కృష్ణా జిల్లా పెనమలూరులో ఎండలో కూర్చొని వేసవి తాపం తీర్చే పండ్లు అమ్ముతున్న బాలుడు
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో వరుసగా మూడో రోజూ వాతావరణం మంటపుట్టించింది. ఒకవైపు ఎండలు ఠారెత్తించగా, మరోవైపు వడగాడ్పుల తీవ్రతతో ప్రజలు విలవిల్లాడారు. శనివారం రాష్ట్రంలోని పలుచోట్ల సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీల మేరకు అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీనికితోడు తీవ్రమైన వడగాడ్పులు వీచాయి. ముఖ్యంగా కృష్ణా, గుంటూరు జిల్లాల్లో వడగాడ్పులు విపరీతంగా వీయడంతో ప్రజలు అల్లాడారు.
ప్రస్తుత వాతావరణ పరిస్థితుల ప్రభావంతో రానున్న నాలుగు రోజులపాటు రాష్ట్రంలో వడగాడ్పులు వీస్తాయని విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది. శనివారం విజయవాడలో అత్యధికంగా 45.1 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్రంలోని పలు ప్రధాన పట్టణాల్లోనూ 43 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇదిలా ఉంటే.. ఆగ్నేయ మధ్యప్రదేశ్ నుంచి తెలంగాణ వరకు 0.9 కి.మీ. ఎత్తులో ఉపరితల ద్రోణి కొనసాగుతోందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment