
సాక్షి, విశాఖపట్నం/సాక్షి, అమరావతి/సాక్షి నెట్‌వర్క్: పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దానికి ఆనుకొని నైరుతి బంగాళాఖాతంలో ఉత్తర తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ తీరాల మీదుగా మంగళవారం ఉదయం అల్పపీడనం ఏర్పడింది. ఇది సాయంత్రం తీవ్ర అల్పపీడనంగా మారింది. మరింత బలపడి రాగల 48 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశాలున్నాయని విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది. వాయుగుండంగా మారే క్రమంలో తీవ్ర అల్పపీడనం కోస్తాంధ్ర తీరం వైపుగా కదులుతోంది. దీని ప్రభావంతో రాగల రెండు రోజుల పాటు రాష్ట్రమంతటా విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. తీరం వెంబడి గంటకు 45 కి.మీ. నుంచి 50 కి.మీ. వేగంతో బలమైన గాలులు వీస్తాయని చెప్పారు. మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరించారు.
పలు జిల్లాల్లో వర్షాలు
తూర్పు గోదావరి జిల్లాలో పలుచోట్ల ఒక మోస్తరు నుంచి భారీ వర్షం కురుస్తోంది. లోతట్టు ప్రాంతాలు నీట మునుగుతున్నాయి. కృష్ణా జిల్లాలో మంగళవారం 22 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. సోమవారం అర్ధరాత్రి మంగళవారం సాయంత్రం వరకు వర్షం కురుస్తూనే ఉంది. పలు గ్రామాలు, నగరాల్లో రహదారులు జలమయమయ్యాయి. గుంటూరు జిల్లాలో మంగళవారం చిరు జల్లులు కురిశాయి. రొంపిచర్ల మండలంలోని వి.రెడ్డిపాలెంలో రెండు ఇళ్లు కూలిపోయాయి. ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో ప్రకాశం జిల్లా అంతటా వారం రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. చెరువులు, కుంటలు నిండిపోయాయి. వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రమంతటా విస్తారంగా వర్షాలు కురిశాయి. నెల్లూరులో 10 సెంటీమీటర్లు, ఒంగోలులో 7, అమలాపురం, కందుకూరు, అగలిలో 6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.
Comments
Please login to add a commentAdd a comment