగించనుంది. -
సూరీడు 40+ హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరిక
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఎండలు దంచికొడుతున్నాయి. ఉదయం 8 గంటల నుంచే ఎండల తీవ్రత కనిపిస్తోంది. సాయంత్రం 6 గంటలు దాటి నా వేడిగాలులు వీస్తున్నాయి. ఇప్పటికే సాధారణం కంటే 2–3 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమో దవుతుండగా వచ్చే మూడు రోజులపాటు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని... కొన్ని జిల్లాల్లో 42ని–44 డిగ్రీల సెల్సియస్ మధ్య గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. అలాగే మంగళవారం నుంచి హైదరాబాద్ చుట్టు పక్కల జిల్లాల్లో పగటి ఉష్ణోగ్రతలు 38–41 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేసింది. దిగువ స్థాయిలోని గాలులు వాయవ్య దిశ నుంచి రాష్ట్రం వైపు వీస్తున్నాయని వివరించింది. రాష్ట్రంలోకి రుతుపవనాలు ప్రవేశించే వరకు ఇదే పరిస్థితి కొనసాగుతుందని వాతావరణ అధికారులు చెబుతున్నారు. సోమ వారం నల్లగొండలో 43.5 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదవగా భద్రాచలంలో 43.2 డిగ్రీలు, ఖమ్మంలో 43 డిగ్రీల చొప్పు న ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరోవైపు వడదెబ్బకు గురై హనుమ కొండ జిల్లాలో ముస్కుపెంటు(52)అనే ఉపాధి హామీ కూలీ, మంచిర్యాల జిల్లాలో సంతోష్‌కుమార్ (36) అనే కానిస్టేబుల్ మృతి చెందారు. మరోవైపు రాష్ట్ర ప్రణాళికా విభా గం విడుదల చేసిన గణాంకాల ప్రకారం నల్లగొండ జిల్లా దామరచర్ల 45.3 డిగ్రీలు, జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ 45.1 డిగ్రీలు, నల్లగొండ జిల్లా నిడ మానూరులో 44.9 డిగ్రీలు, ములుగు జిల్లా తాడ్వాయి, రామగుండంలో 44.4 డిగ్రీల చొప్పున, జగిత్యాల జిల్లా జైనా, కరీంనగర్ జిల్లా వీణవంక, మహబూబాబాద్ జిల్లా బయ్యారంలో 44.3 డిగ్రీల చొప్పున, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సీతారాంపట్నంలో 44.2 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కాగా, ఏపీలో కూడా వడగాడ్పులు, ఎండల ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. -
వేసవి గాలుల తీవ్రరూపం.. కళ్లు పొడి బారుతున్నాయ్ జాగ్రత్త!
లబ్బీపేట (విజయవాడ తూర్పు): వేసవి గాలులు తీవ్రరూపం దాల్చాయి. తప్పనిసరి పరిస్థితుల్లో ప్రయాణాలు చేసేవారి సంఖ్య ఎక్కువగానే ఉంటోంది. అలాంటి వారికి వేడి గాలుల ప్రభావంతో కళ్లు పొడిబారిపోతున్నట్టు వైద్యులు చెబుతున్నారు. దీంతో టియర్ పొర (కన్నీటి గ్రంధి) దెబ్బతిని కంటికి తేమ అందక డ్రై అవుతున్నట్టు వైద్యులు చెబుతున్నారు. మరోవైపు పాఠశాలలు, కళాశాలలకు వేసవి సెలవులు ఇచ్చేశారు. దీంతో పిల్లలు ఇంట్లోనే స్మార్ట్ఫోన్లతో కాలక్షేపం చేస్తున్నారు. పిల్లల్లో అత్యధికులు రోజులో 3నుంచి 5గంటల పాటు స్మార్ట్ఫోన్లు చూస్తున్నారు. అలాంటి వారిలో కంటి సమస్యలు వస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు. సాధారణంగా నిమిషానికి 8 సార్లు కంటి రెప్పల్ని ఆర్పుతుంటాం. అలా చేయడం వల్ల కార్నియాకు అవసరమైన నీరుచేరి కళ్లు డ్రై కాకుండా చేస్తాయి. స్మార్ట్‌ఫోన్ చూసే సమయంలో కనురెప్పలు నిమిషానికి రెండు లేదా మూడుసార్లు మాత్రమే ఆర్పుతుంటారని వైద్యులు చెబుతున్నారు. దీంతో కళ్లు డ్రై అవుతున్నాయంటున్నారు. ప్రస్తుతం కంటి దురదలు, కళ్ల మంటలు రావడం, కొందరికి తలనొప్పి వంటి సమస్యలు వస్తున్నట్టు చెబుతున్నారు. వెలుతురు సరిగ్గా చూడలేకపోవడం, కళ్లు ఎర్రబారడం వంటి లక్షణాలుంటాయంటున్నారు. చికిత్స పొందకుంటే నల్లగుడ్డుపై ప్రభావం చూపే అవకాశం ఉన్నట్టు వైద్యులు చెబుతున్నారు. సకాలంలో చికిత్స పొందాలి కళ్లు డ్రై అయిన వారిలో దురదలు, కళ్లు మంటలు, ఎర్రగా మారడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ లక్షణాలు కనిపించినప్పుడు నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలి. అశ్రద్ధ చేస్తే క్రమేణా నల్లగుడ్డుపై ప్రభావం చూపవచ్చు. ప్రతిరోజూ ఐ డ్రాప్స్, ఆయింట్మెంట్ వాడటం వలన సమస్యను పరిష్కరించుకోవచ్చు. ఆ మందులు దీర్ఘకాలం వాడినా ఎలాంటి దుష్ఫలితాలు ఉండవు. సమస్య రాకుండా ఉండాలంటే కంటికి దూరంగా.. బ్రైట్నెస్ తక్కువగా పెట్టుకుని స్మార్ట్‌ఫోన్, కంప్యూటర్లను వినియోగించాలి. – సి.త్రివేణి, నేత్ర వైద్య నిపుణురాలు, విజయవాడ ఏం చేయాలంటే.. ► వేసవిలో ప్రయాణాలు చేసేవారు విధిగా కళ్లజోడు వినియోగించాలి. ► తరచూ ముఖాన్ని చన్నీటితో కడుక్కోవడం మంచిది. ► స్మార్ట్‌ఫోన్ బ్రైట్నెస్ తక్కువగా పెట్టుకుని ఉపయోగించాలి. ► కళ్లకు ఫోన్‌ను 15 సెం.మీ. దూరంలో ఉంచి చూడాలి. ముఖానికి దగ్గరగా పెట్టకూడదు. ► 20 నిమిషాలపాటు ఫోన్, కంప్యూటర్ వాడిన తర్వాత 20 సెకన్లపాటు దూరంలో ఉన్న వస్తువులను చూడాలి. అలా చేయడం ద్వారా కనురెప్పలు వేయడంతో నల్లగుడ్డు పొరపైకి నీరు చేరి డ్రై కాకుండా చేస్తుంది. ► ఎట్టి పరిస్థితుల్లో చీకట్లో స్మార్ట్‌ఫోన్ వినియోగించకూడదు. ► కంప్యూటర్‌పై పనిచేసే వారు యాంటీ రిఫ్లెక్టివ్ గ్లాస్ వాడితే మేలు. ► రోజులో ఎక్కువసేపు స్మార్ట్‌ఫోన్, కంప్యూటర్‌పై పనిచేసే వారు ఐ డ్రాప్స్, ఆయింట్మెంట్ వాడటం ద్వారా దుష్ఫలితాలు లేకుండా చూడవచ్చు. -
రాష్ట్రంలో మంటలు కంటిన్యూ.. గ్రేటర్ మినహా రాష్ట్రమంతా ఆరెంజ్ అలర్ట్ జారీ
ఎండలు మండుతుండటంతో వేరుశనగ పంట తీసేందుకు వెళ్లిన కూలీలు.. ఆ మొక్కలనే గుడిసెగా మార్చు కుని పనిచేసుకుంటున్న దృశ్యమిది. ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలం వడ్డాడి గ్రామశివార్లలో ఈ దృశ్యం కనిపించింది. – సాక్షి ఫొటోగ్రాఫర్ , ఆదిలాబాద్ సాక్షి, హైదరాబాద్/సాక్షి నెట్వర్క్: రాష్ట్రంలో ఎండలు మండుతున్నాయి. రికార్డుస్థాయిలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇంట్లో నుంచి కాలు బయటపెట్టాలన్నా భయపడేలా వడగాడ్పులు వీస్తున్నాయి. గాలిలో తేమశాతం బాగా పెరగడంతో విపరీతంగా ఉక్కపోత ఉంటోంది. మరో రెండు రోజులు కూడా ఇదే పరిస్థితి ఉంటుందని, గరిష్ట ఉష్ణోగ్రతలు మరింతగా పెరుగుతాయని వాతావరణశాఖ హెచ్చరించింది. ఈ మేరకు గ్రేటర్ హైదరాబాద్ మినహా రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్‌ను జారీ చేసింది. గురు, శుక్రవారాల్లో రాష్ట్రంలోని చాలాచోట్ల 41 డిగ్రీల సెల్సియస్ నుంచి 44 డిగ్రీల సెల్సియస్ వరకు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో వడగాడ్పులు సైతం వీస్తాయని వివరించింది. 22 నుంచి కొన్నిరోజులు ఉపశమనం శనివారం (ఈ నెల 22వ తేదీ) నుంచి ఎండలు కాస్త తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా చాలాచోట్ల సాధారణ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని.. కొన్నిచోట్ల సాధారణం కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే చాన్స్ ఉందని వెల్లడించింది. గ్రేటర్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు మరింత తగ్గవచ్చని అంచనా వేసింది. వాతావరణంలో నెలకొంటున్న పలు మార్పులే దీనికి కారణమని వివరించింది. దాదాపు నాలుగైదు రోజుల పాటు ఉష్ణోగ్రతలు తగ్గిన తర్వాత మళ్లీ పెరిగే అవకాశం ఉందని పేర్కొంది. గురువారం వాయవ్య తెలంగాణ, శుక్రవారం తూర్పు తెలంగాణ జిల్లాల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. అప్రమత్తంగా ఉండాలి.. ఓవైపు అధిక ఉష్ణోగ్రతలు, వడగాడ్పులు, ఈదురుగాలులతో కూడిన వానలు పడే అవకాశం నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. బయటికి వెళ్లేవారు తగిన జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలని స్పష్టం చేసింది. వీలైనంత వరకు మధ్యాహ్న సమయంలో ఇంట్లోనే ఉండాలని పేర్కొంది. ఇక బుధవారం రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రత ఆదిలాబాద్‌లో 42.3 డిగ్రీలుగా నమోదైనట్టు తెలిపింది. సాధారణం కంటే అధికంగా.. రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీల సెల్సియస్ మేర అధికంగా నమోదవుతున్నట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. ఖమ్మంలో సాధారణం కంటే ఏకంగా 3.2 డిగ్రీలు అధికంగా నమోదవడం గమనార్హం. నల్లగొండలో 2.4 డిగ్రీలు.. భద్రాచలం, మెదక్‌లలో 1.9 డిగ్రీలు, హన్మకొండలో 1.7 డిగ్రీలు, నిజామాబాద్, రామగుండంలలో 1.6 డిగ్రీల మేర అధికంగా నమోదైనట్టు తెలిపింది. – పగటి ఉష్ణోగ్రతలకు తగినట్టుగా రాత్రి ఉష్ణోగ్రతలూ సాధారణం కంటే ఒకటి, రెండు డిగ్రీలు అధికంగా ఉంటున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. చాలాచోట్ల అర్ధరాత్రి దాటే వరకు కూడా ఉక్కపోత కొనసాగుతోందని వివరించింది. – ఇక జగిత్యాల జిల్లా మల్లాపూర్‌లో 44.5 డిగ్రీలు, జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్‌పూర్‌లో 44.5 డిగ్రీలు, ఆదిలాబాద్ జిల్లా తలమడుగులో 44.3 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదైనట్టు రాష్ట్ర ప్రణాళికా విభాగం తమ వెబ్సైట్లో తెలిపింది. – ఎండ తీవ్రత కారణంగా రాష్ట్రవ్యాప్తంగా ఉదయం పది, పదకొండు గంటల సరికే రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారిపోతున్నాయి. ఏప్రిల్‌లోనే ఈ పరిస్థితి ఉంటే.. మే నెలలో ఎండల తీవ్రత మరెలా ఉంటుందోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది. దేశవ్యాప్తంగా భగభగలు న్యూఢిల్లీ: భానుడి ప్రతాపంతో దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలు అల్లాడిపోతున్నాయి. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో, ఒడిశాలోని బారిపడలో 44.5 డిగ్రీలు నమోదైనట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఢిల్లీలో కొన్ని రోజులుగా 40 డిగ్రీలకు పైగానే నమోదవుతున్నాయి. ఈశాన్య రాష్ట్రాల్లోనూ ఎండ ప్రచండంగా ఉంది. దాంతో త్రిపురలో ‘స్టేట్ స్పెసిఫిక్ డిజాస్టర్’ ప్రకటించారు. కేరళలోనూ ఎండలు మండుతున్నాయి. పశ్చిమ బెంగాల్, ఏపీ, బిహార్ తదితర రాష్ట్రాల్లో తీవ్ర వడగాడ్పులు రెండు రోజులుంటాయని ఏపీలో ఈ నెల 21, 22ల్లో వర్షం పడొచ్చని వాతావరణ శాఖ చెప్పింది. -
వేడి తీవ్రతపై ప్రధాని సమీక్ష
న్యూఢిల్లీ: దేశంలో పెరిగిపోతున్న ఎండవేడిపై ప్రధాని నరేంద్ర మోదీ గురువారం కీలక సమీక్షా సమావేశం నిర్వహించారు. వేడి గాలులతో ప్రజలకు ప్రాణాపాయం జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఆయన సమీక్షించారు. దేశంలో అధిక ఉష్ణోగ్రతల గురించి సమావేశంలో వాతావరణ శాఖ, జాతీయ విపత్తు నిర్వహణా అథార్టీలు వివరించాయి. అధిక ఎండలతో అగ్ని ప్రమాదాలు, వడగాలులు సంభవిస్తాయని, వీటివల్ల ప్రాణాపాయం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రధాని కోరారు. దేశంలో అడవుల పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యలు, అడవుల్లో కార్చిచ్చు రేగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఆయన సమీక్షించారు. రాబోయే రుతుపవనాలను దృష్టిలో ఉంచుకొని తాగునీటి సంరక్షణా చర్యలు తీసుకోవాలని, నీటివనరులు కలుషితం కాకుండా జాగ్రత్తపడాలని ఆదేశించారు. -
ఉత్తరాదిన భానుడి సెగలు
సాక్షి, న్యూఢిల్లీ: ఉత్తరాది రాష్ట్రాలు వేడి గాలులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. ఇప్పటికే రావాల్సిన రుతుపవనాలు 2 వారాలుగా ఆగిపోవడంతో వేడి పెరిగింది. దీంతో, ఉత్తర భారతదేశంలో ఇప్పుడు వాతావరణం వేసవిని తలపిస్తోంది. ఎండల ప్రభావంతో సుమారు 7 డిగ్రీలు ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఢిల్లీలో 90 ఏళ్ల రికార్డు బద్దలైంది. పశ్చిమ దిశ నుంచి వస్తున్న గాలులు వాతావరణంలో వేడిని పెంచాయి. రుతుపవనాల ప్రారంభ దశలో తేలికపాటి వర్షాలతో కాస్త ఉపశమనం పొందిన ప్రజలకు ఇప్పుడు వేడి గాలుల కారణంగా ఉక్కపోతతో అవస్థలు పెరిగాయి. రికార్డు బద్దలు: దేశ రాజధాని ఢిల్లీలో భానుడి ప్రతాపంతో వేడి 90 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టింది. రాజధానిలోని మంగేష్‌పూర్ ప్రాంతంలో గురువారం 45.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అంతకుముందు 1931 జూలై 1న 45 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డు అయ్యింది. అయితే అదే సమయంలో జూలై మొదటి రోజు 9 ఏళ్ల తర్వాత అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. సాధారణంగా జూన్ చివరి వారంలో రుతుపవనాల ప్రభావం కారణంగా ఉష్ణోగ్రత 37–38 డిగ్రీలుగా ఉంటుంది. కానీ ఈ ఏడాది వేడిగాలుల కారణంగా రుతుపవనాలు ఆలస్యం కావడంతో భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. అంతకుముందు 2012 జూలైలో గరిష్ట ఉష్ణోగ్రత 43.5 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. మూడు రోజులుగా ఢిల్లీలో ఉష్ణోగ్రత సుమారు 43 డిగ్రీల సెల్సియస్‌గా ఉంది. ఇది సాధారణ ఉష్ణోగ్రత కంటే 7 డిగ్రీల సెల్సియస్ ఎక్కువ. అయితే పలుచోట్ల తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉంది. ఢిల్లీతోపాటు హరియాణా, చండీగఢ్, యూపీల్లోనూ వేడిగాలులతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. పాకిస్తాన్ వైపు నుంచి వస్తున్న వేడిగాలులు రుతు పవనాలను అడ్డుకుంటున్నాయి. త్వరలో ఉపశమనం.. రెండు రోజులు ఆలస్యంగా కేరళలో ప్రవేశించిన రుతుపవనాలు కేవలం 10 రోజుల్లోనే దేశంలోని 80% ప్రాంతాన్ని కవర్ చేశాయి. జూలై 3 నుంచి అరేబియా సముద్రం నుంచి గుజరాత్, రాజస్తాన్ మీదుగా ఢిల్లీ వైపు తేమ గాలులు చేరుకోవడం ప్రారంభమవుతుందని, అప్పుడు ఉపశమనం లభిస్తుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. రుతుపవనాల బ్రేక్ జూలై 7 వరకు కొనసాగవచ్చని, ఆ తరువాత బంగాళాఖాతం నుంచి వచ్చే గాలులు ఉత్తర భారతదేశానికి చేరిన తర్వాత రుతుపవనాలు చురుగ్గా ఉంటాయని అంటోంది. -
నేడు,రేపు వడగాడ్పులు
-
మరో 3 రోజులు వేడి గాలులు
మహారాణిపేట (విశాఖ దక్షిణ): రాష్ట్రంలో మరో రెండు మూడు రోజులపాటు వేడిగాలులు, ఉక్కపోత కొనసాగుతాయని విశాఖ వాతావరణ కేంద్రం సోమవారం వెల్లడించింది. పలు చోట్ల నిప్పుల వానలా ఎండ కాస్తుందని తెలిపింది. రాయలసీమలో 40 డిగ్రీల నుంచి 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయని పేర్కొంది. రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో 40 డిగ్రీలకు పైనే ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయని వివరించింది. అత్యవసరమైతే తప్ప ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ప్రజలెవరూ బయటికి రావొ ద్దని అధికారులు సూచిస్తున్నారు. అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు దక్షిణ బంగాళాఖాతం, అండమాన్ సముద్రం, దాన్ని ఆనుకొని ఉన్న బంగాళాఖాతం మధ్య ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు ఈ నెల 27న వచ్చే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం డైరెక్టర్ తెలిపారు. ఇలా ఉండగా ఉపరితల ద్రోణి,ఆవర్తనం కారణంగా మంగళవారం దక్షిణ కోస్తా ఆంధ్రా, రాయలసీమల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. బుధవారం కూడా రాయలసీమలో తేలికపాటి వర్షాలు కురుస్తాయి. -
మూడోరోజూ మంటలే..
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో వరుసగా మూడో రోజూ వాతావరణం మంటపుట్టించింది. ఒకవైపు ఎండలు ఠారెత్తించగా, మరోవైపు వడగాడ్పుల తీవ్రతతో ప్రజలు విలవిల్లాడారు. శనివారం రాష్ట్రంలోని పలుచోట్ల సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీల మేరకు అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీనికితోడు తీవ్రమైన వడగాడ్పులు వీచాయి. ముఖ్యంగా కృష్ణా, గుంటూరు జిల్లాల్లో వడగాడ్పులు విపరీతంగా వీయడంతో ప్రజలు అల్లాడారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల ప్రభావంతో రానున్న నాలుగు రోజులపాటు రాష్ట్రంలో వడగాడ్పులు వీస్తాయని విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది. శనివారం విజయవాడలో అత్యధికంగా 45.1 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్రంలోని పలు ప్రధాన పట్టణాల్లోనూ 43 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇదిలా ఉంటే.. ఆగ్నేయ మధ్యప్రదేశ్ నుంచి తెలంగాణ వరకు 0.9 కి.మీ. ఎత్తులో ఉపరితల ద్రోణి కొనసాగుతోందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది. -
నేడు, రేపు రాష్ట్రంలో వడగాడ్పులు
సాక్షి, హైదరాబాద్ : ఉత్తర, తూర్పు తెలంగాణ ప్రాంతాల్లో కొన్ని చోట్ల గురు, శుక్రవారాల్లో తీవ్ర వడగాడ్పులు వీచే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. శుక్రవారం అక్కడక్కడ తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది. మరోవైపు ఈశాన్య, మధ్య బంగాళాఖాతం ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగు తోందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారి రాజారావు తెలిపారు. ఇదిలావుండగా బుధవారం పలుచోట్ల అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఖమ్మం, రామగుండంల్లో ఏకంగా 44 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఆదిలాబాద్, భద్రాచలం, హన్మకొండ, మెదక్‌ల్లో 42 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రత నమోదు కాగా, నిజామాబాద్, నల్లగొండల్లో 41 డిగ్రీలు, మహబూబ్‌నగర్‌లో 39, హైదరాబాద్‌లో 38 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డయింది. -
ముందుంది నిప్పుల వాన!
సాక్షి, విశాఖపట్నం/సాక్షి నెట్వర్క్: రాష్ట్రానికి నిప్పుల ముప్పు ఇంకా పొంచి ఉంది. నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించేదాకా ఉష్ణ తీవ్రత కొనసాగనుంది. ఫొని తుపాను తీరాన్ని దాటక ముందు నుంచీ భానుడు నిప్పులు చెరుగుతూనే ఉన్నాడు. ఎడతెరపి లేకుండా వడగాడ్పులు వీస్తూనే ఉన్నాయి. కోస్తాంధ్ర, రాయలసీమ అన్న తేడా లేకుండా సాధారణం కంటే 4–7 డిగ్రీల వరకు అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతూ ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. కోస్తాంధ్రలోని నెల్లూరు, ప్రకాశం, తూర్పు గోదావరి, రాయలసీమ జిల్లాల్లోనూ వెరసి 139 మండలాల్లో వడగాడ్పులు తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. గడిచిన పదేళ్లలో ఉష్ణోగ్రతల పెరుగుదల తీరుపై ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ (ఏపీడీఎంఏ) ఒక అట్లాస్‌ను రూపొందించింది. దాని ప్రకారం రాష్ట్రంలో ఏటా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. అలాగే ఐఎండీ నేషనల్ మాన్సూన్ మిషన్ ఏప్రిల్, మే నెలల్లో దేశంలో ఉష్ణోగ్రతల ప్రభావంపై పరిశీలన చేసింది. పంజాబ్, హర్యానా, గుజరాత్, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, బీహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా, తెలంగాణ, కోస్తాంధ్ర, రాయలసీమల్లోని కొన్ని ప్రాంతాలను తీవ్ర వడగాడ్పుల ప్రభావిత ఏరియాలుగా తేల్చింది. ఏపీ, తెలంగాణపైనా డెడ్లీ హీట్‌వేవ్స్ ప్రభావం ఉత్తర, వాయవ్య భారతదేశంలో ఈ వేసవిలో 50 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు (డెడ్లీ హీట్‌వేవ్స్) నమోదయ్యే ప్రమాదం ఉందని ఐక్యరాజ్యసమితి ఇటీవల హెచ్చరించింది. వాటి ప్రభావం ఏపీ, తెలంగాణ రాష్ట్రాలపై కూడా ఉంటుందని తెలిపింది. అధిక ఉష్ణోగ్రతల ధాటికి చాలా మరణాలు సంభవిస్తాయని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ఐక్యరాజ్యసమితి అత్యంత అరుదుగా ఇలాంటి హెచ్చరికలు జారీ చేస్తుంది. ప్రస్తుతం రెండు రోజుల నుంచి ఉపరితల ద్రోణి ప్రభావంతో వడగాడ్పుల తీవ్రత తగ్గి రాష్ట్రంలో పలుచోట్ల ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయిలో నమోదవుతున్నాయి. ఈ పరిస్థితి రెండు మూడు రోజులకే పరిమితమని, ఎండలు విజృంభించి, మళ్లీ తీవ్ర వడగాడ్పులు కొనసాగుతాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. వడదెబ్బకు గురై మంగళవారం ప్రకాశం, అనంతపురం, వైఎస్సార్ జిల్లాల్లో నలుగురు వంతున, గుంటూరు జిల్లాలో ఇద్దరు, విశాఖ జిల్లాలో ఒకరు వంతున మృతి చెందారు. నేడు, రేపు కోస్తాంధ్రకు వర్ష సూచన కోస్తాంధ్రలో బుధ, గురువారాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురవనున్నాయి. అదే సమయంలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో గంటకు 50–60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీయనున్నాయి. కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం(ఐఎండీ) మంగళవారం రాత్రి ఒక నివేదికలో తెలిపింది. ఈదురుగాలులు, వర్షాలతో పాటు కొన్నిచోట్ల పిడుగులు పడే ప్రమాదం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. రాయలసీమలో బుధవారం అక్కడక్కడ తేలికపాటి వర్షం గానీ, జల్లులు గానీ కురిసే అవకాశం ఉంది. గురువారం నుంచి అక్కడ రెండు రోజులు పొడి వాతావరణం నెలకొంటుంది. 47 డిగ్రీల దాకా ఉష్ణోగ్రతలు ‘‘జూన్ ఒకటి రెండు తేదీల్లో రుతుపవనాలు కేరళను తాకిన వారం పది రోజుల నాటికి రాష్ట్రంలోకి ప్రవేశించే అవకాశం ఉంది. అప్పటిదాకా ద్రోణుల ప్రభావంతో ఒకట్రెండు రోజులు ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిసి కాస్త చల్లబరచినా మళ్లీ వడగాడ్పులు విజృంభిస్తాయి. ఇప్పటికన్నా ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. కొన్నిచోట్ల 47 డిగ్రీల వరకు నమోదై నిప్పుల కొలిమిని తలపిస్తాయి. రానున్న రెండు మూడు రోజుల్లోనే వీటి పెరుగుదల మొదలవుతుంది. మరోవైపు ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు మంచి వర్షాలనే కురిపిస్తాయి. ముందుగా ఊహించినట్టుగా ఎల్‌నినో (వర్షాభావ) భయం లేదు’’ – ఓఎస్ఆర్యూ భానుకుమార్, వాతావరణం, సముద్ర అధ్యయనవిభాగ మాజీ అధిపతి. ఏయూ -
నేడు, రేపు పలు జిల్లాల్లో వడగాడ్పులు
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో అప్పుడే వడగాడ్పులు మొదలయ్యాయి. ఆది, సోమవారాల్లో పలు జిల్లాల్లో వడగాడ్పుల తీవ్రత ఎక్కువగా ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఆదిలాబాద్, నిజామాబాద్, నిర్మల్, కుమ్రంభీం, జగిత్యాల, మంచిర్యాల, పెద్దపల్లి, కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో అక్కడక్కడ వడగాడ్పుల తీవ్రత అధికంగా ఉంటుందని తెలిపింది. ఖమ్మం, కొత్తగూడెం, మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లి, మంచిర్యాల, పెద్దపల్లి, వరంగల్ జిల్లాల్లో ఈదురుగాలులు, ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. -
ఏడు జిల్లాలకు వడగాల్పుల హెచ్చరిక
హైదరాబాద్: రాష్ట్రంలోని ఏడు జిల్లాల్లో మంగళవారం వడగాడ్పులు వీచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. కొత్తగూడెం, నల్లగొండ, సూర్యాపేట, ఖమ్మం, నాగర్‌కర్నూలు, వనపర్తి, జగిత్యాల జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో వేడి గాలులు వీస్తాయని పేర్కొంది. రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల్లోనూ సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీలు అధికంగా 42 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వెల్లడించింది. భద్రాచలం, ఖమ్మం, నల్లగొండల్లో సోమవారం అత్యధికంగా 43 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. -
మండే ఎండలు
♦ సోమవారం 38 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు ♦ వారం వ్యవధిలో 5 డిగ్రీల పెరుగుదల ♦ మధ్యాహ్నం బయటకు రాని జనం ఎండలు ముదురుతున్నాయి. అప్పుడే వేడిగాలులు ప్రారంభమయ్యాయి. దీంతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మధ్యాహ్నం వేళ బయటకు రావాలంటే జంకుతున్నారు. వారం రోజులుగా పగటి గరిష్ట ఉష్ణోగ్రతలు అనూహ్యంగా పెరుగుతున్నాయి. ఫిబ్రవరిలోనే ఎండలు తీవ్రరూపం దాల్చడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఈ సీజన్లో అత్యధికంగా సోమవారం 38 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఆదివారం 36.9 డిగ్రీలు గరిష్టంగా, 17.4 డిగ్రీలు కనిష్టంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈనెల 16వ నుంచి 22వ తేదీ వరకు సుమారు 5 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత పెరిగింది. ఉదయం 10గంటల నుంచి వాతావరణం వెడెక్కుతోంది. ఫిబ్రవరిలోనే ఎండలు ఇలా ఉంటే మార్చిలో ఇంకెలా ఉంటాయోనని జనాలు ఆందోళన చెందుతున్నారు. ఈ నెలలో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని తాండూరు వ్యవసాయ పరిశోధన కేంద్రం శాస్త్రవేత్త డా.సుధాకర్ తెలిపారు. - తాండూరు