పలు చోట్ల 44 డిగ్రీల నమోదు
ప్రతాపం చూపిన వడగాడ్పులు
నేడు, రేపు మరింత పెరిగే అవకాశం
46 డిగ్రీలకు చేరుకోనున్న ఉష్ణోగ్రతలు?
8, 9 తేదీల్లో తేలికపాటి వర్షాలతో ఉపశమనం
సాక్షి, విశాఖపట్నం: వేసవి ఉష్ణోగ్రతలు అనూహ్యంగా పెరగడంతో రాష్ట్రం నిప్పుల కుంపటిలా మారింది. మే మధ్యలో నమోదు కావలసిన ఉష్ణోగ్రతలు ఏప్రిల్ మొదటి వారంలోనే రికార్డవుతున్నాయి. అనేక చోట్ల వడగాడ్పులు, కొన్నిచోట్ల తీవ్ర వడగాడ్పులు వీస్తున్నాయి. ఫలితంగా జనం ఇళ్ల నుంచి బయటకు రావడానికి భయపడుతున్నారు. వడగాడ్పులు రోజురోజుకూ అధికమవుతున్నాయి. ఉష్ణోగ్రతలు సాధారణంకంటే 3 నుంచి 6 డిగ్రీలు అధికంగా నమోదవుతూ దడ పుట్టిస్తున్నాయి. కొన్ని చోట్ల 44 డిగ్రీలకు మించిపోగా, పలు చోట్ల 40 నుంచి 43 డిగ్రీలు నమోదయ్యాయి.
ముఖ్యంగా రాయలసీమలోని నంద్యాల, కర్నూలు, వైఎస్సార్, చిత్తూరు, తిరుపతి, దక్షిణ కోస్తాంధ్రలోని ప్రకాశం, పల్నాడు, ఏలూరు జిల్లాల్లో, ఉత్తర కోస్తాలోని శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం జిల్లాల్లో ఉష్ణతీవ్రత అధికంగా ఉంది. శుక్రవారం అత్యధికంగా నంద్యాల జిల్లా ఆలమూరులో 44.4 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డయింది.
లద్దగిరి (కర్నూలు) 44.2, మద్దూరు (వైఎస్సార్), గురజాల (పల్నాడు)ల్లో 44.1, తిప్పాయపాలెం (ప్రకాశం) 44, జి.సిగడాం (శ్రీకాకుళం) 43.8, మాడుగుల (అనకాపల్లి) 43.7, నిండ్ర (చిత్తూరు) 43.6, గుర్ల (విజయనగరం) 43.5, పెదమాండ్యం (అన్నమయ్య) 43.4, ఎం.నెల్లూరు (తిరుపతి), తలుపుల (సత్యసాయి)ల్లో 43, రెంటచింతల (పల్నాడు) 42.6 డిగ్రీలు డిగ్రీల చొప్పున గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
నేడు, రేపు మరింత తీవ్రం
రానున్న రెండు రోజులు రాష్ట్రంలో ఎండలు, వడగాడ్పులు మరింత తీవ్రం కానున్నాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ శుక్రవారం తెలిపింది. పార్వతీపురం మన్యం జిల్లాలో ఉష్ణోగ్రతలు 46 డిగ్రీల వరకు చేరుకునే అవకాశం ఉందని తెలిపింది. శుక్రవారం రాష్ట్రంలోని 94 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 159 మండలాల్లో వడగాడ్పులు వీచాయి.
ఈ సంస్థ అంచనా ప్రకారం.. శనివారం 179 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 208 మండలాల్లో వడగాడ్పులు, ఆదివారం 44 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 193 మండలాల్లో వడగాడ్పులు వీయనున్నాయి. శనివారం శ్రీకాకుళం జిల్లాలో 26, విజయనగరం 25, పార్వతీపురం మన్యం 15, అనకాపల్లి 16, అల్లూరి సీతారామరాజు 9, కాకినాడ 13, కోనసీమ 7, తూర్పు గోదావరి 16, ఏలూరు 4, కృష్ణా 4, ఎన్టీఆర్ 6, గుంటూరు 14, పల్నాడు 17, బాపట్ల 1, తిరుపతి 1, ప్రకాశం జిల్లాలోని 2 మండలాల్లోను తీవ్ర వడగాడ్పులు వీచే అవకాశం ఉందని వివరించింది.
మరోవైపు ఈనెల 8, 9 తేదీల్లో రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవవచ్చని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) వెల్లడించింది. ఫలితంగా ఆ రెండు రోజులు ఉష్ణోగ్రతలు తగ్గి ఉష్ణతాపం నుంచి తాత్కాలిక ఉపశమనం కలిగించనుంది.
Comments
Please login to add a commentAdd a comment