రెండు రోజుల్లో రాష్ట్రమంతా వ్యాపించే అవకాశం
కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం
ఇప్పటికే పలు జిల్లాల్లో వర్షాలు
నేడు, రేపు అక్కడక్కడా భారీ వర్షాలు
సాక్షి, విశాఖపట్నం/అమరావతి: రాష్ట్రంలోకి ముందుగానే ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. ఇప్పటికే రాయలసీమ, నెల్లూరులోకి ప్రవేశించిన రుతుపవనాలు సోమవారం కోస్తాంధ్రలోని కృష్ణా, ఉమ్మడి తూర్పు గోదావరి, ఉమ్మడి విశాఖపట్నం జిల్లాల వరకు, పశ్చిమ మధ్య, వాయవ్య బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలకు విస్తరించాయి. రానున్న రెండు మూడు రోజుల్లో ఇవి కోస్తాంధ్రలోని మిగిలిన ప్రాంతాలకు వ్యాపించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. మరోవైపు పశ్చిమ మధ్య, నైరుతి బంగాళాఖాతంలో దక్షిణ కోస్తాంధ్ర, ఉత్తర తమిళనాడు తీరాలకు ఆనుకుని ఉన్న ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 3.1 కి.మీ. ఎత్తులో ఆవరించి ఉంది. ఇది ఎత్తుకు వెళ్లే కొద్దీ నైరుతి వైపు వంగి ఉంది.
నైరుతి రుతుపవనాలు, ఆవర్తనం ఫలితంగా రానున్న మూడు రోజులు కోస్తాంధ్ర, రాయలసీమల్లో పలుచోట్ల తేలికపాటి వర్షాలు, కొన్నిచోట్ల మోస్తరు వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) తెలిపింది. మంగళవారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, శ్రీసత్యసాయి, వైఎస్సార్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం.. శ్రీసత్యసాయి, వైఎస్సార్ జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది.
అలాగే బుధవారం విజయనగరం, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పల్నాడు, నెల్లూరు, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, వైఎస్సార్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. గురువారం పార్వతీపురం మన్యం, అల్లూరి, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్సార్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవవచ్చని వివరించింది. అదే సమయంలో ఉరుములు, మెరుపులతో పాటు పిడుగులు సంభవిస్తాయని, గంటకు 30–40 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది.
నంద్యాలలో కుంభవృష్టి
రుతుపవనాల ప్రభావంతో రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడా వర్షాలు కురుస్తున్నాయి. అనేకచోట్ల ఆకాశం మేఘావృతమై ఉండటంతో ప్రజలు ఎండల నుంచి ఉపశమనం పొందుతున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో సోమవారం ఉదయం 3.50–4 గంటల మధ్య మొదలైన వర్షం 8.30 గంటల వరకు కురిసింది. నంద్యాల జిల్లాలో ఉరుములు, మెరుపులతో కుంభవృష్టి, కర్నూలు జిల్లాలో భారీ వర్షాలు కురిశాయి. అత్యధికంగా ఎమ్మిగనూరులో 69.2 మి.మీ., నంద్యాల జిల్లా బనగానపల్లిలో అత్యధికంగా 178.8 మి.మీ. వర్షపాతం నమోదైంది.
నంద్యాల జిల్లా జూన్ నెల సాధారణ వర్షపాతం 76.8 మి.మీ. కాగా.. ఒక్కరోజులోనే 56.7 మి.మీ. వర్షం కురిసింది. ఉమ్మడి అనంతపురం జిల్లాలో వర్షాలు విస్తారంగా కురిశాయి. ఆదివారం అర్ధరాత్రి నుంచి ఉరుములు, మెరుపులతో వర్షం మొదలై తెల్లవార్లూ మోస్తరు నుంచి భారీగా కురిసింది. అనంతపురం జిల్లాలోని 31 మండలాల పరిధిలో ఏకంగా 31.7 మి.మీ. సగటు వర్షపాతం నమోదైంది. బొమ్మనహాళ్ మండలంలో 91 మి.మీ., బెళుగుప్ప 84.2 మి.మీ., కణేకల్లు 80 మి.మీ., గుత్తి 62.6 మి.మీ. మేర భారీ వర్షం కురిసింది.
మిగిలిన మండలాల్లోనూ మోస్తరు వర్షపాతం నమోదైంది. భారీ వర్షాలు కురిసిన ప్రాంతాల్లో వాగులు, వంకలు, చెక్‌డ్యాంలు ప్రవహించాయి. శ్రీసత్యసాయి జిల్లాలోని 18 మండలాల్లో వర్షాలు కురిశాయి. అత్యధికంగా కనగానపల్లి మండలంలో 43.2 మి.మీ. వర్షపాతం నమోదైంది. బత్తలపల్లిలో 29.2 మి.మీ., తాడిమర్రిలో 28.4 మి.మీ., గుడిబండలో 23.2 మి.మీ., రొళ్లలో 22.2 మి.మీ., ఎన్‌పీ కుంట 19.2 మి.మీ., కదిరిలో 18.2 మి.మీ., ధర్మవరంలో 12.4 మి.మీ., తనకల్లు మండలంలో 10.4 మి.మీ. వర్షపాతం నమోదైంది. మిగతా మండలాల్లో 10 –1.2 మి.మీ. మధ్య వర్షపాతం నమోదైంది.
Comments
Please login to add a commentAdd a comment