నేటి నుంచి మరింత తీవ్రం
మూడు రోజులపాటు 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు
సాక్షి, విశాఖపట్నం: ఇటీవల తగ్గుముఖం పట్టిన వడగాడ్పులు మళ్లీ దడ పుట్టించనున్నాయి. అధిక ఉష్ణోగ్రతలతో ఎండలు మరింత తీవ్రం కానున్నాయి. నాలుగైదు రోజుల క్రితం ద్రోణి, ఆవర్తనాల ప్రభావంతో రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని, ఫలితంగా ఉష్ణతాపం తగ్గుతుందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అంచనా వేసింది. అయితే.. మారిన వాతావరణ పరిస్థితులతో అవి రాష్ట్రంపై ప్రభావం చూపించకపోవడంతో వానలు ఊరించి ఉసూరుమనిపించాయి. దీంతో ఉష్ణోగ్రతల పెరుగుదల మొదలై వడగాడ్పులు మళ్లీ ఉధృతమవుతున్నాయి.
సోమవారం నుంచి ఇవి తీవ్రరూపం దాల్చనున్నాయి. ఆదివారం రాష్ట్రంలో ఆదివారం 35 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 67 మండలాల్లో వడగాడ్పులు వీచాయి. సోమవారం 31 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 139 మండలాల్లో వడగాడ్పులు, మంగళవారం 33 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 113 మండలాల్లో వడగాడ్పులు వీచే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. రానున్న మూడు రోజులు పలుచోట్ల 41నుంచి 44 డిగ్రీలు, కొన్నిచోట్ల 45 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని అంచనా వేసింది.
పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో 45 డిగ్రీలు, విజయనగరం జిల్లాలో 44, శ్రీకాకుళం, ఎన్టీఆర్, పల్నాడు, ఏలూరు జిల్లాల్లో 43, అనకాపల్లి, తూర్పు గోదావరి, కాకినాడ, కర్నూలు, నంద్యాల, అనంతపురం, వైఎస్సార్, నెల్లూరు జిల్లాల్లో 42 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు కావచ్చని పేర్కొంది. కాగా.. ఆదివారం కర్నూలు జిల్లా గోనవరంలో అత్యధికంగా 42.3 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది.
Comments
Please login to add a commentAdd a comment