Dry Eyes Due To The Effect Of Hot Winds Of Summer - Sakshi
Sakshi News home page

వేసవి గాలుల తీవ్రరూపం.. కళ్లు పొడి బారుతున్నాయ్‌ జాగ్రత్త!

Published Thu, May 11 2023 5:14 AM | Last Updated on Thu, May 11 2023 9:02 AM

Dry eyes due to the effect of hot winds of Summer - Sakshi

లబ్బీపేట (విజయవాడ తూర్పు): వేసవి గాలులు తీవ్రరూపం దాల్చాయి. తప్పనిసరి పరిస్థితుల్లో ప్రయాణాలు చేసేవారి సం­ఖ్య ఎక్కువగానే ఉంటోంది. అలాంటి వారికి వేడి గాలుల ప్రభావం­తో కళ్లు పొడిబారిపోతున్నట్టు వైద్యులు చెబుతున్నారు. దీంతో టియర్‌ పొ­ర (కన్నీటి గ్రంధి) దెబ్బతిని కంటికి తేమ అందక డ్రై అవుతున్నట్టు వైద్యులు చెబుతున్నా­రు. మరోవైపు పాఠశాలలు, కళాశాలలకు వేసవి సెలవులు ఇచ్చేశారు. దీంతో పిల్లలు ఇంట్లోనే స్మార్ట్‌ఫోన్లతో కాలక్షేపం చేస్తున్నారు.

పిల్లల్లో అత్యధికులు రోజులో 3నుంచి 5గంటల పాటు స్మార్ట్‌ఫోన్లు చూస్తున్నారు. అలాంటి వారిలో కంటి సమస్యలు వస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు. సాధారణంగా నిమిషానికి 8 సార్లు కంటి రెప్పల్ని ఆర్పుతుంటాం. అలా చేయడం వల్ల కార్నియాకు అవసరమైన నీరుచేరి కళ్లు డ్రై కాకుండా చేస్తాయి. స్మార్ట్‌ఫోన్‌ చూసే సమయంలో కనురెప్పలు నిమిషానికి రెండు లేదా మూడుసార్లు మాత్రమే ఆర్పుతుంటారని వైద్యులు చెబుతున్నారు.

దీంతో కళ్లు డ్రై అవుతున్నాయంటున్నారు. ప్రస్తుతం కంటి దురదలు, కళ్ల మంటలు రావడం, కొందరికి తలనొప్పి వంటి సమస్యలు వస్తున్నట్టు చెబుతున్నారు. వెలుతురు సరిగ్గా చూడలేకపోవడం, కళ్లు ఎర్రబారడం వంటి లక్షణాలుంటాయంటున్నారు. చికిత్స పొందకుంటే నల్లగుడ్డుపై  ప్రభావం చూపే అవకాశం ఉన్నట్టు వైద్యులు చెబుతున్నారు.  

సకాలంలో చికిత్స పొందాలి 
కళ్లు డ్రై అయిన వారిలో దురదలు, కళ్లు మంటలు, ఎర్రగా మారడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ లక్షణాలు కనిపించినప్పుడు నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలి. అశ్రద్ధ చేస్తే క్రమేణా నల్లగుడ్డుపై ప్రభావం చూపవచ్చు. ప్రతిరోజూ ఐ డ్రాప్స్, ఆయింట్‌మెంట్‌ వాడటం వలన సమస్యను పరిష్కరించుకోవచ్చు. ఆ మందులు దీర్ఘకాలం వాడినా ఎలాంటి దుష్ఫలితాలు ఉండవు. సమస్య రాకుండా ఉండాలంటే కంటికి దూరంగా.. బ్రైట్‌నెస్‌ తక్కువగా పెట్టుకుని స్మార్ట్‌ఫోన్, కంప్యూటర్‌లను వినియోగించాలి. 
– సి.త్రివేణి, నేత్ర వైద్య నిపుణురాలు, విజయవాడ 

ఏం చేయాలంటే.. 
► వేసవిలో ప్రయాణాలు చేసేవారు విధిగా కళ్లజోడు వినియోగించాలి. 
► తరచూ ముఖాన్ని చన్నీటితో కడుక్కోవడం మంచిది. 
► స్మార్ట్‌ఫోన్‌ బ్రైట్‌నెస్‌ తక్కువగా పెట్టుకుని ఉపయోగించాలి. 
► కళ్లకు ఫోన్‌ను 15 సెం.మీ. దూరంలో ఉంచి చూడాలి. ముఖానికి దగ్గరగా పెట్టకూడదు.  
► 20 నిమిషాలపాటు ఫోన్, కంప్యూటర్‌ వాడిన తర్వాత 20 సెకన్లపాటు దూరంలో ఉన్న వస్తువులను చూడాలి. అలా చేయడం ద్వారా కనురెప్పలు వేయడంతో నల్లగుడ్డు పొరపైకి నీరు చేరి డ్రై కాకుండా చేస్తుంది. 
► ఎట్టి పరిస్థితుల్లో చీకట్లో స్మార్ట్‌ఫోన్‌ వినియోగించకూడదు.  
► కంప్యూటర్‌పై పనిచేసే వారు యాంటీ రిఫ్లెక్టివ్‌ గ్లాస్‌ వాడితే మేలు. 
► రోజులో ఎక్కువసేపు స్మార్ట్‌ఫోన్, కంప్యూటర్‌పై పనిచేసే వారు ఐ డ్రాప్స్, ఆయింట్‌మెంట్‌ వాడటం ద్వారా దుష్ఫలితాలు లేకుండా చూడవచ్చు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement