visakha Meteorological Department
-
మరో మూడు రోజులు వర్షాలు
సాక్షి, అమరావతి/అమరావతి బ్యూరో/విశాఖపట్నం: నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రస్తుతం సముద్రమట్టానికి 1.5 కి.మీ. ఎత్తులో కొనసాగుతోంది. దీని ప్రభావంతో కోస్తాలో.. ముఖ్యంగా గుంటూరు, కృష్ణా, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో గురువారం భారీ వర్షాలు కురిశాయి. విజయవాడ, విశాఖ నగరాల్లోని పలుచోట్ల వీధులు, రోడ్లు జలమయమయ్యాయి. మరో మూడు రోజులు అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే సూచనలున్నాయని, దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం కూడా ఉందని పేర్కొంది. గడిచిన 24 గంటల్లో శృంగవరపు కోటలో అత్యధికంగా 86 మి.మీ వర్షపాతం నమోదైంది. -
11న అల్పపీడనం
సాక్షి, అమరావతి/మహారాణిపేట (విశాఖ దక్షిణ)/కొమ్మాది (భీమిలి)/విశాఖపట్నం: బంగాళాఖాతంలో అల్పపీడనం బలహీనపడి మన రాష్ట్రం నుంచి దూరంగా వెళ్లిపోయింది. ఈనెల 11న ఉత్తర బంగాళాఖాతాన్ని అనుకుని మధ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. షీర్ జోన్ (ద్రోణి) సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తున కొనసాగుతోంది. దీని ప్రభావంతో రానున్న 48 గంటల్లో రాష్ట్రంలోని ఒకటి రెండు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ అధికారులు తెలిపారు. మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో పాటు అల్పపీడన ద్రోణి ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా మారింది. విశాఖ జిల్లా తిమ్మాపురం గ్రామం బుధవారం నీట మునిగింది. కాపులుప్పాడ ప్రాంతంలో వరిపొలాల్లోకి నీరు చేరింది. మంగమారిపేట, ఉప్పాడ, తిమ్మాపురం ప్రాంతాల్లో సముద్ర కెరటాలు భారీ ఎత్తున ఎగసిపడ్డాయి. దీంతో మంగమారిపేట వద్ద సముద్ర తీరం కోతకు గురైంది. జిల్లాలోని ప్రధాన నదులైన తాండవ, శారద, వరాహ ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. తాండవ, కల్యాణపులోవ జలాశయాలు నిండుగా ఉన్నాయి. ఆంధ్ర–ఒడిశా రాష్ట్రాలు ఉమ్మడిగా నిర్వహిస్తున్న మాచ్‌ఖండ్ జలవిద్యుత్ కేంద్రానికి నీరందించే ప్రధాన డుడుమ జలాశయంలో నీటిమట్టం గణనీయంగా పెరుగుతోంది. గెడ్డలో కొట్టుకుపోయి.. బయటపడిన పాల వ్యాపారి ఆనందపురం మండలం వెల్లంకికి చెందిన పోలయ్య పాల వ్యాపారం కోసం కాపులుప్పాడ వెళ్తుండగా పరదేశిపాలెం గెడ్డ వద్ద నీటి ఉధృతికి ద్విచక్ర వాహనం అదుపు తప్పింది. ద్విచక్ర వాహనంతో సహా కొట్టుకుపోయిన పోలయ్య.. అక్కడున్న కర్రల సహాయంతో ఒడ్డుకు చేరుకున్నాడు. మధ్యాహ్నం నీటి ఉధృతి తగ్గిన తర్వాత స్థానికుల సాయంతో ద్విచక్ర వాహనాన్ని ఒడ్డుకు చేర్చారు. -
రెండు రోజులపాటు వానలు
మహారాణిపేట (విశాఖ దక్షిణ): రానున్న 48 గంటల్లో ఆంధ్రప్రదేశ్‌లో పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. రాష్ట్రంలో పశ్చిమ, నైరుతి దిశల నుంచి గాలులు వీస్తున్నాయి. ఉత్తర బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టానికి 1.5 కిలో మీటర్ల నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తుల మధ్య ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇది ఎత్తుకు వెళ్లే కొద్దీ నైరుతి దిశ వైపు వంగి ఉంది. దీని ప్రభావం వల్ల ఈ నెల 28న ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుంది. దీని ప్రభావంతో రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. -
నేడు ఉత్తర కోస్తాకు వర్ష సూచన
సాక్షి, విశాఖపట్నం/సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ సముద్ర తీరం, దాని పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ఆదివారం మధ్యాహ్నం బలహీనపడింది. ఇటీవల మారిన వాతావరణ పరిస్థితుల కారణంగా సోమవారం ఉత్తర కోస్తా జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తరాంధ్ర ఏజెన్సీలో వర్షం కురిసే సూచనలున్నాయని కురుస్తుందని, ఉత్తర కోస్తా తీరం వెంబడి గంటకు 30 నుంచి 40 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని అధికారులు తెలిపారు. దక్షిణ కోస్తాలో పొడి వాతావరణం ఉంటుందని, నెల్లూరు, రాయలసీమల్లో ఉష్ణోగ్రత తీవ్రత మూడు రోజుల పాటు కొనసాగుతుందని చెప్పారు. మిగిలిన జిల్లాల్లో సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపారు. గడిచిన 24 గంటల్లో కర్నూలు (40.5), అనంతపురం (40.2)లో తప్ప మిగిలిన ప్రాంతాల్లో 40 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో విశాఖ, కురుపాం, శృంగవరపుకోటలో 5, జియ్యమ్మవలసలో 3, కొమరాడ, చోడవరం, చింతపల్లిలో 2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. -
తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
సాక్షి, విశాఖపట్నం: దక్షిణ కోస్తాంధ్రకు సమీపంలో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. అదేవిధంగా దక్షిణ కోస్తాకు దగ్గర్లో పశ్చిమ మధ్య బంగాళాఖాతం నుంచి తూర్పు మధ్య అరేబియా సముద్రం వరకూ అల్పపీడనం, దానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం, ద్రోణి బలహీనపడ్డాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. మరోవైపు మధ్య బంగాళాఖాతంలో ఈ నెల 19న మరో అల్పపీడనం ఏర్పడనుందని పేర్కొంది. ఇది బలపడి తదుపరి 24 గంటల్లో తీవ్ర అల్పపీడనంగా మారనుంది. దీని ప్రభావంతో ఈ నెల 19, 20, 21 తేదీల్లో కోస్తా, రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అక్కడక్కడా భారీ వర్షాలు పడే సూచనలున్నాయి. అల్పపీడన ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని కోస్తా తీరం వెంబడి గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయి. ఈ కారణంగా ఈ నెల 19 నుంచి 21వ తేదీ వరకూ కోస్తా, యానాం పరిసర ప్రాంత మత్స్యకారులు వేటకు వెళ్లరాదని అధికారులు హెచ్చరించారు. వదలని వాన గడచిన 24 గంటల్లో బొండపల్లి, కారంచేడులో 8 సెం.మీ., డెంకాడలో 7, గుడివాడ, కుక్కునూరులో 6, పాలకోడేరులో 5, చిత్తూరు, అనకాపల్లి, పోలవరం, రేపల్లె, నర్సీపట్నం, గజపతినగరంలో 5, పాలసముద్రం, పుంగనూరు, నగరి, నూజివీడు, నెల్లిమర్ల, విజయనగరం, వరరామచంద్రాపురం, కూనవరం, తుని, రాజమండ్రి, పొదిలి, గుంటూరు, చింతపల్లిలో 3 సెం.మీ. చొప్పున వర్షపాతం నమోదైంది. -
ఉత్తర కోస్తా, రాయలసీమకు భారీ వర్ష సూచన
సాక్షి, విశాఖపట్నం: ఉత్తర అండమాన్ సముద్రం దాన్ని ఆనుకుని ఉన్న తూర్పు మధ్య బంగాళాఖాతంలో 9వ తేదీన అల్పపీడనం ఏర్పడే సూచనలున్నాయని విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇది తదుపరి 24 గంటల్లో వాయుగుండంగా బలపడి పశ్చిమ వాయువ్య దిశగా పయనించనుందని పేర్కొంది. 11వ తేదీ సాయంత్రంలోగా ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాల మధ్య వాయుగుండం తీరం దాటే సూచనలున్నాయని అధికారులు వెల్లడించారు. ఈ ప్రభావంతో రాగల రెండు రోజుల పాటు ఉత్తర కోస్తా, రాయలసీమల్లో విస్తారంగా వర్షాలు పడతాయని తెలిపారు. సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందనీ, తీరం వెంబడి గంటకు 45 నుంచి 55 కి.మీ వేగంతో బలమైన గాలులు వీచే ప్రమాదం ఉందని అధికారులు తెలిపారు. మత్స్యకారులెవ్వరూ ఆంధ్ర, ఒడిశా తీరం వెంబడి వేటకు వెళ్లరాదని హెచ్చరించారు. కాగా, గడిచిన 24 గంటల్లో గుడివాడలో 11 సెం.మీ, కైకలూరులో 9, విజయవాడ, పాలేరు బ్రిడ్జిలో 8, గుంటూరు, వేలేరుపాడులో 6, నందిగామ, మంగళగిరిలో 5, భీమడోలు, అవనిగడ్డ, లామ్, విశాఖపట్నంలో 4 సెం.మీ వర్షపాతం నమోదైంది. -
కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం
సాక్షి, అమరావతి/మహారాణిపేట (విశాఖ దక్షిణ): ఉత్తర మధ్యప్రదేశ్ మధ్య ప్రాంతం, దక్షిణ ఉత్తరప్రదేశ్ ప్రాంతాల్లో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా 7.6 కి.మీ. ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఉత్తర–దక్షిణ ద్రోణి ఉత్తర కోస్తా తమిళనాడు నుంచి కోమెరిన్∙ ప్రాంతం వరకు 0.9 కి.మీ. ఎత్తు వరకు కొనసాగుతోంది. వీటి ప్రభావం వల్ల రాష్ట్రంలో వచ్చే రెండు రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అమరావతి కేంద్రం శనివారం రాత్రి ప్రకటించింది. ► ఉత్తర కోస్తాంధ్రా, దక్షిణ కోసాంధ్రా, రాయలసీమల్లో ఆది, సోమవారాల్లో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఒకటి, రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ► శనివారం పగటి ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదయ్యాయి. అనేక చోట్ల ఒక టి లేదా రెండు డిగ్రీలు ఎక్కువగా నమోదు అయినట్టు వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిశాయి. -
రేపు మరో అల్పపీడనం
మహారాణిపేట (విశాఖ దక్షిణ): బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కొనసాగుతోంది. తూర్పు మధ్యప్రదేశ్ మధ్య భాగం, దాని పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనానికి అనుబంధంగా 7.6 కిలోమీటర్లు ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కూడా కొనసాగుతోందని వాతావరణ అధికారులు తెలిపారు. వాయవ్య బంగాళాఖాతంలో, దాని పరిసర ప్రాంతాల్లో ఈనెల 23న మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని చెప్పారు. రానున్న 48 గంటల్లో రాష్ట్రంలో ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమల్లో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు, కొన్నిచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. కోస్తా తీరం వెంబడి బలమైన గాలులు వీస్తున్నందున మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లరాదని హెచ్చరించారు. -
రంపచోడవరంలో కుండపోత
సాక్షి, అమరావతి/ సాక్షి, విశాఖపట్నం/సాక్షి, నెట్వర్క్: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఆదివారం విస్తారంగా వర్షాలు కురిశాయి. ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లో కొన్నిచోట్ల కుండపోత వర్షం పడింది. ఆదివారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల మధ్య తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరంలో రికార్డు స్థాయిలో 10.37 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది. కాకినాడ, మండపేటలో భారీ వర్షం కురవగా.. అమలాపురం, రాజమహేంద్రవరాల్లో ఓ మోస్తరు వర్షపాతం నమోదైంది. ప్రొద్దుటూరు, తాడేపల్లి, విజయవాడ తదితర ప్రాంతాల్లో భారీ వర్షాలకు ఇళ్లలోకి వర్షం నీరు చేరింది. పలు జిల్లాల్లో వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. ► గుంటూరు జిల్లాలోని తాడేపల్లి, మంగళగిరి, తాడికొండ, గుంటూరు, నరసరావుపేట, తెనాలితో పాటు పలు ప్రాంతాల్లో కురిసిన వర్షం రైతులకు మేలు చేస్తుందని చెబుతున్నారు. ► అనంతపురం జిల్లాలోని 44 మండలాల్లో 13.6 మి.మీ సగటు వర్షపాతం నమోదైంది. ► వైఎస్సార్, ప్రకాశం జిల్లాల్లో కూడా భారీ వర్షపాతం నమోదైంది. ► ప్రకాశం జిల్లాలోని యర్రగొండపాలెం, గిద్దలూరు నియోజకవర్గాలు, చీమకుర్తిలో భారీ వర్షం పడింది. మూడు రోజుల పాటు వర్షసూచన నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనంతో పాటు ఉత్తర కర్ణాటక నుంచి దక్షిణ తమిళనాడు వరకూ ఉత్తర–దక్షిణ ద్రోణి ప్రభావంతో రాగల మూడు రోజులు కోస్తా, రాయలసీమల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే సూచనలున్నాయని విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది. సోమవారం రాష్ట్రంలో ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. కోస్తాంధ్రలో మంగళవారం కూడా విస్తారంగా వర్షం కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) పేర్కొంది. -
మూడోరోజూ మంటలే..
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో వరుసగా మూడో రోజూ వాతావరణం మంటపుట్టించింది. ఒకవైపు ఎండలు ఠారెత్తించగా, మరోవైపు వడగాడ్పుల తీవ్రతతో ప్రజలు విలవిల్లాడారు. శనివారం రాష్ట్రంలోని పలుచోట్ల సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీల మేరకు అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీనికితోడు తీవ్రమైన వడగాడ్పులు వీచాయి. ముఖ్యంగా కృష్ణా, గుంటూరు జిల్లాల్లో వడగాడ్పులు విపరీతంగా వీయడంతో ప్రజలు అల్లాడారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల ప్రభావంతో రానున్న నాలుగు రోజులపాటు రాష్ట్రంలో వడగాడ్పులు వీస్తాయని విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది. శనివారం విజయవాడలో అత్యధికంగా 45.1 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్రంలోని పలు ప్రధాన పట్టణాల్లోనూ 43 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇదిలా ఉంటే.. ఆగ్నేయ మధ్యప్రదేశ్ నుంచి తెలంగాణ వరకు 0.9 కి.మీ. ఎత్తులో ఉపరితల ద్రోణి కొనసాగుతోందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది. -
రానున్న 24 గంటల్లో అల్ప పీడనం
సాక్షి అమరావతి, సాక్షి నెట్వర్క్: మలక్కా జలసంధి, దాని పరిసర ప్రాంతాల్లో 0.9 కిమీ ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని, దీని ప్రభావంతో దక్షిణ అండమాన్, పరిసర ప్రాంతాల్లో 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడే సూచనలున్నాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) వెల్లడించింది. తర్వాత రెండు రోజుల్లో అల్పపీడనం మరింత బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని పేర్కొంది. శుక్రవారం గంటకు 30 నుంచి 40 కి.మీ. వేగంతో ఈదురు గాలులు వీస్తాయని తెలిపింది. మరోవైపు.. దక్షిణ ఛత్తీస్‌గఢ్ దాని పరిసర ప్రాంతాల్లో సముద్రమట్టానికి 1.5 కిమీ ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. అలాగే నైరుతి మధ్యప్రదేశ్ నుంచి ఇంటీరియర్ కర్ణాటక మీదుగా దక్షిణ తమిళనాడు వరకూ ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. వీటి ప్రభావంతో గురు, శుక్రవారాల్లో ఉత్తర కోస్తాతో పాటు కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో పాటు ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురుస్తాయని విశాఖ వాతావరణ శాఖ అధికారులు కూడా వెల్లడించారు. కాగా, రాష్ట్రంలో బుధవారం పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిశాయి. దీంతో కొన్ని చోట్ల వ్యవసాయ, ఉద్యాన పంటలకు నష్టం కలిగింది. -
హిందూ మహాసముద్రంలో 24 గంటల్లో అల్పపీడనం
మహారాణిపేట(విశాఖ దక్షిణం): మాల్దీవులు, దానిని అనుకుని ఉన్న హిందూ మహాసముద్రం ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావం వల్ల రానున్న 24 గంటల్లో మాల్దీవుల ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. దీంతో కోస్తాలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని, ఒకటి రెండు చోట్ల వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రాయలసీమలో వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉందని పేర్కొంది. -
48 గంటల్లో వాయుగండం
సాక్షి, విశాఖపట్నం/సాక్షి, అమరావతి/సాక్షి నెట్వర్క్: పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దానికి ఆనుకొని నైరుతి బంగాళాఖాతంలో ఉత్తర తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ తీరాల మీదుగా మంగళవారం ఉదయం అల్పపీడనం ఏర్పడింది. ఇది సాయంత్రం తీవ్ర అల్పపీడనంగా మారింది. మరింత బలపడి రాగల 48 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశాలున్నాయని విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది. వాయుగుండంగా మారే క్రమంలో తీవ్ర అల్పపీడనం కోస్తాంధ్ర తీరం వైపుగా కదులుతోంది. దీని ప్రభావంతో రాగల రెండు రోజుల పాటు రాష్ట్రమంతటా విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. తీరం వెంబడి గంటకు 45 కి.మీ. నుంచి 50 కి.మీ. వేగంతో బలమైన గాలులు వీస్తాయని చెప్పారు. మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరించారు. పలు జిల్లాల్లో వర్షాలు తూర్పు గోదావరి జిల్లాలో పలుచోట్ల ఒక మోస్తరు నుంచి భారీ వర్షం కురుస్తోంది. లోతట్టు ప్రాంతాలు నీట మునుగుతున్నాయి. కృష్ణా జిల్లాలో మంగళవారం 22 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. సోమవారం అర్ధరాత్రి మంగళవారం సాయంత్రం వరకు వర్షం కురుస్తూనే ఉంది. పలు గ్రామాలు, నగరాల్లో రహదారులు జలమయమయ్యాయి. గుంటూరు జిల్లాలో మంగళవారం చిరు జల్లులు కురిశాయి. రొంపిచర్ల మండలంలోని వి.రెడ్డిపాలెంలో రెండు ఇళ్లు కూలిపోయాయి. ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో ప్రకాశం జిల్లా అంతటా వారం రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. చెరువులు, కుంటలు నిండిపోయాయి. వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రమంతటా విస్తారంగా వర్షాలు కురిశాయి. నెల్లూరులో 10 సెంటీమీటర్లు, ఒంగోలులో 7, అమలాపురం, కందుకూరు, అగలిలో 6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. -
నేడు, రేపు భారీ వర్షాలు
సాక్షి, విశాఖపట్నం: కోస్తాంధ్ర పరిసరాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో గురు, శుక్రవారాల్లో కోస్తాంధ్రలో పలుచోట్ల భారీ వర్షాలు, ఒకట్రెండు చోట్ల అతి భారీ వర్షాలు, అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ శాఖ అధికారులు బుధవారం వెల్లడించారు. దక్షిణ కోస్తా తీరం వెంబడి గంటకు 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, దక్షిణ కోస్తా జిల్లాల్లోని మత్స్యకారులెవరూ వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు. కోస్తాంధ్ర తీరానికి సమీపంలో పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఇది సముద్ర మట్టానికి 5.8 కిలో మీటర్ల ఎత్తులో ఆవరించి ఉంది. ఎత్తుకి వెళ్లే కొద్దీ నైరుతి దిశవైపు వంపు తిరిగి ఉంది. దీని ప్రభావంతో పశ్చిమ మధ్య బంగాళాఖాతం, కోస్తాంధ్ర ప్రాంతాల్లో రాగల 12 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అయితే.. ఆవర్తనం ఎత్తు తగ్గడంతో అల్పపీడనం ఏర్పడే అవకాశాలు తగ్గుముఖం పట్టాయని వివరించారు. -
కృష్ణమ్మ పరవళ్లు
సాక్షి, అమరావతి/సాక్షి నెట్వర్క్: నాలుగు రోజులుగా ఉగ్రరూపం దాల్చిన గోదావరి మంగళవారం శాంతించగా కృష్ణమ్మ ఉరకలెత్తుతోంది. గోదావరి నదీ పరివాహక ప్రాంతంలో వర్షాలు తగ్గడంతో వరద తగ్గుముఖం పట్టింది. ధవళేశ్వరం బ్యారేజీకి వచ్చిన వరద జలాల్లో 7,800 క్యూసెక్కులను డెల్టా కాలువలకు విడుదల చేసి, మిగులుగా ఉన్న 10,45,848 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలారు. బుధవారం వరద మరింత తగ్గే అవకాశం ఉంది. మరోవైపు కృష్ణా నదిలో వరద ఉధృతి పెరిగింది. శ్రీశైలం ప్రాజెక్టులోకి మంగళవారం సాయంత్రానికి 2,10,312 క్యూసెక్కులు వచ్చి చేరుతుండగా.. కుడి, ఎడమ గట్టు విద్యుదుత్పత్తి కేంద్రాల ద్వారా నాగార్జునసాగర్‌కు, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్, హంద్రీ–నీవా, కల్వకుర్తి ఎత్తిపోతల ద్వారా 82,661 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో 868.6 అడుగుల్లో 135.94 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. కృష్ణా నదీ పరివాహక ప్రాంతంలో ప్రధానంగా నదీ జన్మస్థానమైన మహాబలేశ్వరం పర్వతాల్లో భారీ వర్షాలు కురవడం వల్ల ఎగువ నుంచి ఆల్మట్టి, నారాయణపూర్‌లలోకి భారీగా వరద వస్తోంది. కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) హెచ్చరికల మేరకు ఈ రెండు జలాశయాల నుంచి మంగళవారం సాయంత్రం నీటి విడుదలను నాలుగు లక్షల క్యూసెక్కులకు పెంచారు. బీమా నదిపై మహారాష్ట్రలో నిర్మించిన ఉజ్జయిని ప్రాజెక్టు పూర్తిగా నిండింది. వచ్చిన వరదను వచ్చినట్లుగా దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ జలాలు జూరాల ప్రాజెక్టు మీదుగా శ్రీశైలాన్ని చేరనున్నాయి. బుధవారం శ్రీశైలం ప్రాజెక్టులోకి నాలుగు నుంచి 4.50 లక్షల క్యూసెక్కుల వరద వస్తుందని జలవనరుల శాఖ అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి. వరద ఇలాగే కొనసాగితే మూడు రోజుల్లో శ్రీశైలం, ఆ తర్వాత వారం రోజుల్లో నాగార్జునసాగర్ ప్రాజెక్టులు నిండుతాయి. తుంగభద్రలో సోమవారంతో పోల్చితే.. మంగళవారం వరద ప్రవాహం కాస్త పెరిగింది. శ్రీశైలంలో విద్యుత్ ఉత్పాదన శ్రీశైలం కుడిగట్టు జలవిద్యుత్ కేంద్రంలో ఉత్పత్తిని ప్రారంభించారు. మంగళవారం ఉదయం కుడిగట్టు విద్యుత్ కేంద్రంలో 0.226 మిలియన్ యూనిట్లు, భూగర్భ విద్యుత్ కేంద్రంలో 15.703 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేశారు. నేడు తీరం దాటనున్న వాయుగుండం ఉత్తర బంగాళాఖాతంలో సోమవారం ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. బుధవారం ఉదయం తీవ్ర వాయుగుండంగా మారి ఒడిశాలోని బాలాసోర్ పరిసర ప్రాంతాల్లో మధ్యాహ్నం తీరం దాటుతుందని విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో రాష్ట్రంలో పలుచోట్ల విస్తారంగా వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం(ఐఎండీ) మంగళవారం రాత్రి విడుదల చేసిన బులెటిన్‌లో వెల్లడించింది. తుపానుగా మారే అవకాశం లేదని స్పష్టం చేసింది. మత్స్యకారులెవ్వరూ చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరించింది. కళింగపట్నం, భీమునిపట్నం, విశాఖపట్నం, గంగవరం, కాకినాడ పోర్టులో ఒకటో నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేసినట్లు అధికారులు వెల్లడించారు. ప్రభుత్వ సహాయ చర్యలు ముమ్మరం తూర్పుగోదావరిలో వరదల్లో చిక్కుకున్న గ్రామాల్లో ప్రభుత్వం సహాయ చర్యలను ముమ్మరం చేసింది. ముంపునకు గురైన గ్రామాల వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించింది. తూర్పు గోదావరి జిల్లాలో 18,809 మందికి 85 సహాయ, పునరావాస కేంద్రాల్లో వసతి కల్పించింది. వరదల వల్ల అంటువ్యాధులు ప్రబలే ప్రమాదం నేపథ్యంలో ప్రభుత్వం ఒక్క తూర్పు గోదావరి జిల్లాలోనే 85 వైద్య శిబిరాలను నిర్వహించింది. ఒక్కో వరద బాధిత కుటుంబానికి 25 కిలోల బియ్యం, రెండు లీటర్ల కిరోసిన్, కిలో కందిపప్పు, లీటరు పామాయిల్, కిలో ఉల్లిపాయలు, కిలో బంగాళాదుంపలు ఉచితంగా పంపిణీ చేసింది. ఉభయ గోదావరి జిల్లాల్లో 1,377.5 క్వింటాళ్ల బియ్యం, 10,100 లీటర్ల కిరోసిన్, 5,240 కిలోల కందిపప్పు, 6,967 లీటర్ల పామాయిల్, 6,967 కిలోల చొప్పున ఉల్లిపాయలు, బంగాళాదుంపలు పంపిణీ చేసినట్లు అధికార వర్గాలు తెలిపాయి. కాగా, ఉభయగోదావరి జిల్లాల్లో మొత్తం 420 గ్రామాల ప్రజలు వరదలబారిన పడ్డారు. రహదారులు, వంతెనలు దెబ్బతినడంతో తూర్పుగోదావరి జిల్లాలో 64, పశ్చిమ గోదావరి జిల్లాలో 48 కలిపి మొత్తం 112 గ్రామాలకు రవాణా సదుపాయాలు లేకుండా పోయాయి. 17,737 ఇళ్లు గత 24 గంటలుగా జలదిగ్బంధంలో ఉన్నాయి. తూర్పుగోదావరి జిల్లాలో సుమారు తొమ్మిది వేల ఎకరాల్లోని పంటలు వరద ముంపునకు గురయ్యాయి. సాంఘిక సంక్షేమ మంత్రి పినిపే విశ్వరూప్ మంగళవారం వరద బాధితులను పరామర్శించారు. వచ్చే ఉగాది నాటికి వరద బాధితులందరికీ ఇళ్ల స్థలాలు ఇస్తామని హామీ ఇచ్చారు. -
ఏపీకి వర్షసూచన
విశాఖపట్నం: వచ్చే 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్‌లోని కోస్తాంధ్ర ప్రాంతంలో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. ఛత్తీస్‌గఢ్ నుంచి కోస్తాంధ్రమీదుగా దక్షిణ తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి విస్తరిస్తుందని వాతావరణశాఖ కేంద్రం అధికారులు తెలిపారు. -
బంగాళాఖాతంలో అల్పపీడనం!
విశాఖ: ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావం వల్ల నైరుతీ బంగాళాఖాతంలో ఈ నెల 25న అల్పపీడనం ఏర్పడే అవకాశముందని విశాఖ వాతవరణం కేంద్ర తెలిపింది. ఈ అల్పపీడన ప్రభావం తమిళనాడు పైనే ఉంటుందని వాతావరణ అధికారులు స్పష్టం చేయగా, తమిళనాడుతో పాటు ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు, ఒంగోలుపై ఉంటుందని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. సోమ, మంగళవారాల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో వాతావరణం పొడిగానే ఉంటుందని వాతవరణ కేంద్ర పేర్కొంది.